నడిపించే దైవం నాన్న


Sun,June 18, 2017 03:52 AM

నాన్నంటే? తెలియదు. చేయి పట్టుకుని నడక నేర్పినప్పుడు..గాల్లోకి ఎగరేసి ఆడించినప్పుడు..గాయం చేసిన గడపని కొట్టినప్పుడు.. అమ్మకు తెలియకుండా ఐస్‌క్రీమ్ కొనిచ్చినప్పుడు.. కీ ఇచ్చి బైక్ నడపమని వెనకాల కూర్చున్నప్పుడు.. ఎప్పుడూ తెలియదు.. నాన్నంటే ఏంటో.. నువ్వు నాన్న అయ్యాకే తెలుస్తుంది.
కని, పెంచే.. కనిపించే దేవత అమ్మ అయితే.. నడిపించే దైవం నాన్న!ప్రేమించడం అమ్మ వంతయితే..
దీవించడం నాన్న వంతు. అమ్మ అమృతమైతే.. దాన్ని నింపే కలశం నాన్న. అమ్మ వెలిగే దీపమైతే నాన్న దాన్ని వెలిగించే వత్తి. నాన్నంటే.. భద్రత.. భరోసా.. బాధ్యత. నాన్నంటే ఒక రిలేషన్ మాత్రమే కాదు.. ఎప్పటికీ అర్థం కాని ఓ ఎమోషన్. ఆయన మనసు అర్థం కాని అంతరిక్షం. ఆయన హృదయం తెలుసుకోలేని అనంత సాగరం.. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ఈ ముఖచిత్ర కథనం.. నడిపించే దైవం నాన్నకు.. ప్రేమతో...
-దాయి శ్రీశైలం, 8096677035

నాన్న గురించి సినీ దర్శకులు త్రివిక్రమ్ ఓ సందర్భంలో చెప్పిన మాటలు.. సాధారణంగా చాలామంది అమ్మ గురించే మాట్లాడుతారు. అమ్మ నవమాసాలు మోస్తుంది. కంటుంది. మనల్ని పెంచి పెద్ద చేస్తుంది అని. కానీ మనం నాన్న వేలు పట్టుకునే కదా నడుస్తాం. చిన్నప్పుడు ఐదారేళ్ల వయసులో.. చాలామందికి నాన్నే సూపర్ హీరో. ఏమైనా చేయగలడు మా నాన్న అనుకుంటారు. నాన్న చేయలేనిది ఏదీ లేదనుకుంటారు. ఏ పది, పదకొండేళ్ల వయసులో.. డబ్బున్న వాళ్లని చూసినప్పుడు.. పెద్ద పెద్ద కార్లు ఉన్నవాళ్లని చూసినప్పుడు.. మా నాన్న అంత గొప్పోడు కాదేమో.. మా నాన్న కంటే గొప్పొళ్లు ఇంకా చాలామంది ఉన్నారనుకుంటారు. పదిహేడు.. పద్దెనిమిదేళ్ల వయసులో.. బాగా చదువుకో.. రాత్రి పూట తొందరగా ఇంటికి రా.. అంటూ ఇలాంటి మాటలన్నీ నాన్న చెప్పినప్పుడు.. మా నాన్న నస పెడుతున్నాడు, చాదస్తం కాబోలు.. సరిగ్గా బతకడం తెలియకే ఇలా అయిపోయాడు.. అని అనుకుంటారు. ఇరవై, ఇరవై ఐదు ఏండ్లు వచ్చాక ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని.. ఓ ఇల్లు అద్దెకు తీసుకుని.. ఉద్యోగం చేస్తూ.. నెలాఖరులో అప్పులు చేయాల్సి వచ్చినప్పుడు నాన్న మనం అనుకున్నంత తక్కువేం కాదు.. బానే మేనేజ్ చేసినట్లున్నాడు.. నలుగురు పిల్లల్ని కన్నా.. మనకు ఇంత కష్టంగా ఉంది.. ఒకర్ని కూడా కనకముందే అనుకుంటారు. ఆ తర్వాత.. ఓ ముప్పయి, ముప్పయి ఐదేళ్లు వచ్చాక.. పిల్లలు పెద్దవుతుంటే.. స్కూలు ఫీజులు.. రెకమండేషన్లు.. ఒంట్లో బాలేనప్పుడు హాస్పిటల్‌కు పరుగెత్తడం.. ఏదైనా కష్టం వస్తే డబ్బు కోసం వెతుక్కోవడాలు.. ఇలాంటివన్నీ ఎదురైనప్పుడు.. నాన్న గుర్తొచ్చి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఇన్ని కష్టాలు పడి మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడా అని. కానీ మనం అది అర్థం చేసుకునేలోపు.. చాలామంది నాన్నలు ఉండరు.. అందుకే నాన్న బతికి ఉండగానే థ్యాంక్స్ చెబుదాం. మన భారతీయులందరికీ కూడా.. ఒక డే అనే దాని మీద పెద్దగా నమ్మకం లేదని నాకనిపిస్తుంటుంది. ఫిబ్రవరి 14న మాత్రమే ప్రేమించడం.. అలాగే అమ్మని మదర్స్ డే రోజే పూజించడం.. నాన్నను ఫాదర్స్ డే రోజు మాత్రమే గుర్తు చేసుకోవడం.. కాదు.. సంవత్సరంలో 365 రోజులూ ప్రేమిద్దాం.
Fathersday

నాన్న.. వెంటాడే జ్ఞాపకం..

ఎందుకో తెలియదుగానీ.. నేను చిన్నప్పట్నుంచే నాన్నకు నేస్తాన్నయ్యాను. నాన్న పొలానికి వెళ్తే నేనూ వెళ్లడం.. ఆయన తిన్నప్పుడే నేను తినడం.. నాన్న పడుకుంటూనే నేనూ పడుకునేవాడిని. చూసినోళ్లు.. అయ్య తోకిడుస్తలేవుగా అనేవాళ్లు. సాయంత్రం స్కూల్ నుంచి రాంగనే నాన్నెక్కడుండో వెతికి పట్టుకునేవాడిని. ఆయన స్పర్శంటే నాకెంతో ఇష్టం. ఆయన టచ్ చేస్తే నాలో ఏ కాంతిపుంజమో మెదిలినట్లు అయ్యేది. నన్ను కంటికిరెప్పలా చూసుకునేవాడు. నా కలతను తీర్చేవాడు. ఓడిపోతున్న సమయంలో ధైర్యాన్నిచ్చేవాడు. గెలిచినప్పుడు భుజం తట్టేవాడు. నాన్న నాపై కన్నెర్రజేసినా నాకిష్టమే అనిపించేది. దాని వెనుక నా భవితపై ఆయన ఆరాటం కనిపించేది. ఓ రోజు రాత్రి నిద్రలో నాన్నా అంటూ కలవరించాను. నాన్న నా దగ్గరకు వచ్చి నా తలపై చేయేశారు. అప్పుడు తీవ్ర జ్వరంతో ఉన్నానని నాన్నకు అర్థమైంది. వెంటనే మందులు వేశారు. తడిగుడ్డ నుదుటిపై వేస్తూ ఆ రాత్రంతా నా దగ్గరే ఉన్నారు.

ఆ చేతి స్పర్శే నాకు ఔషధంగా పనిచేసింది. ఆ రోజెందుకో అంతరాయం లేని నిద్ర పట్టింది. పొద్దుపోయేదాకా పడుకున్నా. ఇంకా మబ్బుగానే ఉన్నది. బయటి నుంచి ఏవో కేకలు వినిపిస్తున్నాయి. కండ్లు తుడుచుకుంటూ లేచి వెళ్లాను. ఏమయిందో ఏమో అంతా నాన్న చుట్టూ కూర్చున్నారు. ఏడుస్తున్నారు. అసలేమైంది? నాన్నకు.. నా నాన్నకు ఏమైంది.? రాత్రంతా నా దగ్గరే ఉన్నాడు.. నన్ను పడుకోబెట్టాడు కదా. ఇప్పుడేంటి అందరూ నాన్న దగ్గర కూర్చొని ఈ ఏడుపులు. అందర్నీ పక్కకు తోసుకుంటూ నాన్న దగ్గరికి వెళ్లాను. నాన్నా అని పిలిచాను. పలకలేదు. కదల్లేదు. మెదల్లేదు. లేవగానే పొద్దున్నే నా తల నిమిరే నాన్న ఆయల్ల నా తల నిమురలేదు.
Child-Suppo

ఆయన నన్ను మోసం చేశాడు. జ్వరం వచ్చిన నన్ను హాయిగా పడుకోబెట్టి.. బుజ్జగించి వెళ్లిపోయాడు. నాన్న కోసం చాలాకాలం ఎదురుచూశా. ఆయనతో చెప్పుకోవాల్సిన కబుర్లు అలాగే మిగిలిపోయాయి. నాన్న భుజాలెక్కి ఊరంతా తిరగాలని నాకుండె. నాన్న గుండెలపై నిదురోవాలని ఎన్నో ఆశలు. చాలాకాలం చూశాను. నాన్న రాలేదు. ఇన్నేండ్లకు వచ్చాడు. నాకు కొడుకై మళ్లీ వచ్చాడు. నాన్నకు ప్రతిరూపమై మా ఇంటికొచ్చి సంతోషాలు నింపుతున్నాడు. ఇప్పుడు మా నాన్నకు రెండున్నరేండ్లు. నా ఎదలపై ఎత్తుకుని ఆడిస్తున్నాను. భుజాలపై ఎత్తుకుని ఊరంతా తిప్పుతున్నాను. నేనుండాల్సిన ప్లేసులో నాన్న.. ఆయనుండాల్సిన ప్లేసులో నేను! నేనిప్పుడు లేవగానే నాన్న తల నిమురుతున్నాను.

ఓ కొడుకు చెప్పిన కథ

నా మంచి కోసం పరితపించిన బాపు

నాన్న నన్ను నీడలా వెంటాడుతాడు. ఆయన ఉండేది ఊళ్లె. నేనుండేది పట్నంల. కానీ పొద్దున ఆయన పిలిచి నిద్రలేపినట్లే అనిపిస్తుంది. అందుకే పానం సంపుకోలేక వారానికోసారి ఊరెళ్లి పల్కరిచ్చి వస్తుంటా.
నాన్న అనే మాట గుర్తొచ్చినప్పుడల్లా నాకు నేను ఎమోషన్ అయిపోతుంటా. కారణమేంటో తెలియదు. అలాంటి నాన్న గురించి.. ఆయన మనసు గురించి రోజూ గుర్తుచేసుకున్నా తప్పులేదనిపిస్తుంది. అలా నాకిప్పటికిప్పుడు నాన్న గురించి గుర్తుకొచ్చిన ఓ జ్ఞాపకం చెప్పాలనిపిస్తుంది.
ఆ రోజు.. ముర్గశిల. వాన జోరుమీద కురుస్తున్నది. రైతులందరూ సంబురవడుతున్నరు.
ఏమయ్యో లెవ్వు లెవ్వు, పొద్దువోతంది. రాత్రి ఇసిరిసిరి సంపింది వాన. నాగలి సాగుతది నువ్వు ముందు నడువ్, నీ ఎన్క సద్ది వట్టుకొని నేనొస్తా అంటూ అమ్మ ముచ్చటకు మంచం మీదికెల్లి లేసిండు బాపు. వాళ్ల ముచ్చట్లు ఇనీ ఇనవడనట్టు ఇనవడుతున్నయ్. ముసురుకు గజగజ వణుకుతున్న.
ఏయ్ ఏమొర్రుతున్నవే పోరడు లేస్తడు. ఆయిళ్లనే సక్కగ నిర్ద వోలే. మెల్లగొర్రరాదు, మా వోతగని. ఓ దిక్కు నా మీద ప్రేమ, ఇంకో దిక్కు అమ్మకు సమాధానం.

బాపు మాటలు ఇంటా ఉంటే గుండె తరుక్కపోయింది. ముందు రోజు రాత్రి సంఘటన గుర్తొచ్చింది. పొద్దంతా పొలం కాడికి పొయ్యి వచ్చిన అయ్య బువ్వ మీద కూసున్నడు. సరిగ్గా ఎనిమిది కొడుతుంది. నల్లటి మేఘాలతో మొగులు మొత్తం చిమ్మ చీకటైంది. ఉరుములు మెరుపులతో కూడిన సప్పుళ్లు. పిడుగు గిట్ల వడుతదేమోననే భయంతో బాపు అనుకుంట బాపు దగ్గరికి ఉరికిన. ఏంది బిడ్డా భయపడద్దు, నేను లేనా అని దగ్గరికి తీసుకొని తొడ మీద వండ వెట్టుకున్నడు. చిన్నపాటి రేకుల ఇళ్లు మాది. గట్టిగ వాన కొడితే ఉన్న రేకులు ఊసిపోయి మీద వడుతయి. ఇగ వాన జోరందకున్నది.
అవునే వాన బాగనే పడేటట్టుంది నీ అన్నం పాడుగాను పల్లెం తీసేయ్. పోరడు భయపడుతున్నడని పళ్లెం పక్కకు వారేసిండు. ఇట్ల పళ్లెం పక్కకు పారేసిండో లేదో, రేకులు మొత్తం చెల్లాచెదురై ఇళ్లు చిన్నపాటి చెరువైపోయింది. అరేయ్ బాపు నువ్వు మంచం మీద పడుకోపో అని నన్ను మంచం మీద పడుకోవెట్టిండు బాపు. ఏయ్ గా బస్తా తేపో అని అమ్మకు సైగ చేసిండు. ఎక్కడ గట్టిగ మొత్తుకుంటే నాకు మెల్క వస్తదోనని. ఉట్టిగ చెద్దరి మీద కప్పుకున్న గనీ ఆ రోజు రాత్రి మా బాపు పడే బాధ, నా నిద్ర చెడిపోవద్దనే బాపు సైగలు చెవుల్లోకి సొచ్చుకపోయాయి. తాను రాత్రంతా తడుసుకుంటూ నా మీద నీటిసుక్క కూడా పడనీయకుండా నా మంచానికి రక్షక కవచంలా నిలవడ్డడు.

ఆ రోజు వాన మొత్తం మా బాపు మీది నుంచే పోయింది. ఎగిలివారంగా ఇట్ల వడుకున్నడో లేడో అమ్మ లేపుతూనే ఉన్నది. అప్పటిదాంకా మేలికతో ఉన్న బాపు లేచినాక కూడా నా నిద్ర కోసం ఆలోచిస్తా ఉంటే కళ్ల నిండా నీళ్లు కారినయ్. రెక్కాడితే గానీ డొక్కాడని మా జీవితాలకు బాపే పెద్ద దిక్కు. ఒక్క మాట కూడా అమ్మకు ఎదురు చెప్పకుండా పొలం బాట పట్టిండు. నా మంచి కోసం నిత్యం పరితపించే మా బాపుతో ఇలాంటి మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి.బాపూ.. నీ రక్తపు మట్టి ముద్ద నేను. నీ కొనసాగింపుగా నేను. ఇంతటి మనిషిని చేసిన నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని, నా గుండెల మీద నీకు జో కొడుతానని మాటిస్తున్నా.

ఓ కొడుకు జ్ఞాపకం

ఏ బిడ్డయినా చిన్నతనంలో నాన్న చెప్పుల జతలో తప్పటడుగులతోనే జీవిత పరుగు పందాన్ని మొదలుపెడతాడు. ఉద్యోగం, ఉపాధి అంటూ ఉదయాన్నే లేచి వెళ్లే నాన్న.. ఇంటి పట్టున ఉండలేడు. కంటి నిండా నిద్రపోలేడు. ఇంటి బాధ్యతలను ఒంటి స్తంభంలా మోస్తూ తన సంపాదనంతా కుటుంబానికే వెచ్చిస్తాడు. పిల్లల భవిష్యత్తు కోసం వారిని కష్టపెట్టినా అది వారి ఉన్నతి కోసమే. నాన్న అనురాగానికీ, ఆప్యాయతలకు ప్రతీక మాత్రమే కాదు. మార్గదర్శి. మనల్ని నడిపించే దైవం.

మై డాడ్ ఈజ్ మై హీరో

ఫాదర్స్ డే శుభాకాంక్షలు. నాకు ఊహ తెలిసినప్పట్నుంచీ నాన్న ఎవ్రీ మూమెంట్ మా కోసమే తపించేవారు. ఆయన ఇష్టాల గురించి పెద్దగా పట్టించుకోరు. ఎంతసేపూ మా గురించే ఆలోచిస్తారు. సినిమాల్లోకి రావడం గురించి కూడా మొదట నాన్నకే చెప్పాను. మా ఇష్టాలను గుర్తించే వ్యక్తిగా ఆయన నా ఫ్యాషన్‌కు అడ్డు చెప్పలేదు. చిన్నప్పుడైతే నాన్న సాయంత్రం ఇంటికి రాగానే మేమంతా ఆయన ఒళ్లో వాలేవాళ్లం. ఆయన మా తల నిమురుతూ ప్రేమగా చూసుకునేవాళ్లు. పెద్దయ్యాక పిల్లలపై పేరెంట్స్ ప్రేమ తగ్గుతుంది అంటుంటారు. కానీ అది నిజం కాదు. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ వారిపై తల్లిదండ్రుల ప్రేమ కూడా పెరుగుతుంది. నాన్న.. అమ్మ ఇద్దరూ సమానమే. ఇద్దరు సమానమైన ప్రేమ పంచేవాళ్లే. కాకపోతే నాన్న ప్రేమ ఎందుకో వెచ్చగా ఉంటుంది. నాన్నకు నాకు ఉన్న అటాచ్‌మెంట్ మాటల్లో చెప్పలేనిది.
-లావణ్య త్రిపాఠీ, హీరోయిన్
Lavanya

నాన్నకు అన్నీ ఎక్కువే. ప్రేమ ఎక్కువ. సహనం ఎక్కువ. ఆశలెక్కువ. ఓపికెక్కువ. ఓర్చుకునే
గుణం ఎక్కువ. నాన్న నీడలా మన వెనకే ఎప్పుడూ ఉంటాడు..నాన్న సరిగ్గా గుర్తింపులేని ఓ పాత్ర అని అనిపిస్తుంటుంది నాకు. కావ్యాల్లో, నాటకాల్లో, సినిమాల్లో అమ్మని డ్రమటైజ్ చేసినంతగా నాన్నని ప్రపంచం ముందు మనం చూపించలేకపోయాం. నాన్న నుంచి మనం డబ్బు మాత్రమే కాకుండా వారసత్వాన్ని, పేరు, సంస్కారాన్ని తీసుకుని ముందుకు వెళతాం. నాన్న దగ్గర ఇన్ని తీసుకున్నప్పుడు ఆయనకు ఏమివ్వగలం. ఆయనకు ఏమీ అక్కర్లేదు. ఆయన ఏమీ ఆశించి ఇది చేయడు. ఆయన్ను గుర్తు పెట్టుకుంటే చాలు. నాన్న వేలు పట్టుకుని నడక నేర్చుకుంటాం. ఆయన భుజాలపై కూర్చొని ప్రపంచాన్ని చూస్తాం. ఒళ్లో కూర్చొని చదవడం నేర్చుకుంటాం. ఆయన వెళ్లిపోయిన తర్వాత ఒంటరి అయిపోయామని అనుకుంటాం. కానీ నాన్న నీడలా మన వెనకే ఎప్పుడూ ఉంటాడు.(ఓ సందర్భంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ అన్నమాటలివి )
Trivikram

నాన్న సామ్రాజ్యంలో మనమే రారాజులం ..

నేను వేసే ప్రతి అడుగులో నాన్న ఉన్నారని నమ్ముతాను. బాధ్యతలు మీద పడనంత సేపు నాన్నను అంతా లైట్ తీసుకుంటారు. నాక్కూడా కొన్నిసార్లు బిజీగా ఉండి అమ్మానాన్నల్ని నిర్లక్ష్యం చేస్తున్నానా అనిపించేది. నాకు పిల్లలు పుట్టాక మా అమ్మానాన్నను ఇంకా ప్రేమించడం మొదలుపెట్టాను. ఈ లోకంలో మన నుంచి ఏదీ ఆశించకుండా.. ఏమిచ్చినా తీసుకోకుండా నిస్వార్థంగా మనల్ని ప్రేమించేవారు నాన్న మాత్రమే. ఎందుకంటే నాన్న సామ్రాజ్యంలో మనమే రారాజులం. ఆయన ఆశల.. ఆశయాల సాధకులం. నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంత ఎమోషనల్‌గా ఉన్నానో మాటల్లో చెప్పలేను. అందుకే సినిమా ద్వారా ఎంతో కొంత ఆయన్ను చూపించాలనుకున్నా( ఓ సందర్భంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ అన్నమాటలివి)

సర్వం.. సకలం.. నాన్న

నాన్నంటే నాకు ప్రాణం. నా చిన్నప్పుడే అమ్మ ప్రేమకు దూరమయ్యాను. అప్పట్నుంచి నాకు అమ్మయినా.. నాన్నయినా అన్నీ ఆయనే. నాన్నను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేనంత సాన్నిహిత్యం ఏర్పడింది. మా కోసం ఆయన పడిన కష్టం ఇప్పటికీ నా కండ్లముందు కనిపిస్తుంది. మా పొట్ట నింపేందుకు ఆయన పస్తులున్న రోజులు నేనెప్పటికీ మర్చిపోలేను. నాన్న నాకు పాట మాత్రమే నేర్పలేదు. జీవితం కూడా నేర్పాడు. ఆయన భుజాలపై ఎక్కి తిరిగి.. వేలు పట్టుకుని నడిచి.. ఎదలపై దుంకిన క్షణాలు నాలో చాలాకాలం నిశ్శబ్దంగా ఉండిపోయి పాటరూపంలో బయటకు వచ్చాయి. పాట రాయడానికి ఓ కారణం ఉంది. ఓ ఆరునెలలు నాన్నను చూడలేదు. నేను హైదరాబాద్‌లో. అన్న ఇంకోచోట. నాన్న ఊళ్లో. నాన్నను చూడలేని ఈ ఆర్నెళ్లు నాకు మనసున పట్టలేదు. ఆ ఆవేదనలోంచి.. నా మనసంతా నిండిన నాన్న ప్రేమలోంచి పాట పుట్టుకొచ్చి ఇవాళ ఆ పాట వింటుంటే ప్రతి ఒక్కరి నాన్న గుర్తుకొచ్చేలా చేసింది. నా దృష్టిలో నాన్న నా సర్వం.. సకలం.
-సాయిచంద్, గాయకుడు

నాన్న మనసు కనబడదు..

నిజంగానే నాన్న మనసు కనిపించదు. బాధనంతా తన గుండెల భాండాగారంలో భద్రపరిచి కుటుంబం కోసం చమట రూపంలో ఖర్చు చేస్తాడు. నాన్నను అర్థం చేసుకునే అవకాశం కూడా రాదు. అందుకే సైకలాజికల్‌గా నాన్న గుణం చాలా గొప్పది. కానీ చూడటానికి బొమ్మరిల్లు ఫాదర్స్‌లా కనిపిస్తుంటారు. నాన్నను చూసి ఎంత భయపడినా ఎక్కువగా గడిపేది.. తమ ఆలోచనలు పంచుకునేది నాన్నతోనే. పొద్దున్నే లేచి నాన్నను చూస్తే వెయ్యేనుగుల బలం వొచ్చినట్లు అవుతుంది. దీన్నిబట్టి నాన్నంటే ఓ మానసిక ైస్థెర్యంగా చెప్పుకోవచ్చు. ఏది అడిగినా ఇచ్చేవాడు.. ఎంతైనా ఇచ్చేవాడు నాన్న. కాకపోతే తనకున్న కొన్ని సామాజిక పరిధులు.. ఎమోషన్స్ వల్ల మనసులోని ప్రేమను ఎక్కడా బయటకు రానివ్వకుండా చూసుకుంటాడు. చాలామంది చెప్తుంటారు.. వెనకట నాన్నబిడ్డల మధ్యలో ప్రేమలు ఎక్కువగా ఉండేవి.. ఇప్పుడవేవీ లేవని. కానీ అది సరికాదు. మునుపటికంటే ఇప్పుడే నాన్నబిడ్డల మధ్య ప్రేమలు ఎక్కువగా ఉంటున్నాయి. కాకపోతే సంపన్న కుటుంబాల్లో ఆర్థికాంశాలు.. హుందాతనాలు ఈ బంధానికి విలువనీయకుండా నాన్నంటే పైసలిచ్చేవాడే అనుకుంటున్నారు.
-వీరేందర్ చెన్నోజు, సైకాలజిస్ట్

నాన్న ఒక పెద్ద చెట్టు. తన నీడ పడితే బిడ్డ పెరగడేమోనని భయం కాబోలు.. తను ఒదిగి ఉండి, మనల్ని ఎదగనిస్తాడు. నాన్న చేసేది.. రైతు చేసేదీ ఒకేపని. కాకపోతే రైతు నారుమడిలో పెట్టుబడి.. గిట్టుబాటు పదాలుంటాయి. కానీ నాన్న పేజీలో అవేవీ ఉండవు. అమ్మ ఒడి గుడి అయితే నాన్న భుజం లోకాన్ని చూపే బడి. కాలం బాట మీద కనిపించని సాధకుడు నాన్న.

2896
Tags

More News

VIRAL NEWS