తెలంగాణ మట్టి పరిమళం నందిని సిధారెడ్డి

Sun,May 14, 2017 03:27 AM

తెలంగాణ భూమిస్వప్నాన్ని కాంక్షించి ఇక్కడి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సందర్భాల్ని కవిత్వీకరించినవాడు. తెలంగాణ యాసను, భాషను శ్వాసించి సంభాషించినవాడు. పరాయీకరణతో చిమ్మచీకట్లో చిక్కుకున్న తెలంగాణ ఆత్మకు వెలుగు దివిటీనందించినవాడు. నదిపుట్టుబడి వంటి సాహిత్యాన్ని ప్రవాహ ప్రాణహితగా మలిచి నాగేటి చాల్లకు మల్లించి ఇక్కడి చెట్లగాలికి మన మట్టి పరిమళాలు అద్దినవాడు. నాలుగున్నర దశాబ్దాలుగా సాహితీసాగుకే జీవితాన్ని అంకితం చేసి తెలంగాణ బతుకు చిత్రాలను తన కథలు, కవితల ద్వారా ప్రపంచానికి తెలియజెప్పాడు. నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ.. నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ, నా తెలంగాణ అంటూ తన ఆర్తిని, ఆకాంక్షను, సంస్కృతిని తెలియజెప్పిన
కవి నందిని సిధారెడ్డి.నందిని సిధారెడ్డి కవిగా, పాటల రచయితగా తెలంగాణ సమాజానికి చిరపరిచితుడు. అంతేకాదు, రెండు దశాబ్ధాల క్రితమే తెలంగాణను కాంక్షించి తన పాటలు, కవితల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాడు. తెలంగాణ సమాజానికి దార్శనికునిగా స్వరాష్ట్ర ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకు వెళ్లి గుండెల గుడిలో ప్రతిష్టించిన వాడు సిధారెడ్డి. ఆయన కథలు తెలంగాణ పల్లె జీవితాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించి అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రజలను చైతన్యపరిచాయి.నందిని సిధారెడ్డి మెదక్ జిల్లా బందారం గ్రామంలో 1955 జులై 12న జన్మించాడు. తండ్రి బాల సిధారెడ్డి, తల్లి రత్నమాల. ఆయన తండ్రి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యునిస్టు యోధుడు. ఆయన బాల్యం బందారం, వెల్కటూరు, సిద్దిపేటలలో సాగింది. విద్యార్థి దశ నుంచే కథలు, కవితలు రాయడంతో పాటు నవసాహితి, మెదక్ స్టడీ సర్కిల్ అనే సంస్థలను నడిపాడు. 1997లోనే తెలంగాణ రాష్ర్టాన్ని కాంక్షిస్తూ ఆయన తొలిపాట రాశారు.
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ, నా తెలంగాణ
నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నా తెలంగాణ
పారేటి నీల్లల్ల పానాదులల్ల, పూసేటి పువ్వుల్ల, పునాసలల్ల
కొంగుసాపిన నేల నా తెలంగాణ నా తెలంగాణ
పాలు తాపిన తల్లి నా తెలంగాణ నాతెలంగాణా అనే పాట తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి ఉర్రూతలూగించింది. తెలంగాణ బతుకమ్మ పండుగ ఆటపాటలు, బోనాలు, శివసత్తులాటలు, దసరా ఆలయ్ బలయ్, జంబి ఆర్తిలు, పీరీల గుండాలు, పిలగాండ్ల ఆటలు, చిందు, యక్షగానం, వొగ్గు కళా రూపాలు తెలంగాణ యావత్తు తన పాటలో చూపించిండు సిధారెడ్డి.
NADINI-SIDDAREDDY
1997 ఆగస్టు 16న షేక్‌బాబా అనే గాయకుడు ఓ పాటను రాసివ్వండి. బహిరంగ సభలో పాడుదాం అని అడిగి రాయించుకున్న పాటే ఇది. ఈ గేయాన్ని దేశపతి శ్రీనివాస్ అనేక సభల్లో పాడడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత దీన్ని ఆర్. నారాయణ మూర్తి తన పోరు తెలంగాణ చిత్రం కోసం వాడుకున్నారు. ఈ పాటకు 2010లో ఉత్తమ గేయంగా నంది ఆవార్డు లభించింది. పుస్తకాలు చదవడం కాదు.. పుస్తకాలు రాసుడు గొప్ప అన్న తండ్రి మాటలను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ బతుకు చిత్రాలను ఇక్కడి మాగాణాల్లో చిత్రీకరించిన కవి సిధారెడ్డి. మెదక్, సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో తెలుగు లెక్చరర్‌గా పని చేసిన సిధారెడ్డి 2012లో పదవీ విరమణ చేశారు.
జోహారులు జోహారులు అమరులకు జోహారులు వీరులకు జోహారులు
మావుల్ల రేవుల్ల మట్టి పొత్తిల్లల్ల తొవ్వ పువ్వుల తీరు అమరులుంటారు
బువ్వా కొల్లాగొట్టి భూమాత చెరబట్టి
నాగలి దున్నే కార్తె నా అన్న రైతుల్ని
నాట్లేసే తల్లుల్ని బరిమీ చెరబట్టిన
నైజామోని గుండెల్లో నిదురించిన వీరులకు జోహారులు అమరులకు జోహరులు.. అంటూ తెలంగాణ కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరులను వీరులతో పోలుస్తూ సిధారెడ్డి రాసిన మరోపాట. చెరిగిపోని అమరత్వానికి, సజీవ పోరాటానికి ఊతమిచ్చిన పాట. నైజాం పాలన మొదలు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలొదిలిన ఎందరో అమరులను స్మరిస్తూ ఆయన ఈ పాట రాశారు. ఈ పాట రాయడానికి పది సంవత్సరాలకు పూర్వమే 1986లో మంజీర రచయితల సంఘం (మరసం)ను స్థాపించి ఎందరో తెలంగాణ కవులకు కొత్త వేదికను అందించారు. మలి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఉద్యమానికి మరింత బలాన్నిచ్చేందుకు గాను 2001 లో తెలంగాణ రచయితల వేదికను ఏర్పాటు చేసి తెలంగాణలోని రచయితలు, కవులను ఏకం చేసిండు. మంజీర, సోయి పేరుతో త్రైమాసిక పత్రికలను నిర్వహిస్తూ సంపాదకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
దివిటీ(1974), భూమిస్వప్నం(1987), సంభాషణ(1991), ప్రాణహిత (1996), ఒక బాధ గాదు (2001), నది పుట్టువడి (2007), ఇక్కడి చెట్ల గాలి (2014), ఆధునిక తెలుగు కవిత్వం వాస్తవికత-అధివాస్తవికత (పిహెచ్‌డీ సిద్ధాంత గ్రంథం-1986), ఇగురం (2007), ఆవర్థనం (2011), కుల వృత్తులు - తెలంగాణ సాహిత్యం (2008), చిత్రకన్ను వంటి పాటలు, కథలు, వ్యా సాలు, సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన పుస్తకాలు ఆయన రాశారు.
ఈ జాగల రేషమున్నది
కుటిలం లేదు కువారం లేదు
అంటూ తెలంగాణ మట్టికి రేషమున్నదని చెప్పడమే కాకుండా కుటిలం, కువారం లేదని తేల్చిచెప్పాడాయన.
చావుదలకు సుత లేసి ఉరుకుడే
గెలిచినా ఓడినా
దిగిన తర్వాత కొట్లాడుడే అని తెలంగాణ పోరాటపటిమను, ఇక్కడి తెగింపును నిక్కచ్చిగా చెప్పిన కవి సిధారెడ్డి. అంతేకాదు ఈ మట్టిలో పుట్టిన ప్రతివాడు జై తెలంగాణ అనాల్సిందేనని తెగేసి చెప్పాడాయన. ఇక్కడ పుట్టినోడు పరాయి పాట పాడడని ఆయన విశ్వాసం.
ఇక్కడి పిట్టలు కచ్చితంగా ఇక్కడి పాటలే పాడుతయి
ఇక్కడి చెట్లగాలి కచ్చితంగా ఇక్కడి కేరింతలే వినిపిస్తది అని చెప్పినవాడు సిధారెడ్డి. అలా చెప్పడంలో ఆయనలోని ఆత్మవిశ్వాసం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడి మట్టి, గాలి, ప్రకృతి అన్నీ తెలంగానం చేస్తాయని విశ్వసిస్తాడాయన.
పుడమికి పండుగ పూల జాతర, తెలంగాణ మట్టి, తెలంగాణ భాష, తెలంగాణ పాట తదితర పాట లు ఆయన రాశారు.వీటిలో ఇది చరిత్ర అనే పాటను కొలిమి అనే సినిమా కోసం రాశారు.
ఇది చరిత్ర ఇది పవిత్ర జనవిముక్తి సమరం
సాయుధ రైతాంగ పోరు సాహసమే అమరం
తెలంగాణ రైతాంగ ం తెగువ సదా అమరం
మనకాలం విరబూసిన మహామహులు మణులు
జాతికొరకు నినదించిన చరితార్థులు కీర్తులు
వాడవాడ గుండె గుండె శణార్థులు శణార్థులు అంటూ సాగుతూ తెలంగాణ కీర్తిని ఇనుమడింప జేస్తుంది.సిధారెడ్డి మంజీర, సోయి, ఎదపాయలు, జంబి అనే త్రైమాసిక పత్రికలను తీసుకువచ్చారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే డ్యాన్స్ బ్యాలేకు పాటలు రాశారు.తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలకుగాను 2016లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విశిష్ట పురస్కారం, నాగేటి చాల్లల్ల నా తెలంగాణ గీతానికి నంది ఆవార్డు (2011), సదాశివుడు ఆవార్డు (2012), ఒక బాధ కాదుకు విశ్వకళాపీఠం కావ్య స్నేహనిధి పురస్కారం (2009), భూమిస్వప్నానికి దాశరథి ఆవార్డు (1988), భూమిస్వప్నానికే ఫ్రీవర్స్‌ఫ్రంట్ ఆవార్డు (1987) తదితర ఆవార్డులు లభించాయి. 1979లో మల్లీశ్వరిని జీవితభాగస్వామిగా చేసుకున్న సిధారెడ్డికి వీక్షణ అనే కూతురుంది.తెలుగు, తెలంగాణ సాహిత్యానికి నందిని సిధారెడ్డి చేసిన సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆయనను ఇటీవలే సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నియమించింది.

సిధారెడ్డికి ఊరన్న, ఏరన్న, చెరువన్న, చెట్లన్న ఎంతో మమకారం. అందులో నూ ఆయన పుట్టిన బందారం చెరువు, సిద్ధిపేట లోని కోమటి చెరువులతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. అందుకే ప్రతిరోజు ఆ చెరువు గట్లమీదే కూర్చుండి పాటలు, కవితలు, కథలు రాసుకునేవాడట.
పరుగులు పరవశాలు/
దుంఖాలు చూసిన ఒడ్డు
కాలాలు/కల్లోలాలు/
కాఠిన్యాలు భరించిన ఒడ్డు
మునుగుతది తేలుతది/
నానుతది ఎండుతది
ఆ ఒడ్డు/పొద్దున సందడి/రాత్రి ఒంటరి అంటూ చెరువొడ్డు కవితలో ఊర చెరువును వర్ణిస్తడు.

850
Tags

More News