చెట్టమ్మకు చుట్టాలమవుదాం!


Sun,July 16, 2017 01:34 AM

తను మాత్రమే బాగుండాలనుకునేవారు కుక్కను మాత్రమే పెంచుకుంటారు. అందరూ బాగుండాలని కోరుకునేవారు మొక్కను పెంచుతారు. అలాంటి వారికి మొక్కాలి. వారి పేరున మనమూ ఓ మొక్క నాటాలి.
చెట్టు మనకు కూడు పెడుతుంది. నీడనిచ్చే గూడవుతుంది. మనం కట్టే బట్టవుతుంది. ఆయువునిస్తుంది. ప్రాణవాయువునిస్తుంది. ఆఖరికి మనం పోయాక మోసే పాడె.. కాల్చే కట్టె కూడా చెట్టే అవుతుంది. మనిషి పుట్టినప్పట్నుంచి.. చనిపోయేదాక ఒక్కో దశలో ఒక్కో అవసరం తీరుస్తూ మనల్ని కాపాడే చెట్టును నరకడం పాపం కిందకే వస్తుంది. చెట్టు లేనిదే మనిషికి మనుగడ లేదు. అందుకే మొక్కలను నాటడమే కాదు.. చెట్లనూ పరిరక్షించుకోవాలి. ఇది మామూలుగా జరగకూడదు. ఓ ఉద్యమంలా జరగాలి. ఇలాంటి కార్యక్రమం ఇప్పటివరకూ చైనాలోని గోబీ ఎడారిలో.. బ్రెజిల్‌లోని అమెజాన్ నదీ తీరంలో ప్రజలు స్వచ్ఛందంగా చేశారు. అలాంటి కార్యక్రమం తెలంగాణ సర్కారు కూడా చేస్తున్నది. మూడేళ్లలో కోట్లాది మొక్కలు పెట్టి లక్ష్యానికి దగ్గరలో ఉన్నది. ఈ నెల 12న హరితహారం మూడోదశ ప్రారంభమైన
సందర్భంగా.. చెట్టమ్మ గురించి ముఖచిత్ర కథనం.చెట్టు గురించి ప్రకృతి ప్రేమికుడు.. తాత్విక వైరాగి కవి గోరటి వెంకన్న ఇలా అన్నారు. చిరునవ్వు వర్ణం.. సంద్ర లతగంధం.. సృష్టికే అందం.. పరుటాకుల బంధం.. ఈ చెట్లు ప్రాణవాయువు నిలయం. ఆయన చెట్టును.. చెట్టు అందాన్ని.. దాని అవసరాన్ని వర్ణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మోదుగ.. నల్లతుమ్మ.. కానుగ.. విప్ప.. జిట్టరేగు.. వేప.. మామిడి వంటి చెట్లపై జనాలకు హత్తుకుపోయే పాటలెన్నో రాసి.. పాడి పర్యవరణ పరిరక్షణ కోసం తపించారు. ఇంట్లోనూ తీరొక్క చెట్టు పెంచుతున్నారు. చెట్టును బతికిస్తేనే మన మనుగడ సాధ్యమని చెప్తున్నారు వెంకన్న.
Tree

230 కోట్ల మొక్కల లక్ష్యం

తెలంగాణలో ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీమ్ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్ తదితర జిల్లాల్లో వర్షపాతం అధికంగా ఉంది. దీనికి కారణం అటవీ విస్తీర్ణం అధికంగా ఉండటమే. అదే అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న కరీంనగర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో సగటు కంటే కనిష్టంగా వర్షపాతం నమోదవుతున్నది. అడవే ఆవాసంగా బతికిన కోతుల్లాంటి జంతువులు ఈ పరిస్థితుల వల్ల వ్యవసాయానికి ఆటంకం కలిగిస్తూ రైతును ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడం కోసం ఆలోచించింది తెలంగాణ సర్కారు. అటవీ విస్తీర్ణతను పెంచి.. వర్షాభావ పరిస్థితి లేకుండా చేసేందుకు 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నది.
Tree1

మన చెట్లు నరికిందెవరు?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు అడవుల సంరక్షణ.. మొక్కల పెంపకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఏదో ఆషామాషీగా చెప్పడం లేదు. అప్పటి ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఇది తెలుస్తున్నది. మొక్కల పెంపకం.. అడవుల సంరక్షణ కోసం అప్పటి సర్కారు ఏటా సగటున కేవలం 13 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది. 2004-2014 మధ్యకాలంలో అటవీశాఖ మొత్తం ఖర్చు 130.61 కోట్ల రూపాయలు మాత్రమే. 1980-2014 మధ్యకాలంలో తెలంగాణలోని అటవీభూముల్లో 3.17 లక్షల హెక్టార్లలో మాత్రమే మొక్కల పెంపకం చేపట్టారు. ఈ 34 ఏళ్లలో తెలంగాణలో నాటిన మొక్కల సంఖ్య కేవలం 35.3 కోట్లు మాత్రమే. ప్రతియేటా సగటున 3358 హెక్టార్ల అటవీ భూమి అన్యాక్రాంతమైపోయింది. ఈ పరిణామ ప్రభావం వల్ల తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో 26,903 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీభూమి ఉండగా అందులో 25 శాతం దట్టమైన అడవి, 50 శాతం ఓ మోస్తరు అడవి ఉండేది. మిగతా 25 శాతం అటవీభూముల్లో చెట్లు.. చిన్న చిన్న పొదలు ఉండేవి. కానీ అడవులను అన్యాక్రాంతం చేసిన అప్పటి పాలకుల నిర్వాకం వల్ల ఈ అటవీభూమిలో 1.06 శాతం మాత్రమే దట్టమైన అడవి, 28.95 శాతం మామూలు అడవి మిగిలింది. అడవుల పరిరక్షణ అవసరాన్ని ఉమ్మడి రాష్ట్ర పాలకులు విస్మరించడంతో చెట్ల నరికివేత భారీగా కొనసాగింది.
Tree3

బ్రెజిల్ తర్వాత తెలంగాణే!

పచ్చదనాన్ని పెంచేందుకు మొక్కలు నాటే గొప్ప ప్రయత్నం ప్రపంచంలో మూడే మూడు జరిగాయి. అందులో మొదటిది చైనా. రెండోది బ్రెజిల్. మూడోది తెలంగాణ. చైనాలోని గోబీ ఎడారి విస్తరణను నిలుపుదల చేసేందుకు చైనా ప్రజానీకమంతా ఒక్కటై 4500 కిలోమీటర్ల పొడవునా మొక్కలు నాటి Green Wall Of Chinaను నిర్మించారు. రెండోదైన బ్రెజిల్‌లోని అమెజాన్ నదీతీరంలో అటవీ పరిరక్షణ కోసం One Billion Trees For Amazon నినాదంతో వంద కోట్ల మొక్కల పెంపకం చేపట్టారు. ఈ రెండు ప్రయత్నాలను మించిన ప్రయత్నమే తెలంగాణకు హరితహారం.
Tree2

ఆ ఖర్చు 30 రెట్లు ఎక్కువ

హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ఖర్చుకు ఏమాత్రం వెనకాడటం లేదు. గత రెండున్నరేళ్ల లెక్కలు తీసుకుంటే 47.98 కోట్ల మొక్కలు నాటారు. గడచిన 35 ఏండ్లలో 3.17 లక్షల హెక్టార్ల అటవీభూమిలో అడవి పునరుద్ధరణ కోసం ఆనాడు ప్రయత్నాలు జరిగితే.. రెండున్నరేండ్లలో 4.31 లక్షల ఎకరాల్లో ప్లాంటేషన్ జరిగినట్లు లెక్కలు చెప్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి 1243 కోట్ల రూపాయలు అటవీశాఖకు ప్రభుత్వం కేటాయించింది. దీన్నిబట్టి చూస్తే ఏడాదికి సగటున తెలంగాణ ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు పచ్చదనం కోసం ఖర్చు చేస్తున్నట్లు అంచనా వేయవచ్చు. ఇది ఉమ్మడి ప్రభుత్వం పెట్టిన ఖర్చుతో పోలిస్తే 30 రెట్లు ఎక్కువ.
Tree4

ఎన్ని మొక్కలు? ఎక్కడెక్కడ?

తెలంగాణలో 33 శాతం పచ్చదనాన్ని పెంచాలన్నదే హరితహారం లక్ష్యం. మొత్తం 230 కోట్ల మొక్కల పెంపకం. వీటిలో 120 కోట్ల మొక్కలను గ్రామాలు.. పట్టణాల్లోని బాటలు, ఖాళీ ప్రదేశాలు, చెరువు గట్లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రాంగణాలు, ఇండ్లలో నాటుతారు. గతంలో అన్యాక్రాంతమైన అడవిని పునరుద్ధరించేందుకు 100 కోట్ల మొక్కలను అటవీ భూముల్లో నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటుతున్నారు. వీటన్నింటినీ నాటడం.. పర్యవేక్షించడమే లక్ష్యంగా 2015 జూలై 3న హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి ఏడాది 15.86 కోట్లు.. రెండో ఏడాదిలో 31.67 కోట్ల మొక్కలు నాటారు. రెండు దశలు విజయవంతంగా పూర్తి చేసుకున్న హరితహారం మూడో దశలో భాగంగా 40 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ కరీంనగర్‌లో ఈ నెల 12న ప్రారంభించారు. ప్రతి గ్రామంలో సగటున 40 వేలు.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో 40 లక్షల మొక్కలు నాటడం ఈ కార్యక్రమ ఉద్దేశం. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించేందుకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తున్నాయి.
Tree5

చెట్టంటే?

ఒకరు నీడనిచ్చేదంటారు. ఇంకొకరు కలపనిచ్చేదంటారు. మరికొందరేమో వర్షాలనిచ్చేది అంటారు. చెట్టు తన గురించి తాను చెప్పమంటే.. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా.. మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా అని సందేశమిస్తుంది అంటారు తిరుపతి మాట్ల.
రచయిత్రి తిమ్మన సుజాతను చెట్టు గురించి అడిగితే.. ఆమె అంటారు చెట్టు అంటే అమ్మ అని. అదెలా అని అడిగితే.. ఈ కథ చెప్పుకొచ్చారు- అమ్మ చిన్నతనంలో చింత పిక్కలాట ఆడుకుంటూ.. ఓ గింజని ఇంటి పెరడులో నాటిందట. రోజూ నీళ్లు పోస్తూ తనతోపాటే ఆ మొక్కని ప్రేమతో పెంచుకుందట. పెళ్లయి అత్తగారింటికి వెళ్లేటప్పుడు కూడా ఆ చెట్టును విడిచి వెళ్లలేనని గోలచేస్తే.. తాతయ్య ఆ ఇంటిని అమ్మకు కానుకగా ఇచ్చారట. అమ్మతోపాటు మేం కూడా చింతచెట్టుతో మమకారం పెంచుకున్నాం. పెరిగి పెద్దవాళ్లమయ్యాం. నా పెండ్లయి నేను ఆ ఇల్లును.. చెట్టును వదిలేసి అత్తగారింటికి వచ్చేశాను. కొన్నాళ్లకు అమ్మ ఈ లోకం విడిచి వెళ్లిపోయింది. బెంగతో నాన్న కూడా పోయారు. అమ్మ సంవత్సరీకానికి ఆ ఇంటికి వెళ్లాను. అంతా మారిపోయింది. తమ్ముడూ.. ఏంటిది? ఇల్లు కూలగొట్టేశావు. అమ్మ చెట్టును పూర్తిగా నరికేశావు అని కోపంతో అరిచి అక్కడ్నుంచి వచ్చేశాను. ఓ రోజు ఉన్నట్టుండి ఓ మంచం తీసుకుని వచ్చాడు తమ్ముడు. అయ్యో.. నాకెందుకురా ఈ మంచం? ఇంట్లో చాలా ఉన్నాయిగా అన్నాను. అది చింత చెట్టుతో చేసిన మంచం అన్నాడు. ఆ మంచంపై కూర్చుంటే నిజంగానే అమ్మ నాతో వచ్చేసినట్లనిపించి తమ్ముడిని గట్టిగా కౌగిలించుకున్నా. అప్పట్నుంచి ఈ మంచం నాలో ఒక భాగమైపోయింది. పిల్లలు పెద్దవాళ్లయి వేరే దేశాల్లో ఉంటున్నారు. భర్త అనారోగ్యంతో కాలం చేశారు. మనిషి జీవితం ఇంతేనా? ఓ చెట్టులా జీవించలేమా? అనిపించింది. పట్టణాల పేరుతో చెట్లని నరికేస్తూ ఎత్తయిన భవనాలు నిర్మిస్తూ పచ్చదనం కరువయ్యేలా చేస్తున్నారు నేటి జనం. ఆ లోటును పూడ్చేందుకు మొక్కలు నాటాల్సిందే. చెట్టు స్వచ్ఛమైన గాలినిస్తుంది. అమ్మలా లాలిస్తుంది. మన కోసమే జీవిస్తుంది. అందుకే చెట్టు ఎప్పుడూ అమ్మచెట్టు అవుతుంది అని ముగించారు.
Tree6

కాంతి ఫౌండేషన్ ప్రెసిడెంట్ కందుకూరి రామును చెట్టు గురించి అడిగితే తన అనుభవమొకటి చెప్పారు. పదిహేనేళ్ల క్రితం అనుకుంటా.. మండే ఎండాకాలంలో ఒక ఆదివారం రోజు మా మేనేజర్ ఫోన్ చేసి ఒక పని ఉంది.. నువ్వు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఖైరతాబాద్ పోస్టాఫీస్ దగ్గర వెయిట్ చెయ్యి. కలుస్తా అన్నాడు. నేను సరే అని చెప్పి అక్కడ ఎదురు చూస్తున్నాను. ఆయన దాదాపు గంట ఆలస్యంగా వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం.. మండుటెండ.. ఎక్కడా కూర్చోవడానికి స్థలం కనపడలేదు. వడదెబ్బ తగులుతుందేమో అని భయం. నేను రోడ్డుమీద నిలబడలేక అక్కడే ఉన్న ఒక వేపచెట్టు నీడలో నిలబడ్డాను. ఆ రోజు ఆ వేపచెట్టు వడదెబ్బ తగలకుండా నన్ను కాపాడింది. అప్పుడు నాకు చెట్ల ప్రాముఖ్యం తెలిసివచ్చింది. అందుకే పర్యావరణాన్ని పరిరక్షించడానికి.. విద్యార్థులను చైతన్యపరచడానికి నా వంతు బాధ్యతగా మా కాంతి ఫౌండేషన్ ద్వారా పర్యావరణ ప్రాముఖ్యం గురించి ప్రచారం చేయాలని భావించాను. ప్రముఖ కవులు, రచయితలు పర్యావరణం గురించి రాసిన కవితలను, కొటేషన్స్ ను పోస్టర్స్ రూపంలో రూపొందించి ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అందిస్తున్నాం. సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అందరికీ అవగాహన కలిగిస్తున్నాను. ఇటీవల ఓ క్యాలెండర్‌ను పర్యావరణ ప్రాముఖ్యం అనే కాన్సెప్ట్‌తోనే ముద్రించాం. ఫైనల్‌గా చెట్టే సమాజ నిర్మాత అంటున్నారు.

ఒక చెట్టు విలువ ఎంత?

-చెట్టు విలువను దాన్నుంచి లభించే పండ్లు, కలపను ఆధారంగా చేసుకుని నిర్ణయిస్తాం. కానీ చెట్టు వల్ల చాలా రకాల ప్రయోజనాలు మనం పొందుతున్నాం.
-50 సంవత్సరాల వయసున్న చెట్టు నుంచి దాదాపు15,70,000 రూపాయల విలువైన వస్తు సేవలను పొందుతున్నట్లు ఒక అంచనా.
-పూర్తిగా ఎదిగిన చెట్టు ఒక మనిషి వదిలిన కార్బన్ డై ఆక్సైడ్‌ను ఆక్సీజన్‌గా మారుస్తుంది.
-30-40 చదరపు మీటర్ల పచ్చని ప్రాంతం నుంచి ఒక్క రోజులో తయారయ్యే ఆక్సీజన్ ఒక మనిషికి ఒక రోజుకు సరిపోతుంది.
-ఒక కారు వంద లీటర్ల పెట్రోల్‌ను వినియోగించుకునేందుకు 350 కిలోల ఆక్సీజన్ అవసరం. దానికి తోడు కాలుష్య కారకాలను భారీ మొత్తంలో గాల్లోకి విడుదల చేస్తుంది.
-25,000 కిలోమీటర్ల దూరంపాటు ప్రయాణించడం ద్వారా ఒక కారు విడుదల చేసిన కాలుష్యాన్ని పెద్దగా ఎదిగిన చెట్టు పూర్తిగా పీల్చుకోగలుగుతుంది.
- ఒక చెట్టు సంవత్సర కాలంలో330 కిలోల ఆక్సీజన్‌ను విడుదల చేస్తుంది.
-ఒక హెక్టారు భూమిలో చెట్లు.. మొక్కలు లేకపోతే సంవత్సరానికి 24 కిలోల సారవంతమైన మట్టి గాలితో, నీటితో కొట్టుకుపోతుంది.
-చెట్లు, మొక్కలు తాము ఉన్న ప్రాంతపుఉష్ణోగ్రతను 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గిస్తాయి.
-మనం వాడే ఔషధాలలో 25శాతం మొక్కల నుంచి తయారైనవే.
Tree7

సగటున ఎన్ని చెట్లుండాలి?

-భూమ్మీద 33శాతం పచ్చదనం ఉంటేనే ప్రకృతి సమతుల్యమైనట్లు లెక్క.
-అదే రష్యాలో అయితే 4,461 చెట్లుండగా.. ప్రస్తుతం ఆ స్థాయిలో పచ్చదనం ఉన్నదా? లేనే లేదు.
-ైక్లెమేట్ రియాలిటీ ప్రాజెక్ట్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం కెనడాలో చెట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నది. కెనడాలో సగటున ఒక మనిషికి 8,953 చెట్లున్నాయట.
-ఇక ఇండియా విషయానికొస్తే మనిషికి సగటున 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. చూశారుగా పర్యావరణం విషయానికొస్తే ఇండియా ఎంతటి ప్రమాదపుటంచులో ఉన్నదో.
-అమెరికాలో 716 చెట్లున్నాయి.
-చైనాలో102చెట్లున్నాయి.
-ైక్లెమేట్ రియాలిటీ ప్రాజెక్ట్ సర్వే ప్రకారం భూమ్మీద ప్రతి మనిషికి సగటున 422 చెట్లున్నాయి.

చెట్టు కూడా ప్రాణే:

చెట్టు కూడా ప్రాణి అని మనం గుర్తించినా దాని ఉనికిని మనం గుర్తించడం లేదు. మనకు ఉపయోగపడే వస్తువుగా మాత్రమే చూస్తున్నాం. చెట్లను జీవన వనరుగా.. మానవ మనుగడకు సాధనంగా.. మానవ వైపరీత్యాలకు ఒక మందుగా భావించి వాటిని మానవ జనభా స్థాయిలో గుర్తించి పెంపొందించే అవకాశాలు కల్పించాలి. అలాచేస్తే మన భవిష్యత్ బాగుంటుంది. కాబట్టి చెట్టమ్మను బతికించుకునేందుకు చుట్టాలమవుదాం.
-ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త

చెట్టు అమ్మ వంటిది:

నా దృష్టిలో చెట్టు అమ్మ వంటిది. అమ్మ జన్మనిస్తే.. చెట్టు ఆయుష్షునిస్తుంది. నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే ఈ విషయం గ్రహించాను. మా గ్రామంలో అప్పటికే మొక్కల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించా. మొక్కల పెంపకంపై నాటికలు.. కథలు.. కవితలు రాసి ప్రజల్లో అవగాహన కల్పించాను. ఆ అలవాటే మండలం.. జిల్లా దాటి ప్రచారం కల్పించేట్లు చేసింది. ఇప్పుడు హైదరాబాద్ చేరుకోవడానికి ఉండే జాతీయ రహదారుల వెంట గోడలకు.. ఇండ్లకు.. బస్సులకు చెట్టు ప్రాధాన్యం గురించి ఆలోచింపజేసే కోట్స్ రాస్తున్నా. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా నేను రాసిన చెట్టు సందేశాలు కనిపిస్తాయి.
-సురేశ్ దండు, వృక్ష పరిరక్షకుడు

హరితోద్యమం:

హరితహారం కార్యక్రమాన్ని ఏదో యాంత్రికంగా జరిగే ప్రభుత్వ తంతు వలె కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఓ హరిత ఉద్యమంలా కొనసాగుతున్నది. వానలు వాపస్ రావాలె.. కోతులు వాపస్ పోవాలె అని సీఎం గారిచ్చిన నినాదం జనసామాన్యం గుండెలను తాకింది. ప్రభుత్వం ఇచ్చిన పిలుపునందుకొని ప్రజలు.. సంస్థలు స్వచ్ఛందంగా కలిసి వచ్చి పనిచేస్తున్నాయి. ప్రతీ ఊరిలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బాధ్యతగా మొక్కలు నాటుతున్నారు. తెలంగాణ భూమిపై పచ్చని నీడను పరిచే ఈ మహాయజ్ఞం నిరంతరాయంగా.. నిరాటంకంగా కొనసాగుతుందనే నమ్మకం ఇటు ప్రభుత్వానికి.. అటు ప్రజలకూ ఉన్నది.
-ప్రియాంకా వర్గీస్, హరితహారం ఓఎస్డీ

1928
Tags

More News

VIRAL NEWS