జీవితం పంచుకోలేకపోయాం!


Sun,June 10, 2018 09:44 AM

డిగ్రీ చదువడానికి ఊరి నుంచి హైదరాబాద్ వచ్చాను. రామ్‌నగర్‌లో రూమ్ కిరాయికి తీసుకొని అక్కడే ఓ ప్రైవేటు కాలేజీలో బీకాంలో చేరాను. రోజూ కాలేజీకి వెళ్లడం, ఇంటికొచ్చి పని చేసుకోవడం, చదువుకోవడం, తీరిక చూసుకొని ఉస్మానియా కాలేజీలోకి కాలయాపన కోసం వెళ్లడం దినచర్యగా మారింది. నాకు అప్పుడు పాత నోకియా ఫోన్ ఉండేది. బ్యాలెన్స్ కూడా సరిపడా వేయించుకునే పరిస్థితి లేకుండె. ఇలా గడుస్తున్న క్రమంలో నాకు ఓ అర్ధరాత్రి ఫోన్‌కాల్ వచ్చింది. హలో ఎవరూ? అనగానే ఠక్కునే పెట్టేశారు. ఎవరై ఉంటారబ్బా ఇంత అర్ధరాత్రి ఫోన్ చేశారు అని ఆలోచించాను. కాల్ బ్యాక్ చేద్దామంటే సరిపడా బ్యాలెన్స్ లేదు. ఆ ఫోన్‌కాల్ గురించే ఆలోచిస్తూ పడుకున్నాను. తర్వాతి రోజు అదే సమయానికి మళ్లీ కాల్ వచ్చింది. హలో అనగానే కట్ చేశారు. చెక్ చేసుకుంటే సేమ్ నెంబర్. అమ్మాయి గొంతు. నవ్వేసి ఫోన్ పెట్టేసింది. ఎవరన్నా ఆటపట్టిస్తున్నారేమో అనిపించింది. కానీ అలాంటివాళ్లెవరూ నా సర్కిల్‌లో లేరు. ఇంకోటి నేను అమ్మాయిలతో అంత మంచి కమ్యునికేషన్‌లో ఉండను. చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి అనే ఆలోచనే తప్ప వేరే ఆలోచన లేనివాడిని. ఈ వెంట వెంట ఫోన్‌కాల్స్‌తో ఎవరై ఉంటారు అనే కొత్త ఆలోచనలో మునిగిపోయాను. తర్వాత రెండు రోజుల వరకూ ఫోన్ రాలేదు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుందామనుకున్న సమయంలో మళ్లీ ఓ రాత్రి ఫోన్ వచ్చింది. ఇక నావల్ల కాలేదు. రూమ్మేట్స్‌తో చెప్పాను. అరే.. ఎవరో అమ్మాయి నిన్ను కావాలనే ఆట పట్టిస్తుందిరా. ఊళ్లోగానీ, నీ క్లాస్‌మేట్స్‌గానీ ఎవరైనా ఉన్నారేమో చెక్ చేస్కో. తెలిసినోళ్లయితేనే అలా చేస్తారు అన్నారు. చెక్ చేసుకున్నాను. ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు తర్వాత ఎంఎల్టీ కోర్స్ వరకు అందర్నీ జల్లెడ పట్టాను. కానీ ఎవరూ నాతో అంత క్లోజ్‌గా ఉన్నవాళ్లు లేరు. ప్రశాంతంగా ఉన్న నా మనసు పరేషాన్ కావడం మొదలయ్యింది. ఫ్రెండ్స్ నా పరిస్థితి చూడలేకపోతున్నారు. ఇంటికి కూడా ఫోన్ చేయడం తగ్గించాను. వారంలో మూడు నాలుగు సార్లు ఆ అమ్మాయి ఫోన్స్ వస్తుండేవి. ఆశగా ఏమైనా మాట్లాడుదామనుకునే సరికి పెట్టేసేది. ఛల్ ఇదేం లొల్లిరా బాబూ. తిండి తినబుద్ది కావడం లేదు. నిద్ర పోబుద్ది కావడం లేదు అని లోలోపల ఎన్నోసార్లు అనుకున్నా. ఈ విషయంలో తాడోపేడో తేల్చుకోవాల్సిందే అని డిసైడ్ అయ్యాను.
love-story

ఆ రోజు రాత్రి నిద్ర పోలేదు. ఎలాగైనా ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది. వెంటనే ఫోన్ లేపి ఆ అమ్మాయికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తిట్టాలి అని డిసైడ్ అయ్యాను. అనుకున్నట్లుగానే ఫోన్ మోగింది. రెండో రింగుకే లేపాను. తిట్టిన తిట్టు మల్లా తిట్టకుండా పొట్టు పొట్టు తిట్టేశాను. దెబ్బకు ఫోన్ పెట్టేసింది. ఇక అయిపోయింది. మల్లా నాకు ఫోన్ చేయదు అనుకొని నిమ్మలంగా ఉన్న. మూడు రోజులు అయిపోయాయి. నాలో ఏదో అలజడి మొదలైంది. నాకు ఫోన్ చేసే అమ్మాయి ఎవరు? అనే ఆలోచన నన్ను సతమతం చేసింది. ఫోన్ చేసినందుకు తిట్టి బెదిరించిన నేనే మల్లా ఆ అమ్మాయి గురించి ఆలోచించసాగాను. ఆ అమ్మాయి గొంతులో ఏదో మహిమ కనిపించింది. హలో అనగానే ఆమె నవ్విన నవ్వులే నా మదిలో ఊయలలూగుతున్నాయి. నాలుగు రోజులైంది. మరుసటి రోజు సేమ్ టైమ్‌కు ఆ అమ్మాయి నుంచి ఫోన్ రానే వచ్చింది. హలో అనగానే అవతలి నుంచి ఎలాంటి చప్పుడు లేదు. నేనే కలుగజేసుకొని హలో చెప్పూ అంటూ ఏదో తెలిసిన వ్యక్తిలా మాట్లాడాను. అసలు ఎవరు నువ్వు? నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? అని అడిగాను. టైం పాస్ కోసం నువ్వు ఫోన్ చేస్తున్నావు సరే. కానీ నా స్థానంలో వేరేవాళ్లు ఉంటే నీకు సమస్య అవుతుంది తెలుసా? ఎందుకు సమస్యను కొని తెచ్చుకోవడం? దీనివల్ల నువ్వు ఇబ్బంది పడటమే కాదు. మాక్కూడా ప్రాబ్లమే. వేరే ఏదైనా జరగరానిది జరిగితే పేరెంట్స్‌కూ ప్రాబ్లమే. ఇవన్నీ అవసరమా చెప్పు? అని గట్టిగా వారించాను. తన పేరు బుజ్జీ అని ఈసీఐఎల్‌లో ఉంటామని చెప్పింది. ఇంట్లో ఎవరి పనిమీద వాళ్లు బిజీగా ఉంటారు. అక్క, నేను ఇద్దరమే ఖాళీగా ఉంటాం. రోజూ కాలేజీకి వెళ్లడం, ఇంటికి రావడం, తినడం, చదువుకోవడం, టీవీ చూడటం ఇవే మా పనులు. దీంతో బోర్ కొడుతుంది. మా ఫ్రెండ్స్ కొందరు బోర్ కొట్టినప్పుడల్లా ఇలా రాంగ్ నంబర్స్‌కు ఫోన్‌చేసి ఆటపట్టించి రిలాక్స్ అవుతుంటారు. మేం కూడా అలాగే చేద్దామని ఏదో ఒకటి నెంబర్ కొట్టగా మీకు కలిసింది. అంతకంటే ముందు ఎంతోమందిని ఆటపట్టించాం. కానీ ఎవరూ మీలాగా మాట్లాడలేదు. అందుకే మీరు తిట్టినా మళ్లీ ఫోన్ చేశాను. మీరు నాకు నచ్చారు అంటూ ఆపకుండా చెప్పింది.

అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా? అనిపించింది. కానీ ఆ అమ్మాయి మీద ఏమాత్రం కోపం రాలేదు. పైగా ఇష్టం పెరిగింది. క్రమంగా అది ప్రేమగా మారింది. బుజ్జీకి కూడా నాపై ప్రేమ చిగురించింది. అలా నాలుగేళ్లు ఒకరిని ఒకరం చూసుకోకుండా, కలుసుకోకుండా ప్రేమించుకున్నాం. ఇద్దరం ఒకరి విషయాలు ఒకరం పంచుకున్నాం. ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నాం. బుజ్జీతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేని పరిస్థితి నాకు, నాతో మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి ఆమెకు ఏర్పడింది. అందుకే ఆమె మొబైల్ తీసుకుంది. ఈలోగా బుజ్జీది ఇంజినీరింగ్ అయిపోయింది. నాది డిగ్రీ అయిపోయి ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేరాను. బుజ్జీవాళ్ల అక్కకు మా ప్రేమ విషయం తెలుసు. జాగ్రత్తగా ఉండమని తనతో చెప్తూ ఉండేదట. ఇన్నేళ్ల మా ప్రేమలో బుజ్జీ ఒకరోజు ఎటైనా బయటకు వెళ్దాం అని కోరింది. నేను సరే అన్నాను. కానీ ఏదో భయం, ఇంకేదో ఆందోళన నన్ను వెంటాడింది. అమ్మాయిలతో అంతంత మాత్రంగా మాట్లాడే నాకు బుజ్జీతో పరిచయం ఏర్పడటం, ప్రేమలో పడటం, ఇప్పుడు షికారుకు వెళ్లడం తలుచుకుంటే ఆశ్చర్యంగా అనిపించింది. మా ఊరు నల్గొండ. కాబట్టి అమ్మాయిని తీసుకొని తిరగడం చూసే అవకాశం తెలిసినవాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో లేదు.. అని ధైర్యం చేశాను. కానీ ఎలా వెళ్లేది? నాకు బైక్ లేదు. బస్సులో ప్రైవసీ సమస్య. అందుకే మా ఆఫీస్‌లో పనిచేసే సీనియర్‌ను అడిగాను. ప్రేమ విషయం మొత్తం అతనితో షేర్ చేసుకున్నాను. తర్వాతి రోజు. నేను వచ్చేసరికే అమ్మాయి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో వెయిట్ చేస్తూ ఉన్నది. ఆమె గొంతు మాత్రమే తెలుసు. కానీ ఆ గొంతు ద్వారా బుజ్జీ ఎలా ఉంటుందో నాకంటూ ఓ ఇమాజినేషన్ ఉన్నది. నేను డైరెక్ట్‌గా ఆమె దగ్గరికే వెళ్లాను.
హాయ్ బుజ్జీ అన్నాను. తను నన్నూ గుర్తుపట్టేసింది. బైక్‌పై తీసుకొని సాయంత్రం వరకు సిటీమొత్తం చుట్టేశా. చార్మినార్, ట్యాంక్‌బండ్, బిర్లా మందిర్‌లను సందర్శించాం. అంతా బాగానే జరిగింది కానీ పురానాపూల్ బ్రిడ్జి మీదకు రాగానే బైక్ స్కిడ్ అయింది. ఇద్దరం కింద పడ్డాం. పెద్దగా దెబ్బలేవీ తగల్లేదు. కానీ ఇద్దరం కలుసుకున్న మొదటిరోజే ఇలా కావడంతో కొంత డిసప్పాయింట్ అయ్యాం. ఒక మంచి పాయింట్ చూసుకొని లంచ్ చేస్తూ, ఐస్‌క్రీమ్ తింటూ డీప్‌గా మాట్లాడుకున్నాం.

నాలుగేళ్లకు పైగా ప్రేమించుకున్నాం. పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంట్లో వాళ్లను ఒప్పించి చేసుకుందామా? లేక ఇంట్లో నుంచి వెళ్లిపోయి చేసుకుందామా? అనే దగ్గర ఆగిపోయాం. కాస్త సమయం తీసుకొని ఓ నిర్ణయానికి వద్దామని తిరుగు ప్రయాణమై ఇంటికెళ్లాం. మరుసటి రోజు లేవకముందే బుజ్జి ఫోన్ చేసింది. అక్కతో డిస్కస్ చేశాను. ఎలాగైనా పేరెంట్స్‌కు విషయం చెప్పాలని సలహా అడిగాను. ఓకే అన్నది. కానీ అంచనాలు తారుమారు అయ్యాయి. ప్రేమ గురించి, పెండ్లి గురించి చెప్పగానే అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఇక ఇంట్లో ఒప్పించి పెండ్లి చేసుకోవడమైతే కాని పని. బయటకు వెళ్లడమే మన దగ్గర ఉన్న ఆప్షన్ అని చెప్పింది. ఆమె ఆలోచన విధానం, ముందుచూపు, ధైర్యం నాకు నచ్చాయి. నేను కూడా అంత మెచ్యూర్డ్‌గా ఆలోచించలేనేమో అనిపించింది. ఇప్పుడేగా తెలిసింది. ఇంకొంత కాలం వేచి చూద్దాం. తొందర పడితే పని కాదు అని సర్ది చెప్పాను. నేనూ మా ఇంట్లో లవ్ మ్యాటర్ చెప్పాను. పెండ్లంటూ చేసుకుంటే బుజ్జీనే చేసుకుంటానని చెప్పడంతో ఇంట్లోవాళ్లు నామీద గుర్రుగా ఉన్నారు. మా నాన్న నువ్వు ప్రేమ పెండ్లి చేసుకుంటే నా చావు చూస్తావ్ అని బెదిరించాడు. ఇటు ప్రేమించిన అమ్మాయి వైపు ఆలోచించాలా? పేరెంట్స్ గురించి ఆలోచించాలా? అర్థంకాని ఆందోళన పరిస్థితి నాది. అలా మూడేళ్లు గడిచాయి. అంటే మా ప్రేమకు ఏడేళ్లు. వాస్తవానికి బుజ్జివాళ్లది ధనిక కుటుంబం. బుజ్జి ఏం చేసిందో ఏమోగానీ వాళ్లను ఒక మెట్టు దిగేలా చేసింది. నిన్ను అర్థం చేసుకున్నాం బుజ్జీ. అయితే అబ్బాయి నెలకు కనీసం ఓ ముప్పై నలభై వేల రూపాయలు అయినా సంపాదిస్తే బాగుంటుంది కదా? మరీ పదివేల రూపాయల జీతంతో నిన్ను ఏం పోషిస్తాడు? కుటుంబాన్ని ఏం నడిపిస్తాడు? అన్నారట పేరెంట్స్. బుజ్జీ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాబట్టి తనకు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. నేను ఎలాగైనా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి వాళ్ల పేరెంట్స్‌ను ఒప్పిస్తాననే ధీమాతో ఉన్నాను. ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో చదవడం ప్రారంభించాను. కానీ ఇంతలోనే ఇంట్లో నుంచి నాకు పెండ్లి గురించి ఒత్తిడి ప్రారంభమైంది.

ఒక మంచి సంబంధం వచ్చింది, చేసుకోవాలని ఆదేశాలు జారీచేశారు పేరెంట్స్. బాగా డిస్టర్బ్ అయ్యాను. ప్రిపరేషన్ కూడా దెబ్బతిన్నది. మరోవైపు బుజ్జి ప్రభుత్వ ఉద్యోగం కావాలని కండిషన్ పెట్టడంతో నిరాశకు గురయ్యాను. అన్నీ కోల్పోతున్నాననే బాధ వేధించింది. తనకు కూడా వేరే పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. లేచిపోదామనే ఆలోచన చేశాం. కానీ భవిష్యత్‌పై ఇద్దరికీ ఓ అంచనా ఉండటం.. పరిస్థితులు ఎలా ఉండబోతాయన్న విషయంలో స్పష్టత ఉండటం మమ్మల్ని ఎటూ వెళ్లనీయలేదు. కలిసి ఉండి కష్టాలను ఎదుర్కోవడం కాకుండా విడిపోయి ఆనందంగా ఉందామని నిర్ణయించుకున్నాం. ఆ రోజు ఆఖరి రోజు కలుసుకోవడం. చాలాసేపు మాట్లాడుకున్నాం. ఒక దశలో ఏడ్చేశాం కూడా. అనుకోకుండా కలిసి ఇలా విడిపోతున్నందుకు చాలా బాధ కలిగింది. విడిపోయినా కూడా ఫ్రెండ్స్‌లా కలిసి ఉండాలని ఆ రోజే నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత నా పెండ్లయింది. ఆర్నెళ్లకు బుజ్జి పెండ్లి అయింది. ఆమె భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఇప్పుడు బుజ్జీ కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటున్నది. ఇద్దరు బాబులు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఒక ఫ్రెండ్‌లా మాట్లాడుతుంది. యోగక్షేమాలు తెలుసుకుంటూనే ఉన్నాం. మా పవిత్రప్రేమకు ఇలాంటి మదిలోని అనుభవాలే సాక్ష్యం. బుజ్జీ.. మనసులు కలిసినా.. భార్యాభర్తలు కాలేకపోయాం. వచ్చే జన్మలోనైనా మనకు ఆ భాగ్యం కలగాలని ఆశిస్తూ.. నీ స్నేహితుడు

2046
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles