తాటి వనపు మేటి దేవత తాటికుంట మైసమ్మ!


Sun,February 11, 2018 12:53 AM

మేడారం జాతర్లో చూశారు కదా.. కుంకుమ భరణే దేవత. బెల్లం సమర్పణే బంగారం. ప్రకృతి పరిసరాలే దేవాలయం. గద్దెలే గర్భగుడి. అలాంటి సాంప్రదాయం.. తెలంగాణ సంస్కృతి గ్రామీణ ఆలయాల్లోనూ కనిపిస్తుంది. అలాంటి ఆలయాల్లో ఒకటి తాడిపర్తిలోని తాటికుంట మైసమ్మ ఆలయం! చుట్టూ తాటివనం.. దట్టమైన అడవి.. కుంటలు.. చెరువుల తీరాన వెలిసి భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న తాటికుంట మైసమ్మ ఆలయ విశిష్టతే ఈవారం దర్శనం!
thatikunta-maisamma
-మడ్డి యాదగిరి, సెల్: 9441757688


ఎక్కడ ఉన్నది?: రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని యాచారం మండలం తాడిపర్తి గ్రామ సమీపంలో ఫార్మాసిటీ భూ సరిహద్దుల్లో ఈ ఆలయం ఉంటుంది.

ఎలా వెళ్లాలి? : హైదరాబాద్ నుంచి రావాలనుకునేవాళ్లు నాగార్జున సాగర్ జాతీయ రహదారి మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోవాలి. ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం 24 కిలోమీటర్లు ఉంటుంది. ఇబ్రహీంపట్నం నుంచి యాచారం మీదుగా నందివనపర్తి తాడిపర్తి మీదుగా 20 కిలోమీటర్ల దూరంలో తాటికుంట మైసమ్మ ఆలయం చేరుకోవచ్చు. జాతీయ రహదారి మీదుగా కందుకూర్ నుంచి కూడా దారి ఉంది.

విశిష్టత ఏంటి? : ఒకప్పుడు ఇదంతా తాటివనానికి చిరునామా. రెండు జాతీయ రహదారుల మధ్యనున్న రిజర్వ్‌డ్ ఫారెస్ట్‌లో చెరువు కట్టపై వెలిసిన గ్రామ దేవత తాటికుంట మైసమ్మ.

ప్రత్యేకత?: ఆధ్యాత్మికం.. పర్యాటకం కలగలిపిన చోటు ఇది. ఆహ్లాదానికి తోడు పచ్చని సోయగాల వాతావరణం ఇక్కడి ప్రత్యేకత. అమ్మకు బోనం పెట్టి భక్తితో సమర్పిస్తుండగా పక్షుల కిలకిల రావాలు.. డప్పు చప్పుళ్ల మధ్యన తాటికుంట మైసమ్మ పరిసరాలు తన్మయత్వంతో పిల్లగాలుల రూపంలో ఊగిపోతాయి. భక్తిభావానికి.. వారాంతాల్లో ఆట విడుపునకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతంగా తాటికుంట మైసమ్మ మార్మోగుతున్నది.

స్థల పురాణం : పురాతన కాలంలోనే మైసమ్మ దేవత వెలిసింది. ఆ కాలంలో చిన్నచిన్న రాళ్లతో కట్టిన చిన్న ఆలయం ఇది. అందులో ఓ రాతివిగ్రహం ఉండేదట. ఎన్నో ఏళ్లుగా దీపధూప నైవేద్యాలకు నోచుకోకుండా వెలవెలబోయింది. ఆలయం పశువుల కాపరులు, గొర్రెల కాపరులకు, అడవిలో కట్టెలు కొట్టే గిరిజనులకు మాత్రమే తెలుసు. వీరంతా కట్టకింద ఉన్న కుంటలో పశువులకు, గొర్రెలకు నీళ్లు తాగించి, అక్కడే సద్ది తిని సేద తీరేవారు. వారికి కష్టాలు వచ్చినప్పుడు అమ్మవారితో పంచుకునేవారు.

త్వరలోనే వారి కోర్కెలన్నీ తీర్చడంతో.. వారు కొబ్బరి కాయలు కొట్టడం, దీపధూప నైవేద్యం సమర్పించడం మొదలు పెట్టారు. ఆది ఆనోట.. ఈనోటా పడి, అమ్మవారిని చూడడానికి భక్తులు అష్టకష్టాలు పడి అడవి ప్రాంతం నుంచి కాలినడకన వెళ్లి, దర్శనం చేసుకునేవారు. అలా.. అమ్మవారి ప్రసిద్ధి క్రమంగా వెలుగు చూసింది. దీంతో అడవి నుంచి ఆమె ప్రస్థానం జనాల్లోకి వెళ్లింది. 2012లో ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. లక్షల రూపాయలు ఖర్చుచేసి ఆలయం నిర్మించారు. సాయిరెడ్డిగూడ గ్రామానికి చెందిన నర్సింహ్మ అనే వ్యక్తి సహాయంతో విగ్రహాన్ని ప్రతిష్టించారు. హుండీపెట్టెను అమర్చారు. ఆలయం ముందు కలపతో చేసిన ధ్వజస్థంభాన్ని ఏర్పాటు చేశారు. ఆలయం ముందు పుట్ట వద్ద భక్తులు పూజలు చేయడం ఆనవాయితీ. ఇప్పటికీ రెండుమార్లు జాతర నిర్వహించారు. బోనాల ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించారు. దీంతో ప్రతీ ఆదివారం, గురువారం భక్తులు అమ్మవారిని దర్శించుకొని, పూజలు నిర్వహిస్తున్నారు.

భక్తికి మారుపేరు: తాటికుంట మైసమ్మ ఆలయానికి భక్తులు చేరుకోవడానికి సరైన దారిలేకపోవడంతో భక్తులకు అమ్మవారి దర్శనభాగ్యం కరువైంది. ఆలయం అటవీప్రాంతంలో ఉండడంతో దారిలేక భక్తులు ఆలయానికి చేరుకోలేకపోతున్నారు. రాళ్లురప్పలు, చెట్లపొదల్లో గుంతలమయంగా డొంకదారి ఉండడంతో భక్తులు నరకయాతన పడుతున్నారు. అష్టకష్టాలు పడి ట్రాక్టర్, మోటర్ సైకిళ్ల ద్వారా చేరుకుంటున్నారు. ఎన్ని అవస్థలు పడుతున్నా భక్తిభావంతో.. నిష్టతో వాటన్నింటినీ ఎదుర్కొంటూ భక్తులు ఇక్కడకు వస్తున్నారు. తమ బాధలు ఆలకించి అమ్మవారు తప్పకుండా ఆలయానికి సౌలభ్యమైన రాకపోకలకు మోక్షం కలుగుతుందని భక్తులు ఆశిస్తున్నారు.

ప్రకృతికి పరవశం : జనావాసాలకు దూరంగా తాటికుంట మైసమ్మ తల్లి వెలిసింది. ఆదివారం పిల్లల కేరింతలు, విందువినోదాలు, శివసత్తుల పూనకాలు, డప్పుచప్పుళ్లతో అటవీ ప్రాంతం మార్మోగుతుంది. ఆలయప్రాంగణం భక్తులతో కళకళలాడుతూ సందడిగా కనిపిస్తుంది.

thatikunta-maisamma2

సండే సందడి

ఆదివారం వచ్చిందంటే చాలు.. తాటికుంట మైసమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. తాడిపర్తి, కుర్మిద్ద, సాయిరెడ్డిగూడెం, నానక్‌నగర్, మేడిపల్లి, నందివనపర్తి, ఎక్వాయపల్లి, ముద్వీన్, చరికొండ, పల్లెచెల్కతండా గ్రామాలతో పాటు ఇబ్రహీంపట్నం, మంచాల, కడ్తాల్, ఆమనగల్, చింతపల్లి, మర్రిగూడ మండలాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వీక్షించి తనివితీరా పులకరించిపోతున్నారు. అమ్మవారి సమీపంలోని కొలనులో స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. కోళ్లు, మేకలను బలిచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. దీప, ధూప, నైవేద్యాలతో పాటు శివసత్తుల పూనకాలు, డప్పు చప్పులతో బోనాలు సమర్పిస్తున్నారు. అక్కడే వంట చేసుకొని విందు భోజనాలు చేస్తున్నారు. గిరిజనుల, యువకుల నృత్యాలు, చిన్నారుల కేరింతలు అందరినీ అలరిస్తుంటాయి. తాటికుంట మైసమ్మను దర్శించుకుంటే ఆ రోజు బయటి ప్రపంచాన్ని మర్చిపోవాల్సిందే మరి.

1467
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles