త్రిజట


Sun,August 5, 2018 01:40 AM

Trijata
కలలనేవి మన ఆలోచనలకు ప్రతిరూపాలు. మన ఆలాపనలకు నిలువెత్తు సాక్ష్యాలు. అలాగే కలలనేవి మనలోని భయాలకూ, సందేహాలకూ నిజరూపాలు. అయితే అవి నమ్మాలా? వద్దా? అనే సంధిగ్దత, అసలు కలలెందుకు వస్తాయనే సందేహాలు ఎంతోకాలంగా మనల్ని సతమతం చేస్తూనే ఉన్నాయి. మనలోని జ్ఞానం, వివేకం, విజ్ఞత, విశాలమైన భావపరంపర మనకు కలల రూపంలో మార్గనిర్దేశనం చేస్తుందనీ, మనిషి ప్రపంచంలోని ప్రతీ సమస్యకూ, తనలోనే ఉన్న విభిన్న భావకోణం ద్వారా పరిష్కారం చూపగలడనీ పైగా స్వీయ జీవితానికి సంబంధించిన విషయ వివేచన కన్నా లోక క్షేమం గురించిన భావచింతన గలవారికి కలల ద్వారానే రాబోవు కాలంలో జరుగబోయే మంచి ముందే తెలిసి వస్తుందనీ చరిత్రలోని ఎంతోమంది ద్వారా నిరూపితమైంది. మనిషిలోని అంతర్లీన భావజ్ఞానం చాలా గొప్పదనీ, ప్రాపంచికమైన చిన్నపాటి విషయాలపై గాక గంభీరమైన ధర్మం గురించి, మంచికోసం పడే తపన గురించీ కలల ద్వారా ఆవిష్కృతమవుతాయనే, ఆకాంక్షకూ ప్రతీక త్రిజట. లంకలో పుట్టిన మనో లావణ్యం ఆమె. త్రిజట భావజ్ఞానం రామకథా మలుపును ముందుగానే ఊహించగలిగిందంటే అత్యద్భుతం.
-ఇట్టేడు అర్కనందనా దేవి

త్రిజట కలలోనే రామకథను ఆసాంతం ఆస్వాదించింది. భూత భవిష్యత్తులను స్పష్టంగా చూసింది. సీతకు ధైర్యం చెప్పింది. రాక్షస స్త్రీలను హెచ్చరించింది. అశోక వనంలో ఒంటరిగా ఉన్న సీతకు చివదిదాకా తోడుంది.

తులసీ వనంలో గంజాయి మొక్కలున్నట్లే గంజాయి వనంలోనూ చిన్నచిన్న పరిమళభరితమైన గడ్డిపూల మొలకలూ వస్తుంటాయి. అవి గంజాయి వనాన్ని మార్చలేవేమోగాని ఆ వనంలో ఉంటూనే అందులోని చెడుకు దూరంగా బతుకుతూ ఉంటాయి. జరుగబోయే మంచి గురించే ఎదురు చూస్తుంటాయి. రావణుని భయంకర బంగారు లోకంలో రూపానికి పుట్టుకిచ్చిన రాక్షసత్వం పులుముకొని మనసుకు మాత్రం మంచిని ఆపాదించుకున్న త్రిజట అంటే గుర్తొచ్చేది ఆమెకు వచ్చిన కల మాత్రమే. కానీ ఆమెకొచ్చిన ఆకలే అంతటి దుష్కర పరిస్థితుల్లో అశోకవనంలోని సీతకు శ్రీరామరక్షయింది.

దుష్టశిక్షణకు శిష్ట రక్షణకు ధర్మం ఎప్పుడూ నిర్లక్ష్య ధోరణి వహించదనీ, పాపం పండే రోజు తప్పక వస్తుందనీ నమ్మిన రాక్షస స్త్రీ రత్నం త్రిజట. రావణుడు అశోక వనంలో ఉన్న సీతను కలిసి కొంత గడువునిచ్చి తన మాటను వినమనీ, సీతకు భోగాల వలవేసి ఒప్పించమని రాక్షసస్త్రీలకు ఆజ్ఞాపించి వెళతాడు. రావణుడి గొప్పతనాన్ని, క్రూరత్వాన్నీ చెబుతూ సీతను భయాందోళనలకు గురిచేస్తుంటే రాక్షస స్త్రీలందరినీ వారిస్తూ త్రిజట తన స్వప్న వృత్తాంతం చెబుతుంది.

నాకు తెల్లవారుజామున ఒక భయంకరమైన కల వచ్చింది. రాముడు చాలా గొప్పవాడు. సీతమ్మ తల్లి మహాసాధ్వి. రావణలంకకు నాశనం తప్పదు. ఒక్క విభీషణుడు తప్ప లంకంతా ప్రళయం వచ్చి తుడిచి పెట్టుకుపోతుంది. ఒక వానరుడు లంకనంతా తగులపెట్టేస్తాడు. ఇదంతా నా కలలో నేను చూసాను. శ్రీరాముడు వస్తాడు. లంకను మట్టుబెడతాడు. ఇది తథ్యం. భోగాల గురించి ఎవరికి ఆశ చూపిస్తున్నారు. సీతాదేవి రామునితో అన్నీ వదిలి అడవులకు పయనమైంది. రాబోయే మహాప్రళయం నుంచి సీతమ్మ తల్లి మాత్రమే మనల్ని కాపాడగలదు. పరుషంగా ఆమెతో మాట్లాడటం మాని వినయంగా శరణుకోరండి. అదుగో లంకకు అశుభ శకునాలూ, సీతకు శుభశకునాలూ ప్రారంభమయ్యాయనీ త్రిజట చాలా స్పష్టంగా రాక్షస స్త్రీలకు వివరించింది.

త్రిజట కలలోనే రామకథను ఆసాంతం ఆస్వాదించింది. భూత భవిష్యత్తులను స్పష్టంగా చూసింది. సీతకు ధైర్యం చెప్పింది. రాక్షస స్త్రీలను హెచ్చరించింది. అశోక వనంలో ఒంటరిగా ఉన్న సీతకు చివదిదాకా తోడుంది. రాక్షసత్వంలోంచి పరిమళించిన ధర్మచింతన త్రిజటలో ధ్వనించింది.
మనం ఎదుటివారికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో వీలైనంత ధైర్యమివ్వగలగడమనేది చాలా గొప్ప విషయం. అది త్రిజట చేయగలిగింది. అదీ తనకొచ్చిన కలను ఆధారంగా చేసుకొని రామకథకు పరోక్షంగా ప్రోత్సాహాన్నిచ్చింది. సీతమ్మతల్లికే ఆశను కలిగించింది. రాబోయేదంతా మంచేననే త్రిజట మాటల్లో లంకావినాశం లోక కళ్యాణం కోసమేనన్న భావజ్ఞానం త్రిజటలోని ప్రత్యేక కోణం. కలల ద్వారా మన భవితను నిర్ధారించుకోవచ్చనీ, మనిషి భావ పరిమితి చాలా విశాలమైందనీ, ప్రాపంచికతనూ, ప్రత్యక్షంగా కనిపించే సమస్యనూ మనలోని సాధారణ జ్ఞానం పరిష్కరిస్తుంది గానీ అసాధారణ విషయ వివేచనను మనలోనే దాగున్న భావజ్ఙానం మాత్రమే ఊహించగలదనీ చెప్పిన త్రిజట చరితం ఆదర్శం కన్నా ఉన్నతమైందనే చెప్పాలి.

503
Tags

More News

VIRAL NEWS