కార్తీకం.. కమణీయం.. ఆరుట్ల బుగ్గ జాతర!


Sun,November 25, 2018 01:29 AM

bhakthulu
కొందరికి కాశీకి వెళ్లాలని కోరిక ఉంటుంది. మరికొందరికి తిరుమల వెళ్లాలని కోరిక ఉంటుంది. ఇంకొందరికి యాదాద్రి వెళ్లాలని కోరిక ఉంటుంది. ఇవేవీ వెళ్లలేని వాళ్లు.. ఇవన్నీ వెళ్లినవాళ్లు దర్శించదగ్గ క్షేత్రం ఆరుట్ల బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం అంటారు. స్థానికులు బుగ్గజాతరగా పిలుచుకునే ఈ ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమై భక్తుల సందోహంతో.. ఓం నమో నామస్మరణలతో మార్మోగుతున్నది. ఆధ్యాత్మికం.. పర్యాటకం కలగలిసిన ఈ ఆరుట్ల బుగ్గజాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా క్షేత్ర విశిష్టతను తెలుపుతూ ఈ వారం దర్శనం.

- దాయి శ్రీశైలం, 6300948442


ఎక్కడ ఉన్నది?: రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో.
ఎలా వెళ్లాలి?: హైదరాబాద్ నుంచి అయితే మహాత్మాగాంధీ బస్‌స్టేషన్.. సాగర్ రింగ్‌రోడ్డు నుంచి 277 నంబర్ బస్సులు.. జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి అయితే 279 నంబర్ బస్సుల ద్వారా ఇబ్రహీంపట్నం చేరుకొని అక్కడి నుంచి బుగ్గ జాతరకు స్పెషల్ బస్సుల్లో వెళ్లొచ్చు. నల్గొండ జిల్లా నారాయణపూర్, మునుగోడు, చౌటుప్పల్ నుంచి వచ్చేవారు నారాయణపూర్ శివన్నగూడ నుంచి ఆరుట్లకు చేరుకోవచ్చు. మహబూబ్ నగర్ నుంచి వచ్చేవారు ఇబ్రహీంపట్నం నుంచి రావచ్చు.

ఎన్ని రోజులు?: శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు పదిహేను రోజులపాటు జరుగుతాయి. ఈ నెల 23వ తేదీన ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 7వ తేదీవరకు జరుగుతాయి. ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. పూజలు.. వ్రతాలు చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ చారిత్రక ప్రాంతాన్ని సందర్శించి గుండంలో స్నానమాచరించి.. కార్తీక దీపాల్ని వెలిగిస్తే అనుకున్నది నెరవేరుతుందని భక్తుల నమ్మకం.

క్షేత్ర ప్రత్యేకత: బుగ్గ జాతర ఉత్సవాలు ప్రతీ సంవత్సరం జరుగుతాయి. ఈ ఆలయానికి వందలయేండ్ల చరిత్ర ఉన్నది. కార్తీకమాసంలో కార్తీక పౌర్ణమి నాడు ప్రారంభమై.. అమావాస్య వరకు కొనసాగుతాయి. అత్యంత అంగరంగ వైభవంగా జరిగే ఈ ఆలయం భక్తుల పాలిట మరో కాశీ అని భక్తులు చెబుతుంటారు. చుట్టూ అటవీ ప్రాంతం.. కొండల మధ్యన ఉన్న ఈ క్షేత్రంలో పూజలు.. స్నానాలు.. వ్రతాలు.. వనభోజనాలు చేస్తుంటారు. కొండలు.. కోనలు.. ప్రకృతి సెలయేరులు.. పచ్చనిపైర్లు.. ఇంతకన్నా ప్రశాంత వాతావరణం ఎక్కడ దొరుకదేమో అనిపిస్తుంది ఆ దృశ్యాల్ని చూస్తుంటే.

స్థల పురాణం: తూర్పు దిక్కు నుంచి పడమర వైపు నీళ్లు ప్రవహించి.. తిరిగి తూర్పు వైపు మరలుతాయి. ఇది చాలా అరుదైన సన్నివేశం. భూగర్భ జలాలు అడుగంటి.. గతంలో కరువు ఏర్పడినప్పటికీ బుగ్గలో నీటి బుడగలు దుంకడం ఆగలేదు. భక్తుల నోములు.. వ్రతాలకు అసౌకర్యం కలుగలేదు. ఇది నిజంగా మహిమే మరి! పున్నమి రోజున ప్రారంభమైన ఈ ఆలయం దీపకాంతులతో వెలుగులు జిమ్ముతుంది. వందల సంవత్సరాల నుంచి ఈ ఉత్సవం జరుగుతున్నది. ఇక్కడ శ్రీరాముడు ప్రత్యక్షమై స్వయంగా పూజలు నిర్వహించాడట. అందుకే ఇది బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంగా విరాజిల్లుతున్నది.

మరో కాశీ ఎలా?: రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడ పుణ్యాస్నానాలాచరిస్తారు. కాశీకి వెళ్లి దర్శించుకోలేని వారు బుగ్గ రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటే కాశీకి వెళ్లినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.ఆలయ ప్రాంగణంలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. ఈ పదిహేను రోజులు వ్రతాలతో ప్రాంగణమంతా రద్దీగా ఉంటుంది. ఆలయానికి ఎడమవైపున కబీర్దాస్ మందిరం ఉంది. స్నానాల తర్వాత కబీర్ మందిరాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ. కబీర్ మందిరానికి కుడివైపు నాగన్నపుట్ట ఉంది.

నాగేంద్రుడి దర్శనం

భక్తులకు పుట్టలో నుంచి నాగేంద్రుడు దర్శనమిస్తాడట. నాగన్న పుట్టకు ఆపోజిట్లో శివ పార్వతుల ఆలయం.. వెనకాల కబీర్దాస్ ధ్యానమందిరం ఉంది. కాశీలో దైవోపదేశం పొందిన నర్సింహా బాబా అనే సాధువు 1975లో ఈ ప్రాంతంలో కబీర్దాస్ మందిరాన్ని నిర్మించాడట. మందిరంలోనే ధ్యానం చేసిన నర్సింహబాబా ఇక్కడే సజీవ సమాధి అయ్యాడని అక్కడి పూజారులు చెబుతుంటారు. జాతర కోసం స్పెషల్ బస్సులు.. వ్రైవేట్ వాహనాలతో నిజంగానే కాశీయాత్రకు వెళ్లినట్లు అనిపిస్తుంది. బుగ్గజాతరలో బుడగలండీ రామా హరీ అని స్మరించుకోవాల్సిందే!

మా అదృష్టం:

వందలయేండ్ల చరిత్రక కలిగిన ఆలయం ఇది. దీని పక్కనే మా వ్యవసాయ బావి ఉంది. కాబట్టి ప్రతిరోజూ మేం ఈ ఆలయ ప్రాంతంలోనే ఉంటాం. కానీ కార్తీకపౌర్ణమి సందర్భంగా వచ్చే ఉత్సవాలను చూస్తుంటే మాత్రం ఇదెక్కడో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలా అనిపిస్తుంది.
- పుణ్యమూర్తుల స్వామి, ఆరుట్ల గ్రామం

362
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles