చిత్రవిచిత్ర నైవేద్యాలు, ప్రసాదాలు


Sat,March 23, 2019 09:33 PM

సాధారణంగా గుళ్లో ప్రసాదం అంటే మనకు గుర్తొచ్చేది లడ్డూ, పులిహోర, చక్కెరపొంగలి, కొబ్బరి ఇలా.. కానీ, మటన్ బిర్యానీ, చాక్లెట్లు, బంగారం, వెండి, నోట్లకట్టలు ప్రసాదంగా ఎప్పుడైనా తీసుకున్నారా? అయితే ఓసారి ఈ దేవాలయాలకు వెళ్లిరండి.

బిర్యానీ ప్రసాదం


తమిళనాడు మధురై జిల్లా ఆవరణలోని మునీశ్వరుడి ఆలయంలో ఓ వింత ఆచారం ఉంది. ఆ గుడిలో ప్రసాదంగా మటన్ బిర్యానీని పెడతారట. స్వామి వారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత భక్తులకు ప్రసాదంగా పంచిపెడుతున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం మధురై జిల్లా తిరుమంగళం సమీపంలోని వడుకంపట్టి గ్రామంలోని మునీశ్వరుడి ఆలయంలో ప్రతి సంవత్సరం జనవరి 25న జరిగే ఉత్సవాల్లో మటన్ బిర్యానీని ప్రసాదంగా పంచుతారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆచారం అమల్లో ఉంది. ఈ ఏడాది కూడా 2 వేల కిలోల బాస్మతీ బియ్యం, 200 కిలోల మేక మాంసంతో బిర్యానీని తయారు చేసి ప్రసాదం పెట్టారు. దీని వెనుక ఓ పురాణ కథ ఉంది. 85 ఏళ్ల క్రితం ఎస్వీఎస్ సుబ్బానాయుడు అనే వ్యక్తి మునీశ్వరుడు పేరుతో ప్రారంభించిన హోటలుకు బాగా లాభాలు వచ్చాయి. ఆ హోటల్‌లో మటన్ బిర్యానీ ప్రత్యేకం. దాంతో ఆ స్వామికి రెండేళ్ల పాటు మటన్ బిర్యానీతో నైవేద్యం సమర్పించిన అనంతరం భక్తులకు ప్రసాదంగా పంచారట. అప్పటి నుంచి గ్రామస్థులంతా కలిసి బిర్యానీ తయారు చేసి ప్రసాదంగా పంపిణీ చేయడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు రాష్ట్రంలో వందల సంఖ్యలో మునియాండి మాంసాహార హోటళ్లు వెలిశాయి. ఇప్పుడు ఆ హోటళ్లు అక్కడ ఫుల్ ఫేమస్. బిర్యానీని బ్రేక్‌ఫాస్ట్‌గా తినడమన్నది ఈ ఆలయానికి చెందిన ప్రత్యేకతగా ఆలయ నిర్వాహకులు చెబుతారు. ఎక్కడా ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ బిర్యానీ ప్రసాదం అందిస్తామని చెప్పారు.
Temples

బంగారం, వెండి ప్రసాదం


మధ్యప్రదేశ్‌లోని రత్లాం అనే నగరంలో ఉన్న మహలక్ష్మి దేవాలయాన్ని సందర్శించిన భక్తులకు బంగారం, వెండిలతో పాటు నోట్ల కట్టలను కూడా ప్రసాదంగా ఇస్తుంటారు. భక్తులందరికి ఇవి ప్రసాదాలుగా ఇవ్వడానికి ఆ గుళ్లో ఏమన్నా నిక్షేపాలున్నాయి అనుకుంటున్నారా? అదేం లేదు. ఇవ్వన్ని ఎక్కడి నండి వస్తాయి అంటే.. భక్తుల నుండే. భక్తుల నుండి వచ్చిన విలువైన కానుకలను ఆలయం వారు తీసుకోకుండా, తిరిగి భక్తులకే ప్రసాదంగా పంచిపెట్టడం ఆ ఆలయ ప్రత్యేకత. మనం అక్షయ తృతియగా పిలుచుకునే దంతేరాస్ పర్వదినం ముగిసిన మరుసటి రోజు నుండి బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులను దేవీ దర్శనం చేసుకున్న భక్తులందిరికీ ప్రసాదంగా పంచిపెడుతుంటారు. దంతెరాస్ పండుగను చేసుకుని మహలక్ష్మి దేవికి, చాలామంది భక్తులు కిలోల చొప్పున బంగారం, వెండి కడ్డీలు, వేల కోట్ల రూపాయలు కానుకగా సమర్పిస్తారు. అక్షయతృతియ మొదలుకొని దీపావళి పర్వదినం వరకూ ఈ ఆలయమంతా భక్తులతో కిక్కిరిసి ఉంటుంది. అలా వచ్చిన కానుకులను తిరిగి వేరే భక్తులకు పంచుతారంట.

చాక్లెట్ల ప్రసాదం


కేరళలోని తెక్కన్ పలని బాలసుబ్రమణ్య (కుమారస్వామి) ఆలయంలో భక్తులు చాక్లెట్లను నైవేద్యంగా అర్పించుకుంటారు. మంచి బ్రాండ్లకు చెందిన చాకోబార్లను ఆ ఆలయంలో దేవునికి పెట్టిన తర్వాత పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వాటిని తిరిగి భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. అలప్పుజ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ ఆలయ ప్రాంతాన్ని మంచ్ మురుగన్‌గా పిలుస్తారు. ఆలయ అధికారుల కథనం ప్రకారం.. భిన్న కులాలు, సంప్రదాయాలు, మతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తారు, వారందరూ చాక్లెట్లను మురగస్వామికి నైవేద్యంగా సమర్పించి స్వామివారి దీవెనలు పొందుతారు. పరీక్షల సమయంలో ఇక్కడికి చిన్నారులు ఎక్కువ సంఖ్యలో వస్తారట. దేవునికి నైవేద్యంగా అర్పించడం ఎప్పట్నుంచి ప్రారంభమైందో తెలియదని వారు చెబుతున్నారు. ఆలయంలో ప్రధాన దేవుడు బాల మురుగన్. బాల మురుగన్ అంటే చిన్న వయస్సులో ఉన్న దేవుడు (కుమారస్వామి) అని అర్థం.. కాబట్టి, చిన్న పిల్లలకు చాక్లెట్లు అంటే ఇష్టమని భావించిన భక్తులు స్వామి వారికి చాక్లెట్లు సమర్పించే ఆచారం అమలులోకి వచ్చి ఉంటుందని వారి అభిప్రాయం. ఇతర సంప్రదాయాల్లాగే తులాభారంలో బెల్లం, పూలు పెట్టి సమర్పించినట్లుగా ఇక్కడ కూడా చాక్లెట్లను తులాభారంలో భక్తులు సమర్పించుకుంటారు. రాష్ట్రంలోని భక్తులేకాక ఇతర రాష్ర్టాల నుంచి, దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు చాక్లెట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంతకుముందు చిన్నారులు మాత్రమే దేవునికి నైవేద్యం పెట్టేవారు.. ఇటీవలి కాలంలో అన్ని వయస్సుల వారూ చాక్లెట్లను సమర్పించుకుంటున్నారు.

723
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles