తొలి తెలుగు ప్రధాని పి.వి.నరసింహారావు


Sun,November 4, 2018 03:44 AM

P.-V.Narasimha-Rao
అంతకుముందు మరణించిన భారత మాజీ ప్రధానులందరివీ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు న్యూఢిల్లీలో జరగడం, వారికి అక్కడ ఒక స్మృతి చిహ్నం ఏర్పాటుచేయడం సాధారణంగా జరిగేది. కానీ పీ.వీ. విషయంలో అలా జరుగలేదు. ఇక హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించినా సరైన రీతిలో ఆయనకు అంత్యక్రియలు చేయలేదనే విమర్శలు న్నాయి. శవం సగమే కాలిందనీ, అర్ధరాత్రి కుక్కలు శవాన్ని బయటకు లాగాయనీ అనేక చానెల్స్ చేసిన ప్రసారాలు నేటికీ తెలంగాణ ప్రజల కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి.దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన పాలనాదక్షుడు. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థకు పునరుజీ ్జవం పోసి దేశ భవిష్యత్తుకు పునాది వేసిన ఆర్థిక సంస్కరణల పితామహుడు. గాంధీ, నెహ్రు కుటుంబాల తర్వాత మైనారిటీ ప్రభుత్వాన్ని
పూర్తికాలం నడిపిన అపర చాణక్యుడు. కలం పట్టి సాహితీ సేద్యం చేసి తనలోపలి మనిషిని ఆవిష్కరింపజేసుకున్న సాహితి సృజనశీలి. భారతచరిత్రలోనే ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు. అందులోనూ తెలంగాణ వాడు. అనేక అవమానాలకు గురై, అవినీతి ఆరోపణలకు లోనై దేశ రాజధానిలో అంత్యక్రియలు, స్మృతి చిహ్నానికి కూడ నోచుకోని ఒకే ఒక
ప్రధాని తెలంగాణ ముద్దు బిడ్డ పాములపర్తి వెంకట నరసింహారావు చివరిపేజీ ఇది.

మధుకర్ వైద్యుల
8096677409

పి.వి నరసింహారావు..ఈ పేరు తెలియని భారతీయుడుండడు. ఈ పేరు తలువని తెలుగువాడుండడు. పీవీగా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. జర్నలిస్ట్‌గా ప్రారంభమైన ఆయన ప్రస్థానం 1957లో రాజకీయాల వైపు మళ్లింది. పీవీ రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఒకే ఒక తెలంగాణవాడు.

పుట్టింది లక్నేపల్లి, పెరిగింది వంగర

నాటి నిజాం తెలంగాణలోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటి నుంచి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యాడు.

నిజామునెదిరించి..

పి.వి నరసింహరావు ఉన్నత విద్యకోసం హైదరాబాద్ వచ్చి ఉస్మానియాలో చేరారు. 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ లో చేరారు. నిజాం ఆదేశాల్ని ధిక్కరించి వందేమాతర గేయాన్ని పాడారు. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆయనను బహిష్కరించారు. తర్వాత నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బీ చదివాడు. స్వాతంత్య్రోద్యమంలోను, హైదరాబాద్ విముక్తి పోరాటంలోను పాల్గొన్నాడు.

ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో..

ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశాక 1957లో జరిగిన తొలి ఎన్నికల్లో పి.వి ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలోని మంథని నియోజక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యాడు. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1962లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుంచి 1964 వరకు న్యా య, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుంచి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు.

ముఖ్యమంత్రిగా...

69 తెలంగాణ ఉద్యమం ఆగిన తర్వాత తెలంగాణ ప్రజల, ఉద్యమ నేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పి.వి. నరసింహారావును ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. అలా ఆయన 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించారు. అయితే తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి కావడం జీర్ణించుకోలేని ఆంధ్రనాయకులు ఆయనపై అసమ్మతి లేవనెత్తారు. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం రాజుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలనను విధించింది.

కేంద్రమంత్రిగా..ఆయన కేంద్ర కార్యదర్శిగా నియమితుడై ఢిల్లికీ చేరారు.

అధిష్టానం ఆయనకు ఎంపీగా హన్మకొండ స్థానం నుండి అవకాశాన్నిచ్చింది. అలా ఆయన మొదటిసారి హన్మకొండ స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. రెండోసారి మళ్ళీ అక్కడి నుంచే లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి, మరోసారి కూడా రాంటెక్ నుంచే ఎన్నికయ్యారు. 1980 - 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను నిర్వహించారు.

ప్రధానిగా పి.వి..రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయారు. అప్పుడు పార్టీ అధిష్టానం కోరిక మేరకు ప్రధాని పదవిని ఆయన అధిరోహించారు. నంద్యాల నుంచి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆయన ప్రధాని అయ్యేనాటికి పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేదు. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ ఐదేండ్ల పాలన సాగించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం.

భారతదేశాన్ని వెలిగించాడు

దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజం వేశారు. ఆ సంస్కరణల పర్యవసానమే, ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు. పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. కశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనుడాయన. ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలు, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా, ఇరాన్‌లతో సంబంధాలు పెంచుకోవడం వంటివి పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని.

వివాదాలు, విమర్శలు

పార్లమెంటులో సరైన బలం లేని ప్రభుత్వానికి మెజారిటీ సాధనకై జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలకు లంచాలు ఇచ్చాడనే ఆరోపణ ఆయనపై వచ్చిన తొలి విమర్శ. 2000 సెప్టెంబర్ 29 న పీవీని ఈ కోసులో ప్రత్యేక కోర్టు దోషిగా తీర్పునిచ్చింది. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. 1989లో సెయింట్ కిట్స్‌కేసు, లఖుబాయి పాఠక్ కేసు ఆయనను చుట్టుకున్నాయి. అయితే అవి అన్నీ కూడా నిరాధారాలని తేలింది. ఇక అత్యంత వివాదస్పదమైనది 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదును కూలగొట్టిన సంఘటన.

ఒక దిగ్గజం నేలకొరిగింది.

అనేక అవమానాలు, ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ గుండె నిబ్బరంతో నిలబడిన మహోన్నత శిఖరం పి.వి నరసింహారావు. ఆ తర్వాత అనారోగ్యం పాలయ్యి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూనే 2004, డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు కన్నుమూశారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేశారు. అక్కడే స్మృతివనాన్ని నిర్మించారు. పీవీ నర్సింహారావు స్మృత్యర్థం హైదరాబాద్‌లో భారతదేశంలోనే అతిపెద్ద ైప్లెఓవర్‌కు పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే అని పేరు పెట్టారు.

అవమానకర స్థితిలో..

అనేక అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ చెదరని, తొణకని మనిషి పి.వి నరసింహారావు. ఆయనపై వచ్చినా ఏ ఆరోపణ కూడా రుజువు కాకపోగా అన్నీ కేసుల నుంచి ఆయన విముక్తి పొందారు. అయితే ఆయనను జాతీయ నాయకుడిగా గుర్తించడం కాంగ్రెస్ పార్టీకి అందులోనూ ఆ పార్టీ నాయకురాలు సోనియాగాంధీకి ఇష్టం లేదన్నది పార్టీ నాయకుల వాదన. అన్నీ రకాల ఉన్నత పదవులు అదిరోహించిన ఆయనను అవమాన కరంగా పదవుల నుండి తొలగించినా ఆ పార్టీ చివరికీ ఆయన మరణం లోనూ వివక్షను ప్రదర్శించింది.
P.-V.Narasimha-Rao1

ఎందుకీ వివక్ష?

పీవీ నరసింహారావు చాలా నిరాడంబరుడు. బలమైన రాజకీయ స్థానం లేకపోవడం, తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడు కావడం కూడా ఆయనకు రాజకీయంగా అనేకసార్లు అవమానాలు ఎదురయ్యాయి. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రనేతల కుటిలత్వం, తెలంగాణవాన్ని సహించని వారి వ్యక్తిత్వం ఆయనను పదవీచ్యుతున్ని చేస్తే ప్రధానిగా ఉన్న సమయంలో ఉత్తరాది లాబీ ఆయనను కేసులు, విమర్శల్లో ఇరుక్కునేలా చేశాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కానీ ఎన్ని కష్టాలొచ్చినా తుదివరకూ నిండుకుండలానే తొణుకని మనస్తత్వం పి.వి. సొంతం.

సాహీతి శ్రేష్ఠుడు

రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్నా తనకు ప్రియమైన సాహి త్య కృషిని వదిలి పెట్టలేదు నరసింహారావు. పీవీకి ఇంగ్లిషు, హిందీయే కాక మొత్తం 17 భాషలొచ్చు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయి పడగలను సహస్రఫణ్ పేరుతో హిందీలోకి అనువదించారు. దీనికి ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. పన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని అబల జీవితం పేరుతో తెలుగుకు అనువాదం చేశారు. తన జీవితంలోని ఎత్తుపల్లాలను చెబుతూ ఇన్‌సైడర్ పేరుతో నవల రాశారు. ఇది వివిధ భాషల్లోకి అనువామయింది. తెలుగులోకి లోపలి మనిషిగా అనువాదం అయింది. ప్రముఖ రచయిత్రి జయప్రభ కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో గొల్ల రామవ్వ కథ విజయ కలం పేరుతో కాకతీయ పత్రికలో 1949లో ప్రచురితమైంది.

2004 డిసెంబర్ 23 మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఢిల్లీలోని మోతీలాల్ రోడ్డులో తొమ్మిదో నెంబరు ఇంటిముందు ఎయిమ్స్ అంబులెన్స్ వచ్చి ఆగింది. అందులోంచి తెల్లటి ధోతి, సిల్క్ లాల్చీ ధరించి ఉన్న ఒక మృతదేహాన్ని దించి, ఇంట్లోకి చేర్చారు. 1991 నుంచి 1996 వరకూ భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన పాములపర్తి వేంకట నరసింహారావుది ఆ పార్థివ శరీరం. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపించి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించడంతో ఆయన దేహాన్ని పార్టీ కార్యాలయ ఆవరణలో ఉంచడం, అక్కడికి సామాన్య కార్యకర్తలు వచ్చి శ్రద్ధాంజలి ఘటించడమనేదీ పి.వి పార్థివదేహానికి జరుగలేదు. పి.వి. నాయకత్వంలో ఒక వెలుగు వెలిగిన ఆ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గేట్లు ఆ సమయంలో కనీసం తెరుచుకోలేదు. అంతేకాదు ఆ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ రోడ్డుమీదకొచ్చి శ్రద్ధాంజలి ఘటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజస్వామ్య దేశానికి ప్రధానిగా పనిచేసిన నాయకుడు, రాజీవ్ మరణంతో కునారిల్లిన కాంగ్రెస్‌పార్టీకి ప్రాణభిక్ష పెట్టిన నేత, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న దేశాన్ని ప్రగతి మార్గం పట్టించిన మహానీయునికి జరిగిన ఘోర అవమానమిది.

989
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles