జాంబవంతుడు


Sun,June 10, 2018 09:31 AM

బతుకుతున్నంత కాలం బతకాలి. కానీ బతకడమంటే బతికి ఉండటం మాత్రమే కాదు. బతుకుకు అర్థం చేకూర్చుకోవాలి. బతుకిచ్చే ధైర్యం గుణం, వివేకం తనకూ, తనవారికీ, తన అనుభవం రూపంలో ప్రపంచానికీ ఉపయోగపడాలి. అటువంటి బతుకు చిత్రాలెన్నో చరిత్రలో అందంగా, ఆదర్శంగా శాశ్వతీకరించబడినాయి. తరతరాలుగా జీవకళ ఉట్టిపడగా దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాయి. బతుకులోని మాధుర్యాన్నీ, గాంభీర్యాన్నీ అర్థం చేసుకొని అన్వయించుకొని బతకడంలోనే విచక్షణ ఉంది. బతుకు ఎప్పుడూ స్వీయచింతనలో కుంచించుకుపోకుండా విశ్వజనీనమై విలసిల్లాలని తెలియజెప్పిన మహావీరుడూ, గుణచరితుడూ జాంబవంతుడు. తాను చేసుకున్న పుణ్యం కొద్దీ తనలోని శక్తికొలదీ తన మంచితనం, నిరాడంబరత, నిశ్చయబుద్ధి కొలదీ కృత, త్రేతా, ద్వాపర యుగాలలోనూ జీవించిన జాంబవంతుడు తన బతుకుద్వారా బతుకు విలువను నేర్పాడు.

-ఇట్టేడు అర్కనందనా దేవి

భల్లూకరాజైన జాంబవంతుడు మంచి మనసున్నవాడు. అపారమైన తెలివిగలవాడు. అత్యంత బలవంతుడు. ధూముడనే వాడు ఈతని సోదరుడు. జాంబవంతుడు భూమి, ఆకాశాలను చాలాసార్లు చుట్టివచ్చాడు. అమృతం కోసం దేవదానవులు చేసిన యుద్ధం, అమృతం సాధన కళ్ళారా చూసినవాడు జాంబవంతుడు. దేవతలనడిగి కొంచెం అమృతం తాగినందువల్లనే మూడు యుగాలపాటు జీవించగలిగాడు. చాలాకాలం జీవించిన అతివృద్ధుల్లో ముఖ్యుడు జాంబవంతుడు. బలవంటి వారు యజ్ఞాలు చేసి అందులోని ఓషధులు, హవిస్సులు ఇతని చేతికిచ్చేవారట. వాటిని జాంబవంతుడు తీసుకెళ్ళి నేరుగా దేవతలకు అందించేవాడట. ఒక్క పర్వతం మీది నుంచి మరో పర్వతం మీదకు ఒక్క అడుగుతో చేరగల పర్వతాకారుడు జాంబవంతుడు. అంతటి శక్తి ఉన్నా చాలా వినయంతో నెమ్మదస్తుడై ఆలోచనాపరుడై జీవించాడు.కృతయుగంలో ఋషులకు తగిన సహాయసహకారాలు అందించిన జాంబవంతుడు వారివారి జీవన ఒరవడినీ చూసాడు. త్రేతాయుగంలో రామకార్యం కోసం అహర్నిశలూ శ్రమించి హనుమంతుడంతటి వానికి మార్గనిర్దేశనం చేశాడు. ద్వాపరయుగంలో కృష్ణునితో యుద్ధం చేసి, చివరకు శమంతకమణి గురించీ, కృష్ణుని గురించీ తెలుసుకొని తన కూతురు జాంబవతిని కృష్ణునికిచ్చి వివాహం చేసి అంతటివాడిని అల్లుడిగా చేసుకున్నాడు.జాంబవంతుని బుద్ధి కుశలత, సమయస్ఫూర్తి చాలా గొప్పవి. సీతజాడ తెలియక వానరులంతా మరణమే శరణమని ఆలోచిస్తున్న తరుణంలో వెలుగు చుక్కలా కనిపించిన సంపాతితో జాంబవంతుడు సీతజాడను తెలియజేసి మమ్ములందరికీ జీవితాన్ని ప్రసాదించు.
Jambhavantha

మా అందరికీ మిగిలిన ఏకైక ఆశ నీవేనని అంటాడు. అంగదుడు రావణుని లంకకు వెళ్ళి సీతజాడను నిశ్చయంగా తెలుసుకొని రాగలవాడెవరూ లేరా! అని అడుగుతుంటే నూరు యోజనాల దూరం ఉన్న సముద్రాన్ని దాటగల సామర్థ్యం నాది. కానీ వృద్ధాప్యం కారణంగా నేను కేవలం తొంభై యోజనాల వరకే వెళ్ళగలను. కానీ, తిరిగి రాలేను. అంగదుడా నీవే వెళ్ళగలవు. అయితే ఒక్కమాట. రాజు చెప్పి చేయించుకోవాలి. నీవు శాసించాలి కానీ అమలు చేయకూడదు. ఎందుకంటే, రాజంటే భార్యతో సమానం. ఆమెను సదా రక్షించుకున్నట్లే రాజునూ రక్షించుకోవాల్సిన బాధ్యత మా అందరిదని చెప్పిన జాంబవంతుని మాటలు అన్ని కాలాల్లోనూ ఆమోదయోగ్యాలు.. హనుమ శక్తిని పరిపరి విధాలుగా తెలియపరిచి హనుమంతుడితో ఇలా అంటాడు జాంబవంతుడు, హనుమా! అమృతం కోసం దేవదానవులు పాల సముద్రం చిలుకుతున్నంతసేపూ భూమిపై నున్న ఔషధులన్నీ తెచ్చుకుంటూ అందులో వేసినవన్ని, విష్ణువు త్రివిక్రమావతారం చుట్టూ ఇరవైసార్లు ప్రదక్షిణ చేసినవాణ్ని. కానీ ఇప్పుడు నాలో అంతశక్తి లేదు. నాకన్న వెయ్యింతల శక్తి కలవాడివి. పైగా రాముడు నీకే ఉంగరాన్ని ఇచ్చాడంటే రాఘవుని చిత్తం నెరవేర్చే బంటువు నీవే. విజృంభించు, నీ పరాక్రమాన్ని చూపు. లోక కళ్యాణం కోసం శ్రీకారం చుట్టమని ప్రోత్సహిస్తాడు. ప్రతీ ఒక్కరిలోనూ ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రోత్సహించగలిగితే అది అద్భుతాలు చేస్తుందనే విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాడు జాంబవంతుడు. ఎన్నో బతుకుల కోణాల్ని విభిన్నంగా కాలాల దొంతరలో చూసిన అనుభవజ్ఞుడుగా సమయానుకూలంగా స్పందించి తగిన సరైన సలహాలనిచ్చే పెద్దమనిషిగా తన జీవితమంతా మంచికోసం ధారపోసిన మహోన్నతుడిగా చరిత్రే గొప్పగా చెప్పుకోదగిన శ్రేష్ఠుడు జాంబవంతుడు.

1077
Tags

More News

VIRAL NEWS