ఖండాంతరాన కీర్తి కిరీటం


Sun,April 23, 2017 01:42 AM

అత్యున్నత కార్య నిర్వాహక వర్గం యూనివర్సిటీ కౌన్సిల్. దాని తర్వాత ప్రాధాన్యం కలిగినవి సెనేట్.. కౌన్సిల్.. సిండికేట్. వివిధ విభాగాల్లో ఉద్యోగాలను తొలిగా నియమించడం 1919 జూన్ 19వ తేదీన జరిగింది. ఒక మహా విశ్వ విద్యాలయం ఆవిర్భావానికి బీజ భూతమైన యూనివర్సిటీ కళాశాల మౌలానా హిబుల్ రహ్మాన్‌ఖాన్ షెర్వానీ ప్రథమ ఉపాధ్యక్షుడుగా 1919 ఆగస్టు 28వ తేదీన ప్రారంభించారు. మొదటి దశలో (1918-34) యూనివర్సిటీ కళాశాల, భాషాంతరీకరణ-సంకలన సంస్థ, విద్యార్థుల వసతులు కింగ్‌కోఠిలోని నిజాం మందిరానికి కొద్ది దూరంలో కిరాయి ఇండ్లలో ఏర్పాటు చేశారు. మొట్టమొదటి కళాశాల ప్రారంభమైన తర్వాత హైదరాబాద్ నగరానికి మూడు మైళ్ల దూరంలోని అడిక్‌మెట్ ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పాటు చేశారు.

అడిక్‌మెట్ అంటే మహోన్నత్వం. ఉస్మానియా విశ్వవిద్యాలయం గత చరిత్ర విజ్ఞాన పరిశోధన రంగాల్లో మహోన్నత స్థితి సాధిస్తుందని అడిక్ ఆవరణ ఎత్తి చూపిన ఆశాజ్యోతియే. ఈ గత కాలపు స్వప్నం కడచిన దశాబ్దిలో ఫలించిన ఆశయంగా పరిణమించింది. సంవత్సరం తర్వాత మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశారు. అప్పటి హైదరాబాద్ సంస్థానంలోని వరంగల్, గుల్బర్గా, ఔరంగాబాద్ జిల్లాల్లో ఇంటర్మీడియట్ కళాశాలలు స్థాపించారు. నాంపల్లిలో బాలికోన్నత పాఠశాలను 1924లో ప్రారంభించారు. దీనిని తర్వాత మహిళా ప్రత్యేక కళాశాలగా మార్చారు. మొదటిదశలో యూనివర్సిటీ అధ్యాపకులుగా మేథియార్ జంగ్, సర్ రాస్ మధూర్, నబాబ్ సర్ మసూర్ జంగ్, డాక్టర్ సిద్ధిఖీ, అబుల్ రహాన్ వంటి గొప్ప వ్యక్తులు ప్రధానాచార్యులుగా ఉన్నారు.
Council

మూడంచెల ప్రణాళిక :

రెండవ ప్రణాళిక ద్వారా చేపట్టిన యూనివర్సిటీ అభివృద్ధిని మూడు అంచెల్లో పూర్తి చేశారు.
1. బోధనా పరిశోధనలను అభివృద్ధి పరుచుట. అదనపు సాధన సామాగ్రి.. అదనపు ప్రవేశాలు వంటివి దృఢపరిచారు.
2. కొత్త పాఠ్య విషయాలతో.. తరగతులను ప్రారంభించారు.
3. ఉన్న భవనాలను విస్తరించడానికి లేదా కొత్త భవనాలను నిర్మించడానికి అదనపు వసతి కల్పించారు.
ఈ ప్రణాళిక కింద చేపట్టిన ప్రధాన పథకాలన్నింటినీ యూనివర్సిటీ 1961 మార్చి 31వ తేదీ నాటికి అమలు పరిచింది. ప్రధానంగా పరిశోధనా సామగ్రికి కావాల్సిన విదేశీ మారక ద్రవ్యాన్ని.. భవన నిర్మాణం కోసం కావాల్సిన ముడిసరుకును సంపాదించుకోవడానికి ఈ ప్రణాళికలోని 80 శాతం నిధులు ఖర్చు చేసి గణనీయమైన అభివృద్ధి సాధించారు. ముఖ్యంగా వైజ్ఞానిక అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఉదాహరణకు జాపాల్ రంగాపూర్ అబ్జర్వేటరీ. అప్పటివరకు బేగంపేటలో చాలా చిన్నదిగా ఉన్న నిజామియా అబ్జర్వేటరీని అభివృద్ధి చేసేందుకు 48 అంగుళాల దూరదర్శిని సంపాదించింది. దీనికోసం విరాళ సంఘం రూ. 18 లక్షలు మంజూరు చేసింది. అమెరికన్ నిపుణుడైన ప్రొఫెసర్ ఏజీ విల్సన్ సిఫారసుతో యూజీసీ స్థల శోధన చేసి హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని మంచాల మండలానికి చెందిన రంగాపూర్ గ్రామాన్ని కేంద్రంగా ఎంచుకున్నారు. 200 ఎకరాల భూమిని సేకరించి ఆధునిక హంగులతో నూతన అబ్జర్వేటరీని త్వరితగతిన పూర్తిచేశారు. చంద్రాది గ్రహ మండల పరిశోధనాగారంగా ఇది ఉపయోగపడటం.. ఆగ్నేయాసియాలోనే అతి పెద్దదిగా ప్రసిద్ధి చెందడం ఉస్మానియా యూనివర్సిటీ విజయ విశిష్టతను తెలియజేస్తున్నది.

రెండోదశ:

ఉస్మానియా యూనివర్సిటీ రెండవ దశను రెండు ప్రధాన సందర్భాలుగా చెప్పుకోవచ్చు. 1934-38 మధ్యకాలంగా ఒకటి.. 1938-48 వరకు మరొక సందర్భం. 1934లో యూనివర్సిటీ అడిక్‌మెట్(ప్రస్తుతం ఉన్న ప్రాంతం)కు మార్చారు. విశ్వవిద్యాలయ శిల్పాచార్యులైన నవాబ్ జైన్‌యార్ జంగ్ పర్యవేక్షణలో పూర్తికాబడిన మొట్టమొదటి నిర్మాణం ఆర్ట్స్ కాలేజీ భవనం. అజంతా.. ఎల్లోరా స్తంభ తోరణశైలి అధోభాగామందు సుకుమారమైన ఇండో సార్సేనిక్ అర్థవలయ ద్వారం ఉర్థ భాగంలో మృదువుగా మేళవించబడింది. ఈ భవనం శిల్పకళా సమన్వయానికి ప్రసిద్ధి వహించింది. 1938లో నిజాం ప్రభువు ఈ కొత్త ఆవరణాన్ని ప్రారంభించారు. తర్వాత ఉపాధ్యక్షుడి (వీసీ) భవనం, అంతకు పూర్వమే ఉన్న మూడింటికి తోడుగా మరో రెండు విద్యార్థి వసతిగృహాలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ కళాశాలలకు ప్రత్యేక భవనాలు, ఇంజినీరింగ్, లా కాలేజీ భవనాలు, అగ్రికల్చర్, వెటర్నరీ, సైన్స్ కళాశాల భవనాలు, అధ్యాపకులు, ఆఫీస్ సిబ్బందికి వసతి గృహాలు ఏర్పరిచారు. మహిళా కళాశాల మాత్రం అడిక్‌మెట్ (అడిక్‌మెట్ అంటే మహోన్నత్వం అని అర్థం) ఆవరణలోకి తరలించలేదు. కానీ అప్పుడు వీసీగా ఉన్న నవాబ్ అలీయవర్ జంగ్ బహద్దూర్ కృషి ఫలితంగా బ్రిటీష్ రెసిడెన్సీ భవనంలో ఉమెన్స్ కాలేజీని ఏర్పాటు చేశారు. 1934లో విశ్వవిద్యాలయం అడిక్‌మెట్ ఆవరణలోకి తరలించిన తర్వాత పాలనా విధానంలో ప్రధాన మార్పులు ప్రవేశపెట్టారు. 1948లో బోధనను ఉర్దూ నుంచి హిందూస్థానికి.. తర్వాత ఇంగ్లీష్‌కు మార్చడంతో యూనివర్సిటీ చరిత్ర రెండో దశ ముగిసింది.
Council1

మూడోదశ:

1948లో హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ బోధనా భాషగా ఉర్దూ స్థానంలో ఆంగ్లం ఆక్రమించుకున్నది. దేశ నలుమూలల నుంచి ప్రొఫెసర్లను తీసుకొని అధ్యాపక వర్గాన్ని విస్తరించారు. ప్రగతిశీలురైన వీసీలను నియమించి సర్వ హక్కులను వీసీలకు అప్పగించారు. వీసీల పరంపరకు కిరీటప్రాయంగా 1957 నవంబర్‌లో తొలిసారిగా డాక్టర్ డీయస్ రెడ్డి ఉపాధ్యక్ష పదవిని అలంకరించారు. ఆయన హయాంలో ఉస్మానియా యూనివర్సిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. నిజాం కాలేజీ ఉస్మానియాలో విలీనం కావడం మూడోదశలోనే జరిగింది. 1887లో నిజాం హయాంలో మదర్సాతో నిజాం కాలేజీ ప్రారంభమైంది. అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర, దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల విద్యార్థులు ఇక్కడ విద్యను అందిపుచ్చుకున్నారు. ఈ కళాశాలలో ఎంతోమంది ప్రముఖులు విద్యనభ్యసించారు. ప్రపంచస్థాయిలోనే ప్రత్యేక గుర్తింపును చాటుతున్న ఏకైక కళాశాల నిజాం కాలేజీ. 1887లో మద్రాస్ యూనివర్సిటీ కేంద్రంగా ప్రారంభమై 60 సంవత్సరాల తర్వాత 1947 ఫిబ్రవరి 9వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో విలీనమైంది. 1988లో అండర్ గ్రాడ్యుయేట్‌లో స్వయం ప్రతిపత్తి కళాశాలగా ఆవిర్భవించింది.

771
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles