చదువుకొని సినిమాలేంటీ అన్నారు!


Sun,September 2, 2018 01:32 AM

mohan-krishna
చదువులో ఫెయిలైనవాళ్లు, చదువు అబ్బని వాళ్లు మాత్రమే సినిమా రంగంలోకి వస్తారనే దురభిప్రాయం అందరిలో ఉంది. చదువుకున్న వాళ్లను సినిమా వాళ్లు చులకనగా చూడటం మానాలి.ఈ ధోరణి వల్లే విద్యావంతులు ఇండస్ట్రీలోకి రావడానికి భయపడ్డారు. సినీ రంగంలోకి వచ్చిన కొత్తలో నాకు ఆ అనుభవాలు ఎదురయ్యాయి. అంతర్జాతీయ సినిమాలకు సంబంధించి తనకు తెలిసిన అంశాలను చెబితే నీ సలహాలు మాకొద్దు. మాకు లోకల్ చాలు. క్లాస్ అక్కరలేదు అని చులకనగా మాట్లాడుతారు. అలా మాట్లాడి మనల్ని మనమే ఒక రకంగా వెనక్కి తోసేసుకుంటున్నాం అంటున్నారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. గ్రహణంతో దర్శకుడిగా తొలి సినిమాకే జాతీయ అవార్డును అందుకున్న ఇంద్రగంటి క్లాసిక్ మేకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఇటీవల సమ్మోహనంతో మరోసారి తన మార్క్ ఆఫ్ టేకింగ్‌ను చూపించిన ఇంద్రగంటి మోహనకృష్ణ బతుకమ్మతోపంచుకున్న తన సినీ ప్రస్థానం ఆయన మాటల్లోనే...
-మడూరి మధు, సెల్: 91827 77416

పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నా స్వస్థలం. 1972లో జన్మించాను. కానీ పెరిగిందంతా విజయవాడలోనే. దాంతో నేను విజయవాడ అబ్బాయిని అయిపోయాను. 1992లో హైదరాబాద్‌కు వచ్చాను. సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్‌ఏ ఇంగ్లీష్‌లో చేరాను. 26 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. కెనడాలో యార్క్ యూనివర్సిటీలో స్క్రీన్‌రైటింగ్‌లో స్పెషలైజేషన్‌గా ఫిలిం మేకింగ్ కోర్సు చేశాను. నా చిన్నతనం మొత్తం సాహిత్య వాతావరణంలోనే గడిచింది. పాత సినిమా పాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. నాన్న గారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ...దర్శకుడు జంధ్యాల సినిమాలకు పాటలు రాశారు. సినిమా రంగంతో ఆయనకు సంబంధాలుండేవి. ఆయన ద్వారా నాకు సినిమాల పట్ల ఇష్టం మొదలైంది. బాపు, రమణ, జంధ్యాల తరుచుగా మా ఇంటికి వస్తుండేవారు. విజయవాడలో లీలామహల్ అనే థియేటర్ ఉండేది. అందులో ఎక్కువగా ఆంగ్ల చిత్రాలు ఆడుతుండేవి. ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మనీ సినిమాలు బాగా చూసేవాణ్ణి. ఫిలింక్లబ్‌లో మెంబర్‌గా ఉన్నాను. అవన్నీ సినిమాలపట్ల నాలో ఉన్న ఆసక్తిని పెంపొందించడానికి దోహదం చేశాయి. ఎమ్‌ఏ తర్వాత సినిమాల్లోకి వెళ్లాలని, దర్శకుడినవ్వాలని నిశ్చయించుకున్నాను.

ఇండస్ట్రీలో నాకు ఎవరూ తెలియదు. ప్రోత్సహించేవారు లేరు. అవకాశాల కోసం ప్రయత్నిస్తూ చాలా గుమ్మాలు ఎక్కాను. కొన్నాళ్ల తర్వాత ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో గ్రహణం కథ రాసుకున్నాను. అంతకుముందు ఫిలిం క్లబ్ ద్వారా తనికెళ్ల భరణితో పరిచయం ఏర్పడింది. దయ్యం కథతో చలి అనే షార్ట్‌ఫిలిమ్ చేశాను. సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ లఘు చిత్రం తనికెళ్ల భరణికి నచ్చింది. ఆ పరిచయం ద్వారా గ్రహణం కథను ఆయనకు వినిపించాను. అది విన్న భరణి నేను సినిమా తీయలేనేమోననే సంశయాన్ని వ్యక్తం చేశారు. మూడు లక్షల్లో ఎలాగోలా పూర్తిచేస్తానని అన్నాను. నా మాటల్లోని విశ్వాసాన్ని గమనించిన ఆయనే ఓ స్నేహితుడిని అడిగి మరో ఆరున్నర లక్షలు ఇప్పించారు. ఫిలిం మేకింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. సినిమాలకు సంబంధించి బేసిక్ గ్రామర్ తెలుసు. లఘు చిత్రం తప్ప అప్పటివరకు సినిమా చేసినా అనుభవం లేదు. దిగితే కానీ ఈతరాదని అంటారు. ఎలాగైనా తీయగలననే గుడ్డినమ్మకంతో గ్రహణం సినిమాను మొదలుపెట్టాను. ఎవరి దగ్గర సహాయకుడిగా పనిచేయకుండానే ఆ సినిమా చేశాను. ఆరున్నర లక్షలతో చిన్న కెమెరాతో చేసిన ఆ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. నా ప్రతిభ ఏమిటో అందరికి తెలిసింది. అవకాశాలు రావడం మొదలుపెట్టాయి.
సినిమా రంగాన్ని వదిలిపెట్టాలనే ఆలోచన చాలాసార్లు కలిగింది. పీహెచ్‌డీని మధ్యలో వదిలివేసి అనవసరంగా సినిమాల్లోకి వచ్చానని అనుకున్న సందర్భాలున్నాయి. బాగా చదువుకొని సినిమాలేంటి అని చాలామంది అనేవారు. తప్పు చేసినట్లు చూసేవారు. వారి మాటలు ఆశ్చర్యాన్ని కలిగించేవి. ఏడాది తిరిగినా అవకాశాలు రాకపోవడంతో తిరిగి కెనడా వెళ్లాలనుకున్నాను. అదే మాట అమ్మతో చెప్పాను. కెనడా ఎప్పుడైనా వెళ్లవచ్చు. ఇంకో ఏడాది ప్రయత్నించు అని నన్ను పోత్సహించింది.

నిర్మాతలు, దర్శకుల నుంచి లైట్‌బాయ్ వరకు చదువుకొని సినిమాల్లోకి ఎందుకొచ్చావని తొలుత నాకు సలహాలు ఇచ్చారు. దాంతో వారి మాటలు నాలో నిరాశని కలిగించాయి. ఒక లఘు చిత్రం తీసి ప్రతిభను నిరూపించుకోవాలని అనుకున్నాను. దాని ద్వారా అవకాశాలు వస్తే ఇండస్ట్రీలో కొనసాగాలని లేదంటే సినిమాలకు గుడ్‌బై చెప్పాలని అనుకున్నాను. అప్పటివరకు ఉన్న సేవింగ్స్ మొత్తం అయిపోయాయి. అమ్మానాన్నలు కొన్నేళ్ల తర్వాత రిటైర్ అయిపోతారు. వారిపై ఇంకా ఆధారపడకూడదని చలి అనే లఘు చిత్రాన్ని తెరకెక్కించాను. దానికి మంచి పేరు రావడంతో దర్శకుడిగా అవకాశాలు వచ్చాయి.

నా తొలి సినిమా గ్రహణం సమయంలో చాలా కష్టాలు అనుభవించాను. చేతిలో ఒక్కపైసాలేదు. నటీనటులు ఎవరూ ఒక్క రూపాయి తీసుకోకుండా నటించారు. చాలా కష్టసాధ్యమైన పరిస్థితుల్లో షూట్ చేశాం. ఆయినా అందరూ నన్ను నమ్మారు. చిన్న కెమెరాతో లైట్స్ లేకుండా తీశాం. కనీసం టెలిఫిల్మ్ కోసమైనా పనికివస్తుందా అనే పరిస్థితుల్లో ఆ సినిమా చేశాం. దర్శకుడిగా ఎన్ని సినిమాలు చేసినా, నేను చనిపోయేవరకు నా జీవితంలో ప్రత్యేకమైన చిత్రంగా గ్రహణం నిలుస్తుంది. అది లేకపోతే నేను లేను. ఇండస్ట్రీలో నేనంటూ ఎవరికీ తెలియని సమయంలో గ్రహణం ఏమిటి? ఆరు లక్షల్లో సినిమా తీసి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా జాతీయ అవార్డును సాధించడమేమిటి? అసలు అతడెవరూ అంటూ అందరూ నా గురించి మాట్లాడుకునేలా చేసింది. కమర్షియల్‌గా అష్టాచమ్మా, క్రిటికల్‌గా గ్రహణం నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచాయి. చాలామంది అష్టాచెమ్మా నా తొలి సినిమా అనుకుంటారు. కానీ అది నా రెండో సినిమా. తక్కువ బడ్జెట్‌లో అంతా కొత్తవాళ్లతో సినిమా తీసి హిట్టు కొట్టగలనని నిరూపించింది. ప్రత్యేకంగా ఆ సినిమాలో హాన్యనటులెవరు కనిపించరు. తనికెళ్ల భరణి, ఝాన్సీ, హేమ తప్ప మిగతా అంతా కొత్తవారే నటించారు. కోటి రూపాయల బడ్జెట్‌తో ఆ సినిమా చేశాం.

పెద్ద హీరోతో సినిమా చేయాలని, ఆఖిలాంధ్ర ప్రేక్షకుల్ని అలరించాలనే ఆశలు లేవు. అలాంటి సినిమాలు చేయలేకపోయాననే అసంతృప్తి నాలోలేదు. కమర్షియల్ సినిమాలు చేయడంలో కొన్ని పరిమితులు ఉంటాయి. హీరో పరిచయ గీతం ఉండాలి. హీరోయిన్‌తో ఎక్స్‌పోజింగ్ చేయించాలి. అలాంటివి నేను చేయలేను. పది మందిలో ఓ ఐదుగురికి నేను నమ్మింది చెబితే చాలు. ఫలానా హీరోతో చేస్తే ఆ మిగతా అయిదుగురిని థియేటర్‌కు రప్పించగలుగుతామంటే ఒకే. కానీ ఆ హీరోల కోసం కమర్షియల్ హంగులు, ఎక్స్‌పోజింగ్‌లు జోడించి సినిమాను చేయాలంటే కుదరదు.దర్శకుడిగా నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఒక దానికి మరోదానితో సంబంధం ఉండదు. గ్రహణం చిత్రంలో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. అష్టాచెమ్మా సినిమాలో వినోదం, గోల్కొండ హైస్కూల్‌లో క్రీడా కథాంశం తెరకెక్కించాను. జెంటిల్‌మన్ థ్రిల్లర్, సమ్మోహనం లవ్‌స్టోరీ ఇలా విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేశాను. తదుపరి సినిమాను యాక్షన్ నేపథ్యంలో చేయబోతున్నాను. కథ, కథనం, పాత్రలకు మాత్రమే నేను ప్రాధాన్యమిస్తాను. హీరో, ఇమేజ్, నటులను పొగుడుతూ సంభాషణలు, పాటలు రాయించడం నాకు రాదు. అది తప్పో ఒప్పో తెలియదు. అలాంటివి ఎలా చేయాలో అవగాహన లేదు. ఒకవేళ బలవంతంగా ప్రయత్నించినా అభాసుపాలవుతాను. ప్రేక్షకులు నన్ను చూసి నవ్వుకుంటారు.

నిజజీవితంలో నుంచి వచ్చే పాత్రలను సృష్టించడానికే ఇష్టపడతాను. అదే నా బలం. కథ, పాత్రలు రాసుకున్న తర్వాతే నటుల్ని ఎంచుకుంటాను. ఫలానా హీరోని దృష్టిలో పెట్టుకొని కథ రాయడం, హీరో కండలు చూపిస్తూనో, గుర్రం స్వారీ చేయిస్తూనో అతడిలోని హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు తెరకెక్కించలేను. ఆ స్కిల్ నాకు లేదు. ఓ ఆలోచనతో కథను మొదలుపెట్టి పాత్రలు రాసుకొని దానిని డెవలప్ చేసుకున్న తర్వాతే నిర్మాణం గురించి ఆలోచిస్తాను. అలాగని నేనేమీ స్టార్స్‌కు వ్యతిరేకిని కాదు. అగ్రనటులకు నా కథలను వినిపించాను. భవిష్యత్తులో ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి అగ్రనటులతో పనిచేస్తే వారిని కొత్తగా చూపించాలి. హీరోయిజం పిచ్చిలో ఇండస్ట్రీ పడిపోయింది. అలాంటి సినిమాల పట్ల ప్రస్తుతం ప్రేక్షకుల్లో విసుగు మొదలైంది. అందుకే రంగస్థలం, మహానటి లాంటి సినిమాలు ఆడుతున్నాయి. ప్రేక్షకుల్ని తక్కువగా అంచనా వేస్తూ ఇండస్ట్రీ వెనుకబడి ఉంది. ప్రేక్షకులు లాజికల్‌గా ఆలోచించకూడదు, వారికి దొరక్కూడదంటూ ప్రతిక్షణం బిక్కుబిక్కుమంటూ దొడ్డిదారిన ఎలాగోలా కథ చెప్పి డబ్బులు చేసుకుంటున్నారు. అలా కాకుండా ధైర్యంగా ప్రేక్షకులకో మంచి కథ చెప్పాలి. వారు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన ధైర్యం కళాకారుడికి ఉండాలి.

నా కథలన్నీ నిజజీవితంలో నుంచి పుట్టినవే. షూటింగ్ ఉండగా జరిగిన అనుభవాన్ని ఆధారంగా చేసుకొని సమ్మోహనం కథ రాసుకున్నా. ప్రేమనేది ఓ పని అనే ఓ హాలీవుడ్ సినిమాలోని సంభాషణ చూడగానే అరే ఇదేదో భలే ఉందనిపించింది. ఈ ఐడియా నుంచే అంతకుముందు ఆ తర్వాత కథ పుట్టింది. న్యాయం అనేది వయోక్తికం. తప్పు చేసిన వాడిని చంపడం ఒకరి దృష్టిలో అన్యాయమైతే మరొకరు న్యాయమని నమ్ముతారు. ఆ అంశాన్ని ఆధారంగా చేసుకొని బందిపోటు రూపొందించాను. ఎన్ని తరాలు మారినా త్యాగం అనేది మానవుడిలో ఉన్న గొప్ప గుణం అనే పాయింట్‌ను నమ్మి జెంటిల్‌మన్ సినిమా చేశాను. దురాశ దుఃఖానికి చేటు అనే లైన్ నుంచి అమీతుమీ తెరకెక్కించాను. మంచి మాటలు, వ్యక్తులు, గొప్ప రచనలు, సినిమాలు ఇలా ఎక్కడినుంచైనా కథ పుట్టవచ్చు. ఎక్కడ నుంచి స్ఫూర్తి పొంది సినిమా చేశాననే అంశాన్ని స్పష్టంగా చెబుతాను. కాపీ కొట్టను. రచయిత కుటుంబం నుంచి వచ్చి వచ్చాను కాబట్టి రచనల్ని దొంగిలించకూడదనే ప్రాథమిక సూత్రాన్ని పాటిస్తాను. ఆ రచయితకు క్రెడిట్ ఇచ్చిన తర్వాతే మిగతాది నేను తీసుకుంటాను. అష్టాచెమ్మా చిత్రాన్ని ఇంపార్టెన్స్ ఆఫ్ ది బీయింగ్ హానెస్ట్ అనే నాటకం నుంచి నలభై శాతం కథ తీసుకొని ఆరవై శాతం నా శైలి హంగులు జోడించి తెరకెక్కించాను. కథా రచయితగా సినిమాలో నా పేరు కనిపిస్తుంది. రాంబాబు, ఆనంద్ పాత్రల నేపథ్యాల్ని నేనే రాసుకున్నాను కాబట్టి నా పేరు వేసుకున్నాను. దాని గురించి ఎవరైనా అడిగితే చెప్పగలిగే స్థితిలో ఉన్నాను. అలా స్ఫూర్తి అనేది ఒక చోటునుండి కాకుండా రకరకాలుగా ఉంటుంది.

ఇండస్ట్రీ గురించి ఇక్కడి వారే చెడ్డగా మాట్లాడుతున్నారు. హీరోయిన్లు అంటే అన్ని చేయాలి తప్పదంటూ చెబుతున్నారు. వారి మాటల కారణంగా ప్రేక్షకులు సినిమా వారిని చులకనగా చూస్తున్నారు. ఓ మధ్య తరగతి తండ్రి తన కూతురు సినిమాల్లోకి వెళతానంటే ఎందుకు వద్దు అంటున్నాడు. ఇండస్ట్రీ వారే చెడు వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. సినిమాల్లోకి అడుగుపెడతానంటే స్వేచ్ఛగా వెళ్లు అని చెప్పే రోజు వచ్చినప్పుడే ఇండస్ట్రీకి గౌరవం, గుర్తింపు వస్తాయి. ఇంత చదువుకొని దరిద్రపు రంగంలో ఎలా ఉంటున్నావని నా స్నేహితులే చాలా సార్లు నాతో అన్నారు. అలాంటి మాటలు వింటుంటే బాధేస్తుంది.

కొడవటిగంటి కుటుంబరావు, బుచ్చిబాబు రచనలతో పాటు తెలుగు సాహిత్యంలో గొప్ప రచనల్ని సినిమాలుగా తీయాలన్నది దర్శకుడిగా నా కోరిక. ఆ రచనల్ని సమకాలీన ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా మలచాలి. పీరియాడిక్ సినిమా ఇది. ఈ కాలానికి చెందినది కాదని ప్రేక్షకులు అనుకోకూడదు. ఆధునిక ఛాయలతో సినిమా సాగాలి. కన్యాశుల్కం నవలను ఈతరం నటీనటులతో వెండితెరపై ఆవిష్కృతం చేయాలనుంది. చివరకు మిగిలేది, బారిష్టర్ పార్వతీశం, అసమర్థుడి జీవయాత్ర, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా ఇలాంటి గొప్ప రచనల్ని సినిమా ద్వారా నేటి తరానికి పరిచయం చేయాలి.

653
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles