కుంతీదేవి విడిది చేసిన.. గొంతెమ్మ గుట్ట!


Sun,February 18, 2018 01:52 AM

అద్భుత చరిత్రకే కాదు.. అబ్బురపరిచే వింత ఆలయాలకు.. విశిష్ట కట్టడాలకు పుట్టినిల్లు లాంటిది తెలంగాణ. ఎక్కడాలేని వినూత్న రీతి గుళ్లూ.. గోపురాలు.. వింత నేపథ్యమున్న కట్టడాలు మన దగ్గర ఉంటాయి. పాండవుల గుట్టలుంటాయి.. పవర్ హనుమంతుడుంటాడు. పిల్లలమర్రి ఉంటుంది.. పీనుగుల మల్లన్న గుడీ ఉంటుంది. అలాంటి నేపథ్యమున్న ఆధ్యాత్మికం.. చారిత్రకం జోడించిన ప్రాంతమే గొంతెమ్మగుట్ట. ప్రకృతి అందాలకు.. ప్రాచీన చరిత్రకు వేదికైన గొంతెమ్మగుట్ట ఈవారం దర్శనం.

-అరవింద్ ఆర్య పకిడే, సెల్: 7097 270 270

gonthemma-gutta
ఎక్కడ ఉన్నది?: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రతాపగిరి.. చిద్నేపల్లి గ్రామాల సరిహద్దులో ఉన్నది.

ఎలా వెళ్లాలి?: భూపాలపల్లి నుంచి కాటారం మీదుగా మహదేవ్‌పూర్ చేరుకోవాలి. భూపాలపల్లి నుంచి కాటారం 20 కిలోమీటర్లు.. అక్కడ్నుంచి మహదేవ్‌పూర్ 8 కిలోమీటర్లు.. అక్కడ్నుంచి నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తే ప్రతాపగిరి.. అక్కడ్నుంచి మరో 4కిలోమీటర్ల దూరంలో గొంతెమ్మగుట్ట ఉంటుంది. ఇదంతా దట్టమైన అటవీప్రాంతం. కొంతదూరం వెళ్లగానే కొండ మీద కోటగోడలు దర్శనమిస్తాయి.
gonthemma-gutta2
స్థల పురాణం: ద్వాపరయుగంలో కుంతీదేవి వరాలు పొందడానికి ఈప్రాంతంలో తపస్సు చేసినట్లు స్థానికులు చెప్తుంటారు. శ్రీకృష్ణుడు.. సుభద్ర.. కుంతీదేవీ కొంతకాలం పాటు ఈ ప్రాంతంలో ఉన్నట్లు చెప్తుంటారు. 14వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు మొఘల్ సేనల దండయాత్రల నుంచి రక్షించుకునేందుకు.. గోదావరినది తీరంలో సైనికస్థావరాలుగా ఈ గుట్టని ఉపయోగించుకున్నట్లు కూడా చెప్తున్నారు. దానికి నిదర్శనంగా గొంతెమ్మ గుట్ట మీద ఒకటిన్నర కిలోమీటర్ల మేర పెద్దపెద్ద రాళ్లతో 3 అంచెల కోట గోడలను నిర్మాణం చేసిన ఆనవాళ్లు నిలిచి ఉన్నాయి. ఈ గుట్టతో పాటు దీనికి సమీపంలోని మరో పెద్ద గుట్టపైన కోటలాంటి నిర్మాణాలు ఉన్నాయి. ఆ గుట్ట పేరు ప్రతాపగిరి. సమీపంలోని ఊరు పేరూ ప్రతాపగిరే.
gonthemma-gutta3
కృష్ణుడి పాదముద్రలు: గొంతెమ్మ గుట్ట పైభాగంలో మూడంచెల నిర్మాణం చేసిన కోటగోడలను దాటి పైకి వస్తే ఎడమ వైపు ఒక గుహలాంటి ప్రదేశం ఉంటుంది. దాంట్లో ఒక శివలింగం ఉంది. ఈ శివలింగాన్ని పాండవుల తల్లి కుంతీ దేవి పూజించినట్లు స్థానికులు అంటున్నారు. శివలింగం ఎదురుగా రెండు పాద ముద్రలు ఉన్నాయి. వీటిని శ్రీ కృష్ణుడి పాదముద్రలుగా పిలుస్తుంటారు.

కోటగోడలు : శత్రువుల నుంచి రక్షణ కోసం శత్రు దుర్భేద్యమైన రక్షణా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తున్నది. మూడంచెలలో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర గుట్ట చుట్టూ అత్యంత పటిష్టమైన రాతికోట గోడలు.. సైనికులు పహారా కాసేందుకు నలువైపులా బురుజుల వంటి నిర్మాణాలు ఉన్నాయి. అలాగే కొండ పైభాగంలో 1వ కోటగోడకి.. 2వ కోటగోడకి మధ్య భాగంలో నీటి నిల్వకోసం చెక్ డ్యాం తరహాలో నిర్మాణం చేశారు. వర్షపు నీటిని వృథా కాకుండా కొండ పైభాగం నుంచి జాలు వారే నీటిని నిల్వ చేయడానికి ఈ నిర్మాణం చేసినట్లు తెలుస్తున్నది.
gonthemma-gutta5
కొలను నీటి విశిష్టత: కోట ప్రవేశ ద్వారం నుంచి పైకి వెళ్లే దారిలో కుడి వైపు కుంతీదేవి కొలను ఉంది. కొండ పైభాగంలో ఉన్న ఈ కొలనులో కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో నీరు ఉండడం విశేషం. ఈ నీటిని తీసుకొని వెళ్లి పంటలపై చల్లితే పంటలకు తెగుళ్లు సోకకుండా మంచి పంట దిగుబడి వస్తున్నదని సమీప గ్రామాల రైతుల నమ్మకం. ప్రతీ సంవత్సరం కొలనులోని నీటిని తీసుకొని వెళ్లి పంటలపై చల్లుతారు.

లక్ష్మీ దేవర మొక్కులు: కొన్ని దశాబ్దాల క్రితం అనావృష్టి కారణంగా సరిగ్గా వర్షాలు కురువకపోవడంతో ప్రతాపగిరి గ్రామ ప్రజలు గొంతెమ్మ గుట్ట వద్దకు వెళ్లి వర్షాలు కురిస్తే పండుగ చేస్తామని మొక్కుకోగా వర్షాలు కురిసాయట. ఇదే రకంగా ఇదే పేరుతో రేగొండ మండలంలో ఉన్న పాండవుల గుట్టల్లో ఉన్న గొంతెమ్మను కూడా పూజిస్తారు. ఇదే విశ్వాసంతో నేటికి స్థానిక ప్రజలు ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో లక్ష్మీదేవర పండగ.. శివసత్తులు.. పాండవ దేవుళ్ళని గుట్టపైకి తీసుకొని వచ్చి బోనాలు సమర్పించి వర్షాలు సకాలంలో కురువాలని పూజలు చేస్తారు. తాము కోరిన కోరికలు తీరినవారు మొక్కులు చెల్లిస్తారు. ఇంతటి అపురూప ప్రకృతి రమణీయత కలిగిన.. ఎకో టూరిజం ప్రాంతంగా.. సాహస క్రీడలకు అనువుగా ఉన్న ఈ గుట్టని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. చారిత్రక సంపదను బాహ్య ప్రపంచానికి తెలియజేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

ప్రకృతి కేంద్రం:

గొంతెమ్మ గుట్ట అందాలు.. ప్రకృతి రమణీయ దృశ్యాలు.. చారిత్రాక ఆనవాళ్లు.. మంత్ర ముగ్దుల్ని చేసే అటవీ అందాలకు కేంద్రం లాంటిది. సుమారు 250 మీటర్ల ఎత్తున గుట్ట.. గుట్ట చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది. లోపలికి రమ్మంటూ స్వాగతం పలికినట్లు ఉండే కోట ప్రవేశ ద్వారాలు ఉంటాయి. కొండ మీద జలజలా పారే సెలయేళ్లు నాటి చరిత్రను కళ్ళముందు చూపెట్టే రాతి నిర్మాణాలు.. శత్రుదుర్బేధ్యంగా పెద్ద పెద్ద రాళ్లతో కోటగోడలు ఇక్కడ చాలా ఉన్నాయి. దూరంగా కనబడే గోదావరి నది.. అడుగడుగునా మనసుని పులకింప జేసే సోయగాలు.. ఇలా చెప్తే వర్ణనకు అందని ప్రకృతి అందాల స్థావరం గొంతెమ్మ గుట్ట.

1645
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles