కార్తీకం కమనీయం


Sun,December 2, 2018 04:28 AM

Karthika-Masam
శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైనది కార్తీకమాసం. హరిహరులిద్దరికీ ఈ మాసంలో పూజలు చేస్తే నేరుగా వారికే చెందుతాయి. సకల దేవతామూర్తులందరూ ఈ మాసంలో శివకేశవులను ఆరాధించి పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. ప్రకృతి సైతం కార్తీకంలో సహజత్వాన్ని, పవిత్రతత్వాన్ని సంతరించుకుంటుంది. చన్నీటితో స్నానం చేసినా చలి పెట్టకుండా సహకరిస్తుంది ప్రకృతి. సకల జీవరాశి మొత్తం భక్తిభావంతో మునిగిపోయే కార్తీకమాస ప్రత్యేక కథనం ఈ వారం ముఖచిత్రం.

- ఇట్టేడు ఆర్కనందనాదేవి
Karthika-Masam2
జనజీవనవాహిని సత్యం, శివం, సుందరమై పయనించాలంటే ఉదాత్త గంభీరమైన సంస్కృతి ఒరవడి కావాలి. చరిత్రకందని కాలం నుంచీ మానవజాతి మనుగడ స్పష్టంగా గోచరిస్తుందంటే సంస్కృతీ సంప్రదాయాలే ఆలవాలం. ఆ సంస్కృతీ సంప్రదాయానికి మెరుగులద్దిన అభేదానికి ఆస్కారమిచ్చిన కార్తీకమాసం ఆత్మసాక్ష్యాత్కారానికి ప్రతీక.స్థితప్రజ్ఞత, జ్ఞానగరిమ, అనన్యభక్తి, భగవదారాధన,ఆధ్యాత్మిక చింతన.. వెరసి నిండైన భారతీయ వ్యక్తిత్వంగా రూపుదిద్దుకునే శుభమాసం కార్తీకం.
Karthika-Masam3
న కార్తీకస్సమోమాసః
న దేవ కేశవాత్పరమ్ !
నచ వేద సమంశాస్త్రం
న తీర్థం గంగాయస్సమమ్!!

Karthika-Masam4
ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన, శ్రేష్ఠమైన మాసం కార్తీకమాసం. శాస్ర్తానుసారం కార్తీకమాసంతో సమానమైనది మరొకటి లేదనేది నిర్వివాదాంశం. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై ఉండే మాసానికే కార్తీకమని పేరు. ఈ మాసమంతా భక్తిభావం వెల్లివిరుస్తుంది. మాసంలోని అన్ని రోజులూ పవిత్రమైనవే. కార్తీకమాస మహాత్యాన్ని పురాణాలు సైతం కొనియాడాయి. సాంప్రదాయం ఈ మాసంలో నిబిడీకృతమై భక్త సంజనితమై విరాజిల్లుతుంది. సకల దేవతారాధన శివైక్యం చెంది శుభాశీస్సులను అందిస్తుంది. కౌముదీమాసంగా చెప్పబడే కార్తీకం శివకేశవుల ఆరాధనాఫలం అలరారుతుంది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఈశ్వరాలయాల్లో రుద్రనమకం మారుమోగిపోతుంది. ప్రతీ ఇల్లూ భక్తిభావంతో పరిమళిస్తుంది. కార్తీకమాసంలో పరమశివుడు అశుతోషుడుగా అందరికీ సంతోషాన్ని కలిగిస్తాడు.

కృత్తికానక్షత్రం - కార్తీకం

నక్షత్రాలలో ప్రాముఖ్యం కలిగిన నక్షత్రం కృత్తిక. ఈ నక్షత్రానికి అధిపతి అగ్నిదేవుడు. అగ్నినక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢాలలో కృత్తికయే మొదటిది. వేదకాలమానం ప్రకారం సంవత్సరారంభం కృత్తికానక్షత్రంతోనే జరిగేది గనుక ఈ నక్షత్రాన్ని అగ్నినక్షత్రం అంటారు. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పరిపూర్ణుడై దర్శనమిస్తూ కార్తీకమాస వైశిష్ట్యానికి తార్కాణమై నిలిచాడు.

శుభప్రదం కార్తీకమాసం

కార్తీకమాసంలో కార్తీకస్నానం, ఉపవాసం ముఖ్యవిధులు. సూర్యోదయానికి ముందే చల్లటినీటితో తలస్నానం చేసి దీపారాధనతో శివకేశవులను ఆరాధించడం విశేష ఫలప్రదం. ఈ మాసంలో వాతావరణం ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. అందుకనే ఈ కాలంలో చేసే నదీస్నానాలు విశేషమైనవి. నదుల్లోని నీళ్లు ఉదయం సూర్యరశ్మి వల్ల వెచ్చబడి, రాత్రివేళలో చంద్రుని కిరణాల వల్ల చల్లబడుతాయి. పైగా అడవుల్లోని ఔషధమొక్కల పుప్పొడి రేణువులు నదీప్రవాహంలో కలువడం వల్ల నీరు స్వచ్ఛంగా మారుతుంది. అందుచేత నదీస్నానం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక సాంత్వన చేకూరుతుంది.

ప్రదోషకాలం..

కార్తీకమాసంలో అత్యంత మహిమాన్విత కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమయం తరువాత మూడు గడియలు గడిచాక ప్రదోషకాలం మొదలవుతుంది. రాత్రికి ఆరంభకాలమే ప్రదోషం. ఇది నాలుగు విధాలు. నిత్య, పక్ష, మాస, మహా ప్రదోషాలు. కార్తీకమాసంలో ప్రతిరోజూ వచ్చే నిత్య ప్రదోషం పరమపావనమైనది. ఈ మాసం పరమేశ్వర ప్రదోషకాలంలో ఆ దివ్యరూపం అర్ధనారీశ్వర స్వరూపంగా దర్శనమిస్తుంది.

కైలాస శైలభువనే త్రిజగజ్జనిత్రీం
గౌరీ నివేశ్య కనకాంచిత రత్నపీఠే
నృత్య విధాతు మభివాంఛతి శూలపాణే
దేవాః ప్రదోష సమయేషు భజంతిసర్వే

సకల దేవతలూ కొలువుదీరిన వేళ కైలాసగిరిపై జగన్మాత అధ్యక్షురాలై విలసిల్లగా పరమశివుడు ఆనందతాండవం చేసే పుణ్యకాలమే ప్రదోషం. అందుకే కార్తీకమాస ప్రదోష సమయంలో అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే సకల దేవతల ఆశీస్సులతో పాటు పరమశివుని అనుగ్రహం మోక్షసాయుధ్యమై లభిస్తుందని చెబుతారు.

మాసమంతా శుభతిథులే

కార్తీకమాసంలో మొదటిరోజు నుంచీ చివరిరోజు దాకా ప్రతిరోజుకూ ఒక ప్రత్యేకత ఉంది. అనేక పర్వాలకు ఆలవాలం కార్తీకం. బలిపాడ్యమిగా చెప్పబడే కార్తీక శుద్ధ పాడ్యమినాడు దీపాలను వెలిగించి ఒకపూట భోజనం చేసినవారికి విద్యాప్రాప్తి, ధనప్రాప్తి కలుగుతాయి. విదియ రోజున సోదరులు సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేస్తారు. దీన్నే భగినీ హస్తభోజనం అంటారు. యమధర్మరాజు తన తోబుట్టువైన యమున ఇంటికి వెళ్లి, ఆమె చేతివంటను తిని కానుకలు సమర్పించి వచ్చాడని కథనం. పురాణకాలం నుంచీ ఈ ఆనవాయితీ కొనసాగిస్తూ సోదరులు తోబుట్టువుల ఇళ్లకు వెళ్లి, భోజనం చేసి, కానుకలు సమర్పించి వస్తారు. దీనివల్ల సోదరికి సౌభాగ్యం, సోదరునికి ఆయుఃవృద్ధి కలుగుతాయని నమ్మకం.

తదియనాడు త్రిలోచన గౌరీవ్రతం చేస్తారు. చవితిరోజున నాగదేవతను పూజించి నాగులచవితిని నిష్టగా చేస్తారు. పంచమిని నాగపంచమి అని పిలుస్తారు. షష్ఠిని సుబ్రహ్మణ్య ఆరాధనారూపంగా భావిస్తారు. శుద్ధ అష్టమిన గోష్ఠాష్టమీ వ్రతం, నవమిని అక్షయనవమీ అని వ్యవహరిస్తారు. దశమిని తీర్థాలకు పుణ్యదినంగా ఆపాదిస్తారు. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులుంటాయి. కార్తీక శుద్ధ ఏకాదశిని పాలకడలిలో శ్రీహరి యోగనిద్రను విడిచి మేల్కొనే రోజు గనుక ఉైత్థెనేకాదశి అంటారు. ఉత్థానం అంటే మేల్కొనుట అని అర్థం. విష్ణువు యోగ నిద్రనుంచి లేచిన ఈ రోజున విష్ణుపూజ చేసి, శంఖాన్ని ఆరాధించాలి. భగవద్భక్తి తరంగాల ద్వారా నిద్రాణమై ఉన్న ఆత్మను మేల్కొల్పడానికి సంకేతం ఈ ఏకాదశి. ఉపవాస దీక్షతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి వేలజన్మల పాపాలు నశించి పుణ్యం లభిస్తుంది.

కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశియనీ, యోగీశ్వర ద్వాదశి అనీ, చిలుక ద్వాదశి అనీ పిలుస్తారు. పూర్వం కృతయుగంలో దేవతలూ, రాక్షసులు క్షీరసాగరాన్ని మథించినరోజు గనుక క్షీరాబ్ధి ద్వాదశిగా పేరుగాంచింది. ఏకాదశినాడు పూర్తిగా ఉపవాసం చేసి, శివకేశవులను ఆరాధించి తర్వాత రోజైన ద్వాదశినాడు సత్పురుషులకు భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలు సమర్పించి వారి ఆశీర్వాదాలు పొందాలి. ద్వాదశి రోజున ఉసిరి చెట్టును పూజించి షడ్రసోపేతమైన నైవేద్యం సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే సర్వ శుభాలూ, సుఖశాంతులూ కలుగుతాయి. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి ద్వాదశినాడే వివాహం చేసుకున్నాడు. క్షీరాబ్ధి ద్వాదశిరోజున తులసీపూజ చేసినవారికి లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది.

కార్తీక శుద్ధ త్రయోదశిని స్వయంభువ మన్వంతర ప్రారంభంగా పరిగణిస్తారు. చతుర్దశిని వైకుంఠ చతుర్దశిగా వ్యవహరిస్తారు. కార్తీకవ్రతోద్యాపన చేసే సమయమిది. ఈ రోజును మహా కార్తీకేయుని దీక్షాసావర్ణిక మన్వంతరంగా భావిస్తారు. చతుర్దశినాడు కుమారస్వామి ఉపాసన వలన విశిష్ట ఫలం దక్కుతుంది. ఈ రోజున చేసే ధాత్రీ నారాయణపూజ, తులసీ కల్యాణం పరమపవిత్రమైనవి. తులసీ, ఉసిరికలను శ్రీదేవి, భూదేవి స్వరూపాలుగా భావించి కార్తీకమాసంలో పూజించడం సంప్రదాయం.

సంస్కృతీ సంప్రదాయ యజ్ఞంగా, హరిహర కృపాకారుణ్య ప్రాసాద పుణ్యకాలంగా, భయం, శోకం కలిగించే చీకట్లను పారదోలే ధైర్యదీపంగా, మనలోని శక్తిని జాగృతం చేసే విశ్వజ్యోతి అనుసంధానంగా, ఆధ్యాత్మిక చిహ్నంగా ఆత్మసాక్షాత్కారానికి ప్రతీకగా ఒప్పారే కార్తీకమాసమంటేనే జన్మజన్మల పుణ్యఫలం.. అపూర్వం.. అమోఘం.. అఖండం.
శుభం భూయాత్ a

దీపారాధనే ప్రధానం

కృత్తికా నక్షత్రంలో చంద్రుడు కూడిన రోజుతో ప్రారంభమైన కార్తీకమాసంలో దీపారాధన ప్రధానం. కార్తీకంలో వెలిగించే దీపాలు ఆకాశంలో చుక్కల్లా వెలిగిపోతూ కన్నులపండుగగా అలరిస్తాయి. ఈ మాసంలో దీపదానం చేయడం వల్ల కీర్తిసౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. రాశికి అధిపతి అగ్ని. ఆ అగ్నిదేవుని ఆరాధనరూపమే దీపారాధన. కార్తీక మాసమంతా పూజామందిరంలో, తులసికోటలో, ఇంటి ముంగిలిలో రంగవల్లులను తీర్చిదిద్ది వాటి మధ్యన దీపాలతో అలంకరణ చేయడం వల్ల సకల సంపదలూ చేకూరుతాయి. ఆలయ ఆవరణల్లో, కోనేటినీటిలో, ఇంటి ముంగిళ్లలో వెలిగించే దీపాలు అజ్ఞానమనే చీకటిని తొలిగించి జ్ఞానకాంతులను ప్రసరిస్తాయి. మనకున్న పన్నెండు తెలుగు నెలల్లో ఒక్క కార్తీకమాసంలో పెట్టే దీపాన్నే కార్తీకదీపమనీ, పరమ పవిత్రమనీ పురాణ కథనం.
Karthika-Masam5

దీపారాధన ఎందుకు చేయాలి?

భారతీయ సంప్రదాయంలో దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉన్నది.
ప్రతీ శుభకార్యాన్ని జ్యోతి ప్రజల్వనతోనే ప్రారంభిస్తారు. తొలి సంధ్య నుంచి మలిసంధ్య వరకు ఇంట్లో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. దీపం త్రిమూర్తులకు ప్రతీక. దీపాన్ని ఆరాధిస్తే ఒకే సమయంలో బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరులను పూజించినట్టే. కార్తీకమాసంలో దీపారాధన చేయడం వల్ల సకల పాపాలు హరిస్తాయి.
Karthika-Masam7

కార్తీకమాసంలో ఏం చేయాలి?

- ఈ మాసంలో తెల్లవారుజామునే నీటిలో ఉసిరి ఆకులు వేసి స్నానమాచరించాలి.
- నిత్యం దీపారాధనచేయాలి. ప్రవహించే నీటిలో దీపాలను వదులాలి.
- ఈ నెలంతా ఇంటిముందు ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగించాలి.
- శివాలయంలో, వైష్ణవాలయంలో దీపాలు వెలిగిస్తే వైకుంఠప్రాప్తి.
- కార్తీక సోమవారం నాడు, కార్తీకపౌర్ణమి నాడు ఉసిరికాయపైన వత్తులు ఉంచి ఆవునెయ్యితో దీపం వెలిగించాలి.
- మాసమంతా దీపం పెట్టలేకపోతే కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమినాడు తప్పకుండా దీపాలు పెట్టాలి.
- కార్తీకంలో దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులు ముక్తి పొందుతాయి.
- అశ్వయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి నుంచి కార్తీక మాసంగా ఆచరించాలి.
- శుద్ధ ద్వాదశినాడు తులసిపూజ చేయాలి.
- ఈ నెలలో శివుడిని మారేడు ఆకులు, జిల్లెడు పువ్వులతో పూజించాలి.
- విష్ణుమూర్తిని తులసీ ఆకులు, జాజిపూలతో పూజించాలి.
- ఇంటిముందు ఆవుపేడతో అలికి, ముగ్గులు పెట్టి ఆ ముగ్గులను పువ్వులతో అలంకరించి ఆ ముగ్గుల మీద కార్తీక దీపం పెట్టి ఆ వెలుగులో కార్తీక పురాణం చదివినా, విన్నా ఏడు జన్మల
వరకు స్వర్గప్రాప్తి, సుఖజీవనం లభిస్తాయని కార్తీక పురాణం చెప్తుంది.

కార్తీక పౌర్ణమి, పురాణం, వ్రతం

కార్తీకమాసంలో అత్యంత ప్రశస్తమైన రోజు కార్తీకపౌర్ణిమ. నిండు చంద్రుని వెలుగు సర్వవ్యాపకమైతే పున్నమి దీపం విశ్వనీరాజనం. దీపేన సాధ్యతే సర్వం అని భావించి పున్నమినాడు ఇంటి ముంగిళ్లన్నీ దీపకాంతులతో ప్రజ్వరిల్లుతాయి. ఆలయాల్లో ఆకాశదీపం వెలిగించడం ఆచారం. పూర్ణిమ రోజున ఉసిరికాయ మీద దీపం వెలిగించాలి. ఈరోజున 360 వత్తులను వెలిగిస్తే సంవత్సరమంతా దీపారాధన చేసిన పుణ్యఫలం లభిస్తుందని కార్తీకపురాణం చెబుతుంది. ధాత్రిపూజ, గౌరీపూజ, శివకేశవుల ఆరాధన, తులసీ పూజలను పున్నమినాడు చేసినవారికి సర్వసిద్ధి కలుగుతుంది. పున్నమిరోజున కార్తీక పురాణపఠనం, శ్రవణం చేసిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభించి, జన్మరాహిత్యం చేకూరుతుందని చెప్పబడింది. ఇక కార్తీకమాస వ్రత మహాత్యాన్ని సూత మహాముని శౌనకాది మునులకు వివరించాడట. హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైన వ్రతం కార్తీకవ్రతం.

కార్తీకమాసమంటేనే నోములమాసం. వారసత్వ పరంపరలో 21 సంవత్సరాలు ఆచరించే వ్రతం కేదారేశ్వర వ్రతం. ఈ వ్రతవైభవం స్కంధపురాణంలో కనిపిస్తుంది. శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాన్ని కూడా కార్తీకమాసంలో చేసుకున్న వారికి అద్భుతఫలం లభిస్తుంది.

కార్తీక సోమవారం

ఈశ్వరునికి ప్రీతికరమైన రోజు సోమవారం. శివారాధనకు అనుకూలమైన కార్తీకమాసంలోని సోమవారాలకు విశిష్టత ఉంది. ఈ నెలలో సోమవారం అన్న పేరు తలుచుకున్నా వెయ్యిసార్లు శివనామస్మరణ చేసినట్లే. సోమవారం నాడు చేసే శివనామస్మరణ సధ్యోముక్తిని కలిగిస్తుందని కార్తీకపురాణం వర్ణించింది. మనుషులంతా వర్ణభేదాలకతీతంగా ఆచరించగలిగే వ్రతం సోమవార వ్రతం. జన్మజన్మల పాపాలను నశింపజేసే పుణ్యవ్రతమిది. ఆ చంద్రతారార్కం మానవజాతికి శుభఫలాలను అందించే వ్రతంగా చెప్పబడింది. కార్తీక సోమవారం తెల్లవారుజామునే స్నానం చేసి భక్తిగా శివాభిషేకం చేయాలి. పగలంతా ఉపవాసం చేసి, ప్రదోషకాలంలో నక్షత్ర దర్శనం అయ్యాక శివపూజ చేసిన తర్వాత భోజనం చేయాలి. కార్తీక సోమవారం నాడు ఏకాదశి వస్తే, ఆ రోజంతా ఉపవాసం చేసి వ్రతమాచరించాలి. పరమశివుడు పార్వతీదేవికి, వశిష్ఠమహర్షి జనకమహారాజుకు వివరించిన పుణ్యవ్రతం సోమవారవ్రతం కథ.
Karthika-Masam6

కార్తీక వనభోజనం

ప్రకృతితో మమేకమయ్యే తత్తం.. మానవత్వం. అందమైన వనంలో అందరూ కలిసి సాత్వికాహారం భుజిస్తే మనుషుల్లోని అంతరాలు దూరమై బంధాలు బలపడుతాయని శాస్ర్తోక్తం. కార్తీకంలో సహజీవన సందేశంగా ఒప్పారే వనభోజనాలు సకల పాపపరిహారాన్ని చూపి విష్ణుపదకైంకర్యాన్ని ప్రసాదిస్తాయి. ఉసిరిచెట్టు నీడన వనభోజనం చేయడం అత్యంత శుభప్రదం. పురాణకాలం నుంచీ కార్తీక వనభోజనం ప్రత్యేకత సంతరించుకుంది.

యః కార్తీకేసితే వనభోజన మాచరేత సయాతి వైష్ణవధామం సర్వపాపైః ప్రముచ్యతే

కార్తీకమాసంలో ఆచరించే స్నానం, దీపం, జపం, ధ్యానం, వ్రతం, వనభోజనం, అన్ని సంప్రదాయాలూ విశిష్ట ఫలితాలను ఇచ్చే శుభకరణాలే.

442
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles