జగమంత కుటుంబం.. ఏకాకి జీవితం!


Sun,September 10, 2017 01:28 AM

కాసేపు ఒంటరిగా ఉంటే ప్రశాంతత దొరకొచ్చు. అది మనిషికి సంబంధించింది. కానీ ఒంటరితనం మనసుకు సంబంధించింది. ఒంటరిగా ఉండడానికి.. ఒంటరితనం అనుభవించడానికి తేడా ఉందంటున్నారు మానసిక నిపుణులు. సర్వరోగాలకు, సకల అనర్థాలకూ ఆ ఒంటరితనమే కారణమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆధునిక మనిషన్నవాడు డిజిటల్ ప్రపంచంలో ఇరుక్కుపోయి.. అన్ని తలుపులూ మూసేసుకున్నాడు.. సామూహిక ఏకాంతాన్ని అనుభవిస్తున్నాడు.. షేర్ చేయడానికి ఎందరో ఉన్నా.. భావాలను పంచుకోవడానికి మాత్రం ఎవరూ లేకుండా పోతున్నారు.. జగమంత కుటుంబం ఉన్నా
ఏకాకి జీవితాన్ని అనుభవిస్తున్నాడు.నెట్టుకొస్తున్న ఆ ఒంటరితనాన్ని ఎలా అధిగమించాలి?ఆ శాపం నుంచి విముక్తి పొందేందుకు ఏ తలుపులు తెరువాలి?ఆ విషయాలు, వివరాల గురించి ఈ వారం ముఖచిత్ర కథనం.


ఇక్కడ ముగ్గురి వయసులూ వేర్వేరు. జెండర్‌లు కూడా వేరు. కానీ సమస్య మాత్రం ఒక్కటే. అదే ఒంటరితనం. ఒక్కొక్కరిని ఒక్కోలా అది వేధించింది, వేధిస్తూనే ఉంది. కేవలం వీరు ముగ్గురు ఒక ఉదాహరణ మాత్రమే. ప్రపంచంలోని కొన్ని లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారంటే అతిశయోక్తి కాదు! లెక్కలు తీస్తే మరణం చివరి అంచుల్లో కొన్ని వేలమంది ఉంటారని కూడా అంచనా. అంతలా ఒంటరితనం అనే ఈ స్లో పాయిజన్ మనిషిని నిలువునా చీల్చేస్తున్నది. ఒంటరితనం అనేది ఎందుకు వస్తుంది? నలుగురిలో ఉన్నా ఒంటరిగా ఉన్నామన్న భావన ఎందుకు కలుగుతుంది? దీనికి అనేక కారణాలున్నాయని శాస్త్రవేత్తలు ఒక పెద్ద జాబితానే విడుదల చేశారు. అందులో కొన్ని మచ్చుకు మీకు చెప్పాలనుకుంటున్నాం. చిన్నప్పుడే ఎదురుదెబ్బలు తగులడం. అంటే.. తల్లిదండ్రుల నుంచి ఆదరణ కరువవడం, పెంచుకున్న వాళ్లు దరిచేరనీయకపోవడం, తోబట్టువుల కంటే తక్కువ చేసి చూడడం, ఎదుటివారితో పోల్చడం వల్ల ఒంటరితనంలోకి నెట్టివేయబడతారు పిల్లలు.
Lonley

ఇక టీనేజ్ వయసు వచ్చేసరికి చదువులు, ఉద్యోగరీత్యా ఉన్న ఊరినీ, కన్న తల్లిదండ్రులనీ వదిలి వెళుతుంటారు. దానివల్ల మనసుపై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. ప్రేమలో వైఫల్యం, విచ్ఛిన్నమైన వివాహ బంధం, ఆప్త మిత్రుల మరణం ఇలాంటివి కొందరిని డిప్రెషన్‌కి గురిచేస్తాయి. ఆఫీసులో కానీ, బయట కానీ పనులతో సతమతమవుతూ ఉంటాం. ట్రాఫిక్ సమస్యలు ఇంటికి చేరేందుకు ఆలస్యమయ్యేలా చేస్తున్నాయి. దాంతో అలసిపోతాం. ఇంటికి వచ్చాక కూడా ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లకే సమయాన్ని పరిమితం చేస్తున్నాం. దాంతో ఇంట్లో వాళ్లతోనే మాట్లాడడం దేవుడెరుగు. ఇక ఇంటి చుట్టుపక్కల వాళ్లతో ఎలా కమ్యునికేట్ చేస్తాం. ఈ కారణాలు చాలా మనం ఎంత ఒంటరితనంలో ఉన్నామో తెలియడానికి. కొంతకాలానికి నిజజీవితంలోనే కాదు డిజిటల్ ప్రపంచంలోనే ఫ్రెండ్స్‌ని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇక మలి వయసు వచ్చేసరికి చేయడానికి పనులుండక, పిల్లల విసుగులు తమకు ఎవరూ లేరన్న భావనను కలిగిస్తాయి.

ప్రొఫెషనల్స్‌లో ఎక్కువ

ఒంటరిగా ఉండడం వేరు, ఒంటరితనం అనుభవించడం వేరు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగి ఇప్పుడు మనుషుల మధ్య దూరం తగ్గిపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడెక్కడి వారినో ఈ డిజిటల్ వేదిక కలిపేస్తున్నది. కానీ మనుషుల్ని, మనసుల్ని మాత్రం దూరం చేస్తూ వారిని మరింత ఒంటరివాళ్లను కూడా చేస్తున్నది. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లలో.. ఫ్రెండ్స్, ఫాలోయర్స్ పెరుగుతున్న కొద్దీ మనలో ఒంటరితనం మరింత పెరుగుతున్నట్టేనని గమనించండి. ఆ ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే ఏం లాభం? అనిపిస్తుంటుంది చాలాసార్లు. మన దేశంలో వర్కింగ్ ప్రొఫెషన్స్‌లో దాదాపు 66 శాతం ఒంటరితనంతో బాధ పడుతున్నారని ఒక సర్వే ద్వారా తేలింది. నూటికి 77 శాతం మంది తమ జయాపజయాల్ని పంచుకోవడానికి తగిన వారికోసం వెతుక్కోవడంలోనే సమయాన్ని వెచ్చిస్తున్నారట. అన్నిటికంటే ముఖ్యంగా టెక్నాలజీ మీద అతిగా ఆధారపడడం వల్ల నూటికి 57 శాతం మంది భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నారని ఆ అధ్యయనంలో తేలింది. అన్నీ ఉన్నా.. అందరూ ఉన్నా.. అదే సమస్య ఇంతమందిని వేధిస్తున్నదంటే లోపం ఎక్కడుంది?

మెషీన్ వెంట పరుగు

మన జీవితాల్లో సోషల్ మీడియా ఓ అంతర్భాగమైపోయింది. పైగా మన ఆనందానికి, హోదాని దాన్ని వేదిక చేసుకుంటున్నాం. ఇతరుల తాలూకు ఫొటోలు చూసి విచ్చలవిడి తనాన్ని కోరుకుంటున్నాం. ఇలా ప్రతిదానికీ పోల్చుకుంటూ.. ఈర్ష్య, అసూయ, అభద్రత, ఆత్మన్యూనతలోకి జారిపోతున్నాం. వాటిలో మునిగిపోయి మనుషులతో మాటామంతి తగ్గిపోయింది. అది ఒంటరితనానికి, డిప్రెషన్‌కి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాపై వెచ్చించే సమయం, శక్తి ఆధారంగా మనిషి మానసిక స్థితి ఆధారపడి ఉంటుందని ఢిల్లీలోని ఫోర్టిస్ హెల్త్‌కేర్ నిపుణులు కూడా వెల్లడించారు. సోషల్ మీడియాలో మాట్లాడుకోవడమనేది కృత్రిమం. నిజంగా మనుషులతో కూర్చొని, వాళ్లతో చేసే స్నేహానికి దానికీ చాలా వ్యత్యాసం ఉంది. మనుషుల్లోని ఆత్మీయతకు దూరమై, మెషీన్‌లో ఆత్మీయతను వెతుక్కోబట్టే ఇప్పుడీ ఒంటరితనం దాపురిస్తుందని సైకియాట్రిస్ట్‌లు కూడా చెబుతున్నారు.

కేస్ 1

భాస్కర్ (పేరు మార్చాం) ఒక ప్రభుత్వ ఉద్యోగి. చాలా చురుకైన వాడు. ఐదు పదుల వయసులోనూ పనులన్నీ చకచకా చేసుకునేవాడు. ఆయనకు ఏదైనా ఫైల్ అప్పగిస్తే సాయంత్రం వరకు సాల్వ్ అవ్వాల్సిందే! అంత నిక్కచ్చి మనిషి.పిల్లలు మంచి పొజిషన్‌లో సెటిలయ్యారు. పట్నంలో నౌకర్లతో వాళ్లు బిజీబిజీ. ఈ మధ్యే భాస్కర్ రిటైర్ అయ్యారు. ఒక నెల రోజుల పాటు మామూలుగా గడిచిపోయింది. కానీ ఆ తర్వాత నుంచి ఆయనలో చురుకుదనం తగ్గిపోయింది. చీటికిమాటికీ భార్య మీద చిరాకు పడుతున్నాడు. ఒక్కడే గదిలో కూర్చొని ఏవేవో పేపర్లు తిరగేసేవాడు. తినడానికి తప్ప ఆ గదిలో నుంచి బయటకు వచ్చిన పాపాన పోయేవాడు కాదు. నలుగురు వచ్చినా పలుకరించ లేనంతగా మారిపోయాడు..రెండు సంవత్సరాల తర్వాత భార్య చనిపోయింది. ఆ మరణం ఆయనను మరింత కుంగదీసింది. ఇక అప్పటి నుంచి ఆ గదిలోకే అన్నీ వెళుతున్నాయి. మనిషి మాత్రం అమావాస్య, పౌర్ణమికోసారి కనిపిస్తున్నాడు.
old-men

కేస్ 2

ప్రియాంక పదవ తరగతి చదువుతున్నది. చదువుల్లో టాపర్.ఒక అక్క, తమ్ముడు ఉన్నారు. అమ్మానాన్న ఇద్దరు ఉద్యోగస్తులే!పిల్లల్ని బాగా చదివించాలన్న ఆశయంతో వాళ్లిద్దరూ కష్టపడుతున్నారు. దాంతో పిల్లలతో సమయం కేటాయించడానికి వారికి తీరిక లేకుండా పోయింది. ప్రియాంకకు చదువు, లేకపోతే కంప్యూటర్‌లే లోకం అన్నట్టుగా మారిపోయింది కొంతకాలంగా. తల్లిదండ్రులు అక్కని, తమ్ముడినే ప్రేమగా చూసుకుంటున్నారన్నది ఆమె భావన. దాంతో అప్పటిదాకా ప్రేమగా ఉండే అక్క, తమ్ముడితో మాట్లాడడం మానేసింది. ఒక్కతే గదిలో కంప్యూటర్లతో నేస్తం కట్టింది. చాటింగ్‌లు చేస్తూ చదువులో వెనుకబడిపోయింది. దీనికి కారణం ఆమెకు ఎవరూ లేరన్న భావనే ఆమెను అలా కంప్యూటర్‌లకు అతుక్కుపోయేలా చేసింది.
women

కేస్ 3

హేమంత్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. పొద్దున్న వెళితే రాత్రికి కానీ ఇంటికి రాడు. ఏవో టాస్క్‌లని, టీమ్ వర్క్ అని ఎప్పుడూ ఫోన్‌లోనే ఉంటాడు. వీకెండ్స్‌లో నిద్ర, పార్టీలంటూ పబ్బం గడుపుతాడు. ఆ రోజుల్లో ఎవరైనా కలువకపోతే పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు. ఆ విపరీత ధోరణి కారణంగా ఫ్రెండ్స్ కూడా దూరం పెట్టడం ప్రారంభించారు. ఫేస్‌బుక్‌లో వెయ్యి మందికి పైగా ఫ్రెండ్స్ ఉంటారు. తను ఏదైనా పోస్ట్ పెడితే వందల లైకులు, పదుల సంఖ్యలో కామెంట్లు వస్తాయి. కానీ రానురాను ఆ సంఖ్య తగ్గినట్టు గమనించాడు. దాంతో తనలో ఏదో తెలియని నిర్వేదం. తనకు ఎవరూ లేరన్న భావన మొదలైంది. తెలియకుండానే ఒక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. మత్తుమందులకు బానిసయ్యాడు. దీనికి కారణం ఒంటరితనం.
staff-member

జీవితంలో ఈజ్ ఉండాలి..

ఒంటరితనం అన్న దానికి మందు లేదు. మన మనసే దాన్ని నయం చేయగలదు. ఈ ఒంటరితనం అనేది చిన్న వయసులోనే బీజం పడుతుంది. మనం పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లకుండా నాలుగు గోడల మధ్య బంధిస్తే ఏమవుతుంది? వీకెండ్స్ వస్తే సినిమాలు, హోటల్స్‌లో తిప్పడం కాదు. నలుగురిని పరిచయం చేయండి. కొత్త విషయాల పట్ల ఆసక్తి పెంచండి. పెద్దవాళ్లను సైతం ఒంటరిగా అస్సలు వదిలేయొద్దు. వారిని ఏదో ఒక పనిలో బిజీ చేయాలి. అయితే సైకియాట్రిస్ట్ భాషలో ఒంటరితనం పోగొట్టుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది. అదే ఈజ్ (ఇ.ఎ.ఎస్.ఇ). ఇక్కడ ఇ అంటే.. ఎక్స్‌టెండ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎలా ఉండాలో గమనించుకోవాలి. ఇతరులతో ఎక్కువసేపు గడపాలి. ఎ అంటే యాక్షన్ ప్లాన్. మన ఆలోచనలు, మనసులోని భావాలను ఎప్పటికప్పుడు తరచి చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా మన పనులు ఉండాలి. ఎస్.. సెలక్షన్. మనం ఎంచుకొనే పనులు మనల్ని బిజీ చేస్తాయి. అందులో కొత్త స్నేహాలను కూడా చేర్చుకోవాలి. కొత్త వ్యాపకాలు చేసుకోవాలి. కొత్త ఆలోచనలు చేస్తుండాలి. ఇ.. ఎక్స్‌పెక్ట్ ది బెస్ట్. ఏ అనుబంధమూ ఒక్కరోజులో ఏర్పడదు. కాబట్టి అవతలి వాళ్లతో స్నేహం చేయగానే వాళ్లూ చేస్తారని అనుకోకూడదు. మెల్లమెల్లగా ఆ స్నేహం పెరిగేలా చేసే బాధ్యత మనదే అని గుర్తుంచుకోవాలి.
- సుజతా రాజమణి, కన్సల్టెంట్ సెకోథెరపిస్ట్

సైలెంట్ కిల్లర్..

ఒంటరిగా జీవించడం ఎంతో హ్యాపీ అని చాలామంది అనుకుంటారు. కానీ అంతకు మించిన తప్పుడు స్టేట్‌మెంట్ ఇంకోటి ఉండదు. నలుగురితో కలువలేకపోవడమనేది పెద్ద మానసిక సమస్య. న్యూక్లియర్ ఫ్యామిలీల వల్ల కూడా ఈ ఒంటరితనం పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. దానివల్ల పిల్లలకు అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యల తోడు ఉండేది. ఒకప్పుడు చందమామలను చూపించి అన్నం తినిపించేవారు. కానీ ఇప్పుడు ట్యాబ్, ఫోన్లను చూపించాకే తినాలనిపిస్తుంది. దీనివల్ల వాటికి పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. దాంతో ఒంటరితనం అనేది ఆ వయసు నుంచే మొదలవుతున్నది. మన లైఫ్‌ైస్టెల్ వల్లే ఒంటరితనం వస్తుంది. అది శారీరకంగా, మానసికంగా బాధిస్తుంటుంది. జీవితంలో బంధాలు తగ్గిపోతే ఒక రకమైన నిర్వేదం ఆవహిస్తుంది. ఒకరితో ఒకరికి కనెక్టివిటీ ఉండాలి. లేకపోతే ఆత్మసంతృప్తి కలుగడం అసాధ్యం. అందుకే వీటిని అధిగమించాలంటే మనల్ని మనమే సన్నద్ధం చేసుకోవాలి. ఒంటరితనం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి కారణంగా అడ్రిలన్స్, కార్టిలాజ్ అనే నెగెటివ్ హార్మోన్స్ విడుదలవుతాయి. అవి మనల్ని మెల్లమెల్లగా అనారోగ్యాలకు దారితీసేలా చేస్తాయి. ఇతరులు మనకు ఇవ్వడం కాదు.. ఇతరులకు మనం ఇవ్వడంలో ఎంతో ఆత్మసంతృప్తి పొందవచ్చు. దీనివల్ల కూడా ఒంటరితనం దరిచేరనీయకుండా చేయొచ్చు. ఒంటరిగా ఉండాలనుకోవడం కన్నా నలుగురితో కలిసి ఉండడం నేర్చుకోండి. ఒంటరితనమనేది సైలెంట్ కిల్లర్. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి మనల్ని మనం మోటివ్ చేసుకోవాలి.
- రాధికా నల్లన్ ఆచార్య, సైకాలజిస్ట్

జన్యు సమస్యా?

ఏకాంతంగా ఉండాలనుకోవడంలో తప్పు లేదు. కానీ దాంట్లోనే జీవించాలనుకోవడం మాత్రం ముమ్మాటికీ తప్పే. మన చుట్టూ ఎంతోమంది మనుషులున్నా వారందరితో ఎలాంటి సంభాషణలు, సంబంధాలు లేకుండా ఉండడమే ఒంటరితనమవుతుంది. ఇది వ్యక్తిగతమైన ఒక మానసిక స్థితి. ఈ స్థితిలో వికృతమైన ఆలోచనలు కలుగుతాయి. నిరాశా, నిస్పృహలు పెరుగుతాయి. అయితే ఈ ప్రవర్తనను ప్రోత్సహించే అంశాలు వంశపారంపర్యంగా సంక్రమించవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మనుషులు ఒంటరిగా ఉండాలని కోరుకోవడానికీ, ఏకాంత జీవితం పట్ల ఆసక్తి చూపడానికి జన్యుపరంగా పరస్పర సంబంధాలున్నాయట. ఒంటరితనాన్ని ప్రేరేపించే ప్రత్యేకమైన జన్యువు ఒకటుందని గుర్తించకపోయినా, ఒంటరితనం వైపు ఆసక్తిని పెంచే ప్రక్రియలో జన్యు ప్రభావమైతే ఉందని మాత్రం శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఒంటరితనం అనేక జన్యు సముదాయల ప్రతిచర్యగా ఆవిర్భవించింది.
dna-predisposition

ఒంటరితనం ప్రాణాంతకం..

ఒంటరితనం మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. ఎవరూ లేరన్న డిప్రెషన్‌ని కలిగిస్తుంది. ఈ సమస్య పురుషులలో కన్నా స్త్రీలలో ఎక్కువ. ఒంటరితనంతో బాధపడే వారి సంఖ్య అధికంగా ఉన్నందు వల్ల బ్రిటన్‌ను ఒంటరితనానికి రాజధానిగా భావిస్తున్నారు. ఒంటరితనం వల్ల 15 సిగరెట్లు, రోజూ మద్యం తాగితే ఆరోగ్యం ఎంతగా చెడిపోతుందో అంతకంటే ఎక్కువ నష్టం వాటిల్లుతుందట. ఒంటరితనంతో బాధపడేవాళ్లలో 18 నుంచి 25 సంవత్సరాల లోపు వయసు వాళ్లు 30 శాతం మంది నిద్రకు దూరమవుతున్నారట. ఈ కారణంగా చిన్నవయసులోనే గుండె జబ్బులు కూడా చుట్టుముడుతున్నాయి. కుంగుబాటు, మతిమరుపు, నిలకడలేమి.. వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందరితో కలిసి ఉండేవారితో పోల్చితే ఒంటరిగా ఉండేవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వృద్ధుల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుందట.
Alone

తుంటరితనమే మేలు

జీవితాన్ని సంతోషంగా గడుపడానికి పెద్దగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. కొద్ది మార్పులతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. దానికి కొన్ని సూత్రాలను మాత్రం పాటించాల్సిందే.

-ఒంటరిగా జీవించే ప్రతి ఒక్కరూ అక్కర్లేని, అవసరం లేని ఆలోచనలకు తావియ్యకండి. వృత్తిరీత్యా ఎంతోమందిని కలుస్తాం. ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. వాటన్నింటినీ గుర్తు పెట్టుకోవాల్సిన పనిలేదు.
-ఎప్పుడూ ఇతరుల కోసం కష్టపడుతున్నామన్న భావనతో ఉండొద్దు. ఈ జీవితం మీది. మీకోసం మీరు జీవించండి. ఈ ఆలోచనే మీకు ఎక్కడ లేని శక్తినిస్తుంది.
-ఆత్మన్యూనతా భావం జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. మిమ్మల్ని సుఖంగా నిద్ర పోనివ్వదు. శాంతంగా బతకనివ్వదు. కాబట్టి స్వేచ్ఛగా జీవించండి. ఇతరుల కన్నా మీరు ఎందులోనూ తక్కువ కాదన్న భావనలో ఉండండి.
-నవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా నవ్వండి. దుఃఖం కలిగితే భారం దిగిపోయేంత వరకు ఏడ్చేయండి. దీనివల్ల మనసు తేలికవుతుంది.
-నలుగురిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలోనన్న ఆలోచన రానీవ్వద్దు. అందరూ మీ వాళ్లే అనుకుంటే నవ్వుతూ ఉండగలరు.
-ఒంటరి జీవనం సాగించడం తప్పదనుకున్నప్పుడు గార్డెనింగ్, పెట్స్‌ను పెంచుకోవడంతోపాటు పుస్తకాలను నేస్తాలుగా చేసుకోండి. ఒంటరితననానికి ఏదో ఒక పని పెట్టుకోవడానికి మించిన మందు లేదు.
-ఎదుటి వారి అభిప్రాయాలు, మాటలను గౌరవించడం నేర్చుకోండి. ఇతరులు చెప్పే మంచి మాటలని విశ్వసించకపోతే మీకంటూ ఎవరూ మిగలకపోవచ్చు. అందుకని ఎదుటివారు చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినండి.
-ప్రతి విషయాన్ని భూతద్దంలో కాకుండా పాజిటివ్‌గా ఆలోచించడం అలవాటు చేసుకోండి.
-ఎప్పుడూ తెలిసిన వారినే కలవడం కాకుండా అప్పుడప్పుడూ కొత్తవారినీ కలవండి. వారితో పరిచయం మీకు కొత్త స్నేహితులను పరిచయం చేస్తుంది. ఉన్న స్నేహితులు, బంధువులను కూడా తరుచుగా కలుస్తుండాలి.
happy-woman

మనదేశంలోనూ సమస్యే..

వంద కోట్ల మందికి పైగా జనాభా ఉన్న మన దేశంలో ఒంటరితనం సమస్యే కాదని అభిప్రాయం ఉంటుందేమో కదా! కానీ జనాభా సంఖ్యతో దీనికి సంబంధం లేదు. దేశంలో వయసు పై బడిన ప్రతి ఇద్దరిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారట. ప్రతి అయిదుగురు వృద్ధుల్లో ఒకరికి కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు నిపుణులు. ఒంటరితనానికి ఇక్కడ ప్రధాన కారణం ఒంటరిగా నివసించడమేనట.

-పట్టణ ప్రాంతాల్లో 64.1%గ్రామీణంలో 39.19% ఉందని ఈ తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
-మన దేశంలో టీనేజ్ జనాభా 75.5 మిలియన్లు. అందులో 25 % మంది ఒంటరితనంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారట.
- 10.1% మందికి అసలు ప్రాణ స్నేహితులే లేరని తేలింది.
-దీంతో ఒంటరితనంతో బాధపడే వారి సంఖ్య రానురానూ ఇంకా పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదని నిపుణుల అభిప్రాయం.
sad-girl

2009
Tags

More News

VIRAL NEWS