నందినికే నా జీవితం అంకితం!


Sun,August 5, 2018 01:55 AM

తన ప్రేమలోని నిజాయితీ తనకు నన్ను మరింత దగ్గర చేసింది. ఓ రోజు మా అమ్మ వాళ్లింటి దగ్గర ఉండగా.. ఆంటీ.. తిన్నావా అని అడిగిందట. ఆరోగ్యం బాగా లేదమ్మా.. రొట్టె చేసే ఓపిక లేదు అని అమ్మ అనడంతో.. అమ్మకోసం రొట్టె చేయడం నేర్చుకున్నది నందిని.
LOVE
ఆమెను ప్రేమించడానికి ఒకరికొకరు పోటీ పడ్డారు. ప్రేమ పరీక్షలో ఎవరు గెలుస్తారోనని చాలెంజ్ కూడా చేసుకున్నారు. దాంట్లో నేను కూడా ఉండటం నాకే ఆశ్చర్యమనిపించింది.

తనది, నాది ఒకే ఊరు. ఇండ్లూ దగ్గర దగ్గరే. మా మనసుల లాగే నా ప్రేమకథలో రెండు భిన్న కోణాలున్నాయి. మొదటిది.. నేను డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న రోజులు. తను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. మా చదువు ప్రయాణంతోనే మా ప్రేమ ప్రయాణం కూడా మొదలైంది. ఆమె పేరు నందిని. చాలా రోజుల నుంచి తను నన్ను ఇష్టపడుతున్న సంగతి నాకు తెలియదు. ఓ రోజు తను నీళ్ల కోసమని మా ఇంటి ముందు నుంచి వెళ్లింది. తనను చూస్తూ నా ఫ్రెండ్ అనిల్‌తో ఈ అమ్మాయిని ఎవరు చేసుకుంటారోగానీ వాళ్లు అదృష్టవంతులు. అయినా ఇలాంటి అమ్మాయిలు మనల్ని ఎందుకు చూస్తారు? అంటూ తనకు వినబడేలా కామెంట్ చేశాను. నవ్వుతూ వెళ్లిపోయింది. కానీ మళ్లీ నీళ్ల కోసమని వచ్చి నావైపు చూస్తూ నిన్నెందుకు ఇష్టపడరయ్యా? నీ చిలిపి పనులు చూసి ఎవ్వరైనా పడిపోవాల్సిందే.. నాతో సహా అన్నది. నా మట్టిబుర్రకు ఆ విషయం అర్థంకాక మళ్లీ తనను అడిగాను.

అయ్యో రామా.. ఇంత చిన్న విషయం కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా స్వామి? నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా బాబూ. ఇన్ని రోజులు నీకు చెప్తే ఏమనుకుంటావో అని చెప్పలేదు అని అన్నది. నేను షాకయ్యాను. ఒకమ్మాయి తనంతట తానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేసరికి ఏం చేయాలో అర్థంకాక ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి.. అవునా అన్నాను. కానీ ఆకర్షణ వల్ల అలా మాట్లాడుతుండొచ్చు.. ఏదైనా ఒక రిస్క్ అనిపించే టెస్ట్ పెట్టి తనలోని అభిప్రాయమేంటో తెలుసుకోవచ్చులే అనుకున్నాను. అయితే నేను నీకు అంత ఇష్టమనుకుంటే రేపు బ్లూ డ్రెస్ వేసుకొని కనిపించు అన్నాను. నాకు బదులివ్వకుండానే వెళ్లిపోయింది. ఇక అంతే సంగతి అనుకున్నాను. తర్వాతి రోజు మా కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ గురించి డిస్కషన్స్ చేస్తున్నాం. అందులో నాదే పైచేయి. అయితే మొదట్లో చెప్పినట్లు రెండవ కోణం ఇక్కడే మొదలైంది. మేం క్లాస్‌మేట్స్ అంతా కలిసి చేస్తున్న డిస్కషన్స్‌లో ఒకమ్మాయి ఎవ్వరితో సంబంధం లేనట్టుగా మౌనమే తన భాష అయినట్టు నిశ్శబ్దంగా కూర్చున్నది. ఆమెవరోగానీ నేనప్పుడే చూశాను ఆ అమ్మాయిని. అందంతో పాటు అమాయకత్వం కూడా ఆమె మొఖంలో కనిపించింది. మా ఫ్రెండ్స్ అంతా ఆ అమ్మాయి గురించే మాట్లాడుకుంటారట. ఆమెను ప్రేమించడానికి ఒకరికొకరు పోటీలు పడ్డారు. ప్రేమ పరీక్షలో ఎవరు గెలుస్తారోనని చాలెంజ్ కూడా చేసుకున్నారు. దాంట్లో నేను కూడా ఉండటం నాకే ఆశ్చర్యమనిపించింది.

ఎందుకో ఆ అమ్మాయి పట్ల నా మనసు లాగింది. పోటీలో నేనే నెగ్గి ఆ అమ్మాయి ప్రేమను పొందాలని నా మనసు తహతహలాడింది. ఒకరకంగా బ్లూ డ్రెస్ అమ్మాయిని మరిచిపోయేట్లు చేసింది. తన పేరు సారిక అని తెలుసుకున్నాను. డ్యాన్స్.. కామెడీ స్కిట్స్ బాగానే ప్రాక్టీస్ చేసి ఫ్రెషర్స్ పార్టీలో మంచి ప్రదర్శన ఇచ్చాను. నేను పండించిన కామెడీకి ఆమె పెదాలపై వేలకోట్ల నవ్వులు పూశాయి. కార్యక్రమం ముగిసిన తర్వాత నేను అటుగా వెళ్తూ ఉంటే సడెన్‌గా మాటలు కలిశాయి. పొద్దుపోయింది.. తనను వాళ్లింటి దగ్గర డ్రాప్ చేయమని రెక్వెస్ట్ చేసింది. నా మనసుకు రెక్కలొచ్చినట్లు ఫీలయ్యాను. ఇంకొంచెం సేపైతే ఆ అమ్మాయిని తీసుకొని వెళ్లాలి.. నేను ఆమెతో ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి అనే ఊహల్లో తేలియాడుతున్నాను. సడెన్‌గా వాళ్ల నాన్న వచ్చాడు. సారికను ఇంటికి తీసుకెళ్లాడు. నాలో కొంచెం నిరుత్సాహం ఏర్పడింది. రేపటి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. క్షణమొక గంటలా గడిచింది. ఉదయం యథావిధిగా కాలేజీకి వచ్చింది ఆ అమ్మాయి. కానీ తన మొఖంలో కోపం కనిపించింది. ఏమైంది అని అడిగాను. చప్పుడు చేయలేదు. మేం ఆమెను ప్రేమలోకి దింపుతామని చేసిన చాలెంజ్ గురించి ఎవరో నాలుగు మాటలు ఎక్కించి చెప్పి ఉంటారనుకున్నాను.

నిజానికి కారణం అదే. ఇద్దరం నిజంగా ప్రేమలో పడ్డాం. చాలెంజ్ గురించి మరిచిపోయాను. తన బర్త్‌డే పార్టీ గ్రాండ్‌గా చేశాను. తరుచూ సినిమాకెళ్లేవాళ్లం. బైక్‌పై లాంగ్ డ్రైవ్‌కు కూడా వెళ్లేవాళ్లం. అలా సంవత్సరం పాటు చిలుకా గోరింకల్లా ప్రేమించుకున్నాం. సారికకు బావ ఉన్నాడనే విషయం కూడా నాకు తెలియదు. కానీ అతడికి నా గురించి మొత్తం తెలుసునట. అందుకే ఒకసారి నన్ను అటకాయించి గొడవ పడ్డాడు. సారికను పిలిపించి.. ఏయ్.. వీడితో నీకేం పని? మీ ఇద్దరికీ ఉన్న సంబంధం ఏంటి? అని నిలదీశాడు.

సొంత బావ, మా ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే గొడవలు అవుతాయనుకున్నదో.. బావను చూసి భయపడిందో ఏమోగానీ సారిక మాట మార్చింది. నాపై ఉన్న ప్రేమను తేలిక చేసి మాట్లాడింది. ఒక రకంగా నాపై ఉన్నది ప్రేమ కాదనీ.. కేవలం పరిచయం మాత్రమే అని చెప్పేసింది. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్నాను. కానీ చాలా బాధనిపించింది. సంవత్సరకాలం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నన్ను ఎలా కాదనుకుంటున్నదో అర్థం కాలేదు. కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వొద్దని నేను ఎప్పుడూ అనలేదు. కానీ ఫ్యామిలీని సాకుగా చూపించి నన్ను నిర్లక్ష్యం చేయడం సహించలేకపోయాను. క్రమంగా మా మధ్య దూరం ఏర్పడింది. సారికపై కోపం కలిగింది. ఏమైందో ఏమో కొద్దిరోజులకు కాలేజీకి కూడా రావడం మానేసింది. వాళ్ల నాన్న మాట కాదనలేక.. కాలేజీ మానేసి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా జాబ్ చేస్తుందనే విషయం తెలిసింది. తనకు తాను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాననే ఆనందంలో ఉన్నదట. కానీ నాతో గడిపిన క్షణాలను ఎలా మర్చిపోయిందో అర్థంకాలేదు. నేనైతే మర్చిపోలేకపోయాను. కుటుంబం గురించి ఆలోచించిన ఆమె నన్ను ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఎందుకు భావించలేకపోయింది? అనే బాధ నిత్యం వెంటాడింది. దీని నుంచి బయటపడేందుకు మద్యాన్ని ఆశ్రయించాను. నేనొక దేవదాసుగా మారిపోయాను. ఇప్పుడు నందిని నా పాలిట దేవత అయింది. నందిని ఎవరో తెలుసు కదా.. నేను మొదటగా ప్రేమించిన అమ్మాయి.

అదే బ్లూడ్రెస్ అమ్మాయి. నాకు తెలియకుండా రెండు సంవత్సరాలుగా నన్ను ప్రేమించిన నందిని నన్ను దేవదాసులా చూసి తట్టుకోలేకపోయింది. ఫ్రెండ్స్ ద్వారా నా గురించి మొత్తం తెలుసుకున్నది. సారిక ఎవరో.. ఎక్కడుంటుందో వంటి విషయాలు కూడా ఆరా తీసిందట. సారిక పనిచేస్తున్న స్కూల్‌కు వెళ్లి తనతో గొడవ పడింది. అసలు నువ్వు ఎవరు? నాతో ఎందుకు గొడవ పడుతున్నావు? నీకు, వాడికి సంబంధం ఏంటి? అని రకరకాలుగా సారిక.. నందినిని నిందించింది. నేను అతడి లవర్‌ని. నీ కంటే ముందే వాడిని ప్రేమించాను. మా ప్రేమకు రెండేళ్లు. మాటల్లేకపోయుండొచ్చు. కానీ, మనసుతో అతడిని ఇంతకాలం ప్రేమించాను. నేను వాడిని పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. వాడు ఎలా ఉండేవాడు? ఎలా అయ్యాడు? అని గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట. సారిక జ్ఞాపకాల్లో శిలనైపోతున్న నన్ను తన ప్రేమతో మంచులా కరగదీసింది నందిని. ఆ జ్ఞాపకాల్లోంచి బయటపడాలనే ఉద్దేశంతో నా పేరును అను నరేశ్‌గా మార్చుకున్నాను. నందిని నన్ను అలాగే పిలిచేది. చాలామంది నా గురించి తప్పుగా చెప్పినా నన్ను మార్చేస్తానని చెప్పేది. నందినికి నేను చాలాసార్లు చెప్పాను.. నేను సారికను మర్చిపోలేకపోతున్నాను. నావల్ల నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అన్నాను. నీవల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నా ప్రేమతో నువు సారికను మర్చిపోయేట్లు చేస్తా అన్నది. అలాగే ప్రేమించింది కూడా. తన మాటల్లో, చేతల్లో అమ్మ ప్రేమ కనిపించేది. తన ప్రేమలోని నిజాయితీ తనకు నన్ను మరింత దగ్గర చేసింది. ఓ రోజు మా అమ్మ వాళ్లింటి దగ్గర ఉండగా.. ఆంటీ.. తిన్నావా అని అడిగిందట. ఆరోగ్యం బాగాలేదమ్మా.. రొట్టె చేసే ఓపికలేదు అని అమ్మ అనడంతో.. అమ్మకోసం రొట్టె చేయడం నేర్చుకున్నది నందిని. ఆమె నన్నే కాదు.. నా కుటుంబాన్ని కూడా ప్రేమిస్తుందనే విషయం దీన్నిబట్టి తెలిసింది. అందర్నీ బాగా చూసుకుంటుందనే భరోసా కూడా కలిగింది.

అలా మా ప్రేమకు నాలుగేళ్ల వయసొచ్చింది. ప్రేమకు కూడా వయసైపోతుందని తెలుపుతూ నందినికి ఇంట్లో సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఒకవైపు మా అమ్మకు ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటన్నది నాకు అర్థంకాలేదు. అమ్మకు అసలే ఆరోగ్యం బాగాలేక డాక్టర్లు బతకదు అని చెప్పేశారు. నాకు చాలా భయమేసింది. అమ్మకు విషయం చెప్తే ఇన్ని రోజుల తన పెంపకాన్ని తప్పుగా అర్థం చేసుకొని మరింత బాధపడే అవకాశం ఉందని చెప్పలేదు. నందినికి పెళ్లి నిశ్చయమై నా కళ్లముందే తన పెళ్లి పనులు జరుగుతున్నాయి. కాస్త ధైర్యం చేసి వాళ్ల ఇంట్లో చెప్పుదామనుకున్నాను. కానీ వాళ్లు ప్రతీదానికి కులం కులం అంటారని చెప్పలేదు. అమ్మకోసం అమ్మలా ప్రేమించిన నందినిని వదులుకోవడం చాలా బాధగా అనిపించింది. పెళ్లికి రోజులు దగ్గరొస్తున్నాయి. ఓ రోజు నందిని నాతో.. బంగారం.. అతను తాళి కట్టేది నా శరీరానికే. నా మనసుకు నువ్వు ఎప్పుడో తాళి కట్టావు గుర్తుందా అన్నది. అది విన్నాక నాకు ఏమీ పాలుపోలేదు. తను వెళ్లిపోతుందని తెలిసి హృదయం మోయలేనంత బరువుగా తయారైంది. రోజులన్నీ జీవితంలో చివరి క్షణాలుగా తోచాయి. అయినా, మరిచిపోవడానికి తను నాకు జ్ఞాపకం కాదు. నా జీవితం. బంగారం.. నువ్వు నా కళ్లముందు లేకుండొచ్చు కానీ నా కళ్లలోనే ఉన్నావ్.. ఈ జీవితం నీకే అంకితం.
నీ అను నరేశ్.!

1317
Tags

More News

VIRAL NEWS

Featured Articles