చీలం రాణీ సిర్నాపల్లి సంస్థానం


Sun,September 2, 2018 01:18 AM

(తెలంగాణ సంస్థానాలు: పదో భాగం)

Sirnapalli-gadi
నిజాం రాజ్య సంస్థానాల్లో అభివృద్ధిలో ప్రముఖ స్థానం పొందిన వాటిల్లో మహోన్నత చరిత్ర కలిగిన సిర్నాపల్లి సంస్థానం ఒకటి. నిజామాబాద్‌గా మారిన ఇందూరు సీమలోని సిర్నాపల్లి సంస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంస్థాన పాలకులు ఉదార స్వభావులు, ప్రజాభిమానం చూరగొన్నవారు. సిర్నాపల్లి సంస్థానం కాకతీయుల పాలనలో, తరువాత కుతుబ్‌షాహీల పాలనలో, ఆ తరువాత నిజాం ఏలుబడిలో ఉండింది. సుమారు 400 ఏండ్ల చరిత్ర గల ఈ సంస్థానం కింద దాదాపు 140 గ్రామాలుండేవి. ఈ సంస్థాన పాలకుల్లో రాణీ చీలం జానకీబాయి సమర్థవంతమైన పాలకురాలిగా పేరుగాంచారు. ఈమె హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ఇప్పటికీ అజరామరం.

నగేష్ బీరెడ్డి
ఫీచర్స్ ఎడిటర్, నమస్తే తెలంగాణ
సెల్ : 80966 77177

సిర్నాపల్లి నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ఉంది. సిర్నాపల్లి సంస్థాన చరిత్ర తెలుసుకోవడానికి మనకు లభిస్తున్న ఆధారాలు చాలా తక్కువ. బీయన్ శాస్త్రి రాసిన రెడ్డి రాజ్య సర్వస్వం ద్వారా కొంత సమాచారం లభిస్తున్నది. తైమూరు వంశీయుల పాలనాకాలం నుంచే ఈ సంస్థానం మనుగడలో ఉన్నట్లు తెలుస్తున్నది. క్రీ.శ.1632 నాటి ఫర్మానా ప్రకారం సిర్నాపల్లిపై చెన్నారెడ్డి అనే ఆయన హక్కులు కలిగి ఉన్నాడు. ఈ చెన్నారెడ్డే సిర్నాపల్లి సంస్థానం మొదటి పాలకుడిగా చరిత్ర చెబుతున్నది. చెన్నారెడ్డికి మహమరతిబ్, చెష్టార్, నిషాల్ వంటి బిరుదులు ఉన్నాయి. చెన్నారెడ్డి తర్వాత అతని కుమారుడు రఘుపతి రెడ్డి వంశపారంపర్యంగా పాలనాబాధ్యతలు చేపట్టాలి. కానీ, రఘుపతిరెడ్డి పిన్నవయస్కుడు కావడం వల్ల అతని తల్లి చెన్నమ్మ కొంతకాలం రాజ్యపాలన చేసింది. రఘుపతి రెడ్డి యుక్తవయస్సుకు వచ్చాక సంస్థాన పాలనా బాధ్యతలు చేపట్టాడు. రఘుపతి రెడ్డి తర్వాత వరుసగా చెన్నారెడ్డి, రాంరెడ్డి, రఘునాథరెడ్డి, చెన్నారెడ్డి, వెంకటరెడ్డి, చెన్నారెడ్డిలు వంశ పారంపర్యంగా పాలన సాగించినట్లు తెలుస్తున్నది. చెన్నారెడ్డి తర్వాత ఆయన భార్య రాణీ ఊహమ్మకు అధికారాన్ని ఇస్తూ క్రీ.శ. 1789లో అప్పటి నిజాం రాజ్య మంత్రి ఉత్తర్వులు ఇచ్చాడు. రాణీ ఉహమ్మ వీరనారీమణి. ఈమె సైనిక దుస్తులు ధరించి యుద్ధాలలో పాల్గొని నిజాం నవాబు ప్రశంసలు పొందిందట. రాణీ ఊహమ్మ మరణానంతరం రాజారాం అధికారం చేపట్టాడు. రాజారాం మరణానంతరం ఆయన భార్య జానకీబాయి సంస్థానాధీశురాలయ్యింది. ఈమె తర్వాత వారి కుమారుడైన రఘుపతిరెడ్డి, ఆ తర్వాత ఆయన కుమారుడు రాజా ప్రతాపరెడ్డి సంస్థానాన్ని పరిపాలించారు.

రాజా ప్రతాపరెడ్డి మరణానంతరం ఆయన భార్య చీలం జానకీబాయి సంస్థాన బాధ్యతలు చేపట్టింది. పిట్లం (కామారెడ్డి జిల్లాలోని మండలం) గ్రామానికి చెందిన రేకులపల్లి లింగారెడ్డి కుమార్తె ఈ జానకీబాయి. ఈమెకు చిన్నతనంలోనే ప్రతాపరెడ్డి (సిర్నాపల్లి సంస్థానాధీశుడు రఘుపతి రెడ్డి, మంగమ్మల కుమారుడు)తో వివాహమైంది. పెండ్లయిన మూడేండ్లకే ప్రతాపరెడ్డి మరణించడంతో జానకీబాయి చిన్న వయసులోనే సంస్థాన పాలనాబాధ్యతలను చేపట్టాల్సి వచ్చింది. అయినా రాణీ జానకీబాయి సిర్నాపల్లి సంస్థానానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టి జనరంజకంగా పాలన సాగించింది. జానకీబాయి గొప్పదాత, ఉదార స్వభావి, మహామనిషిగా కీర్తి పొందారు. ఈమె దాతృత్వం గురించి ఇప్పటికీ స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటారు. ఈమె మరణించిన తర్వాత మృతదేహాన్ని దహనం చేస్తే కుడి చేయి కాలలేదని ఇది రాణి దాతృత్వానికి నిదర్శనమనీ చెబుతారు.

రాణీ దర్బార్ సంస్థాన్ సిర్నాపల్లిగా పాలన సాగించిన జానకీబాయి ప్రజలకు నీటి పారుదల వసతులను కల్పించడంలో ఎంతో ఆసక్తి చూపారు. వ్యవసాయం కోసం చెరువులను, కుంటలను, బావులను తవ్వించారు. సంస్థానంలో ఎన్నో సెలయేర్లకు అడ్డుకట్టలు వేయించి కాలువలను నిర్మించారు. జానకీబాయి నిర్మించిన చెరువులు నేటికీ జల సమృద్ధితో ఉంటూ ఆ ప్రాంతాల్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. సిర్నాపల్లి, నల్లవెల్లి, ఇందల్వాయి (ఇందల్వాయి మండలంలోని గ్రామం) , గౌరారం, లోలం, రామడుగు (దర్పల్లి మండలంలో గ్రామాలు), ఎల్లారెడ్డిపల్లి (తాడ్వాయి మండలంలో గ్రామం) గ్రామాల చెరువులు, జానకంపేట అష్టముఖీ కోనేరు వాటిలో ముఖ్యమైనవి. జానకీబాయి కట్టించిన ఇందూరు (నిజామాబాద్ జిల్లాలోని పట్టణం) చెరువు అలుగు పోసేప్పుడు ఎంతో అందంగా ఉంటుంది. స్థానికులు ఇందూరు నయాగరగా పిలుచుకునే ఈ చెరువును చూడడానికి రెండు కళ్లూ సరిపోవంటే అతిశయోక్తి కాదు. గొలుసుకట్టు చెరువుల నిర్మాణం, ఇందల్వాయి చెరువు, జానకమ్మ చెరువు వంటి నిర్మాణాలు ఆనాటి ఇంజినీరింగ్ ప్రతిభకు తార్కాణంగా నిలుస్తున్నాయి. నిజామాబాద్ పట్టణ ప్రజల మంచినీటి సౌకర్యం కోసం మంచిప్ప చెరువును తవ్వించింది రాణీ జానకీబాయి.

క్రీ.శ. 1887లో మొదటి సాలార్‌జంగ్ జిల్లాల విభజన చేస్తున్నప్పుడు జానకీబాయి ఇందూరుగా పిలుస్తున్న తన సంస్థానంలోని ప్రాంతాన్ని నిజాంబాద్‌గా మార్చింది. ఆ నిజాంబాదే కాలక్రమంలో నిజామాబాద్‌గా మారింది. క్రీ.శ. 1899లో నిజాం రాజు హైదరాబాద్ నుంచి బోధన్, బోధన్ నుంచి మహారాష్ట్రకు రైల్వే లైను వేయిస్తున్నట్లు తెలుసుకున్న జానకీబాయి నిజాం రాజును సంప్రదించి ఆ రైల్వే లైన్‌ను హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు, నిజామాబాద్ నుంచి మహారాష్ట్రకు మార్పించింది. రైల్వే లైనును ఏర్పాటు చేయడానికి నిజాం రాజు పంపించిన సర్వేయర్‌కు సహకరిస్తూనే రాణీ రైల్వే మార్గం సిర్నాపల్లి రైతుల సాగుభూముల నుంచి, చెరువుల నుంచి వెళ్లకుండా మార్పు చేయించింది. ఇందుకు అవసరమైన ఖర్చులను రాణీయే భరించింది. అలా 1905లోనే నిజామాబాద్‌కు రైల్వే స్టేషన్ ఏర్పాటు అయింది. జానకంపేట రైల్వే జంక్షన్ ఈమె పేరుతోనే వెలుగొందుతున్నది. జానకంపేట (వేల్పూరు) గ్రామం ఆమె పేరుతోనే ఏర్పాటైంది.

జానకీబాయి సిర్నాపల్లి గడీని కళాత్మకంగా నిర్మించారు. దాదాపు ఐదెకరాల విస్తీర్ణంలో ఇది ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఈ గడీపై ఉన్న బురుజులు పిరమిడ్స్‌లా ఉంటాయి. ఈ గడీలో ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నిర్వహిస్తున్నారు. జానకీబాయి మహబూబ్‌గంజ్‌లోని గడియారం స్తంభం, నవీపేట (నిజామాబాద్‌లో మండల కేంద్రం) గడీ వంటి అద్భుత నిర్మాణాలు చేపట్టడమే కాకుండా సంస్థానంలోని రఘునాథ ఆలయం, ఖిల్లా రామాలయం, ఇందల్వాయి రామాలయం, జానకంపేట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలను పునరుద్ధరించారు. జానకీబాయిని ప్రజలు పగటి మషాల్ దొరసానిగా పిలుచుకునేవారు. పగటి మషాల్ అంటే పగలే దివిటీలు పట్టడం. జానకీబాయి పల్లకీలో ఊరేగేది. అలా ఏదైనా ఊరెళ్లినప్పుడు దొరసాని పల్లకీకి ముందూవెనుకా దివిటీలు పట్టేవారట. దివిటీలు మోసేందుకు ప్రత్యేక సిబ్బంది ఉండేదట. పగలు దివిటీలతో ఇలా పల్లకీలో వెళ్లడం ఆ కాలంలో ఒక అత్యున్నతమైన రాణీయోగానికి ప్రతీకగా చరిత్రకారులు చెబుతారు. జానకీబాయికి గుర్రపు స్వారీ అంటే మక్కువగా ఉండేదట. కరువు సమయాల్లో పన్నులు వసూలు చేయడానికి వచ్చిన నిజాం దూతలను బండికి కట్టేసిన ధీరవనితగా జానకీబాయి గురించి ప్రజలు చెబుతారు. జనం కరువు కాటకాల్లో కొట్టుమిట్టాడుతుంటే పన్నులేంటి అంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే అధికారుల్ని ఎదిరించేదట.
Sirnapalli-gadi3
ఐదో నిజాం మహబూబ్ ఆలీఖాన్ సుమారు 42 ఏండ్ల పాటు పాలన సాగించగా, ఈయన రాజ్య పాలనకు 1894లో 25 ఏండ్లు నిండాయి. ఈ రజతోత్సవాల సందర్భంగా జరిగిన ఉత్సవాల్లో నిజాం రాజు చీలం జానకీబాయికి రాణీ బిరుదుతోపాటు అనేక బహుమతులను ఇచ్చాడట. ఐదువందల అశ్విక దళంపై ఆధిపత్యం కలిగి ఉండే హక్కును కూడా ప్రసాదించాడట. చీలం జానకీబాయికి సంతానం కలుగకముందే భర్త మరణించడంతో వారసుడి కోసం తన తమ్ముడి కుమారుణ్ని దత్తత తీసుకుంది. ఆయన పేరు రామలింగారెడ్డి. జానకీబాయి మరణానంతరం ఈయనే సంస్థానాధీశుడయ్యాడు. రామలింగారెడ్డి వనపర్తి సంస్థానాధీశుడైన రెండో రాజా రామేశ్వరరావు కుమార్తె జానకమ్మను వివాహం చేసుకున్నాడు. రామలింగారెడ్డి అనంతరం ఆయన కుమారుడు రాజా శ్రీరాంభూపాల్ సంస్థానాధీశుడయ్యాడు. ఈయన కాలంలోనే నిజాం రాజ్యం పతనం కావడంతో సిర్నాపల్లి సంస్థానం నిజామాబాద్ జిల్లాలో విలీనమైంది. అప్పట్లో నిజామాబాద్‌లోని సంస్థానాల నుంచి ఐఏఎస్ సాధించింది ఇద్దరే. వారిలో శ్రీరాంభూపాల్ ఒకరు కాగా, దోమకొండ సంస్థానానికి చెందిన ఉమాపతి రావు రెండో వ్యక్తి. శ్రీరాంభూపాల్ జిల్లా ప్లానింగ్ అధికారిగా కూడా పనిచేశారు. 1969 నుంచి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు. కాగా, శ్రీరాంభూపాల్ విశ్రాంత ఐఏఎస్‌గా 2013లో మరణించారు. ఈయన కూతురు అనురాధారెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ఉంటున్నారు. తాతమ్మ జానకీబాయి కృషి, నాన్న స్ఫూర్తితో నిజామాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు ఆనాటి జ్ఞాపకాలను పరిరక్షించేందుకు ఆమె కృషి చేస్తున్నారు. అనురాధారెడ్డి ఇన్‌టాక్ సంస్థలో హైదరాబాద్ చాప్టర్ కన్వీనర్‌గానూ పనిచేస్తున్నారు.
వచ్చేవారం: ఆందోల్-జోగిపేట సంస్థానం
Sirnapalli-gadi1
రాణీ దర్బార్ సంస్థాన్ సిర్నాపల్లిగా పాలన సాగించిన జానకీబాయి ప్రజలకు నీటి పారుదల వసతులను కల్పించడంలో ఎంతో ఆసక్తి చూపారు. వ్యవసాయం కోసం చెరువులను, కుంటలను, బావులను తవ్వించారు. సంస్థానంలో ఎన్నో సెలయేర్లకు అడ్డుకట్టలు వేయించి కాలువలను నిర్మించారు. జానకీబాయి నిర్మించిన చెరువులు నేటికీ జల సమృద్ధితో ఉంటూ ఆ ప్రాంతాల్ని సస్యశ్యామలం చేస్తున్నాయి.
Sirnapalli-gadi2
శ్రీరాంభూపాల్ విశ్రాంత ఐఏఎస్‌గా 2013లో మరణించారు. ఈయన కూతురు అనురాధారెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ఉంటున్నారు. తాతమ్మ జానకీబాయి కృషి, నాన్న స్ఫూర్తితో నిజామాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు ఆనాటి జ్ఞాపకాలను పరిరక్షించేందుకు ఆమె కృషి చేస్తున్నారు.

732
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles