గుండె పగిలిన రోజు..


Sun,December 2, 2018 04:21 AM

NTR
ఒక దెబ్బ తర్వాత.. ఇంకో దెబ్బ. దెబ్బ మీద దెబ్బ. అల్లుడు.. వెన్నుపోటు.. మోసం.. దగా.. కుట్ర.. సొంత కుటుంబసభ్యులు దూరమయ్యారు.. చరమాంకంలో తోడుంటుందనుకున్న భార్య మీద నిందలేశారు.. గెలిపించుకున్న ఎమ్మెల్యేలను దూరం చేశారు.. పార్టీని.. లాక్కున్నారు.. పదవి పీక్కున్నారు.. ఎన్నికల గుర్తునూ దొబ్బేశారు.. ఆఖరికి.. పార్టీ ఫండు కూడా నాది కాదంటున్నారు.. ఈ డబ్బుతోనే కదా.. రేపు ప్రజల దగ్గరకు వెళ్లాలనుకున్నది. ఈ డబ్బుతోనే కదా.. కోల్పొయిన అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సింహంలా గర్జించాలనుకుంది.. పోయింది... అంతా పోయింది.. ఆ డబ్బూ పోయింది.. నమ్మకమూ పోయింది.. ఎంతటి మోసం.. ఎంతటి కుట్ర.. ఒకదాని తర్వాత ఒకటి.. నమ్మకంగా.. నమ్మించి.. పకడ్బందీగా.. పక్కాగా దోచుకున్నారు.. ఇవే ఆ రాత్రంతా ఆయనను కలవరపరిచి ఉంటాయి. ఎంతటి అభిమానాన్ని తట్టుకున్న ఆ గుండె.. ఈ అవమానాన్ని మాత్రం తట్టుకోలేకపోయింది.. అంతులేని ఆవేదనతో ఆగిపోయింది. ఆ గుండె పగిలిపోయింది. ముక్కలు ముక్కలైంది. అది తెలుగు వారి గుండె పగిలిన రోజు.

నగేష్ బీరెడ్డి
సెల్ : 80966 77 177

(గతవారం తరువాయి)

ఎన్టీఆర్ ఇక లేరు అనే వార్త ఆంధ్రదేశంపై పిడుగులా పడింది. ఆంధ్రుల్లో పౌరుషాన్ని రగిలించి తెలుగు ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురేసిన ప్రియతమ నాయకుడు అస్తమించాడన్న వేదన తెలుగు ప్రజలను కలవరపెట్టింది. గురువారం (జనవరి 18) తెల్లవారుజామున 4 గంటలు..బంజారాహిల్స్‌లోని తన నివాసంలో నిద్రలేచి యథావిధిగా వ్యాయామానికి ఉపక్రమించారు ఎన్టీఆర్. ఒక్కసారిగా గుండెపోటు. ఎన్టీఆర్ కుప్పకూలిపోయారు. మాట లేదు. ఉలుకు లేదు పలుకు లేదు. సతీమణి లక్ష్మీపార్వతి పక్కనే ఉన్నారు. డాక్టర్లకు కబురు వెళ్లింది. హుటాహుటిన వారు ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారు. 4.30 గంటలకు ఎన్టీఆర్ దగ్గరకు చేరుకున్న డాక్టర్ సోమరాజు, కుమార్ పరీక్షించి.. ఎన్టీఆర్ కన్నుమూశారని నిర్ధారించారు. గతంలో మూడుసార్లు గుండెపోటు వచ్చినా తట్టుకున్న ఎన్టీఆర్ నాలుగోసారి మృత్యువు చేతిలో ఓడిపోయారు. ఆఖరి మాట లేకుండానే ఆయన తుదిశ్వాస అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఎన్టీఆర్ మరణవార్త తెలియగానే ఆయన కుటుంబసభ్యులందరూ బంజారాహిల్స్ ఇంటికి చేరుకున్నారు. 5.30 గంటల ప్రాంతంలో పెద్దల్లుడు డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆయన తరువాత చిన్నల్లుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సకుటుంబ సమేతంగా వచ్చారు. ఆ రోజు ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ విదేశాల్లో ఉన్నాడు. అమెరికాలో, మద్రాస్ నగరంలో ఉంటున్న కుమార్తెలు తప్ప మిగిలిన కుటుంబసభ్యులందరూ గురువారం ఉదయాన్నే బంజారాహిల్స్‌కు వచ్చారు. భర్త మరణాన్ని తట్టుకోలేని లక్ష్మీపార్వతి గుండె పగిలేలా ఎన్టీఆర్ భౌతిక కాయం మీద పడి విలపించసాగారు. ఎన్టీఆర్ ఇంట్లో అంతటా విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యుల రోదనలతోపాటు అభిమానుల ఏడ్పులతో, ఉద్వేగ నినాదాలతో బంజారాహిల్స్ కంపించి పోయింది. ఎన్టీఆర్ మరణ వార్తని జీర్ణించుకోలేని జనం ఆయన కడసారి దర్శనం కోసం ఉరుకులు పరుగులుగా వచ్చారు. వేల సంఖ్యలో తరలివస్తున్న జనాన్ని అదుపు చేయడం పోలీసులకు సాధ్యం కాకుండా పోయింది.
* * * *

ఎన్టీఆర్ భౌతికకాయాన్ని సందర్శకుల కోసం ఎక్కడ ఉంచాలన్న విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రితోపాటు ఇతర కుటుంబసభ్యుల మధ్య కొద్దిసేపు సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్ భౌతిక కాయాన్ని రామకృష్ణ స్టూడియోస్‌కు తరలించాలని చంద్రబాబు సహా కుటుంబసభ్యులు చేసిన ప్రతిపాదనను లక్ష్మీపార్వతి తోసిపుచ్చారు. నివాసగృహం నుంచి ఎన్టీఆర్ భౌతికకాయాన్ని తరలించడానికి వీలులేదని పార్టీకార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున గొడవ చేశారు. అక్కడే నిలబడి ఉన్న ముఖ్యమ్రంతి చంద్రబాబు నాయుడిపై దుమ్మెత్తి పోశారు. ఎన్టీఆర్ భౌతికకాయాన్ని లాల్‌బహదూర్ స్టేడియంకు తరలిస్తే బాగుంటుందని మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన ప్రతిపాదనకు పార్టీ కార్యకర్తలు కూడా సుముఖత వ్యక్తం చేశారు. భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యదర్శి ఎం. వెంకయ్య నాయుడు జోక్యం చేసుకొని లాల్ బహదూర్ స్టేడియానికి తరలిస్తేనే సందర్శకులకు సౌకర్యంగా ఉంటుందని ఇరువర్గాల వారిని ఒప్పించారు.
13 యేండ్ల క్రితం లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజల సమక్షంలోముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామారావు అదే స్టేడియంలో లక్షలాది ప్రజల కన్నీటి ధారలతో కడపటి వీడుకోలు కోసం సిద్ధమయ్యారు. ప్రభుత్వం వారం రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది.
* * * *

ఎన్టీఆర్ భౌతికకాయాన్ని ఉంచిన లాల్‌బహదూర్ స్టేడియం ఒక్కసారిగా జనసముద్రంగా మారింది. రాష్ట్రం, నగరం నలుమూలల నుంచి జనం ఎల్‌బీ స్టేడియం వైపు బారులు కట్టారు. ఎన్టీఆర్ అభిమానులు, రాష్ట్ర మంత్రుల మధ్య కొద్దిసేపు ఘర్షణ జరిగింది. ఆయా వర్గాల నాయకులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేయగలిగారు. ఎన్టీఆర్ భౌతికకాయానికి చేరువగా వచ్చి హడావిడి చేయబోయిన రాష్ట్ర మంత్రులు మాధవరెడ్డి, వేణుగోపాలచారి, చంద్రబాబు వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులపై చెప్పులు విసిరారు. చంద్రబాబు వర్గం వారిపై ఎన్టీఆర్ అభిమానులు దూసుకువచ్చే ప్రయత్నం చేయడంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేశారు.
* * * *

ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ రాత్రి తొమ్మిది గంటలకు బొంబాయి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి పత్రికా కార్యాలయాలకు ఫోన్ చేసి మాట్లాడారు. తన తండ్రి ఎన్టీరామారావును లక్ష్మీపార్వతి బలి తీసుకున్నదని, ఆయన మరణంపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నేను విదేశాలకు వెళ్లేముందు తండ్రి ఆశీర్వచనం పొందుదామని 15న ఉదయం ఢిల్లీ విమానాశ్రయం నుంచి నాన్నగారికి ఫోన్ చేశాను. పది నిమిషాల తరువాత ఫోన్ చేయండి అని సమాధానం. పది నిమిషాలు ఆగి చేస్తే మళ్లీ అదే సమాధానం. మళ్లీ చేస్తే మాగ్నెటిక్ సర్జరీ జరుగుతున్నది. ఇప్పుడు మాట్లాడడానికి వీలు పడదని చెప్పారు. అసలు మొదటి నుంచీ ఎన్టీఆర్ డాక్టరైన సోమరాజుని కాదని డాక్టర్ అనిల్‌తో ఎందుకు వైద్యం చేయిస్తున్నారు. గత ఆరునెలలుగా మా నాన్నగారికి వాడుతున్న ఇంజెక్షన్లు ఏమిటి? ఇస్తున్న మందులేమిటి? ఆయనకు ఆరోగ్యం బాగా లేకపోతే గైనకాలజిస్టు డాక్టర్ మహాలక్ష్మిని ఎందుకు పిలిచారు. ఎన్టీఆర్ అనారోగ్యం గురించి ఆయన కుటుంబసభ్యులకు మాట మాత్రమైనా ఎందుకు చెప్పలేదు. ఎన్టీఆర్ భౌతిక కాయాన్ని చూడడానికి వెళ్లిన ప్రముఖులను నిరోధిస్తున్నారు. అప్పుడే అక్కడ శవరాజకీయం నడుస్తున్నది అని హరికృష్ణ ఆరోపించారు. ప్రత్యేక విమానంలో అర్ధర్రాతి 1.30కి వస్తున్నట్లు ఆయన తెలిపారు.
* * * *

చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాల వల్లే ఎన్టీఆర్‌కు గుండెపోటు వచ్చిందని, ఎన్టీఆర్ హంతకుడు చంద్రబాబు నాయుడేనని తెలుగుదేశం పార్టీ (ఎన్టీఆర్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ హోంమంత్రి పి. ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ మరణం ఎలా జరిగిందో తెలియడం లేదు అంటూ అనుమానపు మాటలను ప్రారంభించిన చంద్రబాబు, హరికృష్ణతో లక్ష్మీపార్వతిపై ఆరోపణలు చేయిస్తున్నారని ఎన్టీఆర్ వర్గం విమర్శించింది. చంద్రబాబు బృందం అధికారం నుంచి దించివేసిందనే ఆవేదనతోనే ఎన్టీఆర్ మరణించారని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. దీంతో లక్ష్మీ పార్వతిపై సానుభూతి పెరుగడం మొదలైంది. దీనికి విరుగుడుగా చంద్రబాబు హరికృష్ణను తురుపుముక్కగా వాడుకుంటున్నారు. ఎన్టీఆర్‌ను లక్ష్మీపార్వతి బలి తీసుకుందని తానే విమర్శిస్తే జనం నమ్మకపోవడమే కాకుండా వ్యతిరేక ప్రభావాన్ని చూపే అవకాశం ఉండడంతో తెలివిగా తన మాటలను హరికృష్ణతో పలికించారు. విదేశీ పర్యటనలో ఉన్న హరికృష్ణ హుటాహుటిన స్వదేశానికి పయనమై, బొంబాయి విమానాశ్రయంలో దిగగానే చంద్రబాబుతో టెలిఫోన్‌లో చర్చించారు. ఆయన సూచన మేరకు ఎన్టీఆర్ మరణంపై న్యాయ విచారణ జరిపించాలని హరికృష్ణ డిమాండ్ చేశారు. తన వారసురాలు లక్ష్మీపార్వతే అని ఎన్టీఆర్ గతంలో స్వయంగా ప్రకటించడంతో చంద్రబాబు ఈ చర్య తీసుకోక తప్పలేదు. లక్ష్మీపార్వతిని విమర్శించాల్సిన సందర్భం ఏర్పడినప్పుడల్లా చంద్రబాబు తెలివిగా హరికృష్ణను ఉపయగించుకున్నాడన్నది ఎన్టీఆర్ వర్గం వాదన. ఆంధ్రుల అభిమాన నాయకుడు మృతదేహం ఇంకా అక్కడ ఉండగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పనికిమాలిన ప్రకటనలు చేయిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ఎన్టీఆర్‌కు ఆరోగ్యం బాగలేదని దుష్ప్రచారం చేసింది చంద్రబాబే. ఎన్టీఆర్ చివరి పత్రికా గోష్టిలో తన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకాలేదని స్వయంగా ప్రకటించారు. అందుకు పత్రికలే సాక్ష్యం. దురదృష్టవశాత్తు ఎన్టీఆర్‌కు గుండెపోటు వచ్చింది. దీనిని కూడా స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్న చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు క్షమించరాదని ఎన్టీఆర్ వర్గం దుయ్యబట్టింది.
* * * *

అంతిమయాత్రకు ముందు జరిగిన శ్రాద్ధకర్మల్లో కూడా లక్ష్మీపార్వతిని అనుమతించలేదు. బసవతారకం ఫొటో పెట్టి కర్మకాండ జరిపించారు.
NTR2
తమ ప్రియతమ నాయకుడికి తుది వీడ్కోలు చెప్పేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు లక్షలాదిగా రాజధానికి తరలివచ్చారు. వివిధ రాష్ర్టాల గవర్నర్లు, ముఖ్యమంత్రలు, జాతీయ పార్టీల నాయకులు, పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, ఇతర నాయకులు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.
* * * *

శుక్రవారం తెల్లవారు జామున ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ వచ్చే వరకూ లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ భౌతికకాయం వద్దే గడిపారు. హరికృష్ణ వచ్చాక ఆమెను అక్కడ నుంచి తప్పించే ప్రయత్నాలు సాగాయని కొందరు చూసినవాళ్లు చెబుతారు. అంతిమయాత్రకు ముందు జరిగిన శ్రాద్ధకర్మల్లో కూడా లక్ష్మీపార్వతిని అనుమతించలేదు. బసవతారకం ఫొటో పెట్టి కర్మకాండ జరిపించారు. ఎన్టీఆర్ అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు మొదలైంది. డాక్టర్ వెంకటేశ్వరరావు లక్ష్మీపార్వతిని తీసుకువెళ్లి వాహనం మీదికి ఎక్కించారు. భౌతికకాయాన్ని వాహనం మీదికి చేర్చాక లక్ష్మీపార్వతిని వాహనం నుంచి దింపేశారు. చంద్రబాబు వర్గం మనుషులు, హరికృష్ణ యువసేన కార్యకర్తలు ఆమెను కిందికి లాగేశారు. ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయిన లక్ష్మీపార్వతి అసలే నీరసంగా ఉండడంతో కుప్పకూలిపోయారు. ఈ దశలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హరికృష్ణ, బాలకృష్ణల పురమాయింపుతో అంతిమయాత్ర శకటం కదిలింది. పార్వతి లేచేలోపు వాహనం వెళ్లిపోయింది. పార్వతిని వాహనం మీది నుంచి దించేశారని తెలియగానే అంతిమయాత్రలో పాల్గొనే జనం స్టేడియంలోనే నిలబడిపోయారు. వేలాది మంది జనం మధ్య కనీస రక్షణ లేకుండా పార్వతి మిగిలిపోయారు. ఒక్క పోలీసు కూడా పరిసర ప్రాంతాల్లో కనిపించలేదు. ప్రజల మధ్య నుంచి ఆమెను మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, దేవినేని రాజశేఖర్, శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, మహేందర్‌రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు లోకేంద్రనాథ్ తదితరులు ఒక కైవారంగా ఏర్పడి పార్వతిని అతికష్టం మీద జనం మధ్యలోంచి కారులోకి ఎక్కించారు. ఆమె పెద్ద పెట్టున ఏడుస్తూ కారులో బంజారాహిల్స్‌లోని తమ నివాసానికి వెళ్లిపోయారు. పార్వతిని పదిలంగా కారు వద్దకు చేర్చడం ఒక దశలో సమస్యగా మారింది. పార్వతి పయనించిన కారుకు ముందూ వెనుక అనేకమంది ఎన్టీఆర్ అభిమానులు అనుసరిస్తూ కార్లలో ఇంటికి చేర్చారు.
* * * *

ఎన్టీఆర్ భౌతికకాయాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు మైదానానికి ఊరేగింపుగా తరలించారు. అంత్యక్రియల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైకి ఎన్టీఆర్ భౌతికకాయం సాయంత్రం 4 గంటలకు చేరుకుంది. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య దహన సంస్కారాలను ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత పోలీసులు సంతాప సూచకంగా మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. కుటుంబసభ్యుల, నాయకుల, కార్యకర్తల, అభిమానుల అశ్రుతర్పణాల మధ్య పెద్ద కుమారుడు జయకృష్ణ ఎన్టీఆర్ చితికి నిప్పంటించారు. సాయంత్రం 5.21 గంటలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇలా ఎన్టీఆర్ జీవితంలో చివరి పేజీ చితిపై కాలిపోయింది.

717
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles