టీమిండియా వయా ఐపీఎల్!


Sun,June 18, 2017 02:40 AM

ఐడెంటిటీ క్రైసిస్ ఒక బరువైన మాట. అస్తిత్వ సంక్షోభంగా మన పెద్దలు అనువదించిన ఈమాటకు సైకాలజీలో వేరే అర్థం ఉండొచ్చు. కానీ ఒక్కో సందర్భంలో పెద్ద పెద్ద సెలెబ్రిటీలు కూడా తమ ఐడెంటిటీ చెప్పుకోవాల్సిన క్రైసిస్ ఏర్పడుతుంది. కొన్నేళ్ళ క్రితం పుల్లెల గోపీచంద్‌కు అలాంటి పరిస్థితే ఎదురైంది. తన శిష్యురాలు సైనా నెహ్వాల్‌తో అప్పటి కేంద్ర క్రీడా శాఖా మంత్రి ఎం.ఎస్. గిల్ గారిని కలవడానికి వెళ్ళినప్పటి సంగతి అది. సదరు మంత్రివర్యులు సైనాను గుర్తించారు గానీ గోపీచంద్ ఎవరో ఆయనకు తెలియలేదు. ఇంతకీ మీరెవరు అని అడిగాడాయన. ఈ సంఘటన జరిగిన 2008 సంవత్సరం నాటికి కోచ్ పాత్రలో ప్రపంచానికి గోపీ అంతగా తెలియకపోవచ్చు. కానీ ఐదు సార్లు వరుసగా జాతీయ ఛాంపియన్‌షిప్ గెలువడంతో పాటు ప్రకాశ్ పదుకోన్ తరువాత ఆల్ ఇంగ్లండ్ టైటిల్ గెలిచిన ఏకైక భారత ఆటగాడిగానైనా కేంద్ర క్రీడల మంత్రికి అతను తెలిసి ఉండాలి. ఇంతకీ ప్రకాశ్ పదుకోన్ ఎవరు? ఓహో దీపికా పదుకోన్ వాళ్ళ డాడీ కదా అనుకునే దౌర్భాగ్యం మనది. మరి బాడ్మింటన్ కోర్టు దాటి క్రికెట్ వైపు వస్తే, ఐపీఎల్‌లో ఆరంటే ఆరు మ్యాచ్‌లు ఆడిన మన హైదరాబాద్ కుర్రాడు మహమ్మద్ సిరాజ్‌ను ఇప్పుడు గల్లీ గల్లీలో ప్రతి ఒక్కరూ గుర్తు పడతారు. అదీ ఐపీఎల్‌కుండే పవర్. అంతర్జాతీయ స్థాయి సమీపాలకు కూడా వెళ్ళని ఓ కొత్త కుర్రాడు ఐపీఎల్‌లో ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడితే చాలు, అతన్ని ఉన్నఫళంగా స్టార్‌ను చేసేస్తుందీ ప్రీమియర్ లీగ్.
Sunriser

ఐపీఎల్‌ను ఈసడించుకునే వారు కొంతమంది ఉంటారు. అంతా బెట్టింగ్, ఫిక్సింగ్ అని పెదవి విరుస్తారు. ఈ పోటీలు చూసేవారిని పిచ్చోళ్లుగా జమకడతారు. ఐ డోంట్ వాచ్ దిస్ బ్లడీ ఐపీఎల్ యూ నో అనే గడ్డం మేధావులు మనకు తారసపడుతూనే ఉంటారు. విదేశాల్లో తలదాచుకుంటున్న లలిత్ మోదీ, విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్ళు ఈ లీగ్ మానసపుత్రులే అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. క్రికెట్‌లో వ్యాపార సంస్కృతి వెర్రితలలు వేయడానికి కూడా ఐపీఎల్ కారణమన్నది సైతం ఒప్పుకొని తీరాల్సిన నిజం. కానీ ఒకే ఒక్క కారణం వల్ల ఐపీఎల్ పాపాలన్నింటినీ మనం బారాహ్ ఖూన్ మాఫ్ అంటున్నాం. అది ఈ లీగ్ భారత క్రికెట్‌కు అందిస్తున్న యువ రక్తానికి సంబంధించింది. ఐపీఎల్ అనే నర్సరీలో ఓనమాలు దిద్దుకుని టీమిండియాలోకి కొత్త క్రికెటర్లు తామరతంపరగా వస్తున్నారు. రవీంద్ర జడేజా, యూసుఫ్ పఠాన్, శిఖర్ ధవన్, జస్‌ప్రీత్ బుమ్రా, మనీష్ పాండే, కేదార్ జాదవ్ లాంటివారంతా భారత జట్టులోకి వయా ఐపీఎల్‌తో వచ్చిన వారే. నిజానికి ఐపీఎల్‌ను నర్సరీ అనడం కన్నా ఫ్యాక్టరీ అనడం కరెక్టేమో. ఎందుకంటే నర్సరీలోని చిన్న మొక్కల్ని తెచ్చుకుని మనం పెంచి పెద్ద చేయాలి. కానీ ఈ టీ20 లీగ్ ఆడిన ఆటగాళ్ళు రెడీమేడ్‌గా మనకు అందివస్తున్నారు. అగ్రశ్రేణి అంతర్జాతీయ ఆటగాళ్ళ సరసన ఆడి వారు దేశవాళీ స్థాయిలోనే ఆరితేరుతున్నారు. ముంబై జట్టులో లసిత్ మలింగా నుంచి మెళకువలు నేర్చుకున్న బుమ్రా ఇప్పుడు గురువును మించిన శిష్యుడనిపిస్తున్నాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటికిప్పుడే టీమిండియాలో ఆడించడానికి సిద్ధంగా ఉన్న ఆటగాళ్ళు కనీసం ఒక డజను మంది కనిపించారు. బ్యాట్స్‌మెన్ విషయంలో మనకెప్పుడూ సమస్య లేదు. అయితే ఈసారి ఈ లీగ్ నుంచి చాలా మంది కొత్త బౌలర్లు, వికెట్ కీపర్లు కూడా వెలుగులోకి వచ్చారు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు కొంతమంది బాగా ఆకట్టుకున్నారు. ఐపీఎల్ పదో సీజనులో అత్యుత్తమ ప్రవర్దమాన ఆటగాడుగా ఎంపికైన కేరళ తంబి బేసిల్ థంపి మొత్తం పన్నెండు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. వికెట్ల సంఖ్య పెద్ద ఎక్కువ కాకపోయినా చివరి ఓవర్లలో యోర్కర్లు, స్లో బంతులు వేయడంలో అతను చూపిన ప్రావీణ్యం క్రికెట్ పండితుల మెప్పు పొందింది. అలాగే సిరాజ్, సిద్ధార్థ్ కౌల్, శార్దూల్ ఠాకూర్, నటరాజన్ కూడా అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ కుర్ర ఫాస్ట్ బౌలర్లందరూ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం కూడా విశేషం. రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన ఆవేష్ ఖాన్ కూడా తన వేగంతో ఆకట్టుకున్నాడు. ఇక స్పిన్నర్ల విషయానికొస్తే పదిహేడేళ్ళ వాషింగ్టన్ సుందర్, మరో అశ్విన్ అనిపించాడు. నిజానికి ఈ ఆల్‌రౌండర్ ప్రధానంగా బ్యాట్స్‌మన్. ఇండియా అండర్-19 జట్టులో, తమిళనాడు జట్టులో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేస్తుంటాడు. కానీ పుణె జట్టులో మాత్రం బౌలర్‌గా రాణించాడు. అశ్విన్ లాగానే పవర్ ప్లేలో కట్టుదిట్టంగా బంతులేయడంతో పాటు కీలకమైన వికెట్లు తీశాడు. ఇక రిషభ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డాషింగ్ బ్యాట్స్‌మన్‌గానే కాక కీపర్‌గా కూడా మార్కులు కొట్టేశాడు. ధోనీకి అతనే వారసుడు అనడంలో ఇంకా ఎవరికీ సందేహం లేదు. ధోనీ లాగే జార్ఖండ్‌కు చెందిన కీపర్-బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ కూడా బరిలో ఉన్నాడు. రాహుల్ త్రిపాఠి, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, సంజు శాంసన్ లాంటి బ్యాట్స్‌మెన్ కూడా ఐపిఎల్ పదో సీజనులో మెరుపులు మెరిపించారు. గతంలో ఇండియా తరఫున కొన్ని మ్యాచ్‌లాడిన పేస్ బౌలర్లు జయదేవ్ ఉనాడ్కట్, సందీప్ శర్మ కూడా మళ్ళీ జాతీయ జట్టులోకి రావడానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు పంపుతున్నారు.

ఫైనల్లో ముంబై ఇండియన్స్ గెలుపులో ముఖ్య పాత్ర వహించిన క్రునాల్ పాండ్యా కూడా ఇండియాకు ఆడగల సత్తా ఉన్నవాడే. కానీ ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్ చేసే ఆల్‌రౌండర్ల విషయంలో అతను క్యూలో ఉన్నాడని చెప్పాలి. ఎందుకంటే ఇదే తరహా ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, పవన్ నేగీలతో అతను పోటీ పడాలి. ఇక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కొరత మాత్రం ఈసారి ఐపీఎల్ తీర్చలేకపోయింది. ఈ తరహా ఆల్‌రౌండర్ స్థానానికి హార్దిక్ పాండ్యాకు ఇప్పట్లో పోటీ ఇవ్వగలిగే వారు ఎవ్వరూ కనబడడం లేదు.
అయితే ఈ యువ ఆటగాళ్ళందరిలో ఒక లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఒకటి రెండు అసాధారణ ప్రదర్శనల తర్వాత మిగతా మ్యాచ్‌ల్లో డీలా పడుతున్నారు. అందరి దృష్టిలో పడ్డాక ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆ ఒత్తిడిని తట్టుకుని ఫామ్ కొనసాగించగలగడమే ఛాంపియన్ల లక్షణం. భారత జూనియర్ జట్టుకు రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా ఉండడం ఈ యువ క్రికెటర్లకు ఓ వరం లాంటిది. నిబ్బరంగా ఎలా ఆడాలో, ఒత్తిడి ఎలా తట్టుకోవాలో ద్రావిడ్ కన్నా బాగా ఎవరు నేర్పించగలరు? ఇలా ప్రతీ ఏడాది ఐపీఎల్ ఓ డజను మంది యువ క్రికెటర్లను అందిస్తూ పోతే ఇక కొత్త టాలెంట్ గురించి తడుముకునే పనే ఉండదు.

1030
Tags

More News

VIRAL NEWS