తెరచాటు మరణాలు


Sun,March 11, 2018 02:38 AM

సినీ ప్రపంచం ఒక రంగుల కల. ఎప్పుడు ఏ రంగు మారుతుందో తెలియదు. కొన్ని దశల్లో ఇంద్రధనస్సులా మెరిసే జీవితాలు ఒక్కసారిగా నలుపు తెలుపుగా మారవచ్చు. అవకాశాలు వచ్చినంత వరకు ఒకే. ఆ తరువాతే అందరూ మొఖం చాటేస్తారు. తెర మీదా నవ్వుతూ పలకరించే తారల నిజ జీవితం ఎంతో దారుణంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు, అవకాశాలు లేకపోవడం, పరిస్థితులు అనుకూలించకపోవడం, కెరీర్ పై ఉన్న శ్రద్ధ ఆరోగ్యం పై చూపకపోవడం వల్ల వచ్చే అనారోగ్యాలు. ఈ సమస్యల నుంచి గట్టేక్కడానికి మద్యం, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారూ ఉన్నారు. కొన్ని సమస్యలు ఆత్మహత్యకు ప్రేరేపిస్తే, మరికొన్ని అనారోగ్యాలను రేపి మరణానికి చేరువ చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సినిమా పరిశ్రమలో జరిగే మరణాలన్నీ అసహజ మరణాలుగానే ఉంటున్నాయి. ఇటీవల జరిగిన శ్రీదేవి మరణంతో సినిమా పరిశ్రమలోని మరణాలపై చర్చ మొదలైంది. మంచి భవిష్యత్ ఉన్న తారలు కూడా అర్ధాంతరంగా తనువు చాలించడం సినిమా పరిశ్రమను ఒక కుదుపు కుదుపుతున్నాయి.సినిమా పరిశ్రమ ఇప్పుడు నిద్రలేని రాత్రులను అనుభవిస్తున్నది. తెల్లవారితే ఎవరి మరణవార్త వినాల్సి వస్తుందనే భయం పరిశ్రమను పట్టి పీడిస్తున్నది. అది టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా ఇంకే ఉడ్ అయిన కొంతకాలంగా పరిశ్రమను కుదిపేస్తున్న సమస్య ఇది. ఆ మధ్య హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని చనిపోగా, ఎం.ఎస్. నారాయణ, తెలంగాణ శకుంతల, రామనాయుడులు వివిధ కారణాలతో మరణించారు. తరువాత రంగనాథ్, కొరియోగ్రాఫర్ భరత్‌లు ఆత్మహత్య చేసుకున్నారు. బాలీవుడ్ జియాఖాన్ ఆత్మహత్య మరిచిపోకముందే శ్రీదేవి అనుమానస్పద మరణం మరింత షాక్‌కు గురిచేసింది. జగమంతా కుటుంబం కలిగిన తారలు ఏకాకి జీవితాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు? ఎవరికీ చెప్పుకోలేక ఎందుకు అర్ధాంతరంగా మరణిస్తున్నారనేది అంతుచిక్కటి ప్రశ్న.

శ్రీదేవి

టాలీవుడ్, బాలీవుడ్ అనే కాకుండా అన్ని భాషల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న అందాల నటి శ్రీదేవి. బాలనటిగా తెరంగేట్రం చేసి దేశంలోని అనేక భాషల్లో నటించిన ఆమె వయస్సు పెరిగినప్పటికీ తరగని అందంతో ప్రేక్షకులను అలరించింది. ఎందరికో ఆరాధ్య దైవమైన శ్రీదేవి మరణం సినిమా ఇండస్ట్రీని కుదిపేసింది. ఓ వివాహానికి హాజరయ్యేందుకు కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లిన ఆమె ఈ ఏడాది మార్చి 25న బాత్‌రూమ్‌లోని స్నానాల తొట్టిలో పడి హఠాన్మరణం చెందారని చెబుతున్నారు . 54 సంవత్సరాల శ్రీదేవి మరణం పై అనేక అనుమానాలు ఉన్నాయని అభిమానులు అంటున్నారు. శ్రీదేవి 1963 ఆగస్టు 13న తమిళనాడులో జన్మించారు. నాలుగేళ్ల వయసులో తొలిసారి ఆమె తునైవన్ అనే తమిళ సినిమాలో నటించారు. బాలనటిగా ఆమె పలు తెలుగు, మలయాళం సినిమాల్లో నటించారు. హీరోయిన్‌గా ఆమె నటించిన తొలి సినిమా మూండ్రు ముడిచ్. దక్షిణాది భాషల్లో, హిందీలో శ్రీదేవి నటించిన అనేక సినిమాలు ఘన విజయం సాధించాయి. 1980వ దశకంలో ఆమె వెండితెరపై ఓ వెలుగు వెలిగారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లాంటి అగ్రశ్రేణి నటుల సరసన శ్రీదేవి నటించారు. అనే హిందీ సినిమా తర్వాత పదిహేనేళ్లపాటు శ్రీదేవి సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇంగ్లిష్-వింగ్లిష్ సినిమాతో 2012 లో మళ్లీ తెరపైకి వచ్చారు. ఆమె నటించిన మామ్ చిత్రం గతేడాది విడుదలైంది. శ్రీదేవి 1996లో సినీ నిర్మాత బోనీకపూర్‌ను వివాహం చేసుకున్నారు. శ్రీదేవి, బోనీకపూర్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి పేర్లు జాహ్నవి, ఖుషీ. సినీ రంగానికి శ్రీదేవి అందించిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2013లో ఆమెకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
Sridevi

రంగనాథ్

ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ ఆత్మహత్య తెలుగు సినిమా ప్రపంచంలో తీవ్ర కలకలం రేపింది. రంగనాథ్ పేరుకు తగినట్టు మూర్తీభవించిన రూపం.. ఆ రూపానికి తగ్గట్టు గంభీర స్వరం! వాటికితోడు ఏ పాత్రకైనా ప్రాణప్రతిష్ఠ చేసి మురిపించే నటనా కౌశల్యం అటువంటి నటుడు ఆత్మహత్యకు పాల్పడడం తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. 250కిపైగా సినిమాల్లో మూడు తరాల కథానాయకులతో కలిసి విభిన్న పాత్రల్లో ఒదిగిపోయి జీవించిన సీనియర్ నటుడు రంగనాథ్. తిరుమల సుందర శ్రీరంగనాథ్ పూర్వీకులది ఒంగోలు. ఆయన తండ్రి రైల్వేగార్డుగా పనిచేసేవారు. వృత్తిరీత్యా నాటి మద్రాస్‌లో స్థిరపడ్డారు. అక్కడే 1949లో రంగనాథ్ జన్మించారు. చెన్నైలోని మందాసా మహారాజు ఎస్టేట్‌లో వైద్యులుగా పని చేసిన తాతగారి వద్దే రంగనాథ్ బాల్యం గడిచింది. స్కూలు రోజుల్లోనే కవిత్వాలు, పద్యాలు రాసేవారు. బుద్ధిమంతుడు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన అరవైకి పైగా సినిమాల్లో హీరోగా నటించారు. ఒంటరితనాన్ని భరించలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Ranganath

సౌందర్య

అచ్చతెలుగు అమ్మాయిగా తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న కన్నడ అమ్మాయి సౌందర్య. ఆమె అసలు పేరు సౌమ్య. అందం, అభినయం ఆమె సొంతం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో మొత్తం కలిపి దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించింది. ఆమె నటనకు ఎన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి. సావిత్రి తర్వాత అంతటి నటిగా పేరు తెచ్చుకున్న ఏకైక నటి సౌందర్య. అలాంటి సౌందర్య 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి చార్టెడ్ విమానంలో బయలుదేరి దురదృష్టవశాత్తూ విమానం గాలిలోకి ఎగిరిన కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణలో కుప్పకూలి పోయింది. దీంతో ఆమె ఆక్కడికక్కడే మరణించింది.
Soundarya

భార్గవి

అష్టాచెమ్మా సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయినా భార్గవి మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. బాలానగర్ ప్రాంతంలోని ఫతేనగర్‌లో నివాసం ఉండే భార్గవిది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. భార్గవి అసలు పేరు రామలక్ష్మీ సినిమాల మీదా ఆసక్తితో హైదరాబాద్ చేరుకున్న భార్గవి ఫతేనగర్‌లోని ఓ అపార్టుమెంటులో నివాసం ఉండేది. ఆడదే ఆధారం, ఆహ్వానం, లక్కీ లక్ష్మీ, కొత్త ఒక వింత, జోగిని సినిమాల్లో నటించింది. ఆమెకు భర్త శంకర్, ఒక పాప ఉంది. అయితే ఆయనతో విడిపోయి ఒంటరిగా ఉంటుంది. ఈ ఒత్తిడితోనే అర్ధరాత్రి ఇంట్లోనే ఉరివేసుకుందని పోలీసులు తెలిపారు.
Bhargavi

జియాఖాన్

నిశ్శబ్ద్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయిన బాలీవుడ్ నటి జియాఖాన్ అర్థాంతరంగా తనువు చాలించింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన ఆమె అనతి కాలంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఎంత త్వరగా ప్రేక్షకులకు దగ్గరైందో అంతే త్వరగా ఈ లోకం నుంచి నిశ్శబ్దంగా సెలవు తీసుకుంది. ముంబయి జూహులోని తన ఇంట్లో జియాఖాన్ 2013 జూన్ 3న రాత్రి 11 గంటల సమయంలో జియా ఖాన్ ఆత్మహత్య చేసుకుంది. సాగర్ తరంగ్ అపార్ట్ మెంట్ లో ఉంటున్న జియా ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడింది.
JiahKhan

ప్రత్యూష

వర్ధమాన తెలుగు సినీనటిగా ఎదుగుతున్న క్రమంలోనే ప్రత్యూష మరణించింది. తెలుగు తమిళ చిత్రాల్లో నటించిన ప్రత్యూష స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని చిత్రాల ద్వారా మంచి గుర్తింపు పొందింది. ప్రత్యూష ఇంజినీరింగ్ చదువుతున్న సిద్దార్థరెడ్డితో ప్రేమలో పడింది. అయితే తమ ప్రేమవిఫలం అవుతుందనే భయంతో 2002, ఫిబ్రవరి 23న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని, వీరిద్దరినీ హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చేర్పించగా ప్రత్యూష మరణించింది. ప్రత్యూష మరణం కూడా సినిమాటిక్‌గానే జరుగడం విశేషం. ముందురోజు రాత్రి కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగిన సిద్దార్థ, ప్రత్యూషకు ప్రాణాలపై ఆశ పుట్టింది. దీంతో ఇద్దరూ కారులో కేర్ ఆస్పత్రికి వచ్చి స్పృహ కోల్పోయారు. వైద్యులు వీరి పరిస్థితి గమనించి చికిత్స ప్రారంభించినా ప్రత్యూషను కాపాడలేక పోయారు. ప్రత్యూష చనిపోగా ఆమె ప్రియుడు మాత్రం ప్రాణాలతో బతికిబయటపడ్డాడని పోలీసులు ప్రకటించారు. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ప్రత్యూష తెలుగు, తమిళ సినీ రంగాల్లో నిలదొక్కుకుంటున్నది.
Prathyusha

ఆర్త్తీ అగర్వాల్

ఒకప్పుడు తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన నటి ఆర్తీ అగర్వాల్. ఆర్తీ అమెరికాలోని అట్లాంటాలో చికిత్స పొందుతూ మరణించింది. 2001 నుంచి 2005 వరకూ ఆర్తి అగర్వాల్ తెలుగులో నంబర్ వన్ కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి, వరుసగా 25 హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, జూ.ఎన్టీఆర్.. ఇలా అగ్రహీరోలూ యువ కథానాయకులతో అందరితోనూ కలిసి నటించింది. 1984 మార్చి 5న అమెరికాలోని న్యూజెర్సీలో ఆర్తీ అగర్వాల్ జన్మించింది. పెళ్లి తర్వాత తిరిగి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ లావు తగ్గించుకునే ప్రయత్నంలో ఆపరేషన్ వికటించి మరణించిందనే ప్రచారం ఉంది.
AarthiAgarwal

దివ్యభారతి

1992 సంవత్సర కాలంలో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన నటి దివ్యభారతి. ఉత్తరాది నుండి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకొన్న నటి. ఈమెను నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం బొబ్బిలి రాజాతో పరిచయం చేశాడు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన దివ్యభారతి 1992లో విశ్వాత్మ అనే సినిమాతో బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. మే 1992 లో సాజిద్ నడియాడ్వాలాను వివాహమాడింది. ఏప్రిల్ 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద మరణం పాలయింది. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకనే ఉన్నాయి.
DivyaBarathi

ఉదయ్ కిరణ్

చిత్రం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యువనటుడు ఉదయ్ కిరణ్ సినిమాలు లేకపోవడం, కుటుంబ సమస్యలతో దిక్కుతోచని స్థితిలో తన జీవితానికి ఆర్ధాంతరంగా ముగింపు పలికాడు. జనవరి 6, 2014లో తన ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాడు ఉదయ్ కిరణ్. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవడం, గౌరవం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఆయన మరణానికి కారణమన్న ప్రచారం సాగింది. మరోవైపు ఉదయ్ కిరణ్‌కు కుటుంబం నుంచి కూడా సరైన మద్దతు లభించకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డ్దాడంటారు.
UdayKiran

భరత్

కొరియోగ్రాఫర్‌గా బుల్లితెరకు సుపరిచితుడైన భరత్ తెలుగు సినిమా పరిశ్రమకు కూడా పరిచయమే. కొరియోగ్రాఫర్‌గా ఎదుగుతున్న క్రమంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడడం ఇండస్ట్రీని ఆందోళనకు గురిచేసింది. పలు సినిమా ఈవెంట్స్‌కు కొరియోగ్రఫి చేసిన భరత్‌కు వివాహం సెటిలైంది. అయితే వారిద్దరి మధ్య తలెత్తిన చిన్న వివాదం ఆయన ఆత్మహత్యకు దారితీసినట్లు చెబుతారు.
Bharath

సిల్క్ స్మిత

సౌత్ ఇండియన్ సెక్స్-సింబల్ గా పేరుపొందిన సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీనే. ఆమె ఆర్థిక సంక్షోభం, జీవితంలో నిరంతర వైఫల్యం కారణంగా ఉరివేసుకొని మరణించిందన్న వాదన ఉంది. బాలీవుడ్ చిత్రం ది డర్టీ పిక్చర్ సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగానే తెరకెక్కింది.
SilkSmitha

విజయ్

వర్థమాన కమెడియన్‌గా ఎదుగుతున్న విజయ్ సాయి గతేడాది డిసెంబర్ 17న ఆత్మహత్య చేసుకున్నాడు. యూసఫ్‌గూడలోని తన ఫ్లాట్‌లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. భార్య వేధింపుల వల్లే విజయ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. భార్యాభర్తలు వనిత, విజయ్ మధ్య వివాదాలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తున్నది. అదే విషయాన్ని విజయ్ సెల్ఫీ వీడియోలో ప్రస్థావించడం గమనార్హం. భార్య వేధింపులకు తోడు కొంత కాలం నుంచి సినిమాలు కూడా లేకపోవడంతో విజయ్ మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తున్నది. బొమ్మరిల్లు, అమ్మాయిలు అబ్బాయిలు చిత్రాలతో పాటు పలు సినిమాల్లో విజయ్ నటించారు.
Vijay-Sai

అర్ధంతర మరణాలు

సినిమాతారల్లో అర్థాంతర మరణాలు కూడా పరిశ్రమను వణికించాయి. అనారోగ్యంతో ఊహించని విధంగా తనువు చాలించిన నటులు ఉన్నారు.

దాసరి

తెలుగు సినీ పరిశ్రమకు మూల స్థంభం ప్రముఖ దర్శకుడు, నిర్మాత, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు. ఎంతో మంది నటులకు సినీరంగ ప్రవేశం కల్పించిన ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో 2017 మే ౩౦వ తేదిన తుది శ్వాస విడిచారు. లావు తగ్గడానికి ఆయన తీసుకున్న ట్రీట్‌మెంట్ వికటించడం మూలంగానే ఆయన మరణించారన్న వాదన ఉంది.
Dasari

శ్రీహరి

సహజ నటుడుగా, రియల్ స్టార్ పక్కా హైదరాబాదీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకునే శ్రీహరి కష్టపడి పైకి వచ్చిన నటుడు.1964 ఆగస్ట్ 15న హైదరాబాద్‌లో జన్మించిన శ్రీహరి అనేక సంవత్సరాలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. షూటింగ్ నిమిత్తం ముంబాయికి వెళ్లిన ఆయన అనారోగ్యానికి గురై లీలావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు.
Srihari

చక్రి

తెలంగాణ నుంచి స్వయంకృషితో ఎదిగిన సంగీత దర్శకుడు చక్రి. బాచి(2000) చిత్రంతో సంగీత దర్శకునిగా సినీ సంగీత ప్రస్థానం మొదలుపెట్టాడు. ఏ సంగీత దర్శకుని వద్ద సహాయకుడిగా చేయకుండానే సంగీత దర్శకుడైన ఘనత చక్రికి దక్కుతుంది. స్దూలకాయంతో బాధపడుతున్న చక్రి అరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించాడని, దానివల్లే డిసెంబర్ 15 2014లో తన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందాడంటారు.
Chakri

ఫటాఫట్ జయలక్ష్మి: తెలుగు తమిళ చిత్రాల్లో పలు చిత్రాల్లో నటించిన ఫటాఫట్ జయలక్ష్మి 1980లో ఉరివేసుకుని మరణించారు. వివాహ సమస్యల మూలంగానే ఆత్మహత్య చేసుకుందని చెప్తారు.

ప్రత్యూష బెనర్జీ: డబ్బింగ్ సీరియల్ చిన్నారి పెళ్లికూతురులో ఆనందిగా తెలుగు టీవీ ప్రేక్షకులకు చిరపరిచితురాలైన ప్రముఖ బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబై శివార్లలోని బంగూర్‌నగర్‌లో ఉన్న సొంత ప్లాట్‌లోఆమె సీలింగ్‌కు ఉరివేసుకున్నారు.

మరికొన్ని అనుమానస్పద మరణాలు

దిశా గంగూళీ: కోల్‌కతాకు చెందిన బెంగలీ టీవీ ఆర్టిస్ట్ ఎప్రిల్ 9, 2015న ఇంట్లో ఉరివేసుకొని మరణించింది.

అంజలి శ్రీవాస్తవ : వర్దమాన భోజ్‌పురి నటి అంజలి శ్రీవాస్తవ ఇంట్లో ఉరివేసుకొని మరణించింది. అందేరి జూహు ప్రాంతంలో నివసించే ఆమె తాడుతో ఉరి వేసుకొని చనిపోయారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియరాలేదు.

మోనాల్ నవల్: తమిళచిత్రాల్లో ఎక్కువగా నటించిన మోనల్ ఎప్రిల్ 30, 2002లో మరణించారు.

శిఖాజోషి : బా పాస్ చిత్రంలో చివరిసారిగా కనిపించిన శిఖాజోషి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆమె మరణానికి కారణాలు తెలియలేదు.
పర్వీన్ బాబి: తన అద్భుతమైన నటనతో అలరించిన బాలీవుడ్ నటి పర్వీనాబాబీది కూడా అనుమానస్పద మృతే. కొందరు ఆమె ఆత్మహత్య చేసుకున్నారని చెప్తారు. మరికొందరు మధుమేహం కారణంగా చనిపోయారని చెబుతారు.

నఫీసా జోసెఫ్: మిస్ ఇండియా యూనివర్స్ 1997 విజేత అయిన నఫీసా జోసెఫ్ ఆమె ఫ్లాట్‌లో ఉరివేసుకొని చనిపోయారు.

కుల్జిత్ రంధ్వా: కుల్జిట్ అనేక టెలివిజన్ కార్యక్రమాల్లో, పలు హిప్ హిప్ హుర్రేలతో పేరు సంపాదించారు. ఆమె ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందంటారు.

రీమ్ కపాడియా: ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నటిగా గుర్తింపు పొందిన రీమ్ కపాడియా మార్చి 27, 2001లో అనుమానాస్పదంగా మరణించారు.

గురు దత్: మద్యంమత్తులో నిద్రమాత్రలు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మరణించారు. అది ఆత్మహత్యనా లేకా ప్రమాదవశాత్తూ జరిగిందా అనేది స్పష్టంగా తెలియదు.

వివేకా బాబ్జీ: ప్రముఖ ఫ్యాషన్ మోడల్‌గా గుర్తింపు పొందిన వివేకా బాబ్జీ తన బాంద్రా ఫ్లాట్ లో ఉరి వేసుకున్నారు.

వర్షా భోస్లే: ప్రముఖ గాయని ఆశా భోస్లే కూతురు వర్షా భోంస్లే ఆత్మహత్య కూడా మిస్టరీనే. దక్షిణ ముంబైలోని ప్రభు కుంజ్ అపార్టుమెంటులో పిస్టల్‌తో కాల్చుకుని వర్షా భోస్లే ఆత్మహత్య చేసుకున్నారు.

మన్మోహన్ దేశాయ్: పలు చిత్రాలకు దర్శక నిర్మాతగా పనిచేసిన మన్మోహన్ దేశాయ్ తన బాల్కనీ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

కునాల్ సింగ్: కునాల్ సింగ్ తెలుగులో ప్రేమికుల రోజు సినిమాతో అలరించిన ఆయన ఇంట్లో సీలింగ్‌కు ఉరివేసుకొని మరణించగా ఆయన కుటుంబసభ్యులు మాత్రం అది ఆత్మహత్య కాదని ఆరోపించారు.

మరికొందరి మరణాలు

ఇక వయస్సు మీదా పడి అనారోగ్యాలు, ఇతర కారణాలతో మరణించిన నటులూ ఉన్నారు. వారిలో చెప్పుకోవలసింది. సుత్తివేలు. వందలాది చిత్రాల్లో తన హస్య పాత్రలతో ఆకట్టుకున్న సుత్తివేలు గుండెపోటుతో మరణించడం జీర్ణించుకోలేని అంశం. అదే కోవలో నడిచిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అత్యధిక భాషల్లో సినిమాలు రూపొందించిన నిర్మాతగా గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందిన మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు ఫిబ్రవరి 18న చనిపోయారు. రాముడు భీముడు, ప్రస్థానం, శ్రీకృష్ణ తులాభారం, ప్రేమ్‌నగర్ వంటి వందకు పైగా బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన రామానాయుడు మరణంతో యావత్ ఇండస్ట్రీ షాక్‌కు గురయ్యింది., ఎం.ఎస్. నారాయణ, కొండవలస లక్ష్మణ్‌రావు, కళ్లు చిదంబరం, పొట్టి రాంబాబు, బండజ్యోతి, వి.బి. రాజేంద్రప్రసాద్ అర్థాంతరంగా తనువు చాలించారు. 2015 ప్రారంభంలోనే ఆహుతి ప్రసాద్ కన్నుమూశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన జనవరి 4న హఠాన్మరణం చెందారు.

2308
Tags

More News

VIRAL NEWS