కొండదాపు


Sun,April 15, 2018 02:19 AM

కొండదాపు దట్టంగా పరుచుకున్న గుబురు గుబురు చెట్ల కొమ్మల సందుల్లో నుంచి మసక చీకటి తెరల్ని చీల్చుకుంటూ పొద్దు మాగిన పండై పురుడు పోసుకొని పైపైకి ఎగబాకుతూ ఎక్కెక్కి వస్తూ తన లేలేత కిరణాల్ని సుతారంగ నేలపై పరుచుకుంటుంది. మునిమాపు జాము కాడనే లేసి తన తల్లిని మందలించి రెండురొట్టెలు సద్దిగట్కొని కాళ్లకు బాట పట్టించిన మల్లప్ప గూడానికి దూరం అవుతున్నకొద్దీ అతని గుండెల్లో దడదడ మొదలైంది. అతను వేగం పెంచి తారు రోడ్డు పైకి అతి కష్టంగా చేరుకున్నడు. అతను పిల్లబాట నుంచి, బండ్లబాట నుంచి తారుపై కాళ్లు పెట్టాడో లేదో తన మతిని మెలిపెడుతూ రాబోయే కీడు మతిల శంకించింది. తన భార్య నీలి.. తను ప్రేమగా చూసుకునే నీలి, మాయదారి విషపు జ్వరం బారిన పడి నెల్లాల్లయింది. ఆ గూడానికి యాభై కిలోమీటర్లు పోతేగాని జిల్లా పెద్ద ఆసుపత్రి చేరుకోలేం. అలాంటిది నెలరోజులుగా తీవ్ర జ్వరంతో మంచం పడితే నాటు మందులు వాడిన ఆకుపసరు వైద్యానికి తక్కువ కాకుంటే అతి కష్టంగా టౌన్లో పెద్ద ఆసుపత్రి సర్కారు దవాఖానల శరిక్ చేసిండు మల్లప్ప.భార్య నీలికి కావలిగా తన 16 యేండ్ల కూతురు మొగిలిని ఉంచిండు. భార్యకు చేదోడు వాదోడుగా ఉంటుందని కాని నీలి ఆరోగ్యం రోజురోజుకు విషమించింది. డాక్టర్లు రావడం రకరకాల పరీక్షలు చేయడం, శరామామూలయింది. వైరల్ ఫీవర్ అంటూ కొందరు, డెంగు జ్వరం అంటూ మరికొందరు రకరకాల పరీక్షలు చేసి సరిగా పట్టించుకోలేదు. దానితో ఆమె పరిస్థితి మరీ దయనీయంగా మారింది. డబ్బులు పెట్టి బయట ప్రైవేటులో చూపించే స్థోమత అతనికి లేదు. ఆరోజుల ఆసరా కాలేదు బతికితే అందరు కలిసి బతుకడం ఒకవేళ చనిపోతే ఆపై పైవాడి దయగా భావించి చేతులు దులుపుకోవడం తప్ప ఎవరినీ నిందించే సాహసం చేయనివాడు మల్లప్ప. అతను అమాయకుడు, వారు అనాగరికులు. నాగరికులకి దూరంగా ఎక్కడో కొండ దిగువ ప్రాంతాల్లో నివసించే బతుకులు వారివి. మల్లప్ప గూడెం దాటి, మట్టిబాట దాటి తారుపై నడువడం మొదలు పెట్టాడు. ఏదైనా వాహనం దొరికితే అది తన అదృష్టంగా భావించి టౌన్‌కు చేరాలని అతని తపన. అతని ఆరాటం మల్లప్ప భుజాన సద్దిమూటలతో నడక అలా సాగుతూనే ఉంది. తారురోడ్డుపై కొంత దూరం వెళ్ళాక ఒక లారీ రావడం చూశాడు. అతను వెనుకకు మళ్లీ ఆ లారీవైపు చూస్తూ చేతులు జోడించి లారీ డ్రైవర్‌ను ప్రాధేయపడసాగిండు లారీ ఆపాలని దూరం నుంచే గమనించిన లారీ డ్రైవర్‌కి ఎక్కడో మతిలో కాసింత జాలి కలిగి అతను మల్లప్ప ముందు లారీ ఆపాడు. అయ్యా అయ్యా లారి ఆపండయ్యా ఆపండయ్యా అని మల్లప్ప దీనమైన గొంతుకతో అతన్ని బేలగా చూస్తూ అడగగానే యేడికి పెద్దమనిషి అంటూ డ్రైవర్ డోర్ తీశాడు. మల్లప్ప అయ్యా నేను టౌన్‌కి ఎల్లాల అంటూ ప్రాధేయపడిండు.
Katha

పాలిపోయిన మొహంతో కండ్లు కంతలకు పోయి నెర్సిన జుట్టూ, మాసిన గడ్డంతో, మాసిన బట్టలు తొడిగి సెమట కంపు కొడుతున్న బికారీగా ఉన్న అతన్ని చూస్తే లారీ డ్రైవర్‌కు పిచ్చోడిలా కనిపించినా యాడికి వెళుతున్నవు అని పలుకరించిండు. అయ్యా మాది కొండదాపు చింతగూడెం. టౌన్‌కు వెళ్ళుతున్న. ఆడా పెద్ద ఆసుపత్రిల నా భార్య శెరికైయింది. దాని ఆలతు బాగులేదు. ఆరోగ్యం చెడి నెల్లాలయింది ఎట్లుందో యేమో చూసుకోవాలి అందుకే టౌనుకు వస్తున్న అని అన్నడు మల్లప్ప. అరే అట్లనా ఎంట ఎవరన్న ఉన్నరా అయ్యా నా బిడ్డ కావలిగుందయ్యా అన్నాడు మల్లప్ప. సరిగానే మంచిగ కూర్చో గంట దాటిందంటే జేరుకుంటం పానం నిమ్మలం చేసుకో అన్నడు డ్రైవర్. పొద్దు పొడ విచ్చుకుంది సమయం 7 దాటింది. లారీ టౌన్చేరింది. లారీ అతను బస్టాండ్ దగ్గరల పానగల్ బైపాస్ రోడ్డుపై లారీ ఆపిండు. ఇదుగో పెద్దమనిషి అలా నడుచుకుంటూ వెళితే ఇగ నివ్వు ఆసుపత్రికి వెళ్లొచ్చు అని మల్లప్పను అక్కడ దింపిండు, మల్లప్ప పానగల్ బైపాస్ రోడ్డుపై లారీ దిగి గొల్లగూడెం దవాఖానకు బాటపట్టిండు లారీ డ్రైవర్‌కు దండం పెట్టి, నడికట్ల పైసలు తీయజూసిండు మల్లప్ప. పైసలు వద్దుగని ఇగపో డ్రైవర్ అనేసరికి మల్లప్ప ముందుకు నడక సాగించిండు.

ఆసుపత్రి అంత చలిని చీలుస్తూ ఎండపొడ రేకలు విచ్చుకొని చలితో తడిసి ముద్దయింది. అక్కడ ఉన్నవారందరూ ఆ కాశింత సలికి వణుకుతూ వెచ్చదనం కోసం అటు ఇటు దిక్కులు చూస్తూ ఆసుపత్రి ముందల ఆగిన చాయ్ బండివైపు నడక సాగించిండ్రు తమ శరీరానికి వేడిని రాజేసుకొనేటందుకు. మరి కొందరు భారమైన గుండెలతో తమ బరువెక్కిన గుండెలోపలి బాధను కండ్లపొంటి దారులుగా కారుస్తూ జీరబోయిన గొంతుకతో విలపిస్తూనే. ఇంకొందరు తమను తాము సముదాయించుకుంటూ దుఃఖంలో మునిగారు మల్లప్ప కూతురు తండ్రికై ఎదురుచూస్తూ దిగులు కండ్లతో మునిగి వచ్చిపోయే వారిని ఎగాదిగా చూస్తూ దుఃఖంలో మునిగిపోయింది. ఆమె చెంపలపై కన్నీటి ధారలు చారలుగ నిలిచినై.
అక్కడక్కడ కొందరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఎవరి బాధలో వారు మునిగిపోయారు. అక్కడే గేటు దగ్గర నల్లటిరంగు కాకి బట్టలతో వాచ్‌మెన్ డ్యూటీ చేస్తున్న అతను మల్లప్ప కూతురు వైపు వచ్చి ఇదిగో అమ్మాయి మీ అయ్య ఇంకా రాలేదా? మీ అమ్మ నిన్న జీవిడిసింది. ఇంకా రాలేదు. కబురు పెట్టలే. తొందరగా రమ్మని చెప్పుకో.

మీ అమ్మని తీసుకెళ్లండ్రి పెద్ద సారొస్తే నామీద కోపబడతడు అంటూ అమ్మాయిపై చిటపటలాడుతూ పలికిండు. అతని వైపు బేలాగా చూసింది. అతను అలా అనగానే కలువరేకుల్లాంటి కండ్లలోంచి జల్లు దుఃఖం పొంగుకొచ్చింది. అయ్యా ఈడ వుండాలని మాకేమీ లేదు. మా అయ్యకోసం ఎదురుచూస్తున్న ఈపాటికే వస్తుంటాడు. రాంగనే వెళ్లిపోతాం. కొంచెం సేపు ఓపిక పట్టండి అని అతనివైపు చూస్తూ నిలబడింది. మరేమీ మాట్లాడకుండా అతను శవాల గది వైపు నడిచాడు ఆమె దిగాలుగా కిందకు చూస్తూ దుఃఖంలో మునిగి అక్కడే వరండాపై కూర్చుంది. మల్లప్ప దూరంనుంచే చిన్నగా నడుస్తూ బిడ్డను చూసి ఆమె వైపు కదిలాడు. రాళ్ళురప్పలు నడిసిన అతని కాళ్ళకు తారురోడ్డు గడ్డలా తాకింది. కూతురు దరిచేరి వనుకుతున్న గొంతుకతో కూతురిని తిన్నగా పిలిచాడు. ఆమె తండ్రిని ఎగాదిగా చూసి గుండెల్ని బాదుకుంటూ బోరున ఏడ్చింది ఏమిటో అర్థం కాక అతను ఏందిరా అమ్ని ఏమైందిరా బంగారు అనగానే అమ్మ అమ్మ అమ్మ అని అటువైపు వేలు చూపుతూ అమ్మ చచ్చిపోయినాదయ్యా అని ఏడుస్తూ దుఃఖంలో మునిగిపోయింది. నీలీ అంటూ ఒకే ఒక కేక వేశాడు మల్లప్ప. అలాగే కూలపడిపోయిండు. కొంతసేపయ్యాక తేరుకొని తిన్నగా లేచి కూతురుని తనతోపాటు తీసుకొని శవాల గదివైపు నడిచాడు. అక్కడ వాచ్‌మెన్‌ను సమీపించి తన భార్య శవాన్ని బయటికి తీసుకున్నాడు. తల్లిశవాన్ని రోడ్లపై పడుకోబెట్టి కూతురు ఏడవసాగింది. అతను కూడ నీలిని చూసి ఏడ్పు ఆపుకోలేక బోరున విలపించిండు.

అలా ఏడుస్తూ చివరిచూపుకు నోచుకోలేకపోతిని అయ్యో భగవంత అంటూ ఏడుస్తూ మల్లప్ప దుఃఖాన్ని దిగమింగుతూ వాచ్‌మెన్‌తో ఏదో మాట్లాడడం మొదలు పెట్టాడు. అతను లోన పెద్దసారుండు అడుగుపో ఏదన్న సాయం చేస్తాడు. నా చేతిలో ఏమి లేదు అన్నడు వాచ్‌మెన్. మల్లప్ప పెద్ద డాక్టర్ దగ్గరకు వెళ్ళి కాళ్ళవేళ్ళపడుతూ బతిమిలాడుతూ తన భార్య శవాన్ని తీసుకెళ్లడానికి నా దగ్గర డబ్బులు లేవయ్యా ఏదైన మీరే పెద్దమనసుతో సహాయం చేయండి. దవాఖాన మోటర్ బండి, జీపు ఉంటే ఇప్పించండి నా భార్యను అందులో మా ఊరికి తీసుకెళ్తాను అని బతిమిలాడుకుండూ కాని అక్కడి డాక్టరు ఇక్కడే బండి లేదు. ఇక్కడేమైన అపాయం సంభవించిన ప్రమాదానికి గురైన వారికి 104, 108 ఉంటుంది. కాని తీసుకపోవడానికి ఎలాంటి వసతి లేదు. ఇక్కడ ఉన్నది ఒకటే బండి అదికూడ ఇప్పుడు లేదు అంటూ కసురుకుండు డాక్టర్. మల్లప్ప చేసేదిలేక పాలిపోయిన మొహంతో చాపలో చుట్టిన తన భార్య శవాన్ని భుజంపై వేసుకొని మరో చేత కూతురుని వెంట పెట్టుకొని తన ఊరికి బాట పట్టిండు.

తన ఊరు టౌన్‌కి 50 కిలోమీటర్ల దూరం అది అతనికి తప్పని భారమే భార్యమీద ప్రేమ అతన్ని ఎలాగైన తన ఊరికి తన భార్యను తీసుకెళ్ళాలన్న తపన అతనిని ముందుకు నడిపించింది. అక్కడ ఉన్నవారందరూ వింతగా అతనిని చూస్తుండిపోయారు. ఎవ్వరుకూడ సహాయం చేసిన పాపాన పోలేదు. కూతురు ఏడుస్తూ ముందుకు సాగుతుంది. ఒకవైపు కూతురుని మరో భుజంపై తన భార్యను మోసుకొని ఊరువైపు కదులుతూ బాటసాగుతూ నడక సాగించాడు మల్లప్ప అలా అతను ఊరివైపు సాగుతూనే ఉన్నాడు. టౌన్‌కు దూరమైండు తారురోడ్డుపై అలా నడుస్తూనే ఉండు సందెపొద్దువాలింది. చీకటి ముసురుకుంది. ఆ చీకటిలోకి అతను తన భార్య తన కూతురు వెలుగుచుక్కల మెలుకువతో ముందుకు సాగుతూనే ఉండ్రు. వారికి టౌన్కంటే తమకు అండాదరువైన కొండదాపు గూడెమే కొండంత భరోసా ఇస్తూ పిలుస్తున్నట్టు కనిపించింది. తమ కష్టాల్ని తమ దుఃఖాల్ని తమ సంతోషాన్ని అక్కున చేర్చుకున్న ఆకలి దూపల్ని తీరుస్తున్న దూరంగా విసిరేసినట్లున్న ఆ కొండగూడెం అతనికి అండగా నిల్చింది. అతనికి బాల్యం నుంచి నడక నేర్పింది, ఆకలిదూప తీర్చింది, బతుకునిచ్చింది. మానవత్వం కనిపించని నగరం కంటే తన ఊరే ఆసరా అయ్యింది. ఆ కొండ దాపుకు తన భార్యతో అతను అతని కూతురు సాగిపోయాడు.

ఈ నగరజీవన లోకంలో ఇముడలేక కొంత సేపటికి మల్లప్ప బిడ్డ అతనితో అయ్యా అమ్మను మోయడం బరువుగా లేదా అంతదూరం ఎట్లమోస్తవ్ ఇక్కడే ఏదో తావున పూడ్చి పెట్టి పోదాం అని దీన స్వరంతో చిన్ని పలికింది. చిన్ని నా బంగారి, నీ అమ్మ నాకు బరువా దాన్ని సుఖ పెట్టకపోయిన కనీసం దాన్ని మన ఊరిగూడెం తీసుకెళ్లి అక్కడే సావుచేద్దాం. దానికి మన ఊరన్నా, ఊరి చెట్టు, పుట్ట, ఏనగటూ, కొండజాలు, ఊట సెలిమెలు చుట్టూ దానిమతి బీరాకు తీగోలే అల్లుకపోయింది. దానికి ఊరన్నా, నేనన్నా మన ఇల్లన్నా వల్లమాలిన పాయిరం. అమ్మ ఆత్మశాంతి ఉండాలంటే కొండదాపు గూడానికి అమ్మను చేర్చాలి ఎంతకష్టమైన సరే అంటూ ముందుకు సాగుతూనే ఉండు. కూతురు తండ్రిని అనుసరిస్తూ వెనుకాల నడకసాగిస్తున్నది. వారు అలా... నడుస్తూనే ఉండ్రు ముందుకు సాగిపోతూనే ఉండ్రూ కొండదాపుకు..!

కథలకు ఆహ్వానం

మనమంతా నగర యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోతున్నాం. కొందరు అర్బన్.. సెమీ అర్బన్ కల్చర్‌కు అటూ ఇటూ తిరుగుతుంటే.. ఇంకొందరు అర్బన్ రూరల్ మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ జీవనయానంలో ఎన్నో కథలు, వ్యథలు.. అర్బన్ కల్చర్‌తో ముడిపడి ఉన్న మానవ సంబంధాలు.. జీవన విధానాలు, వైవిధ్యాల చుట్టూ అల్లుకున్న కథలకు బతుకమ్మ స్వాగతం పలుకుతున్నది. కథనంలో వైవిధ్యం, పాఠకులను ఏకబిగిన చదివించగలిగే బిగువూ ఉండాలి. ఆధునిక కథన శిల్పం ఉన్న కథలకు ప్రాధాన్యం.

మీ కథలు పంపాల్సిన చిరునామా..
కథలు రాయాల్సిన చిరునామా: బతుకమ్మ, నమస్తే తెలంగాణ, 8-2-603/1/7,8,9,
కృష్ణాపురం, రోడ్‌నంబర్.10, బంజారాహిల్స్, హైదరాబాద్-500034.
ఈ-మెయిల్ : sunmag@ntdaily.news

816
Tags

More News

VIRAL NEWS

Featured Articles