కృపాచార్యుడు


Sun,September 9, 2018 01:52 AM

Kripacharya
న్యాయ, ధర్మాల విచక్షణ తెలిసీ, మానవీయ విలువలు తెలిసి, సామాజిక ఒరవడి తెలిసీ, మంచీ చెడుల ధోరణి తెలిసి, ఎదుటి వారు చేసే తప్పులను చెప్పలేకపోవడం, దారుణం జరుగుతుందని,అన్యాయం అయిపోయిందని మనసులోనే మథనపడి వ్యక్తపరుచలేకపోవడం చాతకానితనంగా లోకం చిత్రీకరిస్తుంది. ఏదో అవసరం వారిని వెనుకబాటుతనంలోకి నెట్టివేస్తుందని అవహేళన చేస్తుంది. మాటకు విలువనీయక పక్కన పెట్టేస్తుంది. కానీ ఎవరు ఆపినా, ఆపకపోయినా, ఎవరు ధర్మ వివేచన చేసినా చేయకపోయినా కాలం అనేది ఒకటుంది. అదే అన్నిటికీ సమాధానం చెబుతుంది. అన్యాయం జరిగితే దాని తాలూకు అనర్థాన్ని, అనుభవించే క్రమాన్ని అరచేయి అడ్డు వేసి ఆపాలనుకోవడం అవివేకం. కృతజ్ఞత, గురుత్వం, పెద్దరికం, ధర్మం, కాలం పట్ల గౌరవం, నమ్మకం కలిగిన వ్యక్తులు అధర్మాన్ని విమర్శిస్తూ సత్యమార్గాన్ని ఆధారం చేసుకొని జీవించారు. వారిలో ఒకరు కృపాచార్యుడు. భారత కథలో ధర్మజయం కోసం చివరిదాకా ఎదురుచూసిన విజ్ఞుడీయన.
ప్రమద్వర

భీష్మద్రోణ కృపులు లాంటి పెద్దరికానికే వన్నె తెచ్చినవారు. ధర్మం కోసం పరితపించేవారు. న్యాయపోరాటం చేసినవారు. అటువంటి కృపాచార్యుడు శరద్వంతుని కొడుకు. ఇతని చెల్లెలు కృపి ద్రోణుని భార్య. అశ్వత్థామ ఇతని మేనల్లుడు. శరద్వంతుడు తపో దృష్టిలో పడి తన పిల్లలైన కృపుడు, కృపుని గుర్తించకనే అడవి నుంచి వెళ్ళిపోతాడు. అడవిలో పుట్టి అనాథలైన వీరిద్దరినీ వేటకై వచ్చిన శంతనుడు చూసి, వారిని తీసుకెళ్లి పెంచి పెద్ద చేశాడు. శంతనుని కృప వలన వీరిద్దరూ చేరదీయబడినారు కనుకనే వీరికి కృపుడు, కృపి అనే పేర్లు వచ్చాయి. చాలాకాలం తర్వాత శరద్వంతుడు తన పిల్లల జాడ తెలుసుకొని కృపాచార్యునికి ఉపనయనం చేసి, తానే స్వయంగా ధనుర్విద్యను నేర్పుతాడు. కృపిని ద్రోణునికిచ్చి భీష్మ పితామహుల ఆశీర్వాదంతో వివాహం చేస్తాడు. భీష్ముడు కృపాచార్యుని విధేయతనూ, విద్యాకౌశల్యాన్నీ మెచ్చి తర్వాతి తరం కృపాచార్యుని దగ్గరే విలువిద్య నేర్చుకోవాలనుకున్నది.

కౌరవుల ధోరణిని ఎప్పుడూ వ్యతిరేకించేవాడు కృపుడు. పాండవులు కౌరవుల అన్యాయానికి బలవ్వడం సహించేవాడు కాదు. కౌరవులు చేసేది, ఆలోచించేదీ తప్పని, తప్పక ఫలితం అనుభవించాల్సిందేననీ, కౌరవ వినాశనం తథ్యమనీ మొట్టమొదట చెప్పినవారు భీష్మకృపులు. దుర్యోధనునిది నీతి గాథని పదేపదే చెప్పినా కృపుని మాట లెక్క చేయబడలేదు. చాలాసార్లు కృపుడు మనసులో మథనపడి మౌనాన్నే ఆశ్రయించేవాడు. తన విద్యుక్త ధర్మాన్ని మాత్రం విస్మరించే వాడు కాదు. ఏలికలైన భీష్మ ధ్రుతరాష్ట్ర దుర్యోదనుల అన్నం తిన్న, తింటున్న ప్రభు భక్తికి కట్టుబడి అన్యాయాన్ని ధైర్యం చేసి పలికేవాడు కాదు. న్యాయాన్యాయాలు విచారించక కౌరవులను అనుసరించాడు.

ఉత్తర గోగ్రహణంలో దుర్యోధనుడు ప్రేరేపిస్తే కర్ణుడు పరశురాముడే వచ్చి ఎదుట నిల్చినా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. ఇక ఏకాకి అయిన అర్జునుడెంత అన్నప్పుడు కృపాచార్యుడుఅది అవివేకం, అర్జునుడు అసాధారణుడు, ధర్మమో అధర్మమో అందరం కలిసే ఎదుర్కొందామని అంటాడు. రోషానికి వచ్చిన దుర్యోధన కర్ణులను వారించి కృపాచార్యున్ని సమ్మతించి భీష్ముడు అందరం కలిసే ఎదుర్కొన్నా అర్జునున్ని గెలువలేమంటాడు. మనసులోని మాటను స్పష్టంగా అర్థం చేసుకొన్న భీష్మున్ని అభినందించి, అర్జునుని గొప్పతనానికి మనసులోనే జోహార్లు పలుకుతాడు. మంచిని ద్వేషించే కుసంస్కారం ఎన్నటికీ తన ఒంటికి పట్టదని నిరూపించుకున్నాడు.

భారతీయ యుధ్ధంలోనూ అందరిలానే కృపుడూ దుర్యోధనుని పక్షం చేరి శక్తివంచనలేక పోరాటం చేశాడు. తమదే శక్తనీ, పాండవులు అచేతనులనీ కర్ణుడు పలికిన మాటలను ఆక్షేపించి, పాండవుల బలాన్నీ, ధర్మ నిరతినీ దుర్యోధనునికి చెబుతాడు కృపుడు. కర్ణుడు చనిపోయాక, ఇకనైనా యుద్ధం మాని పాండవులతో సంధి చేసుకోమని దుర్యోధనుని బతిమాలుతాడు. అశ్వత్థామ పాండవులను చీకటిలోనే హతమారుస్తానన్న ఘోర చర్యను ఆపడానికి చాలా ప్రయత్నించాడు. ద్రోణుని పుత్రునిగా నీకిది ధర్మం కాదని ప్రాధేయపడ్డాడు. కానీ దుర్యోధనుడు పోతూ పోతూ కృపాచార్యుని సమక్షంలోనే అశ్వత్థామకు సర్వసైన్యాధిపత్యం ఇవ్వడంతో దానికి తలవంచాడు.

భీష్మునికి అంతిమ వీడ్కోలు పలికి ధ్రుతరాష్ర్టాదులతో అడవులకు వెళ్ళిపోయాడు కృపాచార్యుడు. ధర్మం కోసం, తననును పెంచి పెద్ద చేసిన వంశం కోసం, తనలోని పాండవ శ్రేయో కాంక్ష కోసం అహర్నిశలూ తపించాడు కృపాచార్యుడు. తన జీవితం కాల ధర్మం ప్రకారం సాగుతూ వచ్చిందే తప్ప, తనదంటూ ఏమీ లేదని నిమిత్తమాత్రత్వాన్ని లోకంలో ప్రకటించినా, కృపాచార్యుని ఆలోచనా పర్వం, ధర్మ వివేచనా కోణం, మానవీయ జీవిత సందేశం అవ్యక్తమే అయినా లోకంలో అజరామరమై నిలిచిపోతాయనడంలో సందేహం లేదు.

భారతీయ యుధ్ధంలోనూ అందరిలానే కృపుడూ దుర్యోధనుని పక్షం చేరి శక్తివంచనలేక పోరాటం చేశాడు. తమదే శక్తనీ, పాండవులు అచేతనులనీ కర్ణుడు పలికిన మాటలను ఆక్షేపించి, పాండవుల బలాన్నీ, ధర్మ నిరతినీ దుర్యోధనునికి చెబుతాడు కృపుడు. కర్ణుడు చనిపోయాక, ఇకనైనా యుద్ధం మాని పాండవులతో సంధి చేసుకోమని దుర్యోధనుని బతిమాలుతాడు.

311
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles