కోరి కోరి తిందాం.. కొబ్బరి!


Sun,September 2, 2018 12:54 AM

coconut
కొబ్బరి మాత్రమే ఆరోగ్యం, అందం, ఆధ్యాత్మికం ఇలా ఏ కోణంలో చూసినా మేలే చేస్తుంది. భక్తితో దేవుడికి కొబ్బరికాయ కొడితే.. కోరుకున్న కోరిక తీరుతుంది. వంటల్లో కొబ్బరి కలిపి తింటే.. ఆరోగ్యానికి చేకూరే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందాన్ని మరింత పెంచేందుకు కూడా కొబ్బరిముందు వరుసలోనే ఉంటుంది. కొబ్బరినూనె, కోకోనట్ ఫేస్‌ప్యాక్ ఇలా ఎన్నో ఉన్నాయి కొబ్బరి గురించి చెప్పుకునేందుకు.. ఈరోజు వరల్డ్ కొకొనట్ డే సందర్భంగా జంటకమ్మలో కొబ్బరిగురించి
తెలుసుకుందామా!
-ప్రవీణ్‌కుమార్ సుంకరి, సెల్: 9701557412

అసలు కొబ్బరిచెట్టు ఎలా పుట్టిందో తెలుసా? స్వర్గానికీ, భూలోకానికి మధ్య ప్రత్యేకంగా ఒక లోకం ఏర్పాటుచేసుకున్న త్రిశంకు గురించి తెలుసా మీకు? అదేనండీ త్రిశంకు స్వర్గం అంటారు కదా! ఆ కథలో కొబ్బరిచెట్టు ఉద్భవించిన సంగతి గురించి ఉంది. పూర్వం త్రిశంకు అనే మహారాజు ప్రాణాలతోనే స్వర్గానికి పోయి అక్కడ సర్వ స్వర్గ సుఖాలు అనుభవించాలనుకున్నాడు. కానీ.. స్వర్గధ్వారం చేరకుండానే కిందకు తోసివేయబడ్డాడు. ఎన్నిసార్లు ప్రాణాలతో స్వర్గానికి వెళ్దామని ప్రయత్నించినా ఇంద్రుడు ప్రతీసారి నేలమీదకు తోసేస్తుంటాడు. అది గమనించిన విశ్వామిత్రుడు తన తపోబలంతో త్రిశంకును భూమికి, ఆకాశానికి మధ్యలోనే ఆపేస్తాడు. గాలిలోనే త్రిశంకు కోసం విశ్వామిత్రుడు ఒక పొడవాటి కర్రను ఆధారంగా పెట్టి ప్రత్యేక స్వర్గాన్ని నిర్మిస్తాడు. ఆ కర్రను ఆధారంగా చేసుకున్న త్రిశంకు కొబ్బరికాయగా మారిపోతాడు. ఆ తర్వాత ఆ కర్రే కొబ్బరిచెట్టు అయిందనేది ఆ కథలోని సారాంశం.
coconut1

ఆరోగ్యానికి

పచ్చికొబ్బరిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తక్షణ శక్తి కోసం నాలుగైదు కొబ్బరిముక్కలు తింటే మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి తింటే తొందరగా జీర్ణం కాదు అంటారు. కానీ.. కొబ్బరి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. గుండె సంబంధ వ్యాధులున్నవారు తరచుగా కొబ్బరి తింటే మంచిది. ఇందులో ఉండే మంచి కొలెస్ట్రాల్ గుండెకు మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి కొబ్బరి మంచి మార్గం. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కొబ్బరి తింటే సమస్య అదుపులో ఉంటుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లను కూడా పారదోలుతుంది. కొబ్బరిలో రాగి, సెలీనియం, ఇనుము, మాంగనీస్, ఫాస్పరస్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియను మెరుగుపరుస్తాయి. పచ్చికొబ్బరిలో బికాంప్లెక్స్, ఫోలెట్, రైబోప్లెవిన్, నియాసిన్, థయామిన్ లాంటివి కావల్సినన్ని ఉంటాయి. నోటిపూతతో బాధపడేవారు తరచూ కొబ్బరి తిన్నా, కొబ్బరిపాలు తాగినా సమస్య తొందరగా తగ్గుతుంది.

కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు నిత్యం కొబ్బరినీళ్లు తాగితే రాళ్లు కరిగిపోతాయి. అంతేకాదు.. మూత్రనాళాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా కొకొనట్ వాటర్ బయటకు పంపించివేస్తుంది. ఒక్క కొబ్బరిబోండంలోని నీళ్లు ఒక్క గ్లూకోజ్ బాటిల్‌తో సమానం అనే మాట మీరు వినే ఉంటారు. కొబ్బరినీళ్లు తక్షణ శక్తినిస్తాయి. బాడీని డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతాయి. కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరానికి అందే కాల్షియం, మెగ్నీషియం ఎముకల పటుత్వానికి తోడ్పడుతాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు కొబ్బరి నీళ్లు చాలా మేలు చేస్తాయి. రక్తపోటు, కండరాల తిమ్మరి, అలసట నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ఆధ్యాత్మికం

అందం, ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మనదేశంలో. పెండ్లిలకు, పండుగలకు, పలు పూజా సమయాల్లో కొబ్బరికాయదే అగ్రతాంబూలం. ఏదైనా కొత్తగా ఒక పని ఆరంభించేటప్పుడు కూడా శుభసూచకంగా కొబ్బరికాయ కొట్టి ఆరంభించడం మనం చూస్తునే ఉంటాం. ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి కాబట్టే.. కొబ్బరికాయను పండుగలకు, శుభకార్యాలకు వాడుతుంటారు. దీనికి తోడు పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా అందరికీ అందుబాటు ధరలో ఉండడం కూడా కొబ్బరి ఎక్కువగా వాడడానికి ఒక కారణం. రెగ్యులర్‌గా కొబ్బరి తినడం కుదరకపోయినా.. ఇలా పండుగలు, శుభాకార్యాలప్పుడు కొబ్బరి తప్పకుండా వాడడం ద్వారా దాన్ని వేస్ట్ చేయకుండా మనం తినేస్తాం. తద్వారా కొబ్బరి నుంచి చేకూరే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పెద్దలు ఈ సంప్రదాయాన్ని నిర్ణయించారేమో!

అందానికి

కొబ్బరినూనె చర్మానికి, వెంట్రుకలు చాలా మంచిది. అందుకే పలు సౌందర్య ఉత్పత్తులలో కొబ్బరినూనె కలుపుతారు. సన్‌టాన్ లోషన్, లిప్‌స్టిక్‌లలో కొబ్బరినూనె తప్పకుండా వాడుతారు. సహజసిద్ధంగా తయారుచేసిన షాంపూ, సబ్బులు ఎక్కువ నురగ రావడానికి కారణం కొబ్బరినూనె అనే విషయం మీకు తెలుసా! బాడీలోషన్‌గా కొబ్బరినూనెను ఐప్లె చేయడం వల్ల చర్మకణాలను ఉత్తేజ పరిచి, వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా తోడ్పడుతుంది. వెంట్రుకలకు సహజ కండిషనర్‌గా పనిచేస్తుంది. జుట్టు బలంగా ఎదగడానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది.

కొబ్బరి పువ్వు

కొబ్బరికాయలో నీళ్లు ఇంకిపోయి తెల్లటి గడ్డలా గట్టిపడుతాయి. కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు నీళ్లకు బదులు కాయ లోపలిభాగంలో తెల్లగా ఉండే మెత్తటి పదార్థం ఉంటుంది. ఇది తినడానికి తియ్యగా ఉంటుంది. దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు నీళ్లకు బదులు పువ్వు వస్తే అదృష్టంగా భావిస్తారు. ఈ పువ్వు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అధిక రక్తస్రావంతో బాధపడేవారికి కొబ్బరిపువ్వును జ్యూస్‌లా చేసుకొని తాగితే సమస్య తగ్గుతుంది. విరేచనాలు, నీరసంతో ఇబ్బంది పడేవారికి కొబ్బరిపువ్వు ఉపశమనం కలిగిస్తుంది.
coconut2

కొబ్బరిచెట్టు.. కొన్ని విశేషాలు!

-కొబ్బరిచెట్టు దాదాపు 30 అడుగుల ఎత్తు పెరుగుతుంది.
-దీని ఆయుఃప్రమాణం వంద సంవత్సరాలు
-కొబ్బరిలో 49శాతం లారిక్ యాసిడ్ ఉంటుంది.
-ఇది తల్లిపాలకు సమానం
-ఏడు సంవత్సరాలు పూర్తి కాగానే కొబ్బరిచెట్టు నెల నెలా చిగురు వేస్తుంది.
-కొబ్బరికాయ, నారికేళము, టెంకాయ, కొకోనట్ అని మాత్రమే కాకుండా.. శ్రీ ఫలము అని పిలుస్తారు.
-కొబ్బరిని సాంకేతిక పరిభాషలో కోకోస్ న్యుసిఫెరా అంటారు. న్యుసిఫెరా అంటే ఎత్తయినది అని అర్థం.
-ఉష్ణమండలాల్లో విరివిగా, సహజంగా పెరుగుతుంది.

459
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles