కొత్త చూపు


Sun,December 2, 2018 03:34 AM

ఇతిహాసంలో తెలంగాణ ఎక్కడ? - రెండో భాగం
Warangal
మన చరిత్రలో భాగంగా ఇప్పటి వరకు బతుకమ్మలో ప్రచురితమైన 78 భాగాల్లో కాకతీయులకు సంబంధించిన భాగాలను తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ కాకతీయ ప్రస్థానం పేరుతో పుస్తక రూపంలోకి తీసుకువస్తున్నది. నగేష్ బీరెడ్డి రాసిన ఈ పుస్తకానికి కొత్త చూపు శీర్షికన నమస్తే తెలంగాణ సంపాదకులు కట్టా శేఖర్ రెడ్డి రాసిన ముందుమాట రెండో భాగం ఇది.

మనం ఎవరు? ఎక్కడి నుంచి ఇక్కడిదాకా వచ్చాం? ఏయే మలుపులు, ఏయే దారులు, ఏయే ఉత్పాతాలు, ఏయే యుద్ధాలు దాటుకొని ఇక్కడికి చేరాం. ఇక్కడే కదా వేల యోధుల
కరవాలాలు కదను తొక్కింది. ఇక్కడే కదా వేలాదిమంది అశ్వికులు విదేశీ
సేనలను ఎదురొడ్డి పోరాడింది.

మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ నెంబర్‌లో తెలియజేయండి.
సెల్ : 80966 77177


(గతవారం తరువాయి)

విదేశీ యాత్రికుడు మెగస్తనీస్ నమోదు చేసిన వివరాలను తరువాతి తరం రచయితలు వివరించే ప్రయత్నం చేశారు. మెగస్తనీస్ ప్రస్తావించిన మొదగలింగ, త్రికలింగ వ్యుత్పత్తి త్రిలింగమేనని క్రీస్తుశకం 79లో మరణించిన ప్లీనీ వివరించారు. త్రిలింగ ప్రస్తావన తెలుగు రాజ్యానికి సంబంధించిన ప్రస్తావనే అని సుధాకర్ చటోపాధ్యాయ వివరించారు. క్రీస్తుశకం ఒకటవ శతాబ్దంలో భారతదేశంలో పర్యటించిన టోలెమీ క్లాడియస్, టోకోసాన్ ప్రాంత రాజధాని త్రిలింగాన్ అని యాత్రాగ్రంథంలో పేర్కొన్నారు. ప్రఖ్యాత చరిత్ర పరిశోధకుడు కన్నింగ్‌హామ్ (యాన్సియెంట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా పే. 518-9) టోలెమీ ప్రస్తావించిన త్రిలింగ శబ్దం తెలంగాణను ఉద్దేశించినదేనని చెప్పారు. ధనకటక, ఓరుగల్లు, రాజమహేంద్రిల మధ్య ప్రాంతం తెలింగాణగా భావించి ఉంటారని ఆయన రాశారు. కాల్డ్‌వెల్ (ద్రవిడ్ గ్రామర్ పే.32లో) త్రిలింగ శబ్దం గోదావరి తీర తెలంగాణ ఒకటేనని రాశారు. శాతవాహనులు తమ శాసనాల్లో ఎక్కడా తాము ఆంధ్రులమని పేర్కొనలేదు. నానాఘాట్ శాసనం మొదటి శాతకర్ణిని దక్షిణాపథ చక్రవర్తిగా పేర్కొంది. ఈ దక్షిణాపథమే తర్వాత దక్కనుగా మారింది. శాతవాహనులు మౌర్యుల సేనాపతులుగా ఇక్కడికి వచ్చారు. మౌర్యుల దండయాత్ర వింధ్యాచలం మీదుగా నర్మదను దాటుకొని విదర్భ మీదికి వచ్చినట్టు దండయాత్రా మార్గాల పరిశోధన పత్రాల్లో పేర్కొన్నారు.

వారు ముందుగా దక్కనుకు వచ్చి అక్కడి నుంచి రాజ్యం విస్తరించారని, ప్రతిష్ఠానపురం, ఇప్పటి పైఠాను వారి తొలి రాజధాని అని పిమ్మట కోటిలింగాల, తుదకు అమరావతికి తమ రాజధాని మార్చుకొని ఉంటారని మరాఠా చరిత్రకారులు వాదిస్తున్నారు. శాతవాహనుల ఆఖరి గమ్యం అమరావతి. తొలి గమ్యం కాదు. వైభవోపేత కాలమూ కాదు. అమరావతి అంత్యకాల రాజధాని కావచ్చు. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుగా వేనోళ్ల కీర్తినొందిన శాతవాహన కృష్ణుడు త్రిలింగదేశాధీశ్వరుడుగా కీర్తినొందినట్టు చరిత్ర పరిశోధకులు పేర్కొంటున్నారు. కృష్ణా నది సముద్రంలో కలిసే చోట ఆంధ్రభృత్యులు రాజ్యం చేశారని కూడా చరిత్రకారులు గుర్తించారు. డాక్టర్ రామారావు శాతవాహనుల నాణేలు.. ముఖ్యంగా మొదటి శాతకర్ణి నాణేలు తెలంగాణలోని కొండాపురం, పెదబంకూరు, ఆంధ్రలోని గుంటూరులలో లభించాయి. కాబట్టి శాతవాహనులు ఆంధ్రులే అని తన పరిశోధన పత్రంలో వాదించారు. శాతవాహన రాజు హాలుడు రచించిన ప్రాకృత రచన లీలావతి సప్తగోదావరి భీమం లేక ద్రాక్షారామం గురించి ప్రస్తావించింది కాబట్టి శాతవాహనులు ఆంధ్రులే అని కూడా మరో వాదన చేశారు. సప్తగోదావరి కేవలం గోదావరి జిల్లాల్లోనే కాదు, శ్రీరాంసాగర్‌కు దిగువన కడెం నది కలిసే లోపు గోదావరి నది కనీసం నాలుగైదు చోట్ల నాలుగు నుంచి ఏడుపాయలుగా చీలిపోయి ప్రవహిస్తుంది. కరీంనగర్- ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులో కోటిలింగాలకు ఎగువన సప్తగోదావరిని చూడవచ్చు.

రాజు మారినప్పుడల్లా మతం మారడం చరిత్రలో ప్రతిసందర్భంలో చూశాం. యుద్ధాలవల్ల కావచ్చు, మత ప్రచారం కోసమే కావచ్చు జైనులు, బౌద్ధులు వింధ్యా పర్వతాలను దాటుకొని దక్షిణాపథానికి వచ్చారు. ఈ రెండు మతాలు ఉత్తరాది మతాలు. ఈ మత శాఖల రాక, వారిని అనుసరించే రాజవంశాల రాక ఏకకాలంలో జరిగాయి. శాతవాహనులు మౌర్యుల సేనాపతులుగా దక్షిణభారతానికి వచ్చారని, మౌర్యసామ్రాజ్యం బలహీనపడిన వెంటనే స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేసుకున్నారని ఒక వాదన ఉంది. వారు తొలుత బౌద్ధాన్ని వ్యాప్తి చేశారు. బౌద్ధ, జైన మతాలు దక్షిణ భారతంలో అనేక మౌలిక మార్పులను తీసుకువచ్చాయి. శాతవాహనులు తొలిసారిగా ఒక మహాసామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆ కారణంగా త్రిలింగ భావన కొంత బలహీనపడి ఉండవచ్చు. తెరమరుగైపోవచ్చు. కానీ త్రిలింగ భావనే తెలుగు ప్రజలకు మూల బీజం అన్నది మాత్రం నిర్వివాదాంశం. ఐదో శతాబ్దానికి చెందిన తమిళ వ్యాకరణ గ్రంథంలో కొంగణం, కన్నడం, కొల్లం, తెలుంగం అని ప్రస్తావించారు. త్రిలింగ శబ్దం నుంచే తెలింగ, తెలుంగు, తెలుగు ఆవిర్భవించాయని చెప్పడానికి ఆంధ్ర చరిత్రకారులు అంగీకరించలేదు. పదకొండో శతాబ్దంలో నన్నయ ప్రస్తావించిన తెనుగు పదమే తెలుగు భాషకు సంబంధించిన మొదటి ప్రస్తావనగా ఆంధ్ర చరిత్రకారులు మొత్తం తెలుగుజాతిని నమ్మింపజూశారు. రాజకీయాధిపత్యాన్ని, ప్రాదేశిక ఏకతను ఒక్కటిగా చూపడానికి తెలుగుకు సంబంధించిన మూలాలను గుర్తించ నిరాకరించారు. ఇలా చర్చిస్తూ పోతే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. ఇలా మూలాలకోసం వెతుకులాడే తపనలోంచే నమస్తే తెలంగాణలో చరిత్ర శోధన వార్తలను, వ్యాసాలను ఒక పరంపరగా ప్రచురించాం.

తెలంగాణకు సంబంధించి పురాణచరిత్రకు తగిన ఆధారాలు లేవు. మధ్య యుగాల చరిత్రకు సంబంధించి కూడా ఎక్కువగా ఆధారాలు లభించలేదు. విషాదం ఏమంటే దక్కను పీఠభూమి ఉత్తర దక్షిణ భారత దండయాత్రలకు మధ్యన రంగభూమిగా మారడం. ఉత్తరాది రాజులు వింధ్య పర్వతాలు దాటిన తర్వాత మొదట విరుచుకుపడింది దక్కనుపైనే. దక్కను ధ్వంసం తర్వాతనే వారు ఇటు తూర్పునకు అటు మరింత దక్షిణానికి తమ దండయాత్రలు సాగించారు. సుల్తానులు, మొఘలులకు కూడా యుద్ధభూమి దక్కను పీఠభూమే. క్రీస్తు శకం 1300 తర్వాత దక్కను అంతా రక్తసిక్తమే. మొదట దేవగిరిలో యాదవ సామ్రాజ్యాన్ని నాశనం చేసి, తర్వాత ఓరుగల్లుపైకి వచ్చారు. రెండు చోట్ల అసాధారణ విధ్వంసం సాగించారు. సకల సంపదలను కొల్లగొట్టడమే కాదు, చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేశారు. కొంతకాలం దక్కనులోనే వారు తిష్టవేసి బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. యాదవ, కాకతీయ రాజులతో యుద్ధం తర్వాత, దక్షిణాదిలో మనుగడ సాగించాలంటే హిందువులతో కలసి ఉండాలన్న సోయి వారికి వచ్చింది. తమ ఆస్థానాలలో హిందువులను పెట్టుకుని దక్షిణాదిలో ఇంకా మిగిలి ఉన్న హిందూ రాజ్యాలను ఖతం పట్టించే పన్నాగాలకు దిగారు. దక్షిణాది రాజ్యాలపైకి దాడులకు వెళ్లే కొద్దీ ముస్లిం రాజులలో మతసహిష్ణుత అనివార్యమైంది. అందుకే కర్ణాటక, తమిళనాడు, కేరళలల్లో చారిత్రక, ఐతిహాసిక, ఆధ్యాత్మిక ఆనవాళ్లపై విధ్వంసం ఎక్కువగా జరుగలేదు. క్రీస్తుశకం 1323లో ప్రతాపరుద్రుని కిరీటం పడిపోయిన తర్వాత నుంచి 1948 వరకు ముస్లిం రాజుల చరిత్రే తెలంగాణ చరిత్ర.

క్రీస్తుశకం 1331 నుంచి 1475 దాకా మలి కాకతీయులు, పద్మనాయకులు రాజ్యం చేసినప్పటికీ వారి చరిత్ర కూడా ఎక్కడా నమోదు కాలేదు. చివరకు మలి కాకతీయ రాజుల మధ్య తంపులు పెట్టి బహమనీలు తెలంగాణ నేలను మరోసారి రక్తసిక్తం చేశారు. రాజుకొండ, దేవరకొండ, ఓరుగల్లులను నామరూపాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించారు. తెలంగాణలో ఇంకా అక్కడక్కడా మిగిలిఉన్న చిన్నచిన్న రాజ్యాలు, సంస్థానాలు, జాగిర్దారీలు ముస్లిం రాజుల తాకిడికి బదాబదలై పోయాయి. ఆరు వందల సంవత్సరాలపాటు తెలంగాణలో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి పెద్దగా చారిత్రక ఆధారాలు లేవు. కుల చరిత్రలు, వంశచరిత్రలు, కొన్ని శాసనాలు, కొన్ని గ్రంథాలు తప్ప ఏవీ మిగులలేదు. త్రిలింగదేశాధీశ్వరులుగా సకల కీర్తులందుకున్న కాకతీయుల వైభవానికి సంబంధించి అరకొర పరిశోధనలే. పివి పరబ్రహ్మశాస్త్రి గారు నిజానికి ఎంతో శ్రమించి కాకతీయుల చరిత్ర రాశారు. అప్పుడున్న పరిస్థితుల్లో, ఆయనకున్న పరిమిత వనరుల్లో ఆయన చేసిన కృషి అమూల్యమైనది. కానీ చేయవలసింది ఇంకా చాలా ఉంది. శోధించవలసింది ఎంతో మిగిలిపోయింది. అందుకోసం పుస్తకాల సేకరణ, ఆధారాల సేకరణ, పురావస్తుశాలల శోధన అనేకం చేయాల్సి ఉంది. హైదరాబాద్, కోల్‌కత్తా, ఢిల్లీ, తంజావూరు, రాజమహేంద్రవరం వంటి చోట్ల గ్రంథాలయాల్లో, పురావస్తుశాలల్లో దాచి ఉంచిన గ్రంథాలు, పత్రాలు, శాసనాలను శోధించడంతోపాటు విదేశాల్లోని ప్రముఖ గ్రంథాలయాల్లో, పురావస్తుశాలల్లో అన్వేషణ జరుగాలి. ఆ అన్వేషణలో ఒక చిరు ప్రయత్నం నగేష్ బీరెడ్డి చేశారు.

ఈ నేల వేలయేండ్ల చరిత్రను తెలుసుకోవాలన్న ఆశ ఆయనను చాలా దూరం నడిపించింది. మనం ఎవరు? ఎక్కడి నుంచి ఇక్కడిదాకా వచ్చాం? ఏయే మలుపులు, ఏయే దారులు, ఏయే ఉత్పాతాలు, ఏయే యుద్ధాలు దాటుకొని ఇక్కడికి చేరాం. ఇక్కడే కదా వేల యోధుల కరవాలాలు కదను తొక్కింది. ఇక్కడే కదా వేలాదిమంది అశ్వికులు విదేశీ సేనలను ఎదురొడ్డి పోరాడింది. ఇక్కడే కదా శిల్ప, కళా, సాహితీ సౌరభాలు నలుదిక్కుల విరాజిల్లింది. ఇక్కడే కదా సుల్తానులు, బహమనీలు, మొఘలాయిలు స్థానికుల రక్తంతో స్నానమాచరించింది. ఇక్కడే కదా నేలకొరిగిన వీరయోధుల తలలు కోటగుమ్మాలకు వేలాడింది. ఇక్కడే కదా వీరగల్లుల ఊరేగింపులు జరిగింది. ఆ దారులను చూడడానికి, ఆ ఆనవాళ్లను వెతుకడానికి, చరిత్ర కోనల్లోకి వెళ్లాలి. అక్కడ ప్రవహించే ఆ నులివెచ్చని జీవనధారలను శోధించి పట్టుకోవాలి. శోధన ఒక తీరని దాహం. ఆ దాహం తీర్చుకునే ప్రయత్నంలో నగేష్ విజయం సాధించారు. కాకతీయుల చరిత్రపై ఒక కొత్త చూపు ప్రసరింపజేశారు. మరిన్ని వివరాలు, ఆధారాలతో, కొత్తగా, హృద్యంగా, కమనీయంగా వివరించారు. కాకతీయుల కథ పాతదే కావచ్చు, కానీ ముక్కలుముక్కలుగా లభించిన కథలను పేర్చికూర్చి వర్ణించిన తీరు, పాత్రలను నడిపించిన తీరు ఆయన రచనా మాధుర్యాన్ని మనకు పట్టి ఇస్తుంది.

339
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles