చెరువును బతికించు కుందాం!


Sun,April 16, 2017 02:54 AM

జలం లేని చోట.. జీవముండదు. చెరువు లేని చోట సేతానముండదు. చెరువులో నీళ్లుంటేనే.. బాయీ.. బంధం.. ఎద్దూ.. ఎవుసంతో మనిషి మనుగడలో ఉంటాడు. చెరువును అంటిపెట్టుకున్న
సబ్బండ వర్ణాలు సల్లంగా ఉంటాయి. వృత్తులు చేసుకునేవాళ్లకు చేతినిండా పని దొరికి సంపదలను..
సంతోషాలను రాశులకొద్దీ పండిస్తారు. ఏటికేతమేసి వేయిపుట్లు పండించిన తాతల కాలం నుంచి.. కరెంట్
మోటార్‌తో కాలువలు మళ్లిస్తున్న ప్రస్తుత కాలం వరకు చెరువు అలుగు దుంకితేనే.. తూము తెరుచుకుంటేనే అందరూ బాగుంటారు. బాగుపడతారు. ఆ జలకళను.. జీవకళను చిరకాలం చూపించేందుకు పైలాన్ వేసుకొని పైలట్‌లా దూసుకొస్తున్న సాగునీటి సంక్షేమ కార్యక్రమమే మిషన్ కాకతీయ. రెండు దశలు పూర్తి చేసుకొని.. మూడో దశ పనులకు సమాయత్తమవుతున్నది. చెరువుల నీటితో సేతానం ఊపు మీదికొచ్చింది. ఆయకట్టుకు ఆయువు పెరిగింది. చెరువుపై ఆధారపడిన ప్రజలు అలయ్ బలయ్ తీసుకొని.. అస్సోయ్.. ఇస్సోయ్ హైలెస్స రంగోయ్.. అని పాడుకుంటున్నారు. ఈ సందర్భంగా చెరువమ్మ గొప్పదనం, మిషన్ కాకతీయ తీసుకొస్తున్న ఫలాల అవలోకనం ఈ వారం ముఖచిత్ర కథనం.
BUDHARAM-GANDI2

ఆకాశం నుంచి చూస్తే ఏం కనిపిస్తాయి? చెట్లు.. గుట్టలు.. చిన్నసైజుల్లో ఇండ్లు అంతేకదా. కానీ తెలంగాణకు వచ్చిన ఓ విదేశీ పరిశోధకుడికి మాత్రం విమానంలో వస్తున్నప్పుడు తెలంగాణ అంతటా నక్షత్రాలు కనిపించాయట! ఆశ్చర్యం. ఏమిటీ నేలపై తారలా? అవును.. ఆయన దృష్టికోణంలో లోపమేం లేదు.
విస్తారమైన వర్షాలకు.. విశాలమైన చెరువుల్లోకి నీళ్లొచ్చి తెల్లని పాలనురుగులా మెరుస్తూ కనిపించాయి. ఆ పొంగుల హంగులే నక్షత్రాలు. తెలంగాణ గడ్డమీద ఆకాశం నుంచి కనిపించే వేల నక్షత్రాలే పాలపుంత. నీళ్ల పాలపుంత. ఇప్పటికే మిషన్ కాకతీయ రెండు దశల్లో పూర్తయిన వేలకొద్ది చెరువుల పునరుద్ధరణ ప్రతిఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ఊరి బరువునంతా మోసి.. నీరటి సాక్షిగా.. పారేటి కాల్వల సాక్షిగా.. ప్రజల కళ్లలో ఆనందం చూసి మురిసిపోతున్నాయి. ఈ ఆనందాలను మిగిలిన ప్రజలకూ అందివ్వాలని.. అందుకు పురిటి నొప్పులను సైతం హాయిగా భరించేందుకు మిగిలిన చెరువులూ ఇప్పుడు
నీల్లాడుతున్నాయి. నిండిన చెరువు నురగలందం చూస్తే తనివి తీరిపోతుంది. గుండె బరువు దిగిపోతుంది. మనసంతా తేలిక పడుతుంది. లేత రెమ్మలతో.. పారాడే తీగలతో తామరలు చెరువు అలల కొప్పులపై తురిమినట్లుగా కనిపిస్తాయి. రాతి సొరికల్లోని లేత కానుగు పొదలు.. కొత్తనీళ్లు తాగి మత్తు గమ్మి ఉంటాయి. నీళ్లలో మునిగిన తుమ్మనీడల కిందికి సిరుగాలి కలలో వచ్చి చిందాడుతుంటాయి. కుడితి తాగినగానీ.. ఉడుకు తగ్గని బర్లు.. కరువుతీరా ఈది మైమరచిపోతాయి. అరిసె నీటికోళ్లు.. ఆడేటి కొంగలూ సరసమాడుకుంటూ సయ్యాటలాడుతాయి. సుడలెంట పిట్టలు.. చుట్టూ తిరుగుతుంటే రాట్నమేటి నీట తిరిగినట్టు ఉంటుంది. చెరువు నిండుగా తొణుకులాడుతుంటే ప్రజలకు చేతినిండా పని ఉండేది. కొర్రమట్టలు.. బంగారు తీగలు.. చందమామలు వంటి తీరొక్క చేపలతో చెరువు ఒడ్డున తిరునాళ్లు జరిగినట్లు ఉంటుంది. మిషన్ కాకతీయ రెండు దశల్లో వేల చెరువులు ఇప్పుడు అచ్చంగా ఇలాంటి నూతనోత్తేజాన్నే నింపుకున్నాయి. పూడిక తీసిన చెరువులు భారీ వర్షాలతో నిండా నిండాయి. ఆ చెరువుల చుట్టూ కొత్త అందాలు, అనుబంధాలు మరోమారు మనకు కనిపిస్తున్నాయి. మిషన్ కాకతీయ మూడో దశతో ఇక తెలంగాణలోని దాదాపు అన్ని చెరువులూ కొత్త జీవం పోసుకోనున్నాయి. నూతనోత్తేజం నింపుకోనున్నాయి.
BUDHARAM-GANDI

కాకతీయుల అడుగుజాడలు :

కాకతీయ రాజులు తెలంగాణ గడ్డమీదనే పుట్టి.. పెరిగి ఇక్కడి ప్రజల కష్ట సుఖాలను చూశారు. ప్రజల కష్టాలను తీర్చేందుకు చెరువుల నిర్మాణాలనే మార్గంగా ఎంచుకున్నారు. వెంటనే ఆచరణలో పెట్టి చెరువుల ద్వారా ఆశించిన ఫలితాలు రాబట్టారు. వాటిలో ప్రముఖంగా చెప్పుకునేవి గొలుసుకట్టు చెరువులు. వ్యవసాయం.. వ్యాపారం.. ద్రవ్య విధానం తదితర ఆర్థిక రంగాల్లోని వనరులను ప్రజల సంక్షేమానికి వినియోగపడేలా ఇలాంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారు. ఆ రోజుల్లోనూ ప్రజల సాగునీరు.. తాగునీరు అవసరాలను తీర్చినవి ఈ గొలుసుకట్టు చెరువులే. గ్రామ సేవలు అందించే దాదాపు 12 కులాలు వీటిపై ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఆధారపడి బతికేవి. కాకతీయులే కాదు.. వారి సామంతులు.. సేనానులూ వ్యవసాయాభివృద్ధికి చెరువులు తవ్వించారు. చెరువులు, కాలువలే కాకుండా బావుల కింద కూడా వ్యవసాయం జరిగేది. ఈ విధంగా ఆనాటి నీటి వనరులు కాకతీయ సామ్రాజ్యాన్ని సస్యశ్యామలం చేశాయి. ఇప్పటికీ ఉపయోగంలో ఉన్న చెరువులూ ఉన్నాయి. తెలంగాణ సర్కారు కూడా కాకతీయుల అడుగుజాడల్లోనే నడుస్తున్నది. ఆనాటి సంస్కరణల్లో ప్రధాన భాగమైన గొలుసుకట్టు చెరువులను పరిరక్షించే చర్యలు తీసుకుంటున్నది. శిథిలమైన చెరువులను పునరుద్ధరిస్తున్నది. మిషన్ కాకతీయ ద్వారా రెండు దశలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు మిగిలిన చెరువులు మూడో దశకు సిద్ధమవుతున్నాయి.
BUDHARAM-GANDI1

చెరువును బతికించుకుందాం..!:

కాకతీయ రాజులు.. వారి సామంతులు.. సేనానులు వ్యవసాయాభివృద్ధికి పెద్ద చెరువులు తవ్వించారు. కొండల మధ్య మట్టిగట్లు పోసి మరీ ప్రతిష్టాత్మకంగా కాకతీయులు గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. అవిప్పటికీ ఉన్నా.. పునరుద్ధరణ అవసరం. అత్యాధునిక టెక్నాలజీ లేని రోజుల్లోనే చెరువులను అభివృద్ధి చేసి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన పూర్వీకుల అడుగుజాడల్లో నిలిచి చెరువుల్ని పునరుద్ధరించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి. మిషన్ కాకతీయతో మళ్లీ చెరువులు, కుంటలు నిండి భూములు సాగుకు అనుకూలంగా మారితే రాష్ట్రంలో ఎన్నో సామాజిక వర్గాలకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుంది. ఎన్నో కులవృత్తులు పునరుజ్జీవమవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల్ని పునరుద్ధరిస్తే 250 టీఎంసీల మేర నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని నిపుణుల మాట. ప్రభుత్వ సంకల్పానికి తోడు ప్రజల బాధ్యత.. రైతుల పాత్ర మెరుగ్గా ఉండి చెరువులను బతికించుకుందాం.

చెరువుతో ఇకలేదు కరువు..


చెరువు కింద దున్ని చెడినవాడు లేడంటారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభవం వస్తోంది. ఎద్దులనాపోయ్ నీళ్లను తాపోయ్.. అరకను తీయోయ్.. ఉరుకులు పెట్టోయ్ లాంటి పాటలతో పాలమూరులాంటి పడావుబడ్డ నేల్లలో కూడా వ్యవసాయం సాగుతున్నది. నల్లని రేగడి.. నాగలి కర్రు చెరువును చూసి చిరునవ్వు నవ్వుతోంది. పగుళ్లుబారిన నేలల్లో బొట్టుబొట్టూ పారుతుంటే.. ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు వేరు మొలిచి ఎగిరి గంతేస్తున్నది. తడార్పుదామన్నా నిల్వ నీళ్లు లేక కరువుతో కాలం గడిపిన కాలువలు.. ఆకలి తీరక అలిగి కూర్చున్న చెలుకలు చెరువు నీళ్లను చూసి మురిసిపోతున్నాయి.. దగదగా మెరిసిపోతున్నాయి. పూడికతీయడం వల్ల చెరువులో చేపలు పెంచి.. వాటిని ఆనందంతో బెస్తోళ్లు.. తెనుగోళ్లు విసురోయ్ గుంజోయ్.. వల విసిరి గుంజోయ్ అంటూ సంబురాలు చేసుకుంటున్నారు.
BUDHARAM-GANDI3

లక్ష్యం ఏంటి? :


వ్యవసాయానికి ప్రాణాధారమైన 46500 చెరువులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే మిషన్ కాకతీయ - మన ఊరు మన చెరువు. గోదావరి, కృష్ణా బేసిన్లలో చిన్న నీటి వనరుల కోసం కేటాయించిన 256 టీఎంసీల నీటిని సంపూర్ణంగా వినియోగించుకుని.. ఈ చెరువుల కింద సుమారు 25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్న ప్రధాన లక్ష్యంతో మిషన్ కాకతీయ చేపట్టారు.
ఎప్పుడు ప్రారంభించారు?: 2015 మార్చిలో

చెరువు నిండితే ఏమేం లాభాలు..?


చెరువు నిండితే.. చేతినిండా పని ఉంటది. ఇప్పుడే కాదు.. కాకతీయుల కాలం నుంచి కూడా చెరువుల వల్ల గొలుసు పద్ధతిలో ఆయా వృత్తుల వారికి పని దొరికేది. చెరువులో నీళ్లు పుష్కలంగా ఉంటే మొదటగా భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయి. బావుల్లోకి నీళ్లొచ్చి వ్యవసాయం చక్కగా సాగుతది. పనిపాటల వృత్తుల వాళ్లు అయిన కమ్మరి.. కుమ్మరి.. వడ్రంగులు పట్నంలో కూలీ పని చేసుకోకుండా ఊళ్లోనే సంతోషంగా తమ పని తాము చేసుకోవచ్చు. సంచారం కూడా మన సంస్కృతిలో భాగమే. అయినంత మాత్రాన వాళ్లనలాగే ఉండమని కాదు. వాళ్ల పిల్లలూ ఉన్నతంగా చదువుకోవాలి. ఉత్తమంగా ఎదగాలి. అయితే అదే పనిగా ఉన్నవాళ్లకైతే ఉపాధి దొరికే అవకాశం ఇప్పటికైతే మామూలుగా లేదు. ఒకవేళ చెరువులోకి పుష్కలంగా నీరు ఉంటే ఈ పురోగతి సాధించవచ్చు. వెనకట.. ప్రతీయేటా జంగాలు.. దాసరులు.. బుడబుక్కలా వాళ్లు.. గంగిరెద్దూలోల్లు.. గంట పక్కీరోల్లు చెరువులో నీళ్లు చూసి తరలొచ్చేవాళ్లు. పొరకలు బుట్టలు అల్లే ఊరెరకలి వాళ్లు.. గొర్ల జీవాలను పోషించేవాళ్లు కరువును జయించి చెరువెంట ప్రయాణం చేసేవాళ్లు. కాబట్టి చెరువును బతికిస్తే మన సంస్కృతిలో భాగమైన కట్ట మైసమ్మకు బోనం పెట్టి.. బతుకు చెరువు కలిపే బంధుత్వాలతో ఊరి గౌరవం పెరుగుతుంది.
BUDHARAM-GANDI4


మిషన్ కాకతీయ ఫేజ్-1


గుర్తించబడిన చెరువుల సంఖ్య : 8045
మంజూరైన నిధులు : రూ.2516.00 కోట్లు
పనులు జరిగిన చెరువులు : 8022
పూర్తయినవి : 7831
పూర్తికావాల్సినవి : 191
సాగవుతున్న ఆయకట్టు : 3,69,154 ఎకరాలు

మిషన్ కాకతీయ ఫేజ్-2


గుర్తించబడిన చెరువుల సంఖ్య : 9016
మంజూరైన నిధులు : రూ.3145.00 కోట్లు
పనులు జరిగిన చెరువులు : 8887
పూర్తయినవి : 3559
పూర్తి కావాల్సినవి : 5328
సాగవుతున్న ఆయకట్టు : 1,30,335 ఎకరాలు

మిషన్ కాకతీయ ఫేజ్-3


పునరుద్ధరణ చేయాల్సిన చెరువులు : 6500
ప్రణాళిక అంచనా నిధులు: రూ. 1959.42 కోట్లు
పూడిక తీసేందుకు
మంజూరైన చెరువులు : 3889
టెండర్లుకు ఆహ్వానిస్తున్న చెరువులు : 2066
ఎప్పట్లోగా :
మే 31, 2017

ప్రారంభోత్సవం : 2015 మార్చి 12వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా.
భారీ పైలాన్ ఆవిష్కరణ : వరంగల్‌జిల్లా నర్సంపేటలోనిమదాన్నపేట చెరువుకట్టపై
45 అడుగుల ఎత్తయిన మిషన్ కాకతీయ భారీ పైలాన్ ఆవిష్కరణ.

పూడిక తీసిన మొదటి చెరువు : నిజామాబాద్ జిల్లా.. సదాశివనగర్‌లోని పాత చెరువు.
సుమారు 1000 కోట్ల విలువైన 15 కోట్ల 32 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిన పొలాల్లోకి తరలించారు.
ట్రాక్టర్లలో : సుమారు 6 కోట్ల 13 వేల ట్రిప్పులు
సాగులోకి వచ్చిన భూమి : 15 లక్షల ఎకరాలు
భూగర్భ జలాల స్థాయి: సుమారు 6.5 టీఎంసీల సామర్థ్యం పెరిగినట్లు అంచనా

స్వయం పోషకత్వం:


ఎనకట ఎండిపోయిన అనేక చెరువులు మిషన్ కాకతీయ ద్వారా మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. ఇవి అనేక వృత్తులవారికి.. జీవులకు ఆధారంగా మారాయి. చెరువు నిండితే కష్టజీవుల ఆర్థిక స్వావలంబనకు.. స్వయం పోషకత్వానికి అవకాశం ఉంటుంది. చెరువులోకి నీళ్లొస్తే ఎంతోమంది చెరువొడ్డుకు వలసొచ్చేవాళ్లు. వ్యవసాయం మన సంస్కృతిలో భాగం. పాలమూరు లాంటి పల్లెల్లోనూ ఇవాళ చెరువులు నిండి.. పైర్లు పచ్చగా ఉన్నాయంటే చెరువుల పునరుద్ధరణలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. చెరువన్నా.. వాగన్నా.. నాకు వల్లమాలిన ప్రేమ. వాటిని చూస్తూనే పెరిగాను. కాబట్టి ప్రజారంజకంగా పాటలు రాయగలిగాను.


ప్రపంచ దృష్టినీ ఆకర్షిస్తున్నది :


చెరువులను సమగ్రంగా పునరుద్ధరించడం వల్ల తెలంగాణలో వ్యవసాయం పుంజుకోవడమే కాకుండా మొత్తం గ్రామీణ ఆర్థిక.. సామాజిక.. సాంస్కృతిక వికాసానికి చెరువు దోహదం చేస్తుంది. పూడిక మట్టిని పొలాల్లో చల్లుకోవడం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది. రసాయనిక ఎరువుల వాడకం గణనీయంగా తగ్గుతుందని పరిశోధకులే చెప్తున్నారు. చెరువుల పూడిక తీసి వాటిని పునరుద్ధరించడం వల్ల భూగర్భ జలాల మట్టం పెరిగి పరోక్షంగా వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. తాగునీటి కొరత కూడా చాలామటుకు తీరే అవకాశం ఉన్నది.


సముద్రాల తెలంగాణ :


మన చరిత్రకు చెరువులే ఆధారమని చెప్పొచ్చు. దక్కన్‌ను పరిపాలించిన ప్రతి రాజవంశం చెరువుల తవ్వకం జరిపినప్పటికీ కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువులను గణనీయంగా నిర్మించారు. శాతవాహనులు.. రాష్ట్ర కూటుల పాలనాకాలానికే తెలంగాణ వ్యవసాయ రంగ చరిత్ర ఉన్నత స్థితికి చేరుకున్నది. కాకతీయుల కాలానికి చెరువుల ఇంజినీరింగ్ ఉన్నత స్థాయికి చేరుకున్నది. మధ్యయుగాల చరిత్రను పరిశీలిస్తే 10 నుంచి 13వ శతాబ్దాల మధ్య స్థిరమైన రాజ్యాన్ని తెలంగాణ కేంద్రంగా కాకతీయులు స్థాపించారన్నది శాసనాల ద్వారా తెలుస్తున్నది. కాకతీయుల కాలంలో నిర్మాణమైన అనేక చెరువులకు సముద్రం అన్న పేరు స్థిరపడింది. గణప సముద్రం, ధర్మ సముద్రం, బాల సముద్రం, కాట సముద్రం, చౌడ సముద్రం, ఉదయ సముద్రం, భీమ సముద్రం, శనిగర సముద్రం వంటి చెరువులన్నీ దాదాపు కాకతీయుల కాలంలో.. ఆ తర్వాత నిర్మితమైనవే. కాకతీయుల వారసత్వాన్ని కొనసాగిస్తూ తర్వాత రాజ్యాధికారం చేపట్టిన రాజులు సైతం చాలా చెరువులు తవ్వించారు. బహమనీ సుల్తానులు.. కుతుబ్‌షాహీలు కూడా చెరువుల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వాటిని దూరదృష్టితో ఇప్పటి అవసరాలకు కూడా ఉపయోగపడేట్లు తీర్చిదిద్దారు. హుస్సేన్ సాగర్.. మాసాబ్ చెరువు.. ఇబ్రహీంపట్నం.. జల్‌పల్లి కుతుబ్‌షాహీలు పునర్ నిర్మించినవే. 17వ శతాబ్దంలో నిజాం రాజవంశీయులు చెరువుల బాగోగులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
BUDHARAM-GANDI5

3085
Tags

More News

VIRAL NEWS