ది క్లయింట్


Sun,December 2, 2018 02:42 AM

Crime
అతని భార్య హత్య కేస్‌ని పరిశోధించింది నేనే. అతను మరణించబోయే ముందు జరిగింది బలహీనమైన కంఠంతో చెప్పాడు. అందుకే ఇక్కడికి వచ్చా. తీసుకో. ఐదు వేల డాలర్లు. నేను అంత మాత్రమే ఇవ్వగలను. ఒక్కో సారి పోలీసులు కూడా తమ భార్యలని వదిలించుకోవాలని అనుకుంటారు. అతను లేచి వెళ్ళిపోయాడు.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి

కంట్రీ క్లబ్ బార్‌లో ఓ మూల కూర్చున్న నా దగ్గరకి అతను వచ్చి అడిగాడు.
మీరు జేమ్స్ గేరిసనేనా?
అవునన్నట్లుగా నేను తల ఊపాను. ఈ ఊళ్ళో కంట్రీ క్లబ్‌లో నన్నంతా ఆ పేరుతోనే పిలుస్తారు. ఈ ఊరికి రాకముందు నాకు ఇంకో పేరుండేది. ఈ ఊరు వదిలి వెళ్ళాక నేను ఇంకో పేరు పెట్టుకుంటాను.
అతను కొద్దిగా సందేహించడం గమనించి ప్రశ్నించాను.
ఏమిటి?
నన్ను హెన్రిక్స్ పంపించాడు.
అంటే ఇంకో క్లయింట్ అనుకున్నాను. ఈసారి ఈ క్లయింట్ పాత క్లయింట్ రికమండేషన్ మీద వచ్చాడు.
ఐతే? నవ్వుతూ ప్రశ్నించాను.
నేను సరైన మనిషితో సరైన విషయం మాట్లాడుతున్నానా అని సందేహంగా ఉంది
నేను మౌనంగా కూర్చోమన్నట్లుగా సైగ చేశాను. అతను కూర్చుని కొద్దిగా అనిశ్చతతో మళ్ళీ అడిగాడు.
రెండు నెలల క్రితం మీరు ఆగస్ట్‌లో హెన్రిక్స్‌కి ఓ చిన్న పని చేసి పెట్టారా?
కావచ్చు.

నేను మీ వృత్తిలోని వారిని ఎన్నడూ కలువలేదు. విషయం చెప్పే ముందు మీరు సరైన వ్యక్తేనా అనిపిస్తున్నది. మిమ్మల్ని నమ్మడం ఎలా అని ఆలోచిస్తున్నాను.
నేను ఇంత దాకా ప్రతీ క్లయింట్ ఒప్పందాన్ని తు.చ తప్పకుండా అమలు చేశాను. ఏ క్లయింట్ ఎన్నడూ ఇబ్బంది గురి చేయలేదు... ఏ కేసూ కోర్ట్‌కి కూడా వెళ్ళలేదు.
హెన్రిక్స్ మీ గురించి చెప్పాడు. మిమ్మల్ని ఇక్కడ కలవచ్చని కూడా చెప్పాడు అతను చెప్పాడు.
నేను ఈ కంట్రీ క్లబ్‌లో సంవత్సరంగా సభ్యుణ్ణి. సభ్యుడు అవడానికి చాలా పరిమితులు ఉన్నాయి. అందువల్ల నేను చక్కగా ఫోర్జరీ చేసిన కాగితాలతో ఇందులో సభ్యుణ్ణి అయ్యాను. నేను రోజులో చాలా గంటలు ఇక్కడే గడుపుతూంటాను. నా క్లయింట్స్‌ని నేను వేటాడి కనుక్కునేది ఇలాంటి చోట్లే. డబ్బు, సమస్య గల వారంతా ఇక్కడే తారసపడుతుంటారు. కొన్ని పెగ్‌ల తర్వాత ప్రతీ మనిషీ మనసులోని బాధలని వెలిగక్కుతుండడం సహజమే కదా. వాళ్ళ స్వవిషయాలు చెప్తుంటారు. నేను సానుభూతి నటిస్తూ విని వారిలో ఎవరు నా క్లయింట్ అవగలరా అని అంచనా వేశాక కాని ముందుకి వెళ్ళను. వాళ్ళని మాటల్లో పెట్టి నెమ్మదిగా నా వృత్తి వైపు వారి దృష్టిని తీసుకువస్తాను. నా అంతట నేను సూటిగా సూచించను కాని ఇండైరెక్ట్‌గా వారి సమస్యని పరిష్కరించ గలనని చెప్తాను. ప్రతీ వారికి ఓ భార్యో, ఓ ప్రియురాలో లేదా ప్రియుడో, ఓ మామో, ఓ బావమరిదో, వ్యాపార భాగస్వామో కొంత కాలానికి సమస్యగా మారడం కద్దు.
నేను నా ముందు కూర్చున్న ఆ వ్యక్తి వంక నిశితంగా చూసాను. లావుగా ఉన్నాడు. తెల్ల జుట్టు మొదలైన మధ్య వయస్కుడు. బంగారు రోజా పువ్వుని కోటుకి అలంకారంగా తగిలించుకున్నాడు. అలా తగిలించుకున్న వారిని నేను చూడడం అదే మొదటిసారి.

అతను కొద్ది సేపు తన వేళ్ళ వంక చూసుకొని చెప్పాడు.
నా భార్య.
నిర్భయంగా చెప్పండి. తల పంకించి చెప్పాను.
మా పెళ్ళయి ముప్పై యేండ్లయింది. ఆమె నించి విడిపోవాలి అనుకుంటున్నాను. విడాకులు తీసుకుంటే కోర్ట్ నా ఆస్తి మొత్తాన్ని ఆమెకి ఇవ్వమని ఆజ్ఞాపించవచ్చు.
మీకో ప్రియురాలుంది. ఆ సంగతి ఋజువులతో సహా మీ ఆవిడకి తెలిసింది. అంతేనా? అతను చెప్పడం ఆగిపోవడంతో ప్రశ్నించాను.
నేను ఇంకో పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను. మీరు అలా అర్థం చేసుకోండి
అరవై దాటాక మగాళ్ళు కొత్త జీవిత భాగస్వామిని కోరుకుంటారని ఎక్కడో చదివాను. మెనోపాస్ తర్వాత చాలా మంది ఆడవాళ్ళకి సెక్స్ మీద ఆసక్తి తగ్గుతుందని, అదే సమయంలో ఇక వయసైపోతోందనే భయంతో మగాళ్ళు తమ కన్నా వయసులో చిన్న ఆడవాళ్ళని కోరుకుంటారని చదివాను. ఈ రకం క్లయింట్‌లలో ఇతను నాకు కొత్త కాదు.
గురువారం రాత్రి నేనో పార్టీకి హాజరవుతున్నాను. రాత్రి ఏడు నించి పదకొండు దాకా. నాకు తెలిసిన చాలామంది ఆ పార్టీలో ఉంటారు. మా ఆవిడ నాతో రాదు. ఒంటరిగా ఆ సమయంలో ఇంట్లోనే ఉంటుంది. మీరా పనిని అప్పుడు చెయ్యాలి.

నా క్లయింట్స్ అంతా ఎలిబీ విషయంలో జాగ్రత్త పడుతూంటారని నాకు అనుభవ పూర్వకంగా తెలుసు. ముఖ్యంగా జీవిత భాగస్వామి హత్య చేయబడితే.
అనేకసార్లు నేనే ఆ పని చేయాలని అనుకున్నాను. కాని కిరాయి హంతకుడ్ని ఉపయోగించడం మంచిదని నిర్ణయించుకున్నాను.
అది మంచి నిర్ణయం. ప్లంబర్ పని ప్లంబర్ చేయాలి. లాయర్ పని లాయర్ చేయాలి.
ఇంట్లోకి దొంగ చొరబడ్డట్లుగా ఋజువులు సృష్టించండి. మా పడక గదిలోని డ్రసర్ పై డ్రాయర్లో ఆమె తన బంగారు నగలని ఉంచుతుంది
మీరు ఏ పద్ధతిని కోరుకుంటున్నారు? అడిగాను.
పద్ధతంటే?
రివాల్వర్‌తో కాల్చా? పొడిచా? గొంతు పిసికా? కర్రతో కొట్టా?
అతను కొద్ది క్షణాలు ఆలోచించి చెప్పాడు.

మీకు ఏది మంచిదనిపిస్తే అలా.
నా ఫీజ్ గురించి. నేను పని పూర్తి చేయడానికి మునుపే నాకు చెల్లించాలి. తర్వాత కాదు. అదీ నగదు రూపంలో
మర్నాడు డబ్బు తెస్తానని అతను చెప్తాడని ఎదురు చూశాను. కాని తన కోటు జేబులోంచి ఓ తెల్ల కవర్ తీసి బల్ల మీద ఉంచాడు. తర్వాత పేరు, చిరునామా గల ఓ కాగితాన్ని ఇచ్చాడు.
నా పేరు కూడా చెప్పమంటారా? అడిగాడు.
చెప్పకపోయినా మీ ఆవిడ మరణించిన మర్నాడు దినపత్రికల్లోని ఆవిడ మరణవార్త చదివాక మీ పేరు తెలుస్తుంది. నవ్వి చెప్పాను.
వాల్టర్ మార్గన్. లెఫ్టినెంట్ వాల్టర్ మార్గన్‌ని.
నేవీ? ఆర్మీ? రిటైరయ్యారా? నేను కొద్దిగా తడబడి అడిగాను.
రిటైర్ కాలేదు. పోలీస్ శాఖలో. అతను నవ్వుతూ చెప్పి తన బేడ్జ్‌ని తీసి చూపించాడు.
నేనోసారి అప్రయత్నంగా కళ్ళు మూసుకొని మళ్ళీ తెరచి అతని వంక చూశాను. నేను కిరాయి హంతకుణ్ణి అనే ఋజువు అతని దగ్గర ఏముంది? నా మాటలేగా? రికార్డ్ చేసే పరికరంతో వచ్చాడా? ఆ బంగారు గులాబీలో మైక్రోఫోన్ ఉందా? లేక నేను ఎప్పుడూ కూర్చునే ఈ బల్ల కింద నేను రాక ముందే దాన్ని అమర్చాడా?
హెన్రిక్స్ మన మీద ప్రాక్టికల్ జోక్ వేసుంటాడు. అతను ఇలాంటివి వేస్తూంటాడు నేను బలవంతంగా నవ్వి చెప్పాను.
హెన్రిక్స్ జోక్ చేయలేదు. నిజమని చెప్పాడు. అతను నా వంక సూటిగా చూస్తూ చెప్పాడు.

ఐతే అతను అబద్ధమాడాడు.
ఊహు. ఆ పరిస్థితుల్లో అతను అబద్ధమాడడు
ఏ పరిస్థితుల్లో? ప్రశ్నించాను.
నిన్న సాయంత్రం అతని కారుకి ప్రమాదం సంభవించడంతో వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. తను కొద్ది గంటల్లో మరణించబోతున్నానని హెన్రిక్స్‌కి తెలిశాక మనస్సాక్షిని చంపుకోలేక నాకు కబురు చేశాడు. అతని భార్య హత్య కేస్‌ని పరిశోధించింది నేనే. అతను మరణించబోయే ముందు జరిగింది బలహీనమైన కంఠంతో చెప్పాడు. అందుకే ఇక్కడికి వచ్చా. తీసుకో. ఐదు వేల డాలర్లు. నేను అంత మాత్రమే ఇవ్వగలను. ఒక్కో సారి పోలీసులు కూడా తమ భార్యలని వదిలించుకోవాలని అనుకుంటారు.
అతను లేచి వెళ్ళిపోయాడు.
సాధారణంగా నా ఫీజ్ కనీసం ముప్పై వేల డాలర్లు. కాని ఈ కేస్‌లో దానికి నేను మినహాయింపు ఇవ్వదలచుకోలేదు. లెఫ్టినెంట్ మార్గన్‌కి తనకి తనే బాధితుడయ్యేలా మాట్లాడాడని తెలీదు.
మార్గన్ భార్యకి బదులు నా భద్రత కోసం మార్గాన్నే చంపదలచుకున్నాను. నా రహస్యం తెలిసిన అతను బతక్కూడదు.
(జాక్ రిట్జ్ కథకి స్వేచ్ఛానువాదం)

250
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles