ద్వాలి


Sun,May 14, 2017 02:44 AM

గుండెల్లోని గుబులు బయటకు తెలియనియ్యకుండా రోజంతా పని మంత్రం వేసుకుంటూ తానో యంత్రమవుతుంటుంది ద్వాలి. ఆ రోజూ అంతే పత్తి తొక్కించి అలసిపోయి వచ్చింది. పిల్లలకు జొన్నరొట్టెలు చేసిపెట్టింది. వంటిల్లు సర్దడానికి వెళ్లబోతుంటే వాకిట్లో ఎవరో వచ్చిన అలికిడయ్యి ఎవరా అని చూసింది. నిలువెత్తు ఆ మనిషి హేమ్లా.. మొహమాటంగా గుమ్మంలో నిలిచుని ఉన్నాడు. ఉలిక్కిపడిన ఆమె గుండెలో ఏదో అలజడి. దా కూసో.. అన్నది. పరాయివాడిలా ఒక నిముషం మోమాటంగా నిలబడి అంతలోనే మహా పౌరుషంగా వచ్చి కూర్చున్నాడు.పిల్లలను చూడాలనిపించిందా ఈయనకు. అయినా రోజూ ఆడనో ఈడనో చూస్తూనే ఉన్నాడు కదా.. మనసులో అనుకుని లోనికి వెళ్ళిపోయింది. బయటి వాళ్ళు వస్తే ఇచ్చినట్లు మంచినీళ్ల గ్లాసు తీసుకెళ్తుంటే ఆమె గుండెచప్పుడు ఆమెకే వినిపిస్తున్నది.

బహుషా అతని మానసిక పరిస్థితి ఆమెలాగే ఉన్నదేమో గ్లాసు అందుకుని గటగట తాగేశాడు. పంచాయితీ ప్రెసిడెంట్ బానోతు హేమ్లా అంటే ఆ మండలంలోనే తెలియని వారుండరు. అట్లాంటిది ఇప్పుడేంటి నా ఇంటికి నేను వస్తే నాకే నోట మాట రావడం లేదేమిటి.? తనకు తానే ఆశ్చర్యపోయాడు. అంతలోనే అసలు ఇది నా ఇల్లేనా..? అవును నా ఇల్లే.. నాకు నేనే దూరం చేసుకున్న నా ఇల్లే.. మనసులో అనుకున్నాడు.
సోని వెళ్లి నాయన పక్కన కూర్చున్నది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని.. మంచిగా చదువుతున్నావా బిడ్డా అన్నాడు. ఆ మంచిగనే చదువుతున్నా నాయినా.. తండ్రి ఇంటికి వచ్చినందుకు సంబరంగా ఉన్నది సోనికి. అంతలోకే మంగ్యా వచ్చాడు. తండ్రిని చూసి ఆనందం, భయం రెండూ కలిగాయి. ఇటు రా.. అన్నాడు. దగ్గరకు వెళ్ళగానే వాడి తల నిమిరాడు. ఉబికి వస్తున్న కన్నీళ్ళని ఆపుకున్నాడు. తానూ వచ్చిన పని గుర్తుకు వచ్చి తమాయించుకుని..

ద్వాలీ! నీతో జర మాట్లాడాలి. ఇటు వచ్చి కూర్చో.. పిలిచాడు. ద్వాలి వెళ్లి ఎదురుగా కూర్చున్నది.
నీకు తెలుసు గదా తొందరలోనే ఎన్నికలు వస్తున్నాయి. సుట్టుపక్కల నాలుగూర్లకు ఇప్పటికి రెండుసార్ల సంది నేనే పంచాయితీ ప్రెసిడెంట్‌ని. ఇక ముందు కూడా నన్ను కాదనేటోడు లేడు. కానీ పాడుబడ్డ సర్కారు రూల్స్ మార్చిపారేసింది. ఇప్పుడు ఈ పంచాయితీ సీట్ ఆడోళ్లకేనట.. విషయం కొద్దికొద్దిగా అర్థం అవ్వసాగింది ద్వాలీకి..
Story

నేను గిన కాదంటే పోటీ చేస్తానికి మస్తుమంది వాళ్ల భార్యలను, కూతుళ్లను నిలవెడ్తానికి చూస్తున్నారు. అందరేమో గదేంది మన ద్వాలి భాయి ఉండగా ఎవ్వళ్లనో నిలవెట్టుడేంది అంటున్నారు.
ద్వాలికి ఇది పూర్తిగా కొత్త విషయం. కానీ ఎక్కడా తొట్రు పడలేదు. ఆమె మనసులో ఆలోచనలు వేగంగా పరుగెత్తాయి. అతనిపుడు ఎన్నికలలో నిలబడడానికి ఏ మాత్రం వీలులేదు. కానీ తానూ నిలబడి గెలిస్తే అతను ఇంచుమించు పదవిలో ఉన్నట్టే.. ఓహో ఇందుకన్నమాట వచ్చింది.. అన్నట్లుగా అతనివంక చూసింది. ద్వాలి చూపులలో ఏమి కనబడిందో ఒకసారి తలవంచుకున్నాడు. మళ్ళీ అటూ ఇటూ చూస్తూ.. ఎన్నికల తేదీ ఇయ్యాల్నో రేపు సెబుతారంటా నామినేషన్ కాయితాలు దెస్తా. మనోళ్లంతా ఎంటొస్తరు. అందరితోని కూడి పొయ్యి నువ్వు ఆడ నామినేషన్ కాయితం బెట్టుడు వరకే.. ఆటెన్క నువ్వు గెలుసుడు అంతా నేనే చూసుకుంటా. జరంత నేను పిలిసినప్పుడలా ఒక నాలుగు దినాలు తిరిగినవంటే.. అందరూ మనోళ్లే.. మనోల్ల ఓట్లన్నీ మనకే వడుతయి. నువ్వు గెలిసినవనుకో ఇక మనకు తిరుగేముంటది.? కాస్త హుషారుగా అన్నాడు.

ద్వాలి నోరు విప్పింది. గింత అనుభవమున్నోడివి నీ పాత జెండాతో గెలుస్తాననే అనుకుంటున్నావా..?
ఏం ఎందుకు గెలువం? పౌరుషంగా అన్నాడు. అయిదేళ్ల క్రితం నువ్వు ఏ జెండా బట్టుకున్నావో ముఖ్యం గాదు.. నువ్వు మంది కోసం ఏమి చేసినవో గది కావాలె.. నువ్వు ఏ రంగు జెండా పట్టుకుని గెలిసినవో ఆ జెండా, ఆ పార్టీ ఇప్పుడు మందికి అవుసరం లేదు. ఇప్పుడు మన రాజ్యం వచ్చింది. ఇగ నీ పాత పార్టీ జెండా పక్కన బెట్టి ముందు మనలను నడిపిస్తున్న పార్టీల.. మనకి అవుసరమయిన పార్టీల చేరు. ఈలోగా ఎన్నికలు వస్తయి. అప్పుడు ఆలోచిద్దాం ఏమి చేసుడో. ద్వాలి మాటలకూ దిమ్మ తిరిగిపోయింది హేమ్లాకి. ఇంత గుంభనంగా ఉండే ద్వాలిలో ఎంత చతురత ఉన్నది విస్తుపోయాడు.
కాస్సేపు మౌనంగా ఉండిపోయాడు. గంసీ టీ పెట్టుకొచ్చింది. అతను చాలా మాములుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ చాల ఆలోచనలో పడిపోయాడు. ఇంతలో అతని పరివారం కొందరు వచ్చారు.
ద్వాలిభాయి ఇగ నువ్వే నిలవడాల అంటూ.. ఒకరు ద్వాలి బ్యాన్ నువ్వే ఇప్పుడు మాకు గతి. అని ఒకరు మొదలు పెట్టారు.

సరే నిలవడతది తియ్ ఇగ పోదాం నడువుండ్రి.. అంటూ హేమ్లా వాళ్ళను త్వరగా అక్కడి నుండి బయలు దేరదీసాడు. ద్వాలి మాటలు తనపై చాలా ప్రభావం చూపాయి. ముఖ్యమైన పార్టీ పెద్దలతో మంతనాలు జరిపి రెండు రోజుల్లో తన అనుచరులతో వెళ్లి పాలకపక్షంలో చేరిపోయాడు.
రెండు నెలలు గిర్రున తిరిగిపోయాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. హేమ్లా అతని పరివారమంతా ద్వాలి ఇంటి చుట్టూ చేరారు. నీకేమి భయం లేదు ద్వాలీ, నువ్వు నామినేషన్ వేస్తే చాలు అంతా మేము చూసుకుంటాము.. అంటూ అభయమిచ్చారు. ద్వాలి ఏమి ఆలోచించుకుందో ఎన్నికల్లో నిలబడడానికి సంసిద్ధమయ్యింది. హేమ్లా అతని అనుచరులతో కలిసి మేళ తాళాలతో నినాదాలతో మందీ మార్బలంతో బానోత్ ద్వాలిబాయి నామినేషన్ వేసి వచ్చింది. అది మొదలు నిశ్శబ్ద దీవిలా ఉండే ద్వాలి ఇల్లు ఇప్పుడు మాటలతో అరుపులతో నినాదాలతో మారు మ్రోగిపోసాగింది. చీకటి కమ్ముకుంది. అందరూ వెళ్లిపోయారు. ద్వాలి ఎప్పటిలా ఒంటరిగా మిగిలిపోయింది. పిల్లలిద్దరూ పడుకున్నారు. మంచం మీదకు ఒరిగిన ద్వాలి కనుకొనుకుల్లో మంచుబిందువులు చేరాయి. జారుతున్న ఒక్కో బొట్టు మనసు పొరలపై ఆమె గత చరిత్రను తిరగరాసి చూపుతున్నది.

పదిహేనేళ్లప్పుడు పసుపుబట్టలతో పసిడికోర్కెలతో తన వాడితో కలిసి ఆ ఇంట అడుగు పెట్టింది ద్వాలి. అమ్మా నాన్నలకు దూరంగా వచ్చిన బెంగ లేకుండా అత్తా మామ, మరుదులు ఆడబిడ్డలతో ఇల్లంతా మనుష్యుల సందడికి మనసు మురిసిపోయింది. ఇంటి చుట్టూ పూలమొక్కలు కనుచూపు మేరలోనే తమ పొలాలు.. శ్రావణ మాసపు పెళ్లికూతురికి ప్రపంచమంతా పచ్చగా హాయి కన్పించింది. చాలా తక్కువ కాలంలో ఆ ఇంట్లో బాగా కలిసిపోయింది. ద్వాలి చాల బలిష్టంగా ఉంటుంది. చక్కని పొడగరి. ఒక్కతే ముగ్గురి పని చేస్తుందని చెప్పుకుంటారు. ఆమె పని వేగం, నడక వేగం. మాటలు మాత్రం చాలా తక్కువ. కానీ మాట్లాడే ఆ ఒక్కమాట చాలా విలువైందిగా ఉంటుంది. చాలా త్వరగానే అందరిలో మంచి పేరు తెచ్చుకున్నది. ఒక మనిషి చాల బాధ్యతగా ఉండడం మరొకరి సోమరితనానికి దారి తీస్తుందన్నది ఆమె ఊహించలేదు. ఆమె బాధ్యతగా ఉండడం అతనిలో అలసత్వానికి కారణమౌతుందని ఆమెకి తెలియదు. మొదటి నుండే హేమ్లా కులాసా పురుషుడు. దానికి తోడు రాజకీయాల పిచ్చి. ద్వాలి ఇంటి విషయాల బాధ్యత అందుకోవడంతో ఇక స్వేచ్ఛగా తిరగసాగాడు.

హేమ్లా రాజకీయ రంగప్రవేశానికి అనుకోకుండా ద్వాలినే ఒక కారణమయ్యింది. పెళ్లయిన మూడునెలలకే ఆ ఊర్లో చెక్ డాం కమిటీకి ఛైర్మెన్‌గా ఉండడానికి పది పాస్ అయిన వాళ్ళు కావాలి అన్నారు. ఆ ఊర్లో ఉన్న ఆడపిల్లలను తమ ఊరి బడిలో ఉన్న ఏడో తరగతి వరకు చదివించేవారు. ఇక పై చదువులకు పక్క ఊర్లకు పంపలేక ఓ రెండేళ్ళు పొలం పనులకు పంపి మంచి సంబంధం కుదరగానే పెళ్లిచేసి పంపించేవారు. ఆ చిన్న ఊర్లో పది వరకు చదివిన ఆడవాళ్లే లేరా అని ఎలాగా అని మధన పడుతున్న సమయంలో ఎవరో అన్నారు... బానోతు హేమ్లా భార్య ద్వాలి పదోది చదివిందని.. అంతే, ఊరి పెద్దలు హేమ్లా వాళ్ళింటికి వచ్చి అతనితో మాట్లాడి ద్వాలిని చైర్మన్‌గా నిలబెట్టారు. ఆమెను నిలబెట్టిన మొదటి రోజే ద్వాలికి పని. అక్కడినుండి అంతా హేమ్లానే చూసుకునేవాడు. మధ్య వచ్చి ద్వాలి సంతకాలు తీసుకునేవాడు. ఒక్కోసారి పొలం పనుల్లో ఉన్న ద్వాలిని త్వరగా రమ్మని పిలుపు వచ్చేది. పరుగు పరుగున వెళ్ళేది. అధికారులు వచ్చేవారు ఏదేదో అడిగేవారు. అన్నిటికి అతనే జవాబులు చెప్పేవాడు. ఆమెకి ఏదేదో చెప్పేవారు. అన్నిటికీ తలూ పి మళ్ళీ వెళ్లి పనులు చేసుకునేది. తరువాత అతను ఒక పెద్ద లీడర్‌తో ఉన్న పరిచయాన్ని బాగా ఉపయోగించుకుని చాల తక్కువ కాలంలో చిన్నపాటి నాయకునిగా ఎదిగిపోయాడు. అతి త్వరలో పంచాయితీ ప్రెసిడెంట్‌గా నిలబడి గెలిచాడు.

నీకేంటి నువ్విప్పుడు ప్రెసిడెంట్ భార్యవు.. అని అందరూ అంటున్నా ద్వాలి దేనికీ పొంగిపోయేది కాదు. ఏ ఒక్క రోజూ పనులకు వెళ్లడం మానేది కాదు. దానికి తోడు హేమ్లా రాజకీయాలలో మునిగిపోయాక ఆమె పనిభారం పెరిగిందే తప్ప తగ్గలేదు. పరిస్థితులు కూడా అలాగే వచ్చాయి. అనుకోని రీతిలో అకస్మాత్తుగా మామగారు చనిపోవడం, పై చదువులకు వెళ్లిన మరిది అక్కడే ఉద్యోగం సంపాదించుకుని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ ద్వాలి నెత్తినపడ్డాయి. ఆమెకి వ్యవసాయపు పనులంటే చాలా ఇష్టం కూడా. ఏ ఒక్క రోజు ఆమె విశ్రాంతి అన్నది ఎరుగదు. చేనులో పెంచిన గుమ్మడికాయలు, పచ్చిమిరపకాయలు, దోసకాయలు, కరివేపాకు రైతుబజార్‌కి పంపి అమ్మించడం చేసేది. సొరకాయలు బస్తాలకు ఎత్తేది. ములక్కాయలు ముదరక ముందే ఏదో ఒక రేటుకు అమ్మించేసేది. ఇన్ని పనులమధ్య పనివాళ్లను ఎంతో బాగా చూసుకునేది. మొదటి నుండి చాల జాలిగుణంకల ద్వాలి ఎవరయినా పని కావాలి అని అడిగితే వాళ్లకు ఏదో ఒక పని అప్పజెప్పి ఎంతోకొంత ఇచ్చి పంపేది. అలాగే తానూ రకరకాల పనులు చేసి సంపాదించేది.

ఇప్పుడామె లోతువాగు దగ్గర సమ్మక్క దిమ్మెల దగ్గర ఆ సంవత్సరం సమ్మక్క సారక్క జాతరకు పుచ్చకాయలు, బెల్లమూ అమ్మడానికి సన్నాహాలు చేసుకున్నది. నలుగురు పనివాళ్ళను పెట్టుకుని తానూ ప్రయాణమయ్యింది. ఎండ తగలకుండా గోనె సంచులు కట్టి డేరా కట్టి జాతర ఉన్నన్నాళ్లూ మంచి బేరం చేసింది. అదిగో అక్కడే మోతీ పరిచయమయింది. చాల అందమయిన చలాకీ పిల్ల మోతీ.. లారీ యాక్సిడెంట్‌లో భర్త చనిపోయి ఆరునెలలు అవుతున్నదట. అక్కడా ఇక్కడ దొరికిన పనల్లా చేసుకుని బతుకుతున్నానని చెప్పింది. మహబూబాబాద్ దగ్గర రాంక్యాతండా ఆమె ఊరు. రెండు రోజులపాటు పిల్లల ఆట వస్తువులు అమ్మింది. సాయంత్రం బయలు దేరడానికి సిద్ధమయ్యింది.
జాతర ముగిసి అందరూ సర్దుకుని వెళ్లిపోతున్న సమయంలో వడదెబ్బ తగిలి కళ్ళుతిరిగి పడిపోయింది మోతీ.. ద్వాలి ఆమె మనుషులు మోతీకి సపరిచర్యలు చేశారు. ఈలోగా ఆమె వెళ్ళవల్సిన రైల్ సమయం దాటిపోయింది. అయిదేళ్ల కూతురితో ఆ రాత్రి మోతీ ఎక్కడకు వెళ్తుందని తన ఇంటికి తీసుకువచ్చింది. మరిది ఉండి వెళ్లిన గదిలో ఉండమంది. మోతీ.. తెల్లారే వెళ్లిపోదామనుకుంటే పిల్లకు జ్వరం వచ్చింది. రెండురోజులాగి వెల్దువుగానిలే అని ద్వాలి ఆమెకి వంట చేసింది. ఈ లోగా పత్తి తీస్తానికి, మిరప కోస్తానికి మనుషులు అవసరమయి మోతీని కూడా పనికి తీసుకెళ్లింది. ఆ తరువాత మోతీకి ఒకటి తరువాత ఒకటి పనులు దొరికాయి. సరేలె ఇక ఏమి వెళతావుగాని ఆమెని నెలకింత కిరాయి కట్టుకుని ఇక్కడే ఉండిపొమ్మన్నది ద్వాలి. అప్పటినుండి మోతీ ఇంట్లో మనిషిలా కలిసిపోయింది.
ఇంతలో ద్వాలి తల్లి మంచాన పడిందని కబురు వచ్చింది. ఆమె ఓ పది రోజులపాటు ఊరు వెళ్ళవలసి వచ్చింది. పిల్లలకేమో పరీక్షలు ఎలాగా అనుకుంటుంటే-

నీకెందుకక్కా పిల్లలకు, వండి పెట్టి క్యారేజ్ కట్టి పంపుతా. వాళ్ళను జాగ్రత్తగా నేను చూసుకుంటా నువ్వు పోయిరా.. అన్నది మోతీ. ద్వాలి హేమ్లాను తీసుకుని ప్రయాణమయ్యింది. ఆమె తల్లికి వచ్చే ప్రాణం, పోయే ప్రాణంలా ఉంది. చాల రోజులు మంచాన ఉండడం వల్ల ద్వాలి వారం రోజులు అక్కడే ఉండవలసి వచ్చింది. హేమ్లా పనులు ఉన్నాయంటూ జింకలతండాకు తిరిగి వచ్చేసాడు. ద్వాలి అక్కడ నాలుగు రోజులు.. ఇక్కడ రెండు రోజులు.. అక్కడికీ ఇక్కడికీ తిరగాల్సి వచ్చింది.
అలా రెండు నెలరోజులు గడిచాక ఆమె తల్లి చనిపోయింది. అప్పుడు మరో పదిహేను రోజులు పుట్టింట్లోనే ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో అస్తవ్యస్తంగా ఉన్న ఇంటినీ పొలాన్ని మోతీనే చక్కబెట్టింది. పనివాళ్ల సంగతి చూసుకున్నది. మిరప కోయడం ఇంటికి చేర్చడం, పత్తి తొక్కించి బస్తాలకెత్తడం వంటి పనులు సమయానికి నిలబడి చేయించింది. వంటరి మనిషని ఆశ్రయం ఇచ్చినందుకు తమకు ఆపద వచ్చినపుడు మోతీ ఇంటి మనిషల్లే కష్టం పంచుకున్నందుకు చాలా సంతోషపడింది. కానీ ఆమె కష్టాన్నే కాదు ఆమె సంతోషాన్ని కూడా పంచుకుంటున్నదని ఊర్లో వాళ్ళు చెప్పేదాకా తెలియరాలేదు. ఏమి జరుగుతున్నదో అర్థంకాని అయోమయంలో ఉన్న ద్వాలి కాళ్లు పట్టుకుని మన్నించమంటూ వేడుకుంది మోతీ..
మోతీ లేకుండా నేను ఉండలేక పోతున్నాను.. అలాగని నీకేమి అన్యాయం చేయను.. నిన్నేమీ వదులుకోను.. అన్నాడు హేమ్లా.

చెప్పలేని విరక్తితో పిల్లను తీసుకుని గుమ్మం దాటుతున్న ద్వాలిని బతిమాలారు ఇద్దరూ.. వాళ్ళిద్దర్నీ పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదు. అలాగని తన నిర్ణయం మార్చుకోలేదు.
సరే ద్వాలి, నువ్వు వెళ్లొద్దు నేనే వెళ్ళిపోతాను.. అన్నాడు హేమ్లా. ఆపలేదు ద్వాలి. మరునాడు చుట్టాలను తీసుకునివచ్చి చెప్పించాడు. ఒక్క మాట కూడా బదులు పలకలేదు. ఊరి వాళ్ళు మోతీని నీ మూలానే వాళ్ల కుటుంబంలో కలతలు వచ్చాయి. నువ్వు ఊరు వదిలి వెళ్ళిపో. నువ్వు వెళ్లిపోతే వాళ్లే కలిసి ఉంటారు.. అని తిట్టారు.
కడుపుతో ఉన్న మనిషి ఎక్కడికి పోతుంది.. నోరు విప్పింది ద్వాలి. రాంక్యా తండాలో దస్రూకి కిరాయికి ఇచ్చిన ఇంటిని ఖాళీ చేయించిన. ఆమెను అందులో ఉండమని చెప్పండి. దేవుడు ఆమెను మోసం చేసి మొగడు లేకుండా చేసిండు. ఇప్పుడు మీరంతా కూడి ఆమెకి తోడు లేకుండా చేయకుండ్రి. ఆమె లేకుండా ఆయన బతకలేడట. వెళ్లి జర మంచిగా చూసుకొమ్మని చెప్పుండ్రి. ఆయన బతుకుల నా చీటీ నేనే చింపి పారేసిన అని చెప్పుండ్రి.. తీర్పు చెప్పేసింది ఆమె.

ద్వాలీకి అంత పౌరుషం ఎందుకు..? లోకంలో ఎన్ని జరగడం లేదు పిల్లలు లేరనో, కొడుకు పుట్టలేదనో, మళ్ళీ పెళ్లి చేసుకునే వాళ్ళుంటారు. మగవాడు ఇంకో పెళ్లి చేసుకోవడమో ఇంకో ఆడదానితో సంబంధం కలిగి ఉండడం అక్కడ చాలా మామూలు విషయం. అది భరించలేని ద్వాలి చాల గర్విష్టి అనుకుంటారు కొందరు. కానీ ద్వాలి అంతరంగం వేరు.. తానుండగా మరో మగువ మీద మనసు పడి తన మనిషి దూరం అయ్యాడు. పొతే పోనీ, కానీ తనతో ఉద్ధరింపు కాపురం చేస్తానంటాడు. అదే వద్దు మహా పౌరుషంగా అనుకున్నది. కొంతకాలం అలానే ఉంటారు. తరువాత ఆమెనే కలిసిపోతుంది అనుకున్నారు చాలామంది. కానీ, రాంక్యా తండాలో వున్న హేమ్లా మోతీల దగ్గరకు తాను వెళడం గాని జింకలతండాలో ఉన్న తన వద్దకు వాళ్ళను రానివ్వడం కానీ చేయకుండా ఇలా విడిగా బతకడం మొదలెట్టి నాలుగేళ్లవుతుంది. ఇప్పుడు ఇంత కాలానికి మళ్ళీ ఇతను గడప తొక్కాడు. ముందు ముందు ఏమి కానుందో, ఆలోచనల తెరల మధ్య కలత నిద్రపోయింది.

ఎన్నికలలో ద్వాలి, హేమ్లా కలిసి తిరుగుతూ ప్రచారం చేస్తుంటే ఇక ద్వాలి హేమ్లా కలసిపోయారనే అనుకున్నారు, ఆ చుట్టు పక్కల నాలుగయిదు ఊర్ల వాళ్ళు. ద్వాలి అంటే ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో ఆమెను మంచి మెజారిటీతో గెలిపించారు ప్రజలు. తనకు బదులు ద్వాలి ప్రమాణ స్వీకారం చేస్తుంటే మనసు గిల గిల లాడిపోయింది హేమ్లాకు. కానీ సీటు ద్వాలిదే కానీ, ద్వాలి తనదే కదా అనుకున్నాడు. టాప్ లేని జీపులో కూర్చోబెట్టి ద్వాలిని గొప్పగా ఊరేగించాడు. హమ్మయ్య పదవి తన చేయి దాటిపోయినా ఇల్లు దాటిపోలేదు అనుకుని నిశ్చింతగా నిద్రపోయాడు.
పంచాయతీ ప్రెసిడెంట్ బానోతు ద్వాలి చాల త్వరగా వార్డు మెంబర్లను కలిపేసుకున్నది. వాళ్లు సమావేశాలు నిర్వహిస్తుంటే ఆమె పక్కనే హేమ్లాకి వేరే కుర్చీ వేస్తున్నారు. అతని పరివారమంతా ద్వాలి మా మనిషి, అంతా మా రాజ్యమే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి ఒక పెద్ద గుంపు ద్వాలి ఇంటి దగ్గర సమేవేశం అవుతున్నారు.

రెండు మూడునెలలు గడిచాక ఒకరోజు ద్వాలి.. హేమ్లా ఉన్నప్పుడే చెప్పింది.ఉదయం ఎనిమిదింటి నుండే నేను పంచాయతీ ఆఫీసులో ఉంటాను. ఇక పొద్దు మాపు ఇక్కడ చర్చలు ఆపుండ్రి తమ్ముడూ..! పిల్లల చదువులు పాడవుతున్నాయి.. హేమ్లా నిర్ఘాంతపోయాడు.
పిల్లల చదువులు పాడవుతున్నది నిజమే కదా అనుకుని వాళ్ళను పంపేశాడు.
తానూ నులక మంచం మీద కూర్చుని చూడు ద్వాలీ! ఆ పార్టీ రాజునాయక్ కొద్దిగా ఎక్కువ చేస్తున్నాడు. నువ్వు వాడింటి ముందు సిమెంట్ రోడ్డు గురించి అస్సలు కుదరదంటే కుదరదు అని చెప్పు. నిధులు రావాలని, వేరే అవుసరాలు ఉన్నాయని చెప్పు.. మిగతాది నేను చూసుకుంటా ..
అదేంటి అట్లాంటావ్..! అటు వైపు రోడ్డు వేస్తే.. పక్కోర్లో ఉన్న పెద్దబడికి పిల్లలు సైకిళ్ళమీదో ఆటోల్లోనో పోవచ్చు. లేకుంటే వాళ్ళు కాలువ కడ్డంబడి నడవాల్సి వస్తున్నది. వానాకాలం వాళ్లకు మస్తు తక్‌లీబ్ అవుతది. అరే, నేను చెప్తే నీకు సమజ్ గావట్లేదా..? వాడు వాడింటి ముందు రోడ్డు వేపించుకుని ట్రాక్టర్లు, ట్రాలీలు తిప్పుకుందామని జూస్తున్నడు.. వాడి మీద నీకు కోపం ఉంది కాబట్టి.. వాడు ట్రాక్టర్లు తిప్పుకోకుండా ఉండేందుకు నలభయి, యాభయి మంది బడిపిల్లలకూ ఊరోళ్ళకూ రోడ్డు లేకుండా చేద్దామనా..? కోపంగా అన్నది.

చూడు..! నూరేళ్ళ నా బతుకు నీ చేతుల పెడితే అది తీసుకోబోయి ఎవరికో అప్పజెప్పినవంటే అది వేరే సంగతి.. అప్పుడది పురాగా నా బతుకు.. ఇప్పుడు ఈ ప్రజల బతుకులు గూడ నీకు అప్పజెప్పమంటావా.. ద్వాలి మాటలు చాలా పదునుగా వచ్చాయి. పంచాయతీ ఆఫీసుల ఆ రెండో కుర్చీ ఎందుకు అని ప్రతిపక్షాలోళ్లు చర్చకు బెట్టి ఇజ్జెత్ తియ్యకముందే ఆ కుర్చీ తీపించిన.. ఇగ నువు రోజు అక్కడకు వచ్చే అవుసరం గూడ ఉండదిగా .. విస్తుబోయి చూసాడు హేమ్లా.ఏమనుకుంటున్నావు ద్వాలి..! నేను నీ మొగుణ్ణి.. పౌరుషంగా అరిచాడు.. నువెవ్వరో నాకు తెలుసు సరే..! నేనెవరో గూడ నువ్వు జర గుర్తుంచుకోవాలి. నేను ఈ ఊరి ప్రజలందరి బాగు చూసుకోవాల్సిన పంచాయతీ ప్రెసిడెంట్‌ని.. ఆమె బదులిచ్చింది స్థిరంగా..

778
Tags

More News

VIRAL NEWS