గుండె పగిలిన రోజు..


Sun,November 25, 2018 03:14 AM

NTR
జనవరి 17, 1996 బుధవారం మధ్యాహ్నం ఎన్.టి.రామారావు విలేకరుల సమావేశం
(ఇదే ఎన్టీఆర్ ఆఖరిసారి పత్రికా సమావేశం)

విజయవాడలో ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించ తలపెట్టిన సింహగర్జన గురించి చెప్పేందుకు ఎన్టీఆర్ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. మోసం, దగా, వెన్నుపోటుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బతుకుని బజారుకీడుస్తా. వచ్చే నెల 2న విజయవాడలో జరుగనున్న సింహగర్జనలో తెలుగుదేశం పార్టీ పేరుతో రాష్ట్రంలో సాగుతున్న పాలన బండారాన్ని బయటపెడతా. వీళ్లని ఊరికే వదులుతానా? వీళ్ల దగాకోరు బతుకులని బజారుకీడుస్తాను. నేను ప్రజల మనిషిని. ప్రజల్లోకి వెళతాను. జరిగిన విద్రోహాన్ని ప్రజలకే వివరించి చెబుతాను. చంద్రబాబు ఒక కల్తీ సరుకు. 30 శాతం కాంగ్రెస్ రక్తం తనలో ప్రవహిస్తున్నదని సిగ్గులేక తానే చెప్పుకొన్నాడు. నేనంటున్నాను, చంద్రబాబులో ప్రవహిస్తున్న రక్తం నూటికి 130 శాతం కాంగ్రెస్ రక్తమేనని. నాకు తెలుసు, చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికలకు ముందే తన మనుషులకి లక్షలాది రూపాయలు ముట్టజెప్పి కొనుక్కున్నాడు. 130 సీట్లు వచ్చి ఉంటే అప్పుడే తన ఎమ్మెల్యేలతో చంద్రబాబు విద్రోహానికి పాల్పడి ఉండేవాడు. ప్రజలు 220 సీట్లు ఇచ్చారు. కాబట్టి తక్షణమే చంద్రబాబు కుట్రలు ఫలించలేదు. ఇప్పుడేం చూశారు. ముందున్నది ముసళ్ల పండుగ. ఎన్నికలు వస్తున్నాయి. ప్రజలకు తిరిగి మరోసారి తీర్పు చెప్పే అవకాశం దొరికింది. ప్రజలు ప్రజాస్వామ్య ద్రోహులని మట్టి కరిపిస్తారు. సింహం మగతగా ఉన్నదని, జూలుతో ఆడుకోబోయారు. సింహం ఇప్పుడు నిద్రలేచింది. అందుకే విజయవాడలో జరుగబోయే ప్రజాసదస్సుని ప్రక్రియపరమైన విశేషంగా సింహగర్జన అని పేరు పెట్టాను. ఎంతో కష్టపడి స్థాపించి నడిపించిన తెలుగుదేశం పార్టీని స్వార్థపరులపరం చేయను. ప్రాణాలైనా ఇస్తాను గానీ ఎవరికీ తల వంచను

- తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు


(ఫ్లాష్‌బ్యాక్)
మహానటుడిగా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో ఎన్నో ఘనవిజయాలు సాధించారు ఎన్టీఆర్. కానీ ఆయన 14 ఏండ్ల రాజకీయ జీవితం మాత్రం ఒక ఉద్యమంగా సాగింది. 1982లో షష్టిపూర్తి చేసుకున్న రామారావు అదే సంవత్సరం మార్చి 28న రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 9 నెలల్లోనే రాష్ర్టాధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయ జీవితమంతా నిత్యనూతనంగా సాగింది. ఆయన ఎంచుకున్న విధానాలు, పద్ధతులు, కొత్తగా గమ్మత్తుగా ఉండేవి.
1983 జనవరి 9న తొలిసారిగా అధికారాన్ని చేపట్టారు రామారావు . కానీ ఇరవై నెలలకే 1984 ఆగస్టులో అధికారాన్ని కోల్పోయారు. ఇది ఎన్టీఆర్‌ను వెంటాడిన మొదటి ఆగస్టు సంక్షోభం. అయితే దేశవ్యాప్తంగా చెలరేగిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంతో నెలరోజుల్లోనే తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత మూడు నెలల్లోనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తెలుగుదేశం జెండా మళ్లీ ఎగురవేశారు. ఇదే సమయంలో ఆయన భార్య బసవతారకం క్యాన్సర్ వ్యాధితో మరణించారు.
ఐదేండ్ల నిర్విరామ పాలన అనంతరం 1989 అసెంబ్లీ ఎన్నికల్లో అపజయాన్ని చూసిన ఎన్టీఆర్ ఐదేండ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు. 1993లో ఆయన ఒంటరి జీవితంలోకి అర్ధాంగిగా లక్ష్మీపార్వతి ప్రవేశించారు. అది కుటుంబ కలహాలకు దారితీసింది. లక్ష్మీపార్వతితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రామారావు 1994 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో 223 స్థానాలను గెలుచుకొని మరోసారి చరిత్ర సృష్టించారు.

ప్రతిపక్షాల్ని నేలమట్టం చేసి అధికారం చేపట్టిన రామారావుకు ఈసారి ప్రతిపక్షం ఇంట్లోనే ఎదురైంది. లక్ష్మీపార్వతి కారణంతో ఆయన కుటుంబంలో కలహాలు ముదిరాయి. కుటుంబంతో తెగతెంపులు చేసుకుంటున్నట్లు కూడా ఎన్టీఆర్ ప్రకటించాల్సి వచ్చింది. ఆయన జీవితంలో మరోసారి ఆగస్టు సంక్షోభం ఎదురైంది. అధికారాన్నే కోల్పోవాల్సి వచ్చింది. ఎంతో నమ్మి, కాళ్లు కడిగి పిల్లనిచ్చినందుకు అల్లుడే దీనికి నాయకత్వం వహించడం ఆయన్ని ఎంతో కలవరపెట్టింది. కుంగదీసింది. కకావికలం చేసింది.

ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ప్రభుత్వ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నదని పార్టీలో వివాదం లేవనెత్తారు. ఎన్టీఆర్ చిన్నల్లుడు నారా చంద్రబాబు నాయుడు దీనికి నాయకత్వం వహించాడు. శాసనసభ్యులతో తిరుగుబాటు చేయించాడు. తెలుగుదేశం పార్టీ రెండుగా చీలింది. ఓ వైపు ఎన్టీఆర్ వర్గం, మరోవైపు చంద్రబాబు వర్గం పార్టీ మాదంటే మాదంటూ గొడవకు దిగారు.
చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా పావులు కదిపాడు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొన్నాడు. హుటాహుటిన బసంత్ టాకీస్‌లో పార్టీ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశాడు. ఎన్టీఆర్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలిగించి, చంద్రబాబును అధ్యక్షునిగా ఎన్నుకున్నట్లు ఆ సమావేశంలో నిర్ణయం జరిగింది.

1995 ఆగస్టు 23న ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్ష పదవుల నుంచి తప్పించారు. బాబు పగ్గాలు చేపట్టాడు. ఎన్టీఆర్ గెలిపించుకున్న శాసనసభ్యులను తన వైపు తిప్పుకొన్నాడు. హైదరాబాద్ వైస్రాయ్ హోటల్‌లో ఉంచాడు. వారిని కలుసుకోవడానికి ఆగస్టు 27న ఎన్టీఆర్ చైతన్య రథంపై వైస్రాయ్ హోటల్‌కు వెళ్లాడు. అప్పుడు రామారావు మీద రాళ్లు, చెప్పులు విసిరేశారు. అలా వేయించింది చంద్రబాబేనని అప్పట్లో చెప్పుకొన్నారు. ఈ ఘటన రామారావును మానసికంగా ఎంతో దెబ్బతీసింది. అప్పుడాయన మనోవేదన వర్ణించరానిది. నేను ఈ రోజే చనిపోయాను అని ఎన్టీఆర్ అన్న మాటలు నాడు చూసిన వారికి కన్నీరు తెప్పించాయి.

పార్టీ పోయింది. పదవి పోయింది. అంతకుమించి అయినవారి మీద నమ్మకం పోయింది. ఎంతో కష్టపడి, ఇష్టపడి నిర్మించుకున్న పార్టీ. ఆ పార్టీలో ఇంతటి సంక్షోభాన్ని ఎన్టీఆర్ భరించలేక పోయారు. పార్టీని రద్దు చేస్తున్నట్లు గవర్నర్‌కు లేఖ రాశారు. కానీ అంతకుముందే చంద్రబాబు పార్టీని, పార్టీ అధ్యక్షపదవిని సొంతం చేసుకోవడంతో ఆయనకు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఎన్నికల సంఘం కూడా పార్టీ పేరును, ఎన్నికల గుర్తును ఎన్టీరామారావు తరుపు వారికి కాకుండా చంద్రబాబు తరపు వారికే కట్టబెట్టింది. ఇందుకోసం ఎన్టీఆర్, చంద్రబాబు మధ్య పెద్ద తగాదానే నడిచింది.
ఎవరి తరుపు వాదనను వారు వినిపించేందుకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టీఎన్ శేషన్ అనుమతినిచ్చారు. అయినా, ఎలాగైనా వాటిని తానే సొంతం చేసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు ఎన్ని ఎత్తుగడలు వేయాలో అన్ని వేశాడు. ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నింటినీ వాడుకున్నాడు.

రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని చంద్రబాబు నాయుడు సహాయం కోరాడు. ఈవిడను గతంలో ఎన్టీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. చంద్రబాబు నాయుడు తిరిగి పార్టీలోకి తీసుకుంటానని హామీ ఇచ్చాడు. దీంతో రేణుకా చౌదరి ఢీల్లీలో తన పరపతిని ఉపయోగించింది. చంద్రబాబుకు అనుకూలంగా ఎన్నికల సంఘం నిర్ణయం రావడంలో కీలక పాత్ర పోషించింది. అవును, ఆ రోజుల్లో పార్టీ పేరు, గుర్తు చంద్రబాబు నాయునికి దక్కేలా చేయడంలో నేను భూమి ఆకాశాలను ఏకం చేశాను అని ఒక సందర్భంలో రేణుకా చౌదరి స్వయంగా చెప్పుకొన్నారు. ఆవిడ అన్నట్లు భూమ్యాకాశాలు ఏకమై చివరకు పార్టీ పేరు, ఎన్నికల గుర్తు చంద్రబాబు నాయునికే దక్కుతున్నట్లు ఎన్నికల సంఘం తీర్పునిచ్చింది.

కుటుంబం తన వైపు లేదు, పార్టీ తనది కాదు, పార్టీ గుర్తు కూడా ఇప్పుడు కాకుండా పోయింది.. అధికారం పోయింది.. అయినవారు నమ్మక ద్రోహం చేశారు.. ఇవన్నీ ఎన్టీఆర్‌ను అంతులేని ఆవేదనకు గురి చేశాయి. అయినా ఆయనలో ఏదో ఆశ. తనను ఎంతో నమ్మిన, అభిమానించిన, ఆదరించిన తెలుగు ప్రజలకు ఈ విషయాలు తెలుసు. వారు అర్థం చేసుకుంటారనే నమ్మకం. ఆ నమ్మకంతోనే ప్రజల చెంతకు మళ్లీ వెళ్లాలనుకున్నారు. తనకు జరిగిన అన్యాయం చెప్పుకోవాలనుకున్నారు. కోల్పోయిన అధికారాన్ని ఇలా తిరిగి పొందే ప్రయత్నంలో ఎన్టీఆర్ 1996 ఫిబ్రవరి 2న విజయవాడలో సింహగర్జన సభకు ఏర్పాటు చేశారు.
* * * *
సింహగర్జనని నభూతో నభవిష్యత్‌గా లక్షలాది మందితో నిర్వహించి తన ప్రజాభిమాన విశ్వరూపాన్ని ప్రదర్శించాలని ఎన్టీఆర్ ఎంతో ఆశపడ్డారు. సింహగర్జన ఏర్పాట్ల కోసం బరోడా బ్యాంక్‌లో ఉన్న పార్టీ నిధిని ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. 1995 ఏప్రిల్‌లో ఎన్టీఆర్ 70 లక్షల రూపాయల్ని పార్టీ నిధిగా తెలుగుదేశం పార్టీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఖైరతాబాద్ బ్రాంచి అకౌంట్‌లో డిపాజిట్ చేశారు.
చంద్రబాబు నాయుడు ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి అయ్యాక అసలైన తెలుగుదేశం పార్టీ నాదే అన్నట్లుగానే పార్టీ నిధులని కూడా సొంతం చేసుకునే ప్రయత్నాలు చేశాడు. బరోడా బ్యాంకులో ఉన్న 70 లక్షలకు తానే అసలైన హక్కుదారునని చంద్రబాబు బ్యాంకు అధికారులకు లేఖలు రాశారు. ఎన్టీఆర్ చంద్రబాబు వాదనని ఖండించారు.

బ్యాంకులో డిపాజిట్ చేసిన వ్యక్తి లిఖిత పూర్వక అభ్యర్థన లేకుండా వేరొకరి పేరు మీదికి ఖాతా బదిలీ కాదని, అసలు ఖాతాదురుడికి చెప్పకుండా మరో వ్యక్తి లేఖని ఎట్లా నమ్ముతారని ఎన్టీఆర్ తన లాయర్ల ద్వారా బ్యాంకు అధికారులను నిలదీశారు. ఈ విషయమై జనవరి 7న విచారణ జరిగింది. ఇండెమ్నిటీ బాండ్ మీద పార్టీ నిధి నుంచి డబ్బును డ్రా చేసే అవకాశాన్ని ఎన్టీఆర్‌కు కల్పించాలని ఆయన తరుపు వ్యక్తులు కోరారు. ఈ బాండ్ ప్రకారం కోర్టు ఒకవేళ పార్టీ ఫండ్ చంద్రబాబు నాయుడికే చెందుతుందని తీర్పు ఇచ్చిన పక్షంలో తిరిగి బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ న్యాయవాదులు చేసిన ఈ విన్నపం తర్వాత జనవరి 17కు వాయిదా పడింది. తాము చేసిన విన్నపం ఫలించి డబ్బు చేతికి అందే అవకాశం ఉంటుందనుకున్నారు ఎన్టీఆర్. కానీ చంద్రబాబుకు అదే రోజు కోర్టు స్టే ఇచ్చింది.
* * * *

పత్రికా సమావేశం ముగిసింది. ఎన్టీఆర్ బంజారాహిల్స్, రోడ్ నెం. 13లోని తన ఇంటికి చేరుకున్నారు.జనవరి 17, సాయంత్రం 5.30 6 గంటల మధ్య ..తెలుగుదేశం పార్టీ అధికార అడ్వకేట్లు జాస్తి చలమేశ్వర్, ఎస్‌వి రమణ, శ్రీనివాసరావు ఎన్టీఆర్ చెంతకు చేరుకున్నారు. హైకోర్టులో మనం కేసు ఓడిపోయాం. తెలుగుదేశం పార్టీ బ్యాంక్ ఖాతాలు అన్నీ చంద్రబాబు పార్టీకే చెందుతాయని, బ్యాంకుల్లో మీ సంతకాలు చెల్లవని చీఫ్ జస్టిస్ ప్రభా శంకర్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తీర్పు చెప్పిందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బరోడా బ్యాంకులో ఉన్న 70 లక్షల రూపాయల తెలుగుదేశం పార్టీ ఫండ్‌ను ఫ్రీజ్ చేయాలని కోరుతూ కోర్టు నుంచి పొందిన స్టే ఆర్డర్ గురించి వివరించారు. ఈ సమాచారంతో ఎన్టీఆయర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అవాక్కయ్యారు. పది నిమిషాల సేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత కాస్త తేరుకొని.. ఏముందింక.. నా నుంచి నా పిల్లలని లాక్కున్నారు. నేను బీఫాం ఇచ్చి నిలబెట్టిన ఎమ్మెల్యేలనీ బలవంతంగా తోలుకుపోయారు. నా పార్టీ నాది కాదంటున్నారు. నేను స్వహస్తాలతో రూపొందించిన జెండా నాది కాదంటున్నారు. నేను సంపాదించినదంతా నా పిల్లలకు ఇచ్చేశాను. ఇది ప్రజలు నా మీద విశ్వాసంతో, నమ్మకంతో ఇచ్చిన పార్టీ నిధి. దాన్ని ప్రజాహితం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఖర్చు పెడదామనుకున్నాను. అది కూడా వీలు లేకుండా అడ్డు పడుతున్నారు అని ఎన్టీఆర్ దిగాలుగా అన్నట్లు, బోరున ఏడ్చినట్లు కొందరు చెబుతారు. ఆయన ఆఖరి ఆశలు కూడా ఎవరో కొల్లగొట్టినట్లు విలవిలలాడినట్లు కూడా అప్పట్లో వార్తా పత్రికల్లో కూడా వచ్చింది.
పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి నా దగ్గర నయాపైసా లేదు. ఇక పార్టీ అభిమానులు, ప్రజలు మీలాంటి పెద్దలే ప్రజాస్వామ్యానికి అండగా నిలబడాలి అని తన చెంతకు వచ్చినవారితో వాపోయారట. ఈ విషయంలో కోర్టులని తప్పు పట్టలేం. కోర్టును తప్పుదారి పట్టించే ప్రబుద్ధులని ప్రజలు క్షమించరు అని కూడా ఎన్టీఆర్ అన్నారట. ఆ రాత్రి ఆయనేం తినలేదట. పాలు తాగమన్నా తాగలేదు. రాత్రి 8 గంటల తర్వాత నిద్రకు ఉపక్రమించారు.
(సశేషం.. మిగిలిన భాగం వచ్చేవారం)

- నగేష్ బీరెడ్డి సెల్ : 80966 77 177

717
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles