గోరంత రంగు!


Sun,November 12, 2017 02:11 AM

రోజుకో రకం డ్రెస్ వేసుకున్నప్పుడు.. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, చెప్పులు వేసుకోవాలని ఆలోచిస్తారు కొందరు.. కానీ గోళ్ల రంగు కూడా మ్యాచ్ అయితే ఆ అందమే వేరు.. ఒకప్పుడు ఎరుపు రంగు మాత్రమే గోళ్ల రంగుగా భావించేవారు.. ఆ రంగుతో పాటు ఇంద్రధనుస్సులోని రంగులు.. ఇంగ్లిష్ రంగులూ చేరాయి.. అద్దాల్లాంటి రంగులు.. నక్షత్రాలే దిగి వచ్చి గోరంత మెరిపించేస్తున్నాయి..మీ మూడ్‌ని బట్టి రంగులు మారే గోర్ల రంగులూ వచ్చేశాయి.. ఇవే కాదు.. మరెన్నో రంగులూ మార్కెట్‌లో కొలువుదీరాయి.. అసలు ఎన్ని రకాల గోళ్ల రంగులున్నాయో తెలుసా?తెలియకపోతే ఇది తెలుసుకొని గోరంత రంగు వేసుకొని మురిసిపొండి..
Color



క్రీమీ నెయిల్ పాలిష్ :

స్టాండర్డ్ నెయిల్ పాలిష్ అంటే దీని పేరే చెబుతారు. ఈ రంగు మామూలు రంగుల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. ఐస్‌క్రీమ్ ఎలా చిక్కగా ఉంటుందో ఈ రంగులు కూడా అలాగే ఉంటాయి. ఈ రంగును వేసుకోవడానికి ఒక్క కోటింగ్ చాలు. దీనిపై నుంచి మెరిసే ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్ వేస్తే మరింత అందంగా కనిపిస్తుంది. లైట్ కలర్స్ కాకుండా డార్క్ కలర్ నెయిల్ పాలిష్‌లు చాలా అందంగా కనిపిస్తాయి.
Creme

మ్యాట్ ఫినిషింగ్ :

నెయిల్ పాలిష్ వేసుకుంటేనే చేతులు మెరిసిపోవాలి. కానీ ఈ ఫినిషింగ్ అలా ఉండదు. గోడకు వేసే రంగు ఎలా ఉంటుందో, కొన్ని లిప్‌స్టిక్ రంగులు ఎలా ఉంటాయో వీటి ఫినిషింగ్ అలాగే ఉంటుంది. దీన్ని ఒక కోట్ వేస్తే చాలు.. చిక్కగా గోరంతా రంగు కనిపించేస్తుంది. ఒకవేళ మరీ పేలవంగా అనిపిస్తే పై నుంచి షైనీ రంగులు వేసుకుంటే చిక్ లుక్ సొంతమైనట్లే!
ZOYA

ఫ్లేకీ పాలిష్ :

ఇది గ్లిట్టర్‌లాగే కానీ కాస్త డిఫరెంట్ అన్నమాట. లైట్ వెలుతురులో ఇవి మరింత బాగా మెరిసిపోతాయి. మామూలు నెయిల్ పాలిష్‌లో మల్టీ కలర్ ఫ్లేక్స్ కలిపి ఉంటాయి. కాబట్టి పాలిష్ రంగుతోపాటు ఈ ఫ్లేక్స్ మరింత మెరుస్తుంటాయి. ఇంకా లైట్ వెలుతురులో ఈ ఫ్లేక్స్ మరింత అందంగా మెరిసిపోతుంటాయి. నైట్ పార్టీలకు ఈ నెయిల్ పాలిష్ సూటబుల్!
Flakie

జెల్లీ.. :

ఈ నెయిల్ పాలిష్ మనం తినే జెల్లీలాగే కనిపిస్తుంది. ఇది ట్రాన్సపరెంట్ నెయిల్ పాలిష్ కూడా. వాటర్ కలర్స్‌లాగే ఈ నెయిల్ పాలిష్‌లు ఉంటాయి. వైట్ బేస్ మీద ఈ రంగులు వేయాల్సి ఉంటుంది. ఈ రంగు వేసి నెయిల్ ఆర్ట్ వేస్తే కూడా మరింత అందంగా కనిపిస్తుంది. లేయర్లుగా ఈ నెయిల్ పాలిష్‌ని వేయాల్సి ఉంటుంది. ఈ నెయిల్ పాలిష్‌లతో మీ క్రియేటివిటీకి సాన పెట్టుకోవచ్చు.
Jelly

టెక్చర్డ్ :

ఈ పదం ఎక్కడో విన్నట్టుంది కదా! మన ఇంటి రంగులకు టెక్చర్డ్ పెయింట్ వేశారా? అని. అవును ఇది కూడా అలాగే ఉంటుంది. దీన్ని సింగిల్ కోట్ కాకుండా డబుల్ కోట్ వేస్తే షైనింగ్ ఎక్కువ ఉంటుంది. అంతేకాదు.. రెండు షేడ్స్ కలిపి వేస్తే టెక్చర్డ్ నెయిల్ పాలిష్ మరింత బాగా మెరిసిపోతుంది. ఇది మిగతా నెయిల్ పాలిష్‌ల కంటే త్వరగా ఆరిపోతుంది. కాబట్టి బట్టలకు అంటుకుంటుందన్న ఇబ్బంది కూడా ఉండదు.
Textured

మూడ్‌ని బట్టి.. :

మన ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉండక, మారుతూ ఉంటాయి. అలాగే మన నెయిల్ పాలిష్ కూడా మన మూడ్‌ని బట్టి మారుతుంటుంది. అలాగే మన చేతిలో ఉన్న వస్తువును బట్టి అంటే.. చల్లని ఐస్‌క్రీమ్‌లు, వేడి టీ కప్పు ఉన్నప్పుడు మన శరీరంలో ఉష్ణోగ్రతలు మారుతుంటాయి. మన శరీర ఉష్ణోగ్రత తక్కువ ఉంటే లేత రంగులు, ఎక్కువ ఉంటే ముదురు రంగులు కనిపిస్తాయి. దీన్ని బట్టి మనం ఏ మూడ్‌లో ఉన్నామన్నది ఇట్టే కనిపెట్టేయొచ్చు.
Mood

గ్లిట్టర్ :

ఇది చిక్కటి రంగులా ఉండదు. కేవలం నీళ్లలాగే ఉంటుంది. దీంట్లో మెరుపులు జోడించబడుతాయి. అయితే ఈ మెరుపులు రంగురంగుల నక్షత్రాల్లా ఉండొచ్చు, గుండ్రంగా, చతుర్రసంలా రకరకాలుగా ఉండొచ్చు. దీన్ని మామూలుగా కాకుండా ట్రాన్సపరెంట్ నెయిల్ పాలిష్ వేసి దాని మీద ఈ నెయిల్ పాలిష్ కోటింగ్ వేస్తే మెరుపులు మరింత బాగా మెరుస్తాయి.
Glitter

నియాన్ :

మిగతా నెయిల్ పాలిష్‌లతో పోలిస్తే ఈ నియాన్ రంగులు కాస్త డిఫరెంట్. అంటే మామూలు నెయిల్ పాలిష్‌లో ఈ రంగులు దొరుకవు. దీని ఫినిషింగ్ కూడా డిఫరెంట్‌గానే ఉంటుంది. టెక్చర్, క్రీమీ పాలిష్‌లు కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎందుకంటే దీనిలో లక్క కలుపుతారు. వానాకాలంలో ఈ రంగులు మరింత మెరుపు తెస్తాయి.
Neon

డ్యూక్రోమ్:

ఊసరవెల్లి ఎలా రంగులు మారుస్తుందో.. లైటు వెలుతురుకు ఈ రకం నెయిల్ పాలిష్ రంగులు మారుస్తుందట. దీనికి మ్యాజికల్ నెయిల్ కలర్ అని ముద్దు పేరు పెట్టారు. మామూలుగా అయితే ఆకుపచ్చ, పర్పుల్ పింక్ కలర్ షేడ్స్ ఈ నెయిల్ పాలిష్‌లో దొరుకుతాయి. అయితే ముందుగా ఏదైనా మామూలు నల్లరంగు నెయిల్ పాలిష్ వేసి దానిపై నుంచి డ్యూక్రోమ్ నెయిల్ పాలిష్ వేసి చూడండి. మరిన్ని కొత్త రంగులు ఆవిష్కృతమవుతాయి.
Duochrome

మెటాలిక్ :

ఇది నెయిల్ పాలిష్ అనడం కంటే అద్దంలా పనిచేస్తుందంటే సరి. ఏ బంగారు రేకో, వెండి రేకో అతికించినట్టుగా ఈ నెయిల్ పాలిష్ కనిపిస్తుంది. దీన్నే మిర్రర్ క్రోమ్ నెయిల్ పాలిష్ అని కూడా పిలుస్తారు. అచ్చం అద్దంలా మెరిసేంత నున్నగా ఈ నెయిల్ పాలిష్‌లుంటాయి. ఇందులో కేవలం ఈ రెండు రంగులే కాదు.. ఇప్పుడు చాలా రంగులు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి.
Metalic

140
Tags

More News

VIRAL NEWS