టైటానిక్‌లో చేయాల్సి ఉండే!


Sun,June 10, 2018 09:47 AM

ఓవర్‌నైట్ స్టార్‌గా పుణ్యానికి ఎవరూ అవ్వరు. చేసిన సినిమాలు, పడిన కష్టం వర్కవుట్ అవ్వడం వల్లే అది సాధ్యమవుతుంది. నా పని నటన. నేను చేసిన సినిమాలు నచ్చితే చూస్తారు. లేదంటే చూడరు. నేను నచ్చితే ప్రేమిస్తారు. కాదంటే వీడు మనకు ఇష్టంలేదని చెబుతారు. ఏది ఏమైనా అంతిమంగా మన సినిమా బాగుండాలి. స్ట్రగుల్ అయి వచ్చానని జాలితో నా సినిమాల్ని చూడొద్దు. నచ్చితేనే చూడాలి. నా కష్టాల్ని ఒక్కోసారి అందరితో పంచుకోవాలని అనిపిస్తుంది. నాలాగ పడుతున్నవారు చాలా మంది ఉంటారు. అలాంటివి చదివితే కొంతైనా వారిలో స్ఫూర్తి కలుగుతుంది. నటనలోనే అని కాదు ఏదైనా రంగాల్లో స్థిరపడాలనే నమ్మకాన్ని పెంపొందించడానికి అలాంటివి తోడ్పడుతాయి. అందుకే కొన్ని సార్లు స్ట్రగుల్స్ గురించి చెప్పాలని అనిపిస్తది అంటూ తన కెరీర్ గురించి పంచుకున్నారు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు.. అర్జున్‌రెడ్డి చిత్రాలతో యూత్ ఐకాన్‌గా.. స్టార్ హీరోల జాబితాలో చేరిన తెలంగాణ యువ కెరటం విజయ్ ప్రస్థానం ఆయన మాటల్లోనే...

-మడూరి మధు,సెల్: 9182777416

నాప్రయాణంలో అప్పడప్పుడూ వెనక్కి తిరిగి ఆలోచిస్తే భయమేస్తుంది. అలాగని గతాన్ని తల్చుకుంటూ ఉండిపోను. ముందుచూపుతో ఆలోచించాలన్నది నా సిద్ధాంతం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. వచ్చే ఏడాది ఇంకా మంచి పాత్రలు, కథలతో కూడిన సినిమాలు చేస్తూ వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఓ మెట్టుపైన ఉండాలనే ఆలోచిస్తాను. అల్వేస్ లుక్ ఫార్వర్డ్, డోంట్ లుక్ బ్యాక్ అనుకుంటాను. ఫొటోలు పట్టుకొని ఆఫీస్‌ల చుట్టూ తిరిగిన స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన నా ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటాను. దిమాక్‌లో ఎక్కువగా కష్టాలు పడిన రోజుల గురించి ఆలోచిస్తే నిజంగానే తిరిగి అక్కడికే వెళ్లిపోతాం అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో సినిమా ఆఫీస్‌ల గుమ్మం వరకు వెళ్లగానే ఫొటోలు తీసుకొని తిరిగి పంపించేవారు. దాంతో ఆఫీస్‌లకు వెళ్లాలంటేనే భయం వేస్తుండేది. ఎట్లా చూస్తారో ఏమంటారో అనుకునేవాడిని. అందరిలో ఆ భయం ఉంటది. ఆడిషన్‌లో వారికి నచ్చకపోతే మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాల్సివచ్చేది. మా ఆఫీస్‌లో అప్పుడప్పుడు కొందరు యువతీయువకులు వచ్చి అవకాశాలు కావాలని అడుగుతుంటారు. అవన్నీ కొత్త అనుభూతిని పంచుతుంటాయి. జీవితం చాలా మారిందని అనిపిస్తుంటుంది. ఓవర్‌నైట్ స్టార్‌గా పుణ్యానికి ఎవరూ కారు. చేసిన సినిమాలు.. పడిన కష్టం వర్కవుట్ అవ్వడం వల్లే అది సాధ్యమవుతుంది. పెళ్లిచూపులు హిట్టయినందు వల్లే అర్జున్‌రెడ్డి చూడటానికి మరికొంతమంది ముందుకొచ్చారు. సినిమా పట్ల వారిలో ఆసక్తి మొదలైంది. ఆ తర్వాత నా ప్రతి పోస్టర్, టీజర్, ట్రైలర్, మాటలు అన్నీ నా ఇమేజ్‌ను పెంపొందించడానికి కొంత దోహదపడ్డాయి. ఒక్క రాత్రిలో అద్భుతాలు అన్నీ జరుగవు. అర్జున్‌రెడ్డి విడుదలకు ముందు రోజు రాత్రి వంద థియేటర్లలో ప్రివ్యూ వేశాం.
VijayDevarakonda

ప్రేక్షకుల స్పందన చూడటానికి థియేటర్‌కు వెళ్లం. నేను రియలిస్టిక్ పర్సన్‌ను. సహజత్వాన్నే ఎక్కువగా కోరుకుంటాను. థియేటర్‌లో ప్రేక్షకులు సినిమా చూస్తున్న సమయంలో, బయటకు వచ్చిన తర్వాత అరుస్తూ కనిపించారు. అయితే నేను థియేటర్‌లో ఉండటం వల్ల అరుస్తున్నారు కావచ్చునని వారికి నచ్చిందో లేదో తెలుసుకోవడానికి వెయిట్ చేద్దామని అనుకున్నాను. సినిమా చూసి అందరం ఆఫీస్‌కు వెళ్లిపోయాం. ఆ గంట తర్వాత దర్శకుడు సందీప్ వంగా వచ్చి భాయ్ సినిమా అందరికీ నచ్చిందిఅని అన్నారు. అతడికో హగ్ ఇచ్చి సైలెంట్‌గా ఉన్నాను. ఎందుకిట్లున్నావ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేద్దామని సందీప్ అన్నారు. లేదు కొంత సమయం వేచిచూద్దామని చెప్పాను. ఫోన్ చూస్తూ అలాగే ఉండిపోయాను. అదే సమయంలో ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన ఆర్టికల్ కనిపించింది. తక్కువ రేటింగ్ ఇస్తూ సినిమా గురించి దారుణంగా రాశారు. అది చూడగానే చాలా ఫీలైపోయా. సినిమా గురించి అందరూ ఇలాగే అనుకుంటున్నారనిపించింది. కొందరు మాత్రం సినిమా బాగుందని చెప్పారు. అలా రాత్రి రెండు గంటల వరకు ఉండిపోయా. పొద్దున పదకొండు గంటలకు నిద్ర లేవగానే నా ఫోన్ మొత్తం మెసేజ్‌లతో నిండిపోయింది. కొందరు బలంగా తమ సందేశాల్ని పంపించారు. అవి చూడగానే కన్నీళ్లు వచ్చాయి. సినిమాకు మంచి స్పందన రావడంతో బాగా లేదని రాసిన ఆ పత్రిక వారే తిరిగి మార్పులు చేస్తూ మరో ఆర్టికల్ రాశారు. సినిమా పోయుంటే నాకు, మా దర్శకుడికి మెంటల్ ఎక్కేది.

నేను పుట్టింది అబిడ్స్‌లో. ఆరేండ్ల వయసులో అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించారు. 15 ఏండ్ల వరకూ అక్కడే ఉన్నాను. నా బాల్యం మొత్తం పుట్టపర్తిలోనే గడిచింది. వేసవి సెలవుల్లో మాత్రమే రెండు నెలలు ఇంటికి వచ్చేవాణ్ణి. పదో తరగతి తర్వాత హైదరాబాద్‌కు వచ్చాను. భద్రుకాలో బీకామ్ చదివే రోజుల్లోనే రంగస్థలంతో ఏర్పడిన పరిచయం నెమ్మదిగా నటనవైపు అడుగులు వేసేలా చేసింది. చదువులో మంచి విద్యార్థినే.అ లాగని టాపర్‌కాదు. టాప్‌టెన్‌లో నేను ఒకడిగా నిలిచేవాణ్ణి. నా స్నేహితులకు చాలా రకరకాల కథలు చెబుతుండేవాణ్ణి. మా స్కూల్‌లో క్రమశిక్షణ ఎక్కువగా పాటించేవారు. రాత్రి తొమ్మిదిన్నరకు అందరూ నిద్రపోవాలి. ఉదయం ఐదున్నరకు లేవాలి. ఆ సమయంలో తొందరగా నిద్ర రాదు. దాంతో నాకు తోచిన కథలు అల్లి స్నేహితులకు చెప్పేవాణ్ణి. మా స్కూల్‌లో టీవీలు లేకపోవడంతో ఎక్కువగా పుస్తకాలు చదవడం అలవాటయ్యింది. వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నాను. అవన్నీ మానసికంగా ఎదగడానికి తోడ్పడ్డాయి. మా అమ్మకు పుట్టపర్తిలోనే నేను చదవాలి, మంచిజాబ్ సంపాదించుకోవాలనే కోరిక ఉండేది. కానీ కాలేజీలో చేర్పించడానికి వచ్చిన మా నాన్న హైదరాబాద్ వస్తావా? అని అడిగారు. సరే అని ఇక్కడకు వచ్చాను. అలాకాకుండా కాలేజీలో చేర్పించడానికి మా అమ్మ పుట్టపర్తి వస్తే నేను నటుడిని అవకపోయుండేవాణ్ణి. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత కాలేజీకి సిటీ బస్సులో వెళ్లాలి. వాటి నంబర్స్ తెలియవు, ఏది ఎక్కాలో, ఏది ఎక్కడకు వెళుతుందో అర్థం కాలేదు. కాలేజీకి వెళ్లడం మానేసి ఇంట్లోనే చదువుకోవడం ప్రారంభించాను. ఎగ్జామ్స్‌కు ముందు ట్యూషన్‌కు వెళ్లి మంచి మార్కులతో పాసైపోయేవాణ్ణి. కాలేజీ బస్సు ప్రయాణాల నుంచి తప్పించుకొని ఇంట్లో కూర్చొని సినిమాలు ఎక్కువగా చూసేవాణ్ణి. దాంతో ఓ రోజు నాన్న చాలా కోపగించుకున్నారు. టైమ్ వృథా చేయడం ఎందుకని, నీకు దేనిపై ఆసక్తి ఉందో దానిపైనే దృష్టి పెట్టమని చెప్పారు. లేదంటే ఊళ్లో పొలాలు ఉన్నాయి వ్యవసాయం చేసుకు పో అని సీరియస్‌గా చెప్పారు. నాన్న అంటే ఇంట్లో అందరికీ భయం. కోపం వస్తే తిడుతుంటారు. ఆయన మాటలకు ఫీలైపోయి నాకు నటుడవ్వాలని ఉందన్నాను. న్యూయార్క్ ఫిలిం అకాడమీలో యాక్టింగ్ క్లాస్‌లో చేరిపోతానని చెప్పాను. అందులో చేరడానికి మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిపోవని తెలుసు. అవన్నీ కుదరవు నీకు ఇదే సరైందని చెప్పి హిమాయత్‌నగర్‌లోని ఓ అకాడమీలో చేర్పించారు. అక్కడ స్టేజ్‌పై నటించడం, నా నటనకు అందరూ చప్పట్లు కొట్టడం, నాటకం అయిపోగానే అభినందనలు అవన్నీ మంచి కిక్ ఇచ్చాయి. ఇంకా పెద్దస్టేజ్, ఎక్కువ ప్రేక్షకుల ముందు నటించాలనిపించింది. రవీంద్ర భారతిలో వెయ్యిమంది ముందు నటించవచ్చు. అదే సినిమాలు అయితే లక్షలాది మందికి నా నటనా ప్రతిభను చూపించుకోవచ్చునని సినిమాల్లోకి వచ్చాను.

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా కోసం తొలిసారి కెమెరా ముందుకొచ్చాను. అందులో చిన్న పాత్ర చేశాను. ఆ సమయంలో చాలా భయమనిపించింది. ఆ తర్వాత ఎవడే సుబ్రమణ్యంలో నాది ముఖ్యమైన పాత్ర. చిత్రీకరణ తొలిరోజు అన్నీ నాపై వచ్చే సన్నివేశాలనే తెరకెక్కించారు. నేనేమైనా తేడా కొడితే మరొకరిని వెతుక్కోవడానికి వారికో ఆప్షన్ ఉండాలని అలా చేశారు. ఆ సన్నివేశాల్లో నాని నా పక్కన ఉండేవారంతే. దాంతో నాని నా కోసం వెయిట్ చేస్తున్నాడు. తొందరగా, మంచిగా చేయాలనే ఒత్తిడి ఎక్కువగా ఉండేది. సినిమాలో నాది కీలకమైన పాత్ర, కాంట్రాక్ట్ ఉందా, డబ్బులు ఇస్తారా అనే లెక్కలు లేవు. అవసరమైతే ఉచితంగా సినిమా చేయడానికి సిద్ధం. అవకాశం వస్తే చాలనుకున్నాను. తొలుత రుషి పాత్ర కోసం నన్ను ఆడిషన్ చేశారు. ఆ తర్వాత పెద్ద యాక్టర్‌ను తీసుకుంటున్నామని చెప్పారు. సినిమా ప్రారంభానికి మూడు రోజుల ముందు స్వప్నదత్ వాళ్ల ఇంటికి డిన్నర్‌కు వెళ్లాం. అక్కడకు వెళ్లగానే తర్వాతి రోజు నుంచే సినిమా షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. టెస్ట్ షూట్ చేస్తున్నారేమోననుకున్నా. నన్ను పరిశీలించడానికే అన్నారని అనుకొని చాలా టెన్షన్ పడ్డా. మూడు నాలుగు నెలల చిత్రీకరణ తర్వాత తొలి కాంట్రాక్ట్ అంగీకరించారు. మొదటిసారి పారితోషికం అందుకున్నాను. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రీకరణ పూర్తిచేసి మొదటి రోజు ఇంటికి వెళ్లిపోయిన తర్వాత నటన నుంచి వైదొలగాలనుకున్నాను. ఇంత ఒత్తిడిలో పనిచేయవద్దనిపించింది. ఇష్టం లేకుండా, అసౌకర్యవంతంగా పనిచేయడం అవసరమా? యాక్టింగ్ చేస్తే దిల్‌దార్‌గా ఎంజాయ్ చేస్తూ చేయాలి. లేదంటే నచ్చిన పని ఏదైనా వెతుక్కోవాలి అనిపించింది. మరుసరి రోజు షూటింగ్‌కు వెళ్లకూడదని అనుకున్నాను. కానీ షూటింగ్‌కు వెళ్లిపోయి కెమెరా నటన, నాని, నాగ్ అశ్విన్‌ను పక్కనపెట్టి టైమ్‌పాస్ చేసి రావాలని అనుకున్నాను.

నాగ్ అశ్విన్ కూడా నన్ను పక్కకు తీసుకెళ్లి తెరపై సరదాగా కనిపించాలని చెప్పారు. నాది ముఖ్యమైన పాత్ర కావడంతో వారు చాలా భయపడ్డారు. రెండో రోజు చిత్రీకరణకు నాని రాలేదు. మెడిటేషన్ చేసే ఓ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఎవరూ లేకపోవడంతో చాలా ఎంజాయ్ చేస్తూ నటించాను. ఆ రోజు సాయంత్రం వరకు అదే జోరుతో నటించాను. పెళ్లిచూపులు షూటింగ్ సరదాగా సాగింది. స్నేహితులంతా విహారయాత్రకు వెళ్లి టైమ్‌పాస్ చేసినట్లుగా గడిచిపోయింది. అప్పుడప్పుడు మేము చేసిన టైమ్‌పాస్ ఇంత పెద్ద హిట్ కావడం తప్పు అనిపిస్తుంది. అర్జున్‌రెడ్డిలో మాత్రం నా క్యారెక్టర్ సీరియస్‌గా ఉంటుంది. శక్తివంతమైన కథాంశం, ఫిలాసఫీలతో ఆ కథ సాగుతుంది. చిత్రీకరణలో అనుబంధాలు, ప్రేమ, ఫిలాసఫీల గురించి గంటల తరబడి మాట్లాడుకుంటూ షూట్ చేసేవాళ్లం. కలకాలం గుర్తుండిపోయే మంచి సినిమాలు చేయాలన్నది నా లక్ష్యం. బాహుబలి తరహాలోభాషాభేదాలతో సంబంధం లేకుండా పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి సినిమాలను అందరూ రిఫరెన్స్‌గా తీసుకుంటుంటారు. నటుడిగా ఆ విషయంలో గర్వపడుతున్నాను. సినిమా విడుదలై ఏడాది, రెండేళ్లు గడిచినా ఇంకా వాటి గురించి మాట్లాడుతున్నారు. ఆ సినిమాల్ని చాలామంది ఇష్టపడ్డారు. ఆ ప్రభావం ఇంకా వారిపై ఉన్నది. అలాంటి సినిమాలు మరిన్ని చేయాలి. తొలి సినిమా చేస్తున్నప్పటి నుంచి అందరూ మీకు ఎలాంటి సినిమాలు చేయాలనుంది అని అడుగుతున్నారు. కానీ ఏం సమాధానం చెప్పాలో తెలిసేదికాదు. కానీ ఇటీవల నోటా చిత్రీకరణ విరామంలో టీవీలో టైటానిక్ సినిమా చూశాను. అలాంటి సినిమా చేయాలనిపించింది. చాలా నచ్చింది. ఒరిజినల్ వెర్షన్‌లో నేనుంటే బాగుండేదని అనిపించింది. ఒకవేళ అందరూ అంటున్నట్లుగా నన్ను యువత యూత్ ఐకాన్ అనుకుంటే నా రూపంలో యువతరానికి మంచి ఐకాన్ ఉన్నాడు. గుడ్ రోల్‌మోడల్‌గా వారిని సరైన లక్ష్యం దిశగా నడిపిస్తాననే నమ్మకముంది.

1835
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles