చియాన్..ఛాయా చిత్రకారుడు!


Sun,December 2, 2018 03:17 AM

VIKRAM
నటుడవ్వాలని పట్టుదల. అప్పడే ఆయన తండ్రి హీరోగా సినిమాలు చేస్తున్నాడు. కానీ, అతను మాత్రం డమ్మీ పుత్రుడిలా ఉండకూడదనుకున్నాడు. రంగస్థలమే తనకు సరైన వేదిక అనుకొని.. శివపుత్రుడిలా రెచ్చిపోయాడు. అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదు. కష్టానికి కేరాఫ్‌గా మారి.. తనదైన నటనతో అగ్రహీరోగా ఎదిగాడు. నటుడిగా, గాయకుడిగా, రంగస్థల కళాకారుడిగా, సామాజిక సేవకుడిగా తనలోని మరో కోణాన్ని లోకానికి తెలియజేశాడు చియాన్ విక్రమ్.

- పసుపులేటి వెంకటేశ్వరరావు
ఫోన్: 8885797981తండ్రి పేరులో వీ,కే అక్షరాలను, తల్లి పేరులోని ఆర్,ఏ అక్షరాలను, పుట్టిన నక్షత్రం నుంచి రామ్ అనే పదంతో విక్రమ్‌గా పేరు పెట్టారు.

బొంబాయి సినిమా ఆఫర్ ముందుగా విక్రమ్‌కే వచ్చింది. గడ్డం తీయలేక సినిమాను వదులుకున్నాడు.

మల్టీ టాలెంటెడ్.. అనే పదానికి సరిగ్గా సూటవుతాడు హీరో విక్రమ్. కోలీవుడ్ హీరోగా ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి.. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. పాత్రలో వైవిధ్యం ఉంటే చాలు.. హిట్టూ, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా వందకు వంద శాతం న్యాయం చేస్తాడు చియాన్. ఒక పాత్రను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుపడానికి ఎంతో అధ్యయనం, పరిశోధన చేస్తాడు. అందుకే విక్రమ్‌ను విభిన్న పాత్రలకు పెట్టింది పేరు అంటారు. శివపుత్రుడు, అపరిచితుడు, ఇంకొక్కడు, ఐ వంటి చిత్రాలు చియాన్ విక్రమ్ ప్రతిభకు తార్కాణాలు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇటు క్లాస్‌ని, మాస్‌ని ఆకట్టుకోగల ఆహార్యం, నటన విక్రమ్ సొంతం.

రంగస్థలం టు టాప్ హీరో!

కాలేజీలో చదివే రోజుల్లోనే రంగస్థల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రమ్. నాటకాల పోటీల్లో వివిధ పాత్రల్లో నటించి అప్పట్లోనే నటుడిగా తనదైన ముద్ర వేశాడు. ఇంగ్లిష్ నాటకాలంటే చాలా ఇష్టం. మద్రాస్ ఐఐటీలో జరిగిన నాటక పోటీల్లో ఉత్తమ నటుడి బహుమతి అందుకున్నాడు. అప్పటి నుంచి విభిన్న పాత్రలపై దృష్టిపెడుతూ, మంచి కథానాయకుడిగా పేరుతెచ్చుకొని అగ్రస్థానంలో నిలిచాడు. తండ్రి జాన్ విక్టర్ ఏ.కె.ఏ వినోద్ రాజ్ నటుడు, తల్లి రాజేశ్వరి సబ్‌కలెక్టర్. తమ్ముడు అరవింద్ కూడా నటుడే. చెల్లి అనిత ఉపాధ్యాయురాలు. భార్య శైలజ బాలకృష్ణన్. వీరిది ప్రేమ వివాహం. కూతురు అక్షిత, కొడుకు ధృవ్. తల్లి హిందువు, తండ్రి వినోద్‌రాజ్ క్రిస్టియన్. ఆయన పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. తండ్రే తనకు ఆదర్శమంటాడు విక్రమ్.

విక్రమ్ ఫౌండేషన్‌తో సేవలు..

ఎదుటి వారు బాధపడుతుంటే.. వారిని ఓదార్చేందుకు చేతనైన సాయం చేసేవాడు విక్రమ్. ఆ సేవా గుణమే విక్రమ్ ఫౌండేషన్‌కు నాంది పలికింది. ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది అభాగ్యులకు, అన్నార్థులకు, చిన్నారులకు, విద్యార్థులకు సహాయం చేస్తున్నాడు. 2011లో ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు సామాజిక కార్యక్రమాల్లో తనవంతు సాయమందిస్తున్నాడు. ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా బాధితులకు సాయమందించడంలో ముందుంటాడు చియాన్. తను పెద్ద హీరో అయినా సామాన్యుడిగా బతుకుతుంటాడు. మార్కెట్‌కు వెళ్లినా బౌన్సర్లను తీసుకెళ్లడు. అభిమానులు దగ్గరికొస్తే ఆప్యాయంగా పలుకరిస్తాడు.

సింగర్- డబ్బింగ్ ఆర్టిస్ట్

విక్రమ్‌లో గాయకుడు కూడా ఉన్నాడు. పాటలు పాడడం, వినటం అంటే చాలా ఇష్టం. చియాన్‌కు అన్ని సంగీత వాయిద్యాలపై పట్టుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. అమరావతి, పుధియ ముగన్, పాసమలర్గల్, కదలన్, కురుదిపునై, కదైదేశం, సత్య, గాంధీ వంటి చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. కందసామి చిత్రంలో నాలుగు పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. జెమిని, మదరాసి పట్టిణం, మల్లన్న, రాజ పైట్టె, స్కెచ్ వంటి సినిమాల్లో పాటలు పాడాడు. కాలేజీ రోజుల్లో జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా విక్రమ్ తెరంగేట్రం ఆలస్యమైంది. మొదటి చిత్రం ఎన్ కాదల్ కణ్మణి. బొంబాయి సినిమా ఆఫర్ ముందుగా విక్రమ్‌కే వచ్చింది. గడ్డం తీయలేక సినిమాను వదులుకున్నాడు. ఇప్పటి వరకూ ఏడు ఫిల్మ్ ఫేర్, ఒక జాతీయ అవార్డు అందుకున్నాడు. 2011లో యూనివర్సిటీ ఆఫ్ మిలాన్ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

ఫొటోలంటే ప్రాణం..!

విక్రమ్‌కు ఫొటోలు తీయడం ఎంతో ఇష్టం. ఏ శుభకార్యానికి వెళ్లినా ఆ ఫొటోలు సేకరించి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకుంటాడు. తనవారితో గడిపిన మధురక్షణాలను కెమెరాలో బంధిస్తాడు. తాను సేకరించిన, తీసిన ఫొటోలతో ప్రదర్శనలు కూడా పెడుతుంటాడు. చిన్నప్పటి నుంచి చిత్ర కళాకారుడైన విక్రమ్.. తాను గీసిన కళాఖండాలను ఇంట్లో అందంగా అలంకరిస్తుంటాడు. తీరిక సమయాల్లో కుంచె పట్టుకొని పెయింటింగ్స్ వేస్తుంటాడు. చియాన్‌కు మెమోరీ పవర్ ఎక్కువ. తనవారి ఫోన్ నంబర్లు సేవ్ చేసుకోకుండానే టక్కున చెప్పేస్తాడు.

265
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles