దోమకొండ కోట విశేషాలు


Sun,August 5, 2018 01:51 AM

restoration
(తెలంగాణ సంస్థానాలు: ఆరో భాగం)
తెలంగాణలోని సుప్రసిద్ధ చారిత్రక కట్టడాలలో దోమకొండ కోట ఎంతో విశేషమైంది. దీన్ని కోట అనే కాకుండా దోమకొండ గడీ, ఖిల్లా, గడీకోట అని కూడా పిలుస్తుంటారు. చుట్టూ ఎత్తయిన రాతి కోట, నలువైపులా బురుజులు, మధ్యలో అందమైన భవనాలతో ఈ కోట రాజరికానికి గుర్తుగా, రాజుల అభిరుచులకు దర్పణంగా నిలుస్తున్నది. నేటికీ చెక్కుచెదరకుండా ఆనాటి శిల్ప, చిత్రకళలకు అప్పటి వారి ప్రావీణ్యానికి,
వైభవానికి దోమకొండ కోట ఒక తార్కాణంగా వెలుగొందుతున్నది.
venkata-bavanam
నగేష్ బీరెడ్డి
ఫీచర్స్ ఎడిటర్, నమస్తే తెలంగాణ
సెల్ : 80966 77177

దోమకొండ కోట కామారెడ్డి జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రానికి పదహారు కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుంచి 111 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దోమకొండ కోట దాదాపు నలభై ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. చుట్టూ 40 అడుగుల ఎత్తయిన శత్రుదుర్భేద్యమైన రాతి కోట ఉంటుంది. ఈ కోట మధ్యలో అందమైన భవనాలు ఉంటాయి. కోట చుట్టూ నీటి కందకం ఉంటుంది. ఈ రాతి కోటను పదో శతాబ్దంలో రాష్ట్రకూటులు నిర్మించారని, అటు తర్వాత కళ్యాణి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పాలించారని కొందరు చెబుతారు. కోట లోపల చాళుక్యుల కాలం నాటి శాసనం ఒకటి దొరకడమే ఇందుకు ఆధారంగా చెబుతారు. లేదు, దోమకొండ సంస్థానాధీశులైన కామినేని వారే ఈ రాతిగోడను నిర్మించారని ఇంకొందరంటారు. కాదు, కాకతీయులు ఆ రాతికోటను నిర్మిస్తే అటు తర్వాత సంస్థానాధీశులు అందులో భవనాలు కట్టుకున్నారని మరికొందరు చెబుతారు. కోటలో మహదేవుని ఆలయం ఉండడమే కాకతీయులు నిర్మించారనడానికి నిదర్శనమని అంటారు.

దోమకొండ సంస్థానాధీశులు మొదట బిక్కనూర్‌లో ఉన్నప్పుడు పక్కనే సైనికులు, కాశీ యాత్రికులు రాకపోకలు సాగించే దండు రాస్తా ఉన్నందువల్ల ఇబ్బందిగా భావించి దోమకొండకు వచ్చారనీ, అప్పటికే దోమకొండలో కాకతీయుల ప్రహరీ గోడ, మహాదేవుని ఆలయం నిర్మించి ఉన్నాయని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.

మహాద్వారాలు

దోమకొండ కోట లోపలికి ప్రవేశించేందుకు 30 అడుగుల ఎత్తున రెండు పెద్ద కమాన్‌లు ఉంటాయి. పడమర వైపు ఒక కమాన్, తూర్పు వైపు మరో కమాన్ ముఖద్వారాలుగా కట్టుదిట్టంగా నిర్మితమై ఉన్నాయి. ఇనుప శూలాలను చెక్క తలుపులకు బిగించి నిర్మించిన దర్వాజాలు పకడ్బందీగా ఉంటాయి. ఏనుగులు ఢీకొన్నా చెక్కుచెదరని రీతిలో వీటిని నిర్మించారన్నమాట.

వెంకట భవనం

కోట లోపలి విశాలమైన ప్రాంగణం మధ్యలో సంస్థానాధీశుల ప్రధాన నివాసం వెంకట భవనం రాజసం ఉట్టిపడేలా అద్భుతంగా ఉంటుంది. భవనం పై భాగంలోని పాలరాతి ఫలకంపైన వెంకట భవనం అని తెలుగులో, ఉర్దూలో రాసి ఉంటుంది. దీనికి ఎడమవైపు సింహం, కుడివైపు గుర్రం బొమ్మలు అందంగా చెక్కి ఉంటాయి. ఈ బొమ్మలు సంస్థానాధీశుల రాజముద్రలోనివి. రాజవైభవం ఉట్టిపడేలా ఈ ముద్రను చెక్కించారన్నమాట. ఆ కాలంలోనే ఈ భవనంపై పిడుగులు పడకుండా నిరోధించే పరికరాన్ని (ఎర్తింగ్) బిగించారు. రెండంతస్తుల మేడ అయిన ఈ వెంకట భవనం నిర్మాణంలోని శిల్పకళ అద్భుతంగా కనిపిస్తుంటుంది. కింది అంతస్తు ఆర్చీల డిజైన్ ఒకలా, పై అంతస్తులో డిజైన్ ఇంకోలా ఉండడం ఈ భవనం ప్రత్యేకత. ఈ మేడ పై భాగంలో పిరమిడ్ వంటి డిజైన్లను అందంగా నిర్మించారు. మొదటి అంతస్తులో గుండ్రటి స్తంభాలు, చెక్కతో చేసిన దూలాల ఆధారంగా సీలింగ్ ఉంటుంది. ఈ వెంకట భవనంలో 30కి పైగా విశాలమైన గదులున్నాయి. ఇప్పటికీ ఈ సంస్థానాధీశుల వారసులు ఇక్కడకు వచ్చినప్పుడు ఈ భవనంలోనే విడిది చేస్తుంటారు.

రంగ మహల్ (అద్దాల మేడ)

రంగ మహల్ నిర్మాణం కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉంటుంది. ఈ భవనం గోడలు అద్దాలను తలపిస్తాయి. అందుకే దీన్ని అద్దాల మేడ అని కూడా అంటారు. ఈ మహల్‌లో స్తంభాలు, ఆర్చీలు సుందరంగా చెక్కి ఉంటాయి. ఇందులో ప్రజా దర్బార్ నిర్వహించేవారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగేవట. రాణులు సైతం వీక్షించేందుకు వీలుగా ఈ మహాల్ పక్కన మేడలు నిర్మించారు. ఇందులో ఒకటి రాజమహల్, మరొకటి రాణీ మహల్. రాజమహల్‌ను సాయిన్ మహల్ అని కూడా అంటారు. దీన్ని 1924లో నిర్మించినట్లు గుర్తుగా గోడ గడియారం పైభాగంలో చెక్కించారు. రాణీ మహల్ కాలక్రమంలో శిథిలావస్థకు చేరుకుంది. నెమలి ఈక డిజైన్లతో చేసిన కిటికీలు, ఏనుగులు, సింహాలు, గుర్రాల బొమ్మలు చెక్కిన తలుపులు కళాత్మకంగా ఉండేవట. ఈ మహళ్ల ఆవరణలోనే నీటికొలను, ఓ అందమైన ఫౌంటేన్ నిర్మితమై ఉంది. ఈ మహల్‌లకు సమీపంలోనే ఒక సొరంగ మార్గం ఉంది. ఈ మార్గం బిక్కనూరు సిద్ధరామేశ్వరాలయం వరకు ఉంటుందట. శత్రువులు దాడి చేసినప్పుడు ఇందులో నుంచి తప్పించుకునేందుకు చేసుకున్న ఏర్పాటన్నమాట.

ఆలయాలు

దోమకొండ కోట లోపల రెండు ఆలయాలున్నాయి. ఇందులో ఒకటి మహదేవుని ఆలయం. ఇది మొత్తం రాతితో చాలా అందంగా నిర్మితమై ఉంది. ఆలయ నిర్మాణాన్ని బట్టి దీన్ని కాకతీయుల కాలంలో నిర్మించారని చెబుతారు. ఈ ఆలయంలో ప్రతి ఏటా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. గడిలోకి ప్రవేశించగానే ప్రధాన ద్వారానికి ఎడమ వైపున శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. దీన్ని కామినేని వారు కట్టించారు. కోటలో మైసమ్మ గుడి కూడా ఉంది. సంస్థానాధీశులు, ఇప్పుడు వారి వారసులు ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహాదేవునికి అర్చన చేసి, మైసమ్మకు మొక్కులు చెల్లించుకుని వెళ్లడం ఆనవాయితీ.

మీరూ చూడొచ్చు

దోమకొండ సంస్థానంలోని కట్టడాలు, వాటి శిల్పకళా సంపద ఇప్పటికీ ఆకర్షణీయమే. ఈ కోట చారిత్రక వారసత్వ సంపదగా ఉన్నందువల్ల పర్యాటకులకు సందర్శించే వీలును తెలంగాణ టూరిజం కల్పిస్తున్నది. వీటిని వీక్షించేందుకు ప్రత్యేక ప్యాకేజీని కూడా అందిస్తున్నది. కోట, అద్దాల బంగళా, రాజుగారి భవనాలు, అశ్వగజ శాలలు, బురుజులు, కుఢ్యాలు, కందకం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ.

ప్రస్తుత వారసులు

1948లో సోమేశ్వరరావు పాలన సాగుతున్నప్పుడు సంస్థానం ఇండియన్ యూనియన్‌లో కలిసిపోవడంతో వారి పాలన రద్దయింది. చాలా ఏండ్లపాటు ఈ దొరలు కోట, భూములు, ఊరు విడిచి పెట్టారు. 1954 నుంచి ఆరేండ్లపాటు ఈ గడీలో జనతా కాలేజీని నిర్వహించారు. సంస్థాన పాలన తర్వాత కామినేని వారు హైదరాబాద్, అమెరికా, ఇతర దేశాల్లో వివిధ వ్యాపారాల్లో ఉండిపోయారు. కాగా, ఉమాపతిరావు, అనిల్, రాజేశ్వరరావు, సత్యనారాయణ ప్రస్తుతం ఈ సంస్థాన వారసులు. వీరిలో ఉమాపతిరావు, అనిల్ అప్పుడప్పుడూ కోటకు వచ్చి వంశ సంప్రదాయక పూజలు నిర్వహించి వెళ్లేవారు.

కామినేని అనిల్ బిడ్డ ఉపాసనరెడ్డిని చిరంజీవి కొడుకు రామ్‌చరణ్ తేజ్ 2012లో పెండ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తమ వంశ ఆనవాయితీ ప్రకారం నిశ్చితార్థం పూజలు ఈ కోటలోనే నిర్వహించారు కామినేని వారు. కొణిదెల, కామినేని కుటుంబాల పెద్దలు, బంధువులు కోటకు తరలివచ్చి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత ఉపాసన తల్లిదండ్రుల షష్టిపూర్తి కార్యక్రమాన్ని కూడా ఇక్కడే నిర్వహించారు.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి ఉన్నప్పుడు కోటను పునరుద్ధరించారు. దీంతో దోమకొండ కోటకు పూర్వ వైభవం వచ్చింది. కొన్ని ఏండ్లుగా కోట మొహం చూడని కామినేని అనీల్ సోదరుడు రాజేశ్వరరావు, సత్యనారాయణ రంగంలోకి దిగారు. తమకు రావాల్సిన వాటాలు అడిగారు. అనీల్, ఉమాపతిరావుమ వాటాల సర్దుపాటు ప్రయత్నాలు చేశారు. కానీ, అవి విఫలమయ్యాయి. దీంతో సోదరులిద్దరూ తమ వాటాల కోసం కోర్టుకెక్కారు.
వచ్చేవారం : పాపన్నపేట సంస్థానం
gadi
కామినేని అనిల్ బిడ్డ ఉపాసనరెడ్డిని చిరంజీవి కొడుకు రామ్‌చరణ్ తేజ్ 2012లో పెండ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తమ వంశ ఆనవాయితీ ప్రకారం నిశ్చితార్థం పూజలు ఈ కోటలోనే నిర్వహించారు కామినేని వారు.

919
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles