గోకర్ణుడు


Sun,April 21, 2019 02:45 AM

ప్రపంచ యుద్ధం జరగాలంటే ఒక అన్యాయం జరగాలి, ఆక్రోశం రావాలి, అందరూ కదలాలి, కానీ లోకకళ్యాణం జరగాలంటే ఆలోచన రావాలి, సంకల్పం మారాలి. ఒంటరిగానైనా తలపెట్టే విశాలహృదయం కావాలి. మనిషి తనను తాను ఉద్ధరించుకోగలిగితే సమాజాన్ని ఉద్ధరించడం చాలా సులువు. తన ప్రవర్తన, ఆలోచన సమాజహితం అయితే మానవ సమాజం తన ద్వారా సఫలమైనట్లే కదా! మనుగడ దిశగా సాగిపోతుందనే కదా! ప్రతి మనిషి పుట్టుకకూ ఒక కారణముంటుంది. దాన్ని తెలుసుకోవడంలోనే విజ్ఞత ఉంది. కారణజన్ములూ అంటే అవతారాలు ఎత్తాల్సిన పనిలేదు. తన పుట్టుకకు కారణం తెలుసుకొని మసలుకుంటే అద్భుతాలు జరుగుతాయి. పుట్టిన పరిస్థితులూ, పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న కుంచిత స్వభావాలు.. మనిషి మనిషిగా బతకగలిగితే ఎలాంటి ప్రభావం బలహీన పరచదని తెలియజెప్పిన వాడే గోకర్ణుడు. తను, తనదైన సమాజాన్ని ఉద్ధరించేందుకు జీవిత గమ్యాన్ని ఏర్పరుచుకున్న వ్యక్తి గోకర్ణుడు.

-ఇట్టేడు అర్కనందనాదేవి

ఆత్మదేవుడూ, దుంధులీ దంపతులకు పుట్టిన సుపుత్రుడు గోకర్ణుడు. మంచితనం, విలువలు, అభిమానం, ఆలోచన పుట్టుకతో వచ్చిన సుగుణాలు. ఆత్మదేవునికి వయసు మీరుతున్నా సంతానం లేకపోయేసరికి ఒకానొక సాధువు మంత్రించిన ఫలం ఇచ్చి, దాన్ని తన భార్యకు ఇవ్వమని, తప్పక పుత్రుడు జన్మిస్తాడని చెబుతాడు. గోకర్ణుని పుట్టుకకు కారణమైన ఆ ఫలం దుంధులీ తినడానికి ఇష్టపడలేదు. కొడుకును కడుపున మోసి, కని, పెంచడం బరువనుకున్నది. తన చెల్లెలి కొడుకును తన కొడుకుగా సమాజానికి పరిచయం చేయాలనుకున్నది. సాధువు ఇచ్చిన పండును ఆవుకు పెట్టింది. ఆ ఆవుకు పుట్టిన వాడే గోకర్ణుడు. ఆత్మదేవుడు గోకర్ణుడు తన కొడుకని తెలియక పోయినా సొంత కొడుకులానే పెంచాడు.

దుంధులీ చెల్లెలి కొడుకును తన కొడుకులా పెంచుతూ వాడికి దుంధుమారుడనీ, ఆవుకు పుట్టిన వాడి చెవులు ఆవు చెవులను పోలి ఉండడంతో గోకర్ణుడని పెంచసాగింది. దుంధుమారుడు దుష్టుడయితే, గోకర్ణుడు మనుషుల్లో మహనీయుడు. గోకర్ణుడికి జీవితం పట్ల తనదైన ఆలోచన ఉంది. జీవితం ఉద్దేశ్యాన్ని కూడా చిన్న నాడే తెలుసుకున్నాడు గోకర్ణుడు. మనిషికి ఉండేది ఒకే జీవితం, దాన్ని చేజేతులా నాశనం చేసుకోకూడదనే దృక్పథంతో పద్ధతిగా బతకసాగాడు గోకర్ణుడు.
Govu

గోకర్ణుడు యుక్తవయసులోకి రాగానే ఇంటి బాధ్యత తనదనీ, చివరి రోజుల్లోనైనా జీవితాన్ని ప్రశాంతంగా గడపమని ఆత్మదేవుని వానప్రస్థాశ్రమానికి పంపించాడు. దుంధుమారుడి బాధలు తాళలేక తల్లి ప్రాణత్యాగం చేసుకుంటే విధిరాతని సరిపెట్టుకున్నాడు. చివరికి దుంధుమారుడు తానాశ్రయ మిచ్చిన వారి చేతుల్లోనే చంపబడ్డాడని తెలుసుకొని అన్నకు శ్రాద్ధకర్మలు జరిపించాడు.గోకర్ణుని మాటల్లోని సత్యం సమాజంలోని ఎంతో మందిని ప్రభావితం చేసింది. నలుగురికీ తనకు తోచిన నాలుగు మాటలు చెప్పి, తన మాటలు ఏ ఒక్కరినైనా ప్రభావితం చేయకపోతాయా! అనే తలంపుతో జీవిత విలువలు చెబుతుండేవాడు గోకర్ణుడు. గోకర్ణుడు ఒకనాడు చీకటి వేళ ఆరుబయట ఆకాశానికేసి చూస్తూ కూర్చుని ఉండగా, నీడలా తన అన్న దుంధుమారుడు కనిపించాడు. చనిపోయిన వ్యక్తి ఎలా కనిపిస్తున్నాడని అనుకునే లోపే, తాను చేసిన పాపాల ఫలితంగా తన ఆత్మ ముక్తికి నోచుకోలేదని వాపోతాడు దుంధుమారుడు. గోకర్ణుడు ఎంతోమందిని కలిసాడు. ఎందరితోనో చర్చించాడు. ఎలాగైనా తన అన్నకు ముక్తిని ప్రసాదించాలని భాగవతం పారాయణ చేశాడు. కేవలం దుంధుమారునికే కాక ఎంతోమంది మోక్షానికి మార్గం చూపాడు గోకర్ణుడు. జీవితం దానంతటదే లభించే అవకాశం. జీవించడం అనేది మాత్రం మనిషి నిర్దేశించుకోగల మార్గం కావాలని, మనిషి తన కోసం కాక తానుండే, తనదైన సమాజం కోసం పాటు పడాలని, దానికోసం యుద్ధాలూ, అద్భుతాలూ చేయాల్సిన పనిలేదు. తనకు తోచిన, తాను తలంచిన దారిలో నడవగలిగితే, ఆ నడకలోని నడత మానవీయత అయితే మనిషి పుట్టుక సార్థకమైనట్లేనని తన జీవితమే సందేశంగా చూపిన గోకర్ణుని గాథ సామాజిక ఆదర్శానికి ప్రతీక.

302
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles