జాబాల సత్యకాముడు


Sun,May 13, 2018 12:45 AM

పుట్టుకతో వచ్చిన గుణం పుడకలదాకా అంటారు. మనిషి జాతి, మత, కుల, వర్గ, వ్యవస్థలనే విభేదాలతో వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోలేడు. అలాగే వంశం ద్వారా వచ్చే పేరుతోనూ గుర్తింపు పొందలేడు. భారతదేశం ఎందరో మహాత్ములు జన్మించిన పుణ్యభూమి. మరి అంతటి మహానుభావులంతా భారతదేశంలో ఎలా జన్మించగలిగారంటే, మన భారతావని మహాన్నతమైనది కాబట్టి. మనిషి మనిషిగా పుట్టినందుకు గానీ, మానవజాతిని ఆపాదించుకున్నందుకు గానీ గొప్పవాడైపోతాడంటే అవ్వచ్చు. కాకపోతే సరైన గుణం కూడా మనిషికి కావాలి. మానవజాతిని గుణంతో మాత్రమే భువిపై శాశ్వతంగా ప్రతిష్ఠించగలం. వేదకాలం అందుకు సరైన ఉదాహరణలిస్తూ ఎందరో గొప్పవారిని చారిత్రాత్మకంగా మనజాతి గర్వించేలా పరిచయం చేసింది. మనిషికి మంచి గుణం ఉంటే ఎంతటి గొప్పకార్యాలనైనా సాధించగలడని నిరూపిస్తూ జాబాల సత్యకాముడు ఆదర్శానికి అగ్రస్థానంలో నిలిచాడు.

-ప్రమద్వర

సత్యకాముడు మామూలు నిరుపేద కుటుంబానికి చెందినవాడు. వాస్తవంగా అతనికి కుటుంబం అనేదే లేదు. కేవలం తల్లి తప్ప. ఆమె పేరు జాబాల. చిన్నతనం నుంచీ మంచి గుణాలనే అలవర్చుకొని బుద్ధివంతునిగా పెరిగాడు సత్యకాముడు.అమ్మమాటే అతనికి వేదవాక్కు. ఆమె అంటే సత్యకామునికి అమితమైన గౌరవం. ఆమెను ఎన్నడూ ఎదురు ప్రశ్నించిన సందర్భమే సత్యకామునికి రాలేదు. కానీ యుక్త వయసుకు వచ్చాక తనతోటి వారంతా గురుకులాలకు వెళ్ళి చదువుకుంటున్నారనీ, తాను నిరక్ష్యరాస్యుడిలా బతకడం మంచిది కాదనీ, కానీ గురుకులంలో చేరడానికి మంచి వంశం, కులగోత్రాలు... వగైరా వగైరా అవసరం అవుతాయనీ, వాటి గురించసలు తనకేమాత్రం తల్లి ఇంతకాలం చెప్పలేదనీ అనుకొని సత్యకాముడు జాబాలను మొదటిసారి ఇలా ప్రశ్నిస్తాడు. అమ్మా! నా గోత్రం ఏంటి? నా తండ్రి ఎవరు? నా కులం ఏంటి? అని.జాబాల బుద్ధిమంతుడైన సత్యకాముని నుంచి ఎప్పటికైనా ఈ ప్రశ్న వస్తుందని ఊహించింది. కానీ అడిగిన వెంటనే నిజం చెప్పడానికి సిద్ధంగా ఉంది. జాబాల సత్యకామునితో తను చాలా ఇళ్ళలో పరిచారికలా పని చేస్తున్నప్పుడు నా కడుపులో నిన్ను ధరించాను. నాకున్న పరిధుల మేరకు నీ తండ్రి పేరునూ, గోత్రాన్నీ అడుగలేదు. కనుక నాకు తెలియదని అంటుంది. కానీ ఒక్కటి మాత్రం చెబుతాను. నా పేరు జాబాలా, నీ పేరు సత్యకాముడు. నీ అస్తిత్వం అడిగిన గురువులకు నువు చెప్పాలిందిదేనని అంటుంది. సత్యకాముడు జాబాల మాటలకు విలువనిచ్చి, అమ్మ ఆశీస్సులు తీసుకొని గురుకులానికి వెళ్ళాడు. గురుకులం చేరిన సత్యకాముని వయసు కేవలం పదేళ్ళు. కానీ, అతనిలో పరిణతి పొందిన గాంభీర్యం ప్రస్ఫుటంగా కనిపించేది. గురువుతో సత్యకాముడు నేను మీ దగ్గర శిష్యరికం చేద్దామనుకుంటున్నానని సూటిగా చెబుతాడు. తనను శిష్యునిగా అంగీకరించి విద్యాబుద్ధులు నేర్పమంటాడు. సత్యకామునిలోని జిజ్ఞాస, వినయ విధేయతలు గురువైన గౌతముణ్ని ఆకర్షించాయి. ఆనాటి గురుకుల పద్ధతులననుసరించి సత్యకాముని గురువు గౌతముడు నీ తండ్రెవరు? నీ గోత్రం ఏంటి? అని ప్రశ్నిస్తాడు. సత్యకాముడు తడుముకోకుండా తన తల్లి చెప్పిన విషయాన్ని గురువుకు చెబుతాడు. నా తల్లి పేరు జాబాల. నేను సత్యకామున్ని. ఇదే నా అస్తిత్వం అంటాడు. అక్కడున్న వారంతా కులగోత్రాలు లేనివాడని హేళన చేస్తారు. అతణ్ని గురుకులంలో చేర్చుకుంటే మేము ఉండబోమనీ విమర్శిస్తారు. గౌరవాన్ని కల్పించుకోవడానికి లేనిపోనివి చెప్పక నిజాన్ని నిర్భయంగా చెప్పిన సత్యకామున్ని గుణాలను బట్టే జాతిగానీ, పుట్టుకను బట్టి కాదని గౌతముడు శిష్యునిగా అంగీకరిస్తాడు.
Satyakama

గురుకులంలో చేరిన సత్యకాముని చదువు విచిత్రంగా కొనసాగింది. ఆ ప్రయాణం సత్యకామునిలోని విశ్వాసానికి ప్రతీకలా నిలిచింది. సత్యకాముని పిలిచి గురువు గౌతముడు నీకొక పనిని అప్పగిస్తాను. దానిని సఫలం చేయడమే నీ కర్తవ్యం అంటాడు. ఆశ్రమంలోని నాలుగు వందల ఆవులను సత్యకామునికి అప్పగించి, వాటిని దగ్గర్లోని అడవికి తీసుకెళ్ళి ఆలనా పాలనా చూసుకొని అవి వెయ్యి పశువులుగా అయినప్పడు వాటిని తోలుకొని ఆశ్రమానికి వస్తే అప్పుడు విద్యనేర్పిస్తానంటాడు గౌతముడు.
సత్యకాముడు చిరునవ్వుతో గురువు ఆజ్ఞే నా జీవన ధ్యేయం. కనుక గురువు ఆశీస్సులు పొంది ఈ ఆవులు వేయి కాకుండా తిరిగిరానని ప్రతిజ్ఞ చేసి మరీ అరణ్యానికి ఆలమందను తోడ్కొని వెళతాడు. అడవికి వెళ్ళి తనుండడానికి కుటీరం ఏర్పాటు చేసుకొని రాత్రింబవళ్ళు గోసేవ చేస్తూనే ఉంటాడు సత్యకాముడు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోతాయి. నాలుగు వందల గోవులు కాస్తా వేయికి పైగా అవుతాయి. కాని సత్యకామునికి లెక్కలతో పనిలేదు. తన కర్తవ్యమే తనకు ముఖ్యం. కానీ ఒకనాడు ఆలమంద వేయి సంఖ్యను దాటిందని తెలుసుకొని గురుకులానికి తిరుగు ప్రయాణం అవుతుంటే వృషభం, అగ్ని, హంస, నీటికోడి రూపంలో మానవేతరులు వచ్చి సకల విద్యా విశేషాలనూ బోధిస్తారు. గురువును చేరిన సత్యకాముని ముఖంలో పరిపూర్ణ జ్ఞానం, వేయికిపైగా పెరిగిన ఆలమందను చూసిన గౌతముడు లోకంలో ఇంక నీకు తెలియాల్సిన విద్యలేమీ లేవు. నాకు తెలిసిందల్లా నీకు తెలుసు. ఇంక సంపూర్ణ వివేచన గల విద్యావేత్తగా నీ జీవితం కొనసాగించమని అంటాడు.

866
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles