కుమార సింగభూపాలుడు (క్రీ.శ. 1384 - 1399)


Sun,February 18, 2018 02:29 AM

రేచర్ల అనపోతానాయుని దిగ్విజయ యాత్ర ముగిసింది. రాచకొండ రాజ్య స్థాయి నుంచి సామ్రాజ్య స్థాయికి ఎదిగింది. దేవరకొండ దుర్గం నిర్మాణం కూడా పూర్తయింది.

-నగేష్ బీరెడ్డి, సెల్ : 8096677177


kumar-singa
రాజ్య విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం అనపోతానాయుడు తన సోదరుడైన మాదానేనిని దేవరకొండ ప్రాంతానికి అధిపతిని చేశాడు. ఈ విభజన రాజ్యపంపకం కాదు. కేవలం పరిపాలనా సౌలభ్యం, రక్షణ కోసం మాత్రమే జరిగింది. రాజ్యపాలనకు సంబంధించిన ముఖ్య నిర్ణయాలన్నీ రాచకొండ నుంచే జరిగేవి. అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాకే పాలనా కార్యాలు జరిపేవారు. అంతేకాదు రాచకొండ దేవరకొండ సంతతిలో కుటుంబాభివృద్ధి అమితంగా ఉన్నా వారిలో ఎప్పుడూ అభిప్రాయ భేదాలు కలిగినట్లుగానీ, ఐక్యత నశించినట్లుగానీ ఏ ఒక్క సంఘటనా పద్మనాయక చరిత్రలో కనిపించదు. సామాన్యంగా రాచకుటుంబాల్లో ఇలాంటి ఐక్యత కనిపించడం అరుదైన విషయం. ఇది పద్మనాయకుల గొప్పదనం, ప్రత్యేకత.

అనపోతానాయునికి సింగభూపాలుడు, ధర్మానాయుడు అను ఇద్దరు కుమారులు కలిగారు. దేవరకొండ మాదానాయునికి వేదగిరి నాయుడు అను కొడుకు కలిగాడు. వీరిలో కుమార అనే ఉపమానం సింగభూపాలునికి, పెద అను ఉపమానం వేదగిరికి చరిత్రలో వాడారు. దీనికి కారణం అశీతి వర సింగభూపాలుడు జీవించి ఉన్నప్పుడే అనపోతానాయుని పెద్ద కుమారుడు జన్మించాడు. అనపోతానాయుడు తండ్రి మీద ఇష్టంతో కుమారునికి ఆయన పేరునే పెట్టుకున్నాడు. అందుకే అనపోతానేని కుమారున్ని కుమార సింగభూపాలుడు అని పిలిచేవారు. ఇతడినే రెండో సింగభూపాలుడు, రెండో సింగమనేనీ అని కూడా అంటారు.

కళింగాధిపతి నాలుగో వీర నరసింహదేవుడు (క్రీ.శ. 1378-1409) పద్మనాయకుల చేతిలో యుద్ధంలో ఓడిపోయాడు. పద్మనాయకులతో అతడు సంధి చేసుకొని తన కూతురు కనకలక్ష్మీ దేవిని సింగభూపాలుని పెద్ద కొడుకైన రెండో
అనపోతానాయునికి ఇచ్చి వివాహం చేశాడు.

కుమార సింగభూపాలుడు క్రీ.శ. 1365 నుంచే యువరాజుగా తండ్రితో పాటు రాజ్య వ్యవహారాలు చూసుకునేవాడు. తండ్రి అనపోతానేడు యుద్ధ యాత్రల్లో ఉన్నప్పుడు కుమార సింగభూపాలుడు రాజధానిలో ఉండి రాజకార్యాలు తలపెట్టేవాడు. ఆస్థాన మందున్న కవి పండితులను ఆదరించేవాడు. యువరాజుగా ఉన్నప్పుడే సింగభూపాలుడు కల్యాణ (గుల్బర్గా) దుర్గాన్ని జయించి, అక్కడ విజయస్తంభం నాటి కల్యాణ భూపతి అనే బిరుదు పొందినట్లు ఆయన ఆస్థాన కవి విశ్వేశ్వరుని చమత్కార చంద్రిక అనే గ్రంథం చెబుతున్నది.

క్రీ.శ. 1384లో కుమార సింగభూపాలుడు రాచకొండ రాజ్యాధికారం చేపట్టాడు. ఇదే సమయంలో దేవరకొండకు మాదానేని కొడుకు పెద వేదగిరి నాయుడు (క్రీ.శ. 1384 - 1410) రాజయ్యాడు. ఈ రాజ్యాధికార మార్పు సమయాన్ని అదునుగా చేసుకున్న విజయనగరరాజు రెండో హరిహర రాయలు (క్రీ.శ. 1377 - 1404) రాచకొండ భూభాగమైన కొత్తకొండ (ప్రస్తుత వనపర్తి జిల్లాలోని ప్రాంతం) పైకి దండెత్తాడు. రాయల కుమారుడు, యువరాజు అయిన రెండో బుక్కరాయలు వెంటరాగా రాయల సైన్యానికి సాళువ రామదేవుడు నాయకత్వం వహించాడు. కొత్తకొండలో రాయల సైన్యానికి, రాచకొండ వారికి తీవ్రమైన యుద్ధం జరిగింది. రాజ్యాధికార ఆరంభంలోనే ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ సింగభూపాలుడు చాకచక్యంగా, విజయవంతంగా రాయల సైన్యాన్ని తిప్పికొట్టాడు. సాళువ రామదేవుడు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. రెండో బుక్కరాయలు ఓటమి భారంతో విజయనగరం చేరాడు. దీనినే కొత్త కొండ యుద్ధం అంటారు. సింగభూపాలుని అధికారంలో ప్రథమ విజయం ఈ కొత్తకొండ పోరాటం.

ఈ యుద్ధం తర్వాత రెండో సింగభూపాలుడు తన సోదరుడు దేవరకొండ పెద వేదగిరి నాయుడును వెంటబెట్టుకొని కళింగ దేశాన్ని జయించడానికి బయలుదేరాడు. ఈ దిగ్విజయ యాత్రలో భాగంగానే గోదావరి ప్రాంతములందున్న వేములకొండ, బెండపూడి మొదలైన దుర్గాలను సింగభూపాలుడు వశం చేసుకున్నట్లు వెలుగోటి వారి వంశావళి చెబుతున్నది. రెండో సింగభూపాలుని ఈ విజయాల గురించి సింహాచల క్షేత్ర శాసనం మనకు తెలియజేస్తున్నది.

ఈ సమయంలోనే కళింగాధిపతి నాలుగో వీర నరసింహదేవుడు (క్రీ.శ. 1378-1409) పద్మనాయకుల చేతిలో యుద్ధంలో ఓడిపోయాడు. పద్మనాయకులతో అతడు సంధి చేసుకొని తన కూతురు కనకలక్ష్మీ దేవిని సింగభూపాలుని పెద్ద కొడుకైన రెండో అనపోతానాయునికి ఇచ్చి వివాహం చేశాడు. ఇది మొదటి అనపోతానాయుని కళింగ విజయయాత్ర సందర్భంగా జరిగినట్లు కొందరు చరిత్రకారులు రాశారు. కొందరు రెండో సింగభూపాలుని విజయయాత్ర సందర్భంగా జరిగినట్లు రాశారు. ఏ సమయంలో అనే దానికి శాసనాధారాలు లేవు. కానీ చమత్కార చంద్రిక ఆధారంగా పరిశీలిస్తే రెండో సింగభూపాలుని కొడుకు రెండో అనపోతానాయుడు కనకలక్ష్మీ దేవిని వివాహమాడినట్లు చరిత్ర చెబుతున్న నిజం. కనకలక్ష్మీ దేవి సింహాచల క్షేత్రానికి వెళ్లి స్వామి వారిని దర్శించిన సందర్భంగా అక్కడ శాసనం వేయించింది.

కళింగ విజయం తర్వాత రెండో సింగభూపాలుడు పది సంవత్సరాల పాటు ప్రశాంతమైన పాలన సాగించాడు. సోదరులిద్దరూ తమ తమ ఆస్థానాల్లో కవి పండిత పోషణకు పీఠం వేశారు. స్వయంగా కవి, పండితుడు అయిన కుమార సింగభూపాలుడు సర్వజ్ఞ చూడమణి అనే బిరుదాంకితుడు. ఇతడే రసావర్ణవ సుధాకరం అనే గ్రంథాన్ని రాశాడు. సర్వజ్ఞ దేవుని సంగీత రత్నాకరానికి సంగీత సుధాకరం అనే వ్యాఖ్యానం, కుమలయావళి అనే నామాంతరం గల రత్నపాంచాలిక అనే నాటకాన్ని రచించాడు. మహాకవి అయిన విశ్వేశ్వర కవిచంద్రున్ని, పశుపతి నాగనాథున్ని సింగభూపాలుడు విశేషంగా ఆదరించాడు. గురుశిష్యులైన ఈ కవిచంద్రులు అనపోతానేని (రెండో సింగభూపాలుని తండ్రి) ఆస్థానంలో చేరిన తొలి విద్వాంసులు. తండ్రి ఉన్నప్పుడే కాదు, తర్వాత కూడా సింగభూపాలుడు ఈ కవులను పోషించాడు. ఇందులో విశ్వేశ్వర కవి చమత్కార చంద్రిక అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రాశారు. పశుపతి నాగనాథుడు అయ్యనవోలు శాసన రచయిత. ఉమామహేశ్వర శాసనంలో కూడా ఈ కవిచంద్రుని పలుకుబడులు కనిపిస్తాయి.

1290
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles