తెరమరుగైన మన టాకీసులు


Sun,March 20, 2016 02:11 AM

దశాబ్దాల పాటు వెలుగు సోకని తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సినిమా థియేటర్ల వివరాలు ఎవరికీ పట్టకుండా ఉండిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంత సినిమా చరిత్రనే తెలుగు సినిమా చరిత్ర అనుకోవడం వల్ల తెలంగాణ సినిమా చరిత్ర మరుగున పడిపోయింది. దీంతో, తెలంగాణలో సినిమా థియేటర్లు లేవు, తెలంగాణకు మూకీల చరిత్ర లేదని కూడా కొందరు అవగాహన లేని రాతలు రాశారు. కానీ, తెలంగాణలోని సినిమా చరిత్ర యావత్తూ ముంబై సినిమాకు సమాంతరంగా సాగింది. దేశంలో ఇతర ప్రాంతాల మాదిరిగానే అలనాటి హైదరాబాద్ స్టేట్‌లో సినిమాల నిర్మాణం కన్నా ముందుగానే సినిమా టాకీసులు నిర్మాణమయ్యాయి. హైదరాబాద్‌లో మూగ సినిమాలు తీయడానికి 1922లో వచ్చిన ధీరేన్ గంగూలీ చేసిన మొదటి పని తాను తీయబోయే సినిమా ఆడటానికి థియేటర్లను నిర్మించడమే. ఆ తర్వాతే సినిమాలు తీశారాయన. కాగా, తెలంగాణ టాకీసుల గురించి ముఖ్యంగా జంట నగరాల థియేటర్ల గురించి ఈ కథనంలో చూద్దాం.
DEEPAK-TALKES-NARAYANAGUD
మన థియేటర్ల వైభవం: 1920ల్లో పుత్లిబౌలిలో (నేటి వివేకవర్ధిని కాలేజీ ప్రాంతం) నిషాత్ అనే డేరాహాలుని దాదాపుగా హైదరాబాదులో మొదటి సినిమా హాలుగా చెప్పుకోవచ్చు. దీనిని ఆర్.ఎం. మోడీ సోదరులు నడిపేవారు. ఆ తరువాత దివాన్, దోది, దక్కన్ రాయల్ అనే టెంట్ హాల్స్ ఏర్పడ్డాయి. కాగా, హైదరాబాదులో తొలినాటి పర్మినెంట్ థియేటర్లలో ఒకటి సాగర్ టాకీస్. 1925 సెప్టెంబర్‌లో రాజా బిర్బన్ గిర్జి దీన్ని నిర్మించారు. ఈ థియేటర్‌లో దేశ విదేశాల మూకీలను ప్రదర్శించేవారు. 1931లో తొలి భారతీయ టాకీ ఆలం ఆరా ఈ థియేటర్‌లో ప్రదర్శిస్తున్నప్పుడు నాటి ఏడవ నిజాం తన కుటుంబ సమేతంగా హాజరైనారు. హాలు మొత్తం ఆయనే బుక్ చేసుకున్నారు. అయితే, తనకు నచ్చని సినిమా విడుదల చేసి ప్రదర్శించాడనే నెపంతో ధీరేన్‌ను వెళ్ళగొట్టడంతో నిజాంను సినిమాలకు వ్యతిరేకి అని తొలుత అనుకున్నా ఆ తరువాత హైదరాబాదులో సినిమా హాళ్ల నిర్మాణానికి ఆయన ఊతమిచ్చే చర్యలు తీసుకున్నారు.
టాకీలు వచ్చిన కొత్తల్లో హైదరాబాదులో ఉన్న థియేటర్ల సంఖ్య అయిదారుకు మించి ఉండేది కాదని కొందరంటారు. కానీ, 1930 నాటికి 17 సినిమా టాకీసులున్నట్లు ఇంకొక సమాచారం. అయితే 1940 నాటి నిజాం స్టేట్ స్టాటిస్టిక్స్ రికార్డుల్లో హైదరాబాదు నగరంలో రాయల్ టాకీస్ (స్థాపితం 1927), కృష్ణా టాకీస్ (1932), సెలెక్ట్ టాకీస్ (11.2.1937), జమ్రూద్ మహల్ (14.6.1937), సాగర్ టాకీస్ (5.2.1938), నిషాత్ (24.8.1939), పాలేస్ (9.11.1939), దిల్షాద్ (13.11.1939), రాజ్‌మహల్ (8.4.1940) టాకీసులున్నాయని పేర్కొన్నారు. ఈ 1935 -40ల కాలంలోనే లాల్ దర్వాజా కట్టెల మండిలో ఆర్గుస్ థియేటర్ వచ్చింది. వీరే నారాయణగూడ ఆగాపూర్‌లో కూడా ఆర్గుస్ పేరుతోనే మరో రెండు థియేటర్లు నిర్మించారు. నారాయణగూడ ఆర్గుస్‌లో తెలుగు, ఆగపూర ఆర్గుస్‌లో హిందీ సినిమాలు ఆడించేవారు.

1926, 27 నాటికి మునుపే ఆబిడ్స్‌లో ప్రేమ్, సాగర్ థియేటర్లు నిర్మాణమైనట్లు చెబుతారు. ఈ రెండు టాకీస్‌ల్లో పలు సభలు, సమావేశాలు కూడా జరిగేవి. పాత నగరంలో చార్‌మినార్ సమీపంలోని గుల్జార్ హౌజ్‌లో 1932లో మొదలైన కృష్ణా టాకీస్‌లో రెండు మూడేళ్ల కిందటి వరకు సినిమా ప్రదర్శనలు జరిగాయి. ఆ తరువాత చేతులు మారి కూల్చబడి ఇప్పుడు పెద్ద భవనం ఒకటి దీని స్థానంలో నిర్మాణమవుతోంది.
1927లో మొదలైన రాయల్ టాకీస్‌ను, కృష్ణా టాకీస్‌ను 1939లో వేణయ్య, మైసయ్యలు కొని కొత్త హంగులు కల్పించారు. ప్రేమ్ టాకీస్‌ను ఖాసిం అలీ ఫాజిల్ కొని 1939లో దానిని దిల్‌షాద్‌గా మార్చి ఆధునీకరించారు. ఆబిడ్స్‌లోని సెలెక్ట్ టాకీస్ 1939లోనే పటేల్, భగత్‌ల చేతుల్లోకి మారింది. అయితే, 1939 ప్రాంతం వరకు హైదరాబాదులో జమ్రుద్, ప్యాలెస్, సెలెక్ట్, సాగర్ థియేటర్లన్నీ సెలెక్ట్ టాకీస్ ఓనర్ల చేతుల్లోనే ఉన్నట్లుగా 1940 నాటి నిజాం స్టాటిస్టికల్ బుక్‌లో పేర్కొన్నారు.
MAHESWARI-AND-PARMESHWARI
ఇదే పుస్తకంలో 1940 నాటికి అప్పటి తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉన్న సినిమా థియేటర్ల వివరాలు ఇలా వున్నాయి. వరంగల్ జిల్లా హన్మకొండలో ప్రిన్స్ టాకీస్ (నిర్మాణం 1940)ను మహమ్మద్ హుస్సేన్ కట్టారు. ఖమ్మంలో సినిమా టాకీస్ (1930)ను ఇంతియాజ్ హుస్సేన్ నిర్మించారు. ఇంకా ఎల్లందులో ఈశ్వర్‌నాథ్ టూరింగ్ టాకీస్ (1930), శ్రీ మోహినీ ఈశ్వర్‌నాథ్ టాకీస్ (1940) నిర్మాణమైనవి. ఆదిలాబాద్‌లో జామియత్ టాకీస్ (1940), నిజామాబాద్‌లో నిజాంబాద్ పిక్చర్ ప్యాలెస్ (1939), నల్గొండలో జూబిలీ టాకీస్ (1937), ఔరంగాబాద్‌లో సికిందర్ టాకీస్ (1935 ఖలంధర్‌ఖాన్), జాల్నాలో సికిందర్ టాకీస్ (1934 ఎం.డి.ఆలంఖాన్), బీడ్ జిల్లా పర్భనీలో కృష్ణాటాకీస్ (1940 ఆర్.సి.పారిక్), బస్మత్‌లో మార్కండేయ టూరింగ్ టాకీస్ (1940 మహదేవ్‌రావు), శ్రీకృష్ణా టాకీస్ (1937 హింగోలీలో యజమాని రామ్ కన్వర్), నాందేడ్‌లో సదానంద్ టాకీస్ (1935 బాబాపటేల్, గణపతి పటేల్), అజీమ్ టాకీస్ (1940), గుల్బర్గా (జిల్లా)లో లక్ష్మీటాకీస్ (1937), న్యూమదన్ టాకీస్ (1938), యాద్గిర్‌లో సర్దార్ టాకీస్ (1933), తాండూర్‌లో శాంతిమహల్ ఉస్మానాబాద్‌లో హంస్ టాకీస్ (1939), రాయచూర్ (జిల్లా)లో నూరీ టాకీస్ (1939), గద్వాల్‌లో వేణుగోపాల్ టాకీస్ (1940 అచ్చిరెడ్డి), బీదర్‌లో గుల్జార్ టాకీస్ (1939) నిర్మాణమై సినిమా ప్రదర్శనలు జరుగుతూ ఉండినవి. ఇదే కాలంలో సికిందరాబాదు కంటోన్మెంట్ ఏరియాలో కూడా థియేటర్లు ఉన్నట్లు సమాచారం ఉంది. బ్రిటిష్ సైనికాధికారుల కోసం ఇక హోమ్ థియేటర్లు కూడా ఉండేవి. ఇక్కడి నుండి ముడి ఫిలిం మద్రాసుకు సరఫరా కాబడింది. ఈ కాలంలో సికిందరాబాదులో రాజేశ్వర్ టాకీస్ 1921లో, మనోహన్ టాకీస్ 1934లో నిర్మింతమైనట్లు కొన్ని రికార్డులు చెబుతున్నాయి.

అయితే, హైదరాబాదులో తొలి పర్మినెంట్ థియేటర్ నిర్మాణానికి పూనుకున్నది సాక్షాత్తు నిజాం నవాబే. మూడో సాలార్‌జంగ్ మీర్ యూసుఫ్ అలీఖాన్ దివాన్ దేవిడి ప్యాలెస్ ప్రాంగణంలో సెలెక్ట్ టాకీస్‌ను ఏర్పాటు చేశారు. ఇది నిజాం కుటుంబ సభ్యుల కొరకు మాత్రమే నిర్మించిన థియేటర్. ఇందుకు గాను లండన్ నుండి 16 ఎం.ఎం. ప్రొజెక్టర్‌ను దిగుమతి చేసుకున్నారు. 1920లో నిర్మించిన ఈ సెలెక్ట్ టాకీస్ పేరు ఆ తరువాత ఎస్టేట్ టాకీస్‌గా మారింది. దాంతో బాటు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇది జరిగింది 1939లో. భద్రసింగ్, భగత్‌సింగ్‌లు టాకీస్ నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. మరోవైపు అవిభాజ్య నిజాం స్టేట్‌లోని బీడ్ జిల్లా కేంద్రంలో 1920లోనే ఎం.డి.సర్దార్‌ఖాన్ దక్కన్ టాకీస్ పేరున పర్మినెంట్ థియేటర్‌ను నిర్మించాడు. ఈ రెండు చారిత్రక సత్యాలు విజయవాడ మారుతి (1921) టాకీస్ కన్నా ముందుగానే నిజాం స్టేట్‌లో సినిమా థియేటర్ల నిర్మాణం జరిగిందని రుజువు పరుస్తున్నాయి. మళ్లీ నిషాత్ థియేటర్ వద్దకు వద్దాం. ఈ థియేటర్‌లో సినిమాలు మొదటి, రెండు షోలు మాత్రమే ఆడేవి. సినిమాలు మాత్రమే గాక ఇక్కడ నృత్య ప్రదర్శనలు జరిగేవి. సితార, లీలాదేశాయ్ వంటి తొలి తరం నటులు ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చేవారు. పృథ్వీరాజ్ కపూర్ తన ట్రూప్‌తో వచ్చి పఠాన్, దీవార్ నాటకాలను ప్రదర్శించారు కూడా. 1934లో జమ్రుద్ థియేటర్ నిర్మించారు. ఈ టాకీస్ దేవకీబోస్ సీత (దుర్గాఖోట్, పృథ్వీరాజ్ కపూర్) చిత్రంతో ప్రారంభం కావలసి ఉండింది. కానీ, బిల్వమంగళ్‌తో ప్రారంభమైంది. ఈ బిల్వమంగళ్ చిత్రం బ్రిటన్‌లో ప్రాసెస్ అయిన తొలి భారతీయ చిత్రం.
MENAKA-AT-LALDARWAZA
హైదరాబాద్‌లో 1930లో నిర్మించిన మరో పేరున్న థియేటర్ యాకూత్ మహల్. ఎనభైయేళ్లుగా ఏనాడూ ఆగకుండా సినిమాలు ప్రదర్శిస్తున్న ఈ థియేటర్‌లో 1927లో తయారై చికాగో నుండి దిగుమతి చేసుకున్న రెండు అత్యాధునిక ప్రొజెక్టర్లు అమర్చడం ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు. ఆ రోజుల్లో మహిళా ప్రేక్షకులకు విడిగా సీట్లుండటమే గాక పురుష ప్రేక్షకులను విభజిస్తూ మధ్యలో పరదా కూడా ఉండేది. ప్రధానంగా నేటికీ అలనాటి హిందీ చిత్రాల ప్రదర్శనకు ప్రాధాన్యమిచ్చే ఈ థియేటర్‌లో అమితాబ్ డాన్, ఆ తరువాత మొన్నా మధ్య వచ్చిన షారూక్‌ఖాన్ రెండో డాన్ చిత్రాలు విడుదల కావడం విశేషం.

హైదరాబాదులో తొలినాళ్లలో ఈ టెంట్స్ హాల్స్‌లో మ్యాట్నీ షోలకు అవకాశం ఉండేది కాదు. కనుక రాత్రి పూట మొదటి, రెండవ షోలు మాత్రమే ఉండేవి. పర్మినెంట్ హాల్స్ వచ్చాక కూడా ఇదే పద్ధతి కొన్నాళ్లు కొనసాగింది. టికెట్టు ధరలు రెండు, నాలుగు, ఆరు, పది అణాలుగా ఉండేది. అయితే కాస్త ఎక్కువ డబ్బు పెట్టగలిగే వారికి ప్రత్యేకంగా అమర్చిన విశాలమైన సోఫా టికెట్టు రెండు రూపాయలుండేది. ఇంకా అప్పట్లో థియేటర్లలో సినిమాలతో బాటు నాటకాలను కూడా ప్రదర్శించేవారు. సంగీత కచేరీలు కూడా జరిగేవి. ఈ ప్రదర్శనల్లో ముందు వరుసలో కూర్చునే వారికి ఎక్కువ ధర టికెట్లు, వెనుక వరుసలో కూర్చునేవారికి తక్కువ ధర టికెట్లు ఉండేవి. కాలక్రమంలో థియేటర్లు సినిమాల ప్రదర్శనలకే పరిమితం కావడంతో ఎక్కువ ధర టికెట్లు కొన్నవారు వెనక్కు వెళ్లి, తక్కువ ధర టికెట్లు కొన్నవారు ముందుకు వచ్చేశారు.

కాగా, 1941 డిసెంబర్ 12న నిజాం నవాబు సినిమా థియేటర్లపై వినోదపు పన్ను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయినా సినిమా థియేటర్ల నిర్మాణం ఆగలేదు సరికదా వాటి సంఖ్య క్రమంగా పెరగడం మొదలైంది. వాస్తవానికి హిందీ సినిమాల మార్కెట్ బొంబాయి తరువాత హైదరాబాద్‌లోనే ఎక్కువగా జరిగేది. అందుకే చాలా మంది థియేటర్ల నిర్మాణానికి ఆసక్తి కనబరిచారు. హైదరాబాదులో హిందీ సినిమాలకు సంబంధించిన వ్యాపారమంతా ఆ రోజు బొంబాయి రీజియన్ కిందనే జరిగేది. నేటికీ అదే పద్ధతి కొనసాగుతోంది.

1956లో హైదరాబాదు స్టేట్ ఆంధ్ర రాష్ట్రం ఏకమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. దీనికి హైదరాబాదు రాజధాని కావడంతో తెలుగు సినిమాలను విడుదల చేసే పద్ధతులకు (హిందీ సినిమాలకు ముంబై లాగా) మెట్రోపాలిటన్ స్టేటస్ వచ్చింది. ఇండస్ట్రీలో నైజాం ప్రాంతంగా చెప్పబడే తెలంగాణలో చేసే వసూళ్లు నిర్మాతలకు కోట్ల రూపాయల లాభం తేవడం. ఇప్పటికీ ఉండనే ఉంది.

లాభాలకు కేంద్రం హైదరాబాద్ ః హైదరాబాదు ప్రాధాన్యం పెరగడంతో ఎన్టీ రామారావు రామకృష్ణ, తారకరామ థియేటర్లు నిర్మించగా, సుబ్బరామిరెడ్డి మహేశ్వరి, పరమేశ్వరి థియేటర్లను నిర్మించారు. ఒకవైపు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చెన్నై నుండి సినిమా పరిశ్రమను హైదరాబాదుకు తరలిరావాలని కోరడంతో నెమ్మదిగా అక్కినేని, దుక్కిపాటి వంటి వారు హైదరాబాదులోనే సినిమాలు తీయడం ప్రారంభించారు. అప్పటికి ఎక్కువ మొత్తం సినిమాలు చెన్నైలో తయారవుతున్నా వాటి పెట్టుబడి, లాభాలు రాబట్టడానికి మాత్రం తెలంగాణ ప్రాంతమే కీలకం అయ్యింది. క్రమంగా అందరూ హైదరాబాదు బాట పట్టారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి అది కాస్త ఎక్కువైంది. వసతులు సమకూర్చే పేరుతో హైదరాబాదులోని వందల ఎకరాలు రూపాయలకే కట్టబెట్టారు. వాటి విలువ ఇప్పుడు కోట్లలో ఉంటుంది.

సినీ- రాజకీయం: 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మన సినిమా వాడు కదా ఇండస్ట్రీకి ప్రభుత్వం వైపు నుండి ఎంతైనా తోడ్పాటు అందుతుందని అంతా ఆశించారు. కానీ ఆయనకేమో చెన్నై నుండి సినిమా రంగం హైదరాబాదుకు రావడం ఇష్టం లేదు. తనకు సినిమా జీవితాన్నిచ్చిన అభిమాన జనాన్ని, ముఖ్యమంత్రి పదవిని సంపాదించి పెట్టిన చెన్నపట్నాన్ని వదిలిపెట్టడం ఆయనకిష్టం లేదు. అందుకే 1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నాలుగు నెల్లు తిరక్కుండానే ఏప్రిల్ 27న మద్రాసుకు తాగునీటి కోసం ఉద్దేశించిన తెలుగుగంగ పథకానికి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.ఆర్., ప్రధాని ఇందిరతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇక్కడ కొసమెరుపేమిటంటే ఆ రోజు తాగునీటి కోసం ఏర్పాటైన తెలుగుగంగ నేడు పోతిరెడ్డిపాడుగా మారి కృష్ణానదినే మలుపుకు పోయే దుర్మార్గపు ప్రాజెక్టుగా మారి పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొడుతున్నది. అట్లా తెలంగాణ నీటిని తరలించుకుపోయే దుశ్చర్యలు ఆంధ్ర రాజకీయ నాయకులే కాదు, సినీ రాజకీయ నాయకులు కూడా చేశారు. అప్పటికే థియేటర్లు కట్టుకుని ఉన్నా ఎన్.టి.ఆర్. సినిమా రంగానికి మేలు చేయాలనుకోలేదు.

స్లాబ్ సిస్టమ్‌తోనూ థియేటర్ల మూత: ఎన్.టి.రామారావు 1984లో టాక్స్ కట్టే విధానానికి స్లాబ్ సిస్టంను తీసుకురావడంతో థియేటర్ల ఉనికి ప్రమాదంలో పడింది. అంతవరకూ సినిమా టాకీస్‌లో ఎన్ని సీట్లు నిండినవో దానికి అనుగుణంగానే పన్ను కట్టాల్సి ఉండేది. స్లాబ్ విధానం రావడంతో కెపాసిటీని బట్టి సీట్లు నిండినా, నిండకపోయినా ఆ థియేటర్ పూర్తిగా నిండితే ఎంత వస్తుందో దాని ప్రకారమే పన్ను కట్టాలి. దీంతో ఖాళీ సీట్లకు కూడా టాక్స్ కట్టి తీరాల్సిందే. ఈ పరిస్థితుల్లో సినిమాను కలెక్షన్లు ఉన్న కాడికే నడిపించడమో, లేకపోతే వెంటనే ఎత్తేసి మరొక సినిమా వేయడమో చేస్తారు. చిన్న సినిమాలకు, పాత సినిమాలకు కొంత రాయితీ ఇవ్వడంతో మొదట ఇది బాగానే ఉన్నా, డబ్బింగ్ సినిమాలకు డబుల్ టాక్స్ విధించింది ప్రభుత్వం. దీంతో ఎగ్జిబిటర్లు తాత్కాలికంగా లాభపడుతున్నాం అనుకున్నారు గానీ ఈ స్లాబ్ సిస్టమే రాచపుండులా మారుతుందని ఊహించలేదు. ఫలితంగా చిన్న సినిమాలు బతికి బట్ట కట్టడానికి వీల్లేకుండా పోయింది.
SHEESH-MAHAL
స్లాబ్ సిస్టం వల్ల నడిచినంత కాలం నడుపుకుని కలెక్షన్లు తగ్గితే కొత్త సినిమాలేసుకోవచ్చని, అది తగ్గితే మరొకటని, వీటి మధ్యలో పాత సినిమాలు, చిన్న సినిమాలు పాత సినిమా టైటిల్స్‌తో వచ్చిన కొత్త సినిమాలు ఇలా జిమ్మిక్కులతో తొలుత నెట్టుకు వచ్చినా, వాణిజ్య పన్నుల అధికారులను మేనేజ్ చేసుకుని పన్ను ఎగవేసినా అదెంతో కాలం కొనసాగలేదు. చివరికి వసతులు చూపి టికెట్టు ధరలు పెంచుకోవడం కూడా వారి చేతుల్లో లేకుండా పోయింది. దీంతో సీట్ల సంఖ్య తగ్గించి కొత్త సినిమా వచ్చిన రోజున ఖాళీ స్థలంలో కుర్చీలు వేసి లెక్కలో ఉన్న సీట్లకు మాత్రమే స్లాబ్ చెల్లించడం మొదలుపెట్టారు. ఇదీ ఎంతో కాలం కొనసాగలేదు. ఈ క్రమంలో రోజులో నాలుగు షోలే వేయాలి. అదనంగా వేయాలంటే అనుమతిపొంది కొంత అదనపు స్లాబ్ చెల్లిస్తే గానీ సాధ్యమవుతుంది.

ఈ నేపథ్యంలో థియేటర్ యజమానుల పరిస్థితులు తలకిందులయ్యాయి. అప్పటిదాక థియేటర్ గేట్ కీపర్, బుకింగ్ క్లర్క్, మేనేజర్‌లకు కూడా సమాజంలో పెద్ద గౌరవముండేది. కానీ స్లాబ్ సిస్టమ్‌తో యజమాని థియేటర్‌ను అమ్ముకోవడమో, లీజ్‌కిచ్చుకోవడమో, కూల్చి ఫంక్షన్ హాల్‌గా మార్చుకోవడమో తప్ప మరో మార్గం కనబడలేదు. మరికొన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌లుగా, మల్టీఫ్లెక్స్‌లుగా, అపార్ట్‌మెంట్లుగా మార్చబడ్డాయి. ఈ పరిస్థితి హైదరాబాదు జంట నగరాలు, వరంగల్‌లలో స్పష్టంగా కనిపిస్తుంది.

నగరంలో ఒకనాడు సినిమా వినోదానికి కేంద్రంగా వెలుగొందిన లిబర్టి, షాలీమార్, సంగీత్ టాకీస్‌లు, గోల్కొండలో ఉన్న తస్వీర్ మహల్ ఇంకా నాంపల్లిలో లతా, లాల్ దర్వాజీలో రాయల్, షాలిబండ అల్కా, సుల్తాన్ బజార్ రాయల్, శీశ్‌మహల్ (గోల్కొండ), కమల్, తిరుమల, షమా (చాదర్‌ఘాట్), నవరంగ్, అశోక్, విక్రాంత్ (పుత్లీబౌలీ), షామ్, స్టెర్లింగ్ (లక్‌డీకాపూల్), కల్పన (కవాడిగూడ), పల్లవి, నటరాజ్, అజంతా (సైదాబాద్) థియేటర్లు ప్రేక్షకులకు కనుమరుగయ్యాయి. దీపక్ (నారాయణ) వంటి చాలా థియేటర్లు మూతపడ్డాయి. ఈ పరిస్థితులను ఆసరాగా తీసుకొని పరిశ్రమలో నలుగురు పెద్ద మనుషులు రెండు రాష్ట్రాల్లోని థియేటర్లను తమ గుప్పిట్లో పెట్టుకుని వీటిలో తమవి, తమకు నచ్చిన వారి సినిమాలను ఆడించడం, చిన్న సినిమాల విడుదలకు థియేటర్లు ఇవ్వకపోవడం వంటివి చేస్తూ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.

మల్టీప్లెక్స్‌ల రాక: ఒకవైపు నుంచి థియేటర్లు కనుమరుగవుతుండటం సామాన్యునికి సినిమా వినోదం దూరం కావడం మొదలైంది. ఇక హైదరాబాదులో మల్టీప్లెక్స్‌ల నిర్మాణం పుంజుకుని సుమారు వంద స్క్రీన్లు నగరశివార్లు, కూకట్‌పల్లి, కొండపూర్, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి. వీటి టికెట్టు 200 రూపాయలపై మాటే. ఇవేమీ పేదవాడికి అందుబాటులో లేనివే. తమిళనాడులో మాత్రం సామాన్యుడికి సినిమా వినోదం అందుబాటులో ఉండాలని అమ్మ థియేటర్ల పేరున చిన్న చిన్న థియేటర్లు నిర్మించడం గమనార్హం.

తెరపడింది


టికెట్టు ఏ స్థాయిలోనిదైనా సరే కులమతాలకు అతీతంగా వెళ్లి థియేటర్‌లో ఒకరి పక్కన ఒకరు కూర్చొని సినిమా చూస్తాం. కానీ, పక్క వాడిని ఏ కులం, ఏ మతం అని ఎవరమూ అడగం. ఇట్లా థియేటర్లు మనుషుల మధ్య అంతరాలకు అతీతంగా మనల్ని దగ్గర చేశాయి. అంతరాలతో నిమిత్తం లేని సినిమా వీక్షణం ఇలా వర్థిల్లగా ఒక సందేహమైతే ఉండేది. సినిమా ప్రాబల్యం వల్ల రంగస్థల, జానపద కళలు అంతరిస్తాయేమో అని చాలామంది ఆందోళనపడ్డారు. 1980 నుంచి మొదలైన టీవీలు 1990ల చివరి నాటికి ఇంటింటా వ్యాప్తినొందాయి. ఒక దశలో టీవీల వల్ల సినిమాలకు పెద్ద ముప్పే అనిపించింది. కానీ, సినిమా -టీవీలు రెండూ కాలక్రమంలో అనుబంధ రంగాలుగా మారి వ్యాపారాలతో పరస్పరం ఉనికిని నిలుపుకోవడం విశేషం. కానీ, టీవి అట్లా మరింత విస్తారం అవుతుండగా సినిమా థియేటర్ల నిర్వహణ భారం పెరగడం, గత ప్రభుత్వాల అపసవ్య విధానాలు మరోవంక మల్టీప్లెక్స్‌ల రాక వల్ల ఆఖరికి సినిమా టాకీసుల ఉనికి ప్రమాదంలో పడింది. మన జంట నగరాల్లోనే ఎన్నో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. భారతదేశంలో సినిమా హాళ్లు జాతీయ సమైక్యతను కాపాడటంలో పోషించిన పాత్ర విస్మరించలేనిది.

మన దగ్గర థియేటర్లు: 1958 నాటికి తెలంగాణలో 99 పర్మినెంట్, 57 టూరింగ్ టాకీస్‌లు వుండేవని కూడా తెలుస్తోంది. అలాగే, 1982 నాటికి హైదరాబాదు సికిందరాబాదుల్లో -హైదరాబాదు రూరల్‌తో కలిపి 120 సినిమా టాకీసులుండేవి. మిగతా తెలంగాణ ప్రాంతంల్లో- ఆదిలాబాద్ 30, కరీంనగర్ 52, ఖమ్మం 62, మహబూబ్‌నగర్ 51, మెదక్ 20, నల్గొండ 55, నిజామాబాద్ 38, వరంగల్ 57 సినిమా టాకీసులున్నట్లు సమాచారం. అప్పటికి వీటన్నింటి సంఖ్య 485. కాగా ప్రస్తుతం 550పైనే ఉండవచ్చు. వీటిలో మల్టిప్లెక్స్‌ల్లోని చిన్న చిన్న స్క్రీన్‌లు కూడా ఉన్నాయి.

మాయమై మధుర జ్ఞాపకాల్లా నిలిచి...


1920లో హైదరాబాదులో మొదలైన థియేటర్లు గడచిన 95 ఏండ్లలో అయిదు పదుల సంఖ్యతో మొదలై కాలప్రవాహంలో రెట్టింపై వందలైనాయి. మారుతున్న కాలంలో రూపు మార్చుకున్నవి కొన్నైతే, మరికొన్ని తెరమరుగైనాయి. కొన్నేమో మల్టీఫ్లెక్స్‌లైనాయి. ఇంకొన్ని షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్, ఫంక్షన్ హాల్స్ ఇలా చాలా రూపాల్లోకి మారి మాయమయ్యాయి. కానీ, సినిమా ప్రేక్షకులకు మాత్రం గత కాలపు మరపురాని జ్ఞాపకాలుగా చెరిగిపోని అనుభూతులతో ఒక స్వర్ణయుగాన్ని తలపింపజేస్తాయి.

శుక్రవారం వస్తే చాలు, హైదరాబాద్‌లో సినిమా ప్రియులకు విడదీయలేని వినోద కేంద్రాలుగా నిలిచిపోయిన థియేటర్లు చాలా ఉన్నాయి. టి.వి.సెట్లు ప్రతి ఇంటికి వచ్చే వరకు కూడా సాయంత్రం అయితే చాలా మంది అడుగులు థియేటర్ల వైపే పడేవి. ఎక్కడికక్కడ ఈ సినిమా టాకీసులు ఆయా ప్రాంతాలకు కొండ గుర్తులుగా నిలిచిపోయాయి. అలాంటి సినిమా థియేటర్లు కాలక్రమంలో కనుమరుగైపోయాయి.
ఆ రోజుల్లో సికిందరాబాదులో సంగీత్ థియేటర్‌కి సినిమాకి వెళ్లడమంటే లండన్‌లోని ఒపేరా థియేటర్లకు వెళ్ళినంత అనుభూతి కలిగేది. ఎన్నో ఇంగ్లీష్ హిట్ చిత్రాలుగానే గాన్ విత్ ది విండ్, ఫాలింగ్ లవ్, ఓ గాడ్, ఆల్ దట్ జాజ్, డర్టీ డాన్సింగ్, స్టార్‌వార్, సిక్త్స్‌సెన్స్ చిత్రాలు ఈ టాకీస్‌లో ప్రదర్శించారు. 2008లో సంగీత్‌ను కూల్చేశారు. ఆబిడ్స్‌లోని జి.పి.ఓ.కి. దగ్గరలో ఉన్న పాలేస్ థియేటర్‌లో ఆ రోజుల్లో హిందీ సినిమాలు వేసేవారు. ఇదీ కూల్చివేతకు గురై రూపు మార్చుకుంది.
బొగ్గులకుంటలోని షాహీన్, ఫర్హాన్ థియేటర్లు పోస్టాఫీస్ పక్కకు ఉండేవి. కొత్త హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువగా వేసేవారు. ఈ రెండూ తరువాత సూర్య 35, సూర్య 70 ఎం.ఎం. టాకీసులుగా మారాయి. తిలక్‌రోడ్ ఆబిడ్స్‌లో ఈ థియేటర్లు ఆ రోజుల్లో లాండ్‌మార్క్స్‌గా పేరొందాయి.

కోటి హనుమాన్ టేకిడిలో ప్లాజా థియేటర్ ఒకటుండేది. ఇంగ్లీష్ చిత్రాలు, ఇతర సెకండ్‌గ్రేడ్ చిత్రాలు వేసే వారిందులో. ఇలాంటిదే రాయల్ టాకీస్ కింగ్‌కోటీలో ఉండేది. ఇప్పుడది ఫంక్షన్ హాల్‌గా మారింది. నిజాంకాలేజీ పక్కనే ఉండే లైట్‌హౌస్ థియేటర్ ఒకటుండేది. ఇందులో ఎక్కువగా మలయాల చిత్రాలు ఆడేవి. అప్పుడప్పుడు థర్డ్‌గ్రేడ్ ఇంగ్లీషు సినిమాలు వేసేవారు. ఇదిప్పుడు లేదు.
సికిందరాబాదులోని జుబిలీ బస్టాండ్ దగ్గరలో డ్రీమ్‌లాండ్ థియేటర్ ఉండేది. ఇది పాతదైనా అంతా యురోపియన్ పద్ధతిలో విశాలమైన ఖాళీ స్థలం, అందమైన రూపురేఖలతో ఉండేది. 1960ల్లో ఇంగ్లీష్ సినిమాలకు ప్రసిద్ధి ఈ థియేటర్. కానీ కాలక్రమంలో కేవలం పాత సినిమాల ప్రదర్శనకే పరిమితమై తరువాత కనుమరుగైపోయింది. లక్‌డీకాపూల్ మూలన హిందీ హిట్ సినిమాలకు పెట్టింది పేరైన షామ్, దీని పక్కనే ఉండేది దిల్‌షాద్. ఇవి రూపు మారిపోయాయి.
బషీర్‌బాగ్‌లో స్కైలైన్, స్టెర్లింగ్ థియేటర్లు జనాదరణ పొందిన ఇంగ్లీష్ చిత్రాలు చికాగో, టైటానిక్ వంటి చిత్రాలను ప్రేక్షకులకు చూపించాయి. 1980ల మొదట్లో కాచిగూడ చౌరస్తాలో సుబ్బరామిరెడ్డి మహేశ్వరి, పరమేశ్వరి టాకీసులను నిర్మించారు. ముప్పై ఏండ్ల తరువాత వాటి స్థానంలో పెద్ద షాపింగ్ మాల్ అందులో ఐమాక్స్ పేర మల్టిప్లెక్స్ నిర్మించారు. ఆ పక్కనే ఎన్.టి.రామారావు అంతకుముందే తారకరామ, ఆబిడ్స్‌లో రామకృష్ణా థియేటర్లు కట్టించారు. అయితే వారసులకు వాటిని నిర్వహించుకొని సంపాదించుకోమన్నారు. కాని అమ్మడమో, కూల్చి వేయడమో చేయొద్దని విల్లు రాశాడని అంటారు.
బాలానగర్ ప్రాంతంలో మొదటి టాకీస్ శోభన. తర్వాత దాని పక్కనే విమల్ కట్టారు. అయితే శోభన్ కూల్చివేతకు గురి కాగా, విమల్ మాత్రం అలాగే ఉంది. సికిందరాబాదు కవాడిగూడలో కల్పన, పోస్టాఫీసు దగ్గరలో ఉన్న నటరాజ్, అజంతా థియేటర్లు కాలక్రమంలో కనుమరుగైనవి. అమీర్‌పేటలో పాతదైన విజయలక్ష్మి థియేటర్ దశాబ్దాల తరబడి సినిమాలు ప్రదర్శించింది. మారుతున్న పరిస్థితుల్లో నిర్వహణ భారమైనా నేటికీ ఉనికిలో ఉంది.
లక్‌డీకాపూల్‌లో అమరావతి, మీరా, సుదర్శన్ (ఆర్టీసీ ఎక్స్‌రోడ్), వెంకటేశ్, శ్రీనివాస్ (నారాయణగూడ), బసంత్, ప్రభాత్, కిశోర్ (నారాయణగూడ), జగత్ (హైదరాబాద్), ఆషా, అల్కాసుధా (షాలిబండ), అప్సర, మేనక (లాల్‌దర్వాజ) వొకదాని వెంట వొకటి మూతపడ్డాయి.
ఇంకా బాలాజి (ముషీరాబాద్), లత (నాంపల్లి), ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంగం శ్రీమయూరిగా మారింది. ముషీరాబాద్‌లోని సుభాష్ ఉషామయూరి అయింది. సంగీత్ మల్టీప్లెక్స్‌గా మారింది. ఆబిడ్స్‌లోని పాలెస్‌లో 60లో గైడ్ సినిమా ఆడింది. దాని స్థానంలో ఇప్పుడు ఎం.పి.ఎం.మాల్ కనిపిస్తుంది. బషీర్‌బాగ్‌లోని లిబర్టి, పక్కనే ఉన్న మినీ ఎంబసి, కాచిగూడలోని వెంకటాద్రి, పద్మావతి, కుమార్ ఇంకా ఎన్నో కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ లిబర్టి, కల్పనా, సుభాష్, మనోహర్, ఉషామయూరి, రాజా డిలక్స్, బాలాజి థియేటర్స్ పేర్లతోనే సిటీ బస్‌స్టాప్‌లు, రోడ్ లైన్లు స్థిరపడిపోవడం గమనార్హం..

ఆ రోజుల్లో ఆబిడ్స్‌లో ఉన్న జమ్రుద్ టాకీస్ హైదరాబాద్ థియేటర్లకు పితామహుడి వంటిది. అప్పటి సంతోష్, స్వప్న థియేటర్లకు ఎదురుగా ఉండేది. ఈ టాకీస్‌లోనే తొలుతగా పెద్ద పెద్ద హిందీ సినిమా పోస్టర్లు, పెయింటెడ్ కటౌట్స్ పెట్టేవారు. విషాదమేమిటంటే ఇదీ నేల కూలింది. అలాంటివే మౌజం జాహీ చౌరస్తాలో ఉండిన నవరంగ్, అశోక్, విక్రాంత్ థియేటర్లు. బ్లాక్ బస్టర్ హిందీ చిత్రాలను ప్రదర్శించే వారిక్కడ.

అమీర్‌పేటలో కొండగుర్తు లాంటి థియేటర్ శీష్‌మహల్. మెయిన్‌రోడ్ మీదనే ఉంటుంది. ఇది కూడా పాత థియేటర్. అప్పట్లో చాలా హిట్ సినిమాలు శతదినోత్సవాలు ఇందులోనే జరుపుకున్నాయి. కాలక్రమంలో నిర్వహణ భారమై దీన్ని మూసేసారు.

మంటల్లో మోతీమహల్


1936 జూన్ 14. సరిగ్గా ఆ రోజు హైదరాబాదు నగరంలోని సుల్తాన్ బజార్‌లో ఉన్న మోతీ మహల్ థియేటర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.
అప్పుడు ఆ థియేటర్‌లో కాలేజ్ గర్ల్ సినిమా ప్రదర్శితమవుతోంది. సినిమా 10 నిముషాల్లో పూర్తవుతుందనగా రాత్రి 9.20 కి హఠాత్తుగా స్త్రీలు కూర్చునే బాల్కానీ (జనానా)లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు రేగాయి. లేడీస్ గ్యాలరీ వెనుకనే ప్రొజెక్షన్ గది ఉండటం, అదీ పూర్తిగా కలపతో తయారు చేయబడి ఉండటం వల్ల మంటలు క్షణాల్లో వ్యాపించాయి. కరెంట్ సరఫరా ఆగిపోయి పూర్తిగా చీకటి కమ్మేసింది. ఈ పరిస్థితుల్లో ఒక మహిళ తన చీర విప్పి మిద్దె పిట్ట గోడకు కట్టి దాని సాయంతో కిందికి దిగింది. తరువాత మరికొందరు స్త్రీలు చీర ద్వారా కిందికి దిగారు. అంతే చీర అంటుకుంది. అంతే, బాల్కానీ నుండి మహిళా ప్రేక్షకులు కిందికి రావడానికి ఒకరి వెంట ఒకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగి 14 మంది మరణించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది పది గంటలకల్లా చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. తెల్లవారే సరికి గాని మంటలు అదుపులోకి రాలేదు. థియేటర్ పూర్తిగా కాలి బూడిదైంది.
మరునాడు ఉదయం పది గంటల ప్రాంతంలో నిజాం ప్రభువు సంఘటనా స్థలం సందర్శించి, పరిస్థితులను సమీక్షించి, బాధితులను, మృతుల కుటుంబాలను పరామర్శించారు. అంతేగాక నగరంలో ఉన్న అన్ని సినిమా థియేటర్లలో ఉన్న లోపాలను సవరించి రక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసు అధికారులకు ఫర్మానా జారీ చేశారు. విద్యుత్ అధికారుల తనిఖీల అనంతరం భద్రతా లోపాల కారణంగా మూడు థియేటర్లను మూసి వేయించారు. ఈ థియేటర్ల మేనేజర్లను, అక్కడి ప్రొజెక్షన్ అసిస్టెంట్లను బాధ్యులను చేస్తూ అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. వీటి సంగతి ఇలా ఉండగా, దహనమైన థియేటర్ స్థానంలో ఆ తరువాత దిల్షాద్ పేర్న కొత్త థియేటర్‌గా నిర్మితమైంది.

ముగింపు: తెలంగాణలో రాస్తే సినిమా థియేటర్లదే ఒక చరిత్ర అవుతుంది. అవును మరి. 1921లో విజయవాడలో మారుతి టాకీస్ నిర్మాణం నాటికి ఆంధ్ర ప్రాంతం ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో ఉండింది. అప్పటికే మద్రాసులో థియేటర్లు నిర్మాణమై ఉన్నాయి కనుక మారుతిని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాకనే తొలి టాకీసుగా చరిత్రలో నమోదు చేసుకున్నారు. ఇక తెలంగాణలో 1920లోనే సెలెక్ట్ టాకీసు నిర్మాణం జరుపుకున్నది కనుక థియేటర్ల విషయంలో మనమే ముందున్నామనేది రుజువైంది. అంతగొప్ప చరిత్ర ఉన్న తెలంగాణలోని థియేటర్లు తెరమరుగు కావడానికి సీమాంధ్ర ప్రభుత్వాల ఏకపక్ష నిర్ణయాలే కారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాదులో మినీ థియేటర్ల నిర్మాణానికి ప్రభుత్వం చేయూతనివ్వాలని, దీంతో చిన్న సినిమాలను బతికించుకోవచ్చని ఈ ప్రాంత దర్శక, నిర్మాతలు అభిలషిస్తున్నారు.

2452
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles