కార్తీక్.. నా గుండెల్లో ఉన్నావ్!


Sun,January 7, 2018 03:48 AM

ఎంబీఏ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న రోజులు. ఆ టైమ్‌లోనే నా జీవితంలోకి వచ్చాడో కుర్రాడు. అతని పేరు కార్తీక్. అప్పటివరకు ఇల్లు.. కాలేజీ. ఇదే నా జీవితం. కానీ 2012వ సంవత్సరం నాకు ఇల్లు.. చదువు కాకుండా వేరే ప్రపంచాన్ని పరిచయం చేసింది. అది మా చుట్టాల వాళ్ల ఫంక్షన్. అక్కడే నాకు కార్తీక్ పరిచయమయ్యాడు. చూసీ చూడగానే నన్ను ఇష్టపడ్డాడట. ఎలాగోలా నాతో మాట్లాడాలని ఉవ్విళ్లూరుతున్నాడని తెలిసింది. ఎవరిచ్చారో ఏమోగానీ.. మొత్తానికి నా కాంటాక్ట్ నెంబర్ పట్టేశాడు. ఆ ఫంక్షన్ జరిగిన వారం పదిరోజులకి నా ఫోన్‌కు తరుచూ కొత్త నంబర్‌తో కాల్స్ రావడం మొదలయ్యాయి. ఏదో రాంగ్ నెంబర్ అని పెట్టేయడం నావంతైంది. కానీ ఎవరో ఆట పట్టిస్తున్నట్టూ.. నాతో మాట్లాడాలనీ ఆరాటపడుతున్నట్లూ అనిపించింది వాళ్ల చేష్టలు చూస్తే. నాకప్పటికే సినిమా అర్థమైంది. కార్తీకే చేస్తున్నాడని తెలిసింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అతడి పని పట్టాలని డిసైడ్ అయ్యాను. మళ్లీ ఫోన్ మోగింది. హలో.. ఎలా ఉన్నావూ అన్నాడు. నేను ఏదో తెలియనట్లు.. ఎవరు అన్నాను. నేను కార్తీక్‌ను మాట్లాడుతున్నా అనగానే నాకూ ఎందుకో మొహమాటమేసి ఏదో తెలియనట్లు పైపైన మాట్లాడాను. కానీ కార్తీక్ నుంచి రోజూ ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. అవి కామన్ అయిపోయి నేనూ అతనితో మాట్లాడటం ప్రారంభించా. అలా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. సంవత్సరం దాటకముందే మా స్నేహం ప్రేమగా మారింది. కలుసుకోవడం కూడా ప్రారంభమైంది. మా ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడసాగింది. ఒక్కరోజు కార్తీక్ నుంచి ఫోన్‌కాల్ రాకపోతే తల్లడిల్లిపోయేదాన్ని. అంతలా మార్చేసింది కార్తీక్ ప్రేమ నన్ను.
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నేను నేనేనా అనిపించింది. కానీ ప్రేమ ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది. ఒకరోజు కార్తీక్ నుంచి.. ఐ లవ్ యూ అనే మాట వచ్చింది. నేను ఆశ్చర్యపోయాను. కానీ సంతోష పడ్డాను. కార్తీక్‌ను వదిలించుకోవద్దని బలంగా ఫిక్స్ అయ్యాను. రోజులు గడుస్తున్న కొద్దీ అతడే నా ప్రపంచం కాసాగాడు.
Love

వరసైనోడు.. బంధువు.. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఒక అమ్మాయికి ఇంతకంటే ఏం కావాలి? అని పెండ్లి చేసుకోవడానికి కూడా మేం సిద్ధపడ్డాం. ఇక రోజూ మా ప్రేమను ఆస్వాదించడమే మా పని. ఒకర్ని విడిచి ఒకరం ఉండలేని పరిస్థితి మాది. అలా ప్రేమలో ఐదు సంవత్సరాలు మునిగి తేలాం. కార్తీక్ నాకోసం ఎంతో కష్టపడ్డాడు. ప్రేమించిన అమ్మాయిని ఏ రకంగానైనా కష్టపెట్టొద్దనేది అతని ఆలోచన. నాకు ఏ లోటూ రాకుండా చూసుకోవాలని.. లైఫ్‌లో సెటిల్ అయ్యి నన్ను పెండ్లి చేసుకోవాలని బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు. ఆ వ్యాపారం బాగుండాలనీ.. కార్తీక్ హ్యాపీగా ఉండాలని నేను ఎన్నో పూజలు చేశాను. కార్తీక్ కూడా బిజినెస్ కోసం ఎంతగానో కష్టపడ్డాడు. అతని కష్టం ఫలించింది. కార్తీక్ తన వ్యాపారంలో లాభాలు పొందాడు. చూస్తుండగానే చాలా ఎదిగిపోయాడు. తనతో పాటు ఈజీగా పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నాడు. నేనైతే వాళ్ల కుటుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువ సంతోషించా.
ఇంతలొ మా ప్రేమ విషయమూ మా ఇండ్లల్లో తెలిసిపోయింది. మొదట్లో మా ఇంట్లో ఒప్పుకోలేదు. కానీ నా ప్రేమను అర్థం చేసుకుని ఓకే చెప్పేశారు. కార్తీక్ వాళ్ల అమ్మానాన్న కూడా సానుకూలంగానే స్పందించారు. నేనంటే వాళ్లకూ ఇష్టమే ఉండేది. కానీ వాస్తవ పరిస్థితులు క్రమంగా మారిపోయాయి. డబ్బు మనిషిని దూరం చేస్తుందని విన్నాను. కానీ అది నా జీవితంలో నిజంగా జరిగింది. మా ప్రేమకు అడ్డంకిగా మారారు అంతా. నన్ను.. కార్తీక్‌ను వేరు చేయడానికి వాళ్ల చుట్టాలంతా ఏకమయ్యారు. మా ప్రేమ గురించి తెలిసి కూడా స్వార్థంగా ఆలోచించారు. ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుందని కొంచెం కూడా ఆలోచించలేదు. కానీ కార్తీక్ నేను చాలా బాధపడ్డాం. ఈ బంధనాల్ని ఎలాగైనా తెంచుకుని ఒక్కటవ్వాలని ఎంతో ప్రయత్నించాం. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటిదాకా ఒకెత్తు.. ఇప్పుడొకెత్తు. కార్తీక్ నా కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు. మెసేజెస్‌కి రిప్లయ్ ఇవ్వడం లేదు. తనంటే నాకు ఎంత ఇష్టమో.. నేనంటే కూడా కార్తీక్‌కు అంతే ఇష్టం. నాతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేని కార్తీక్ హఠాత్తుగా మాట్లాడలేదేమిటి అని ఆందోళన మొదలైంది.

పిచ్చెక్కిపోతోంది నాకు. ఏం చేయాలి? అసలేం జరిగింది?ఏ రోజైనా కార్తీక్ నా దగ్గరికి రాకపోతాడా అని నమ్మకంతో ఎదురు చూడసాగాను. దుఃఖాన్ని దిగమింగుకుంటూ బతికాను.
మా ప్రేమ గురించి అందరికీ తెలిసిపోయింది. ఎవరికీ ముఖం చూపించలేని పరిస్థితి ఏర్పడింది. నిజానికి కార్తీక్ చాలా మంచోడు. పెద్దలని గౌరవిస్తాడు. ఎవరినీ బాధ పెట్టడు. అందరి దృష్టిలో మంచివాడు. తనలో ఉన్న ఆ మంచితనమే నాకు శాపంగా మారిపోయింది. కొన్ని రోజులు కార్తీక్ జ్ఞాపకాలతో పిచ్చిదాన్ని అయ్యాను. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయంగా ఉండేది. నిద్ర.. తిండి.. మానేసి కార్తీక్ కోసం ఎదురుచూశాను. మా ఇంట్లోవాళ్లకి ఎలాగైనా కార్తీక్ నా దగ్గరికి వస్తాడు అని.. తను నేను లేకుండా బతకలేడనీ.. తొందరపడి ఇప్పుడే నాకు పెండ్లి సంబంధాలు చేయొద్దనీ చెప్పాను. నా ఇష్టాన్ని.. ఆందోళనని అర్థంచేసుకుని మా వాళ్లు సహకరించారు. నా ఇష్టానికి నన్ను వదిలేశారు. కానీ.. సడెన్‌గా ఒక విషయం తెలిసింది. కార్తీక్‌కు వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ అయింది. షాకయ్యాను. నా బాధను ఎవరితో చెప్పాలో తెలియని పరిస్థితి. గట్టిగా అరవాలనీ.. ఏడవాలనీ అనిపించేది. ఆ క్షణం నా ప్రాణమైనా పోతే బావుండనిపించింది.
నిజానికి కార్తీక్ పక్కన నేనుండాలి. కానీ వేరే అమ్మాయిని చూసి జీర్ణించుకోలేకపోయాను. నా కష్ట సుఖాలతో నాకు తోడుగా ఉంటానని చెప్పి ఇప్పుడు నన్ను మోసం చేశాడని.. నా జీవితాన్ని చీకట్లోకి నెట్టివేశాడని బాధపడ్డాను. కార్తీక్ వాళ్ల బంధువులు కూడా నాకు మంచి చేస్తున్నట్లు నటించి.. నాకు ధైర్యం చెప్పినట్టే చెప్పి వెన్నుపోటు పొడిచారు. కార్తీక్ పెండ్లి నిశ్చయం అయ్యిందని తెలిసిన పదిహేను రోజులకే తన మేనమామ కూతురితో జరిగిపోయింది. అవన్నీ చూస్తూ ఎందుకు బతికున్నానా అనిపించింది. కానీ అమ్మానాన్న పరువు గురించి ఆలోచించి అక్కడే ఆగిపోయాను. దుఃఖం తన్నుకొస్తున్నా నా కన్నీళ్లు ఎవ్వరికీ కనపడకుండా దాచుకున్నాను. గుండె నిండా బాధ.. ఇంట్లో నాన్న ఆరోగ్యం బాలేదు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. నాకు ఏ కష్టం వచ్చినా కార్తీక్‌కే చెప్పుకునేదాన్ని. కానీ నా కార్తీకే ఇప్పుడు నా వాడు కాకుండా పోయాడు.
Love1

అప్పుడప్పుడే తేరుకుని బాధని లోపల దాచుకుని ఇంట్లోవాళ్లతో గడుపుతున్నా. ఈ సమయంలోనే కార్తీక్ గురించి మరో నిజం తెలిసింది. పెండ్లికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదంట. ఎలాగైనా నన్నే చేసుకుంటానని పట్టుబట్టాడట. కానీ సెంటిమెంట్‌తో కొట్టి అతడికి ఇష్టం లేకున్నా వేరే అమ్మాయితో పెండ్లి చేశారట. పెండ్లి అయ్యాక కూడా కార్తీక్ నా గురించి చాలా బాధపడ్డాడని తెలిసింది. అది తెలిసినప్పట్నుంచీ నాలో తండ్లాట మరింత పెరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నాతో కార్తీక్ ప్రేమ గురించి అతన్ని చేసుకున్న అమ్మాయికి కూడా తెలుసు. అయినా అతన్నే చేసుకున్నది. కానీ వాళ్లకు కావాల్సింది కార్తీక్ ప్రేమ.. అతని మంచితనం కాదు. కేవలం డబ్బు మాత్రమే. అందుకే మా ప్రేమకు అడ్డొచ్చి మరీ అతడిని తమవైపు తిప్పేసుకున్నారు. ఏదేమైనా మా ప్రేమ స్వచ్ఛమైంది. మా ప్రేమ మరువలేనిది. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ ప్రేమకు అంతం ఉండదు. నా జీవితంలో ఇంకొకరికి స్థానం ఉన్నా కూడా మొదటిస్థానం మాత్రం కార్తీక్‌దే. ఓయ్.. కార్తీక్ నేను నా జీవితాంతం నీ జ్ఞాపకాలతోనే గడిపేస్తా. నువ్వైతే మంచిగా పెండ్లి చేసుకుని హాయిగా ఉన్నావ్‌గా. ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే నా ప్రాణం. నువ్వే నా ప్రపంచం. నీవెక్కడ ఉన్నా.. ఎవర్ని చేసుకున్నా.. సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటున్నా. కానీ ఒక్కమాట. ప్రతి మనిషి జీవితంలో పెండ్లి ఒక మధురమైన ఘట్టం. అలాంటిది నా జీవితంలో పెండ్లి అనే మాట ఒక్క ప్రశ్నార్థకంగా మారింది. ప్రేమ అనేది ప్రతి మనిషికీ ఏదో ఒకరోజు పుడుతుంది. ప్రేమించండి తప్పులేదు. కానీ నాలాగా ప్రేమనే జీవితంగా మార్చుకోకండి. మన ప్రేమ వేరే వ్యక్తికి ఇబ్బందిగా మారకుండా చూసుకోవాలి. తల్లిదండ్రుల గురించీ ఆలోచించాలి. చివరగా.. కార్తీక్ ,మరోసారి చెప్తున్నా.. నువ్వే నా ప్రాణం. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. ప్రేమతో నీ ప్రవళిక!

మా ప్రేమ గురించి అందరికీ తెలిసిపోయింది. ఎవరికీ ముఖం చూపించలేని పరిస్థితి ఏర్పడింది. నిజానికి కార్తీక్ చాలా మంచోడు. పెద్దలని గౌరవిస్తాడు. ఎవరినీ బాధ పెట్టడు. అందరి దృష్టిలో మంచివాడు. తనలో ఉన్న ఆ మంచితనమే నాకు శాపంగా మారిపోయింది. కొన్ని రోజులు కార్తీక్ జ్ఞాపకాలతో పిచ్చిదాన్ని అయ్యాను. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయంగా ఉండేది. నిద్ర.. తిండి.. మానేసి కార్తీక్ కోసం ఎదురుచూశాను.

తొలిప్రేమకు ఆహ్వానం!

ప్రేమ శాశ్వతం. ప్రేమ యథార్థం. ఈ ప్రపంచమంతా ప్రేమమయమైతే ఎంతో బాగుండనిపిస్తుంటుంది. అలాంటి ప్రేమలో తొలిప్రేమది మధురఘట్టం. ఒక రకంగా నిజమైన ప్రేమకు జ్ఞాపిక తొలిప్రేమ. కాలేజీ లైఫ్‌లో ప్రేమాభిమానాలను చూరగొన్న.. మీ లైఫ్‌లోకి తొంగిచూసిన.. తెరువని పేజీయై మీ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన, తడియారని తొలిప్రేమ గురించి రాసుకోవాలనుందా? మరొక్కసారి ఆ జ్ఞాపికను చూసుకోవాలనుందా? అక్షర రూపంలో అద్భుత కావ్యంగా మలుచుకునే అవకాశం మీకు మేము కల్పిస్తున్నాం. ఇదే మా ఆహ్వానం!
ప్రేమ కథలు రాయాల్సిన చిరునామా: బతుకమ్మ, నమస్తే తెలంగాణ, 8-2-603/1/7,8,9, కృష్ణాపురం, రోడ్‌నంబర్.10,
బంజారాహిల్స్, హైదరాబాద్-500034. ఈ-మెయిల్ : sunmag@ntdaily.news

1228
Tags

More News

VIRAL NEWS