గల్లీలోనూ.. ర్యాప్ ఊపుతున్నది!


Sun,March 17, 2019 01:29 AM

rap
గల్లీబాయ్.. ర్యాప్ నేపథ్యంలో వచ్చిన బాలీవుడ్ సినిమా..అప్పట్లో బిగ్‌బాస్‌లో రోల్‌రైడా కూడా ర్యాప్‌తో ఇంటింటికీ పరిచయమయ్యాడు.. ఇప్పుడు గల్లీల్లో కూడా ర్యాప్ ఊపు ఊపుతున్నది. తిరుగుబాటు నుంచి పుట్టిన ర్యాప్ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నది..గల్లీలున ఊపేస్తున్న ర్యాప్ గురించి ఈ కథనం..

మ్యూజిక్ ప్రపంచంలో పాశ్చత్య, శాస్త్రీయ సంగీతాల నుంచి హిప్ ఆప్, ఫాస్ట్‌బీట్ వరకూ ఎన్నో వచ్చాయి. బ్రాస్ బ్యాండ్, ఫ్యూజిన్, ఇండిపాప్ అంటూ సంగీతం కొత్త ఒరవడి తొక్కింది. కానీ అందులో ర్యాప్ మాత్రం వాటి అన్నింటికన్నా భిన్నం. ఎక్కడో అమెరికాలో పుట్టిన ర్యాప్ ఇప్పుడు గల్లీ గల్లీలో కుర్రకారును చిందులేయిస్తుంది. క్రమంగా ర్యాప్‌పై యూత్ అభిరుచి పెరుగుతున్నది. కేవలం రిథమ్ కోసమే కాదు ర్యాప్ అంటే, అర్థం కాని పదాలను అడ్డదిడ్డంగా వాడడం అంతకన్నా కాదు ర్యాప్ అంటే, పదాన్ని పదాన్ని పేర్చి అందమైన, అర్థవంతమైన వాక్యాన్ని రూపొందించి దానికి రిథమ్ ఇవ్వడం ర్యాప్ అంటే. అదే ర్యాప్‌కు ప్రాణం. ఇలాంటి ర్యాప్ సాంగ్స్ సందేశాలను మోసుకొస్తూ యువతకు దగ్గరవుతున్నాయి. వినసొంపుగా ఉండే ఏ సంగీతమైన ఆమోదించదగ్గదే. భాషను సమర్థవంతంగా ఉపయోగించుకొని శ్రోతలను ఆనందింపజేయాలి. ర్యాప్‌కు తెలుగు భాషకు సంబంధం లేకపోవచ్చు. అభివృద్ధి చెందుతున్న కాలానికి అనుగుణంగా ర్యాప్ తెలుగు నేలను తాకింది.
తెలుగుతో ర్యాప్‌ను సృష్టించడం ఇప్పటి యువత ప్రయోగమని అభిప్రాయపడతారు. తెలుగులో వచ్చే ర్యాప్ సాంగ్స్‌ని మాత్రం కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. సుమారు 12 యేండ్ల క్రితమే తెలుగు భాషలో ర్యాప్ వచ్చింది. ర్యాప్ అంటే మెదడుకు పదును పెట్టడమే కాదు, వాటిలోని మధురమైన శబ్ద సౌందర్యం మనస్సును పులకింపజేస్తుంది.

తెలుగు ర్యాపర్ల రూటే సపరేట్..

రాక్‌బ్యాండ్, ఫాస్ట్‌ట్రాక్ బీట్‌కే తెలుగు ర్యాపర్లు పరిమితం కాలేదు. ర్యాప్‌లో అమ్మభాషను ఉపయోగించి, భాషాభిమాన్ని చాటుకుంటున్నారు. పోయెట్రీకి బీట్ జోడించి విభిన్న సరళులతో అలరిస్తున్నారు. ర్యాప్‌లో సామాజిక సమస్యలపై సందేశాలిస్తున్నారు. సమాజంలోని పెడధోరణుల పట్ల విరుచుకుపడుతున్నారు. ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ఒక ర్యాప్ సాంగ్‌లోని లిరిక్ ఇది... నువ్వు ఆడుతున్న రొట్ట ఆట కాదు హిప్ ఆప్ అంటే, పాడుతున్న పాట కాదు సాహిత్యం అంటే, నువ్వు చేస్తుంది అంతా జస్ట్ ఫేమ్ కోసం అంతే.. చరిత్ర అంత తీసి చదువుకో హిప్ ఆప్ అంటే కల్చర్ అని కాస్త నువ్వు తెలుసుకో అంటూ ఓ ర్యాపర్ తెలుగును అడ్డదిడ్డంగా వాడి సంగీతం అంటున్న వారిపై విమర్శలు గుప్పించాడు. మరో సాంగ్‌లో హృదయాన అనగా నిశ్శబ్ద బ్రాహ్మి సమయాన, సరస్వతికి నమరిస్కరించి.. మనసు గతిని తిరస్కరించి.. చేతనేను కలం పట్టి రాత నేను కాగితంపై పెట్టి.. ప్రతిరోజూ నన్ను పీడించే సంఘటనల సమస్యలను సృష్టించే చీడపురుగులందరికీ ప్రశ్నలే సంధిస్తూ అంటూ తన భాషాభిమానాన్ని, తన సంఘర్షణను బయటపెట్టాడు మరో ర్యాపర్. ఇంకా చాలామంది మన తెలుగు యువకులు మాతృభాషలో ర్యాప్‌లు చేస్తూ భాష స్పృహను పెంచుతున్నారు. తెలుగు ర్యాప్‌కు ఆదరణ లేదంటూ నిరాశపడాల్సిన అవసరం లేదంటున్నారు మన ర్యాపర్లు. ఇప్పటి వరకూ వచ్చిన తెలుగు ర్యాప్‌లతో స్ఫూర్తి పొందితే చాలు. తెలుగు ర్యాపర్లలో ఎక్కువ క్రేజ్ ఉన్న వారిలో రోల్‌రైడా, ప్రణవ్ చాగంటి, మేఘరాజ్ రవీంద్ర, ఎంసీ యూనిక్, ఎంసీ మైక్‌లు ర్యాప్‌లు సృష్టిస్తున్నారు. ఫన్, క్రియేటివిటీ, సోషల్ మెసేజ్ ర్యాప్‌లో మిళితం చేసి సోషల్‌మీడియా ద్వారా యూత్‌కి దగ్గరవుతున్నారు.
rap1

ర్యాప్ చేయాలంటే..

ర్యాప్ సాంగ్ రాయాలంటే పెద్ద పెద్ద కవిత్వాలు, సాహిత్యాలు వల్లె వేయాల్సిన పని లేదు. మన ఇళ్లు, మన గల్లీ, మన జీవితం, పడ్డ కష్టాలే ర్యాప్‌కు ప్రాణం పోస్తాయి. అమ్మ భాష మీద ప్రేమ, దానికి కొంచెం భావోద్వేగాలు తోడైతే ర్యాప్‌ను సృష్టించొచ్చు. లోపల మెదిలే భావావేశాలే ర్యాప్‌కు మూలం. వివిధ దేశాల్లో ర్యాపర్లు అంతా ఇలాంటి స్థితిగతుల నుంచి వచ్చిన వాళ్లే. తీవ్ర అణచివేతకు గురై, ప్రజ్వలించే భావాలనే ర్యాప్‌ల ద్వారా ప్రకటిస్తారు. అచ్చం అలాగే తెలుగులోనూ చేయొచ్చు. ప్రజా కవుల సాహిత్యాన్ని, కవిత్వాన్ని చూస్తే ర్యాప్ చేయడం అర్థమవుతుంది. న్యూయార్క్ వీధుల్లో జరిగిన ఉద్యమంలో పుట్టిన ర్యాప్ ఇప్పుడు భారతదేశంలో ఓ ఉపసంస్కృతిగా మారింది. గల్లీబాయ్ సినిమాతో ర్యాప్‌కు దేశంలో మరింత క్రేజ్ పెరిగింది. ఓ ర్యాపర్ జీవితంపై వచ్చిన సినిమా ఇది. దాదాపు ర్యాపర్ల జీవితాలను చూపించే విధంగా ఉండటంతో ర్యాప్ మీద యువతకు మరింత ఆసక్తి పెరిగింది. స్టేజీ మీద ఉర్రూతలూగించే ర్యాప్‌ను ఓ సబ్జెక్ట్‌గా విద్యార్థులకు బోధించేందుకు ముంబై యూనివర్సిటీ చొరవ తీసుకుంది. ఆసియాలో ఇది మొదటి సారి అని యూనివర్సిటీ యాజమన్యం చెబుతున్నది. తగిన స్టడీ మెటీరియల్ అందించి హిప్ పాప్ విద్యను బోధించనున్నది. 2019-20 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ హిప్ ఆప్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించనుంది.

- వినోద్ మామిడాల
సెల్: 07660066469

317
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles