కాకతీయ ప్రస్థానం ఇతిహాసంలో తెలంగాణ ఎక్కడ?


Sun,November 25, 2018 03:02 AM

MANACHARTHRA
మన చరిత్రలో భాగంగా ఇప్పటి వరకు బతుకమ్మలో ప్రచురితమైన 77 భాగాల్లో కాకతీయులకు సంబంధించిన భాగాలను తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖకాకతీయ ప్రస్థానం పేరుతో పుస్తక రూపంలోకి తీసుకువస్తున్నది. నగేష్ బీరెడ్డి రాసిన ఈ పుస్తకానికి కొత్త చూపు శీర్షికన నమస్తే తెలంగాణ సంపాదకులు కట్టా శేఖర్ రెడ్డి రాసిన ముందుమాట ఇది. పాండ్యులు పాండవుల పక్షాన యుద్ధం చేశారు. ఆంధ్రులకు పాండ్యులకు ఆది నుంచి వైరుధ్యం ఉంది. ఘర్షణ ఉంది. ఆ ఘర్షణ కురుక్షేత్ర యుద్ధంలో ప్రతిఫలించవచ్చు. ఆశ్చర్యం ఏమంటే మహాభారతంలో తెలంగాణ ప్రాంత ప్రస్తావన గురించి పరిశోధకులు పరిశీలించకపోవడం. అసలు ఈ ప్రాంతం అప్పట్లో ఏ పేరుతో ఉంది? ఎవరి పక్షాన ఉంది? కచ్చితంగా మహాభారత కాలం నాటికి ఆంధ్ర అంతా ఒక్కటిగా లేదు. మహారాజ్యాలు ఏర్పడలేదు.

చరిత్ర ఒక తరుగని గని. ఎంత శోధించినా మరికొంత మిగిలే ఉంటుంది. ఎందుకంటే చరిత్ర అంతా ఆధిపత్య సంఘర్షణలమయమే. సంఘర్షణలో గెలిచినవారు పరాజిత ప్రాంతాల చరిత్రను ధ్వంసం చేసి తమ చరిత్రను స్థాపితం చేయడం గతకాలమంతా జరిగింది. గతానికి సంబంధించిన ఆనవాళ్లు, ఆధారాలు, శత్రుశేషాలు లేకుండా చేయడం అన్నది విస్తృతంగా, కొన్నిసార్లు వికృతంగా జరిగింది. చాలాసార్లు అధికార సంఘర్షణ మాత్రమే గాక మతాల సంఘర్షణగా కూడా చరిత్ర నడిచింది. శైవం, వైష్ణవం, జైనం, బౌద్ధం, మళ్లీ శైవం, వైష్ణవం.. పరస్పర విధ్వంస పునాదులపై పొరలుపొరలుగా చరిత్ర పేరుకుపోయింది. తెలంగాణ పూర్వయుగపు చరిత్రకు సంబంధించి రేఖామాత్ర ఆధారాలు తప్ప, కచ్చితమైన కాలనిర్ణయంగానీ, రాజవంశాల అనుక్రమణికగానీ లభించలేదు. ముక్కలు ముక్కలుగా అక్కడక్కడా లభించిన శాసనాలు, కథాసాహితీ గ్రంథాలు, పురాణాల ప్రస్తావనలే ఇప్పటి చరిత్రకు ఆధారాలు. ఆధారాలు లేనప్పుడు ఆధిపత్య శక్తులు తమకు తోచిన విధంగా చరిత్రను మల్చుకోవడం పరిపాటి. తెలుగునేల చరిత్రలో కూడా ఈ వైకల్యం కనిపిస్తుంది. కళింగ, వేంగి, వెలనాడు, పాకనాడు, రేనాడు, సబ్బినాడు మొదలైన నాడులేర్పడి ప్రతినాడులోనూ స్వతంత్ర రాజ్యం వెలసి రాజకీయైక్యానికి భంగం వాటిల్లింది. రాజకీయంగానే గాక ప్రతివర్ణంలోనూ నాడీ భేదం ఏర్పడి సాంఘిక అనైక్యానికి కారణమై జాతీయ భావం దుర్భలమైంది.

తెలంగాణ, రేనాడు ప్రాంతాలు చిరకాలం ఆంధ్రేతర రాజవంశాల పాలనలోనే ఉండడం జరిగింది. సుదీర్ఘమైన తమ చరిత్రలో ఆంధ్రులు అత్యల్పకాలం మాత్రమే ఏకఛత్రాధిపత్యం కింద మనగలిగినారు (ఆంధ్రుల చరిత్ర, పేజీ9, పేరా3) అని ప్రముఖ చరిత్రకారుడు బీఎస్‌ఎల్ హనుమంతరావు పేర్కొన్నారు. ఉద్యమ వేకువలో తెలంగాణవాదులు ఆ మాటే అంటే సమైక్యవాదులు, కొందరు చరిత్రకారులకు కోపం వచ్చింది. ఆంధ్ర, తెలంగాణ వేర్వేరు కాదు అని, తెలంగాణ ప్రత్యేకం అని చెప్పే వాదన విచ్ఛిన్నకరమైనదని వాదించారు. తెలంగాణకు ఆది నుంచీ సొంత అస్తిత్వం ఉంది. సొంత చరిత్ర ఉంది. తెలుగు అన్న భావనే త్రిలింగ, తెలింగ, తెలుంగు నుంచి వచ్చిందని అనేక చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ప్రాంతాలతోనే భాషలు ఎదిగాయని ఏ భాషను చూసినా అర్థమవుతుంది. కర్ణాటులు మాట్లాడిన భాష కన్నడం అయింది. తమిళులు మాట్లాడిన భాష తమిళం అయింది. మర్హాటులు మాట్లాడిన భాష మరాఠా అయింది. అలాగే గుజరాతీ, ఒరియా, బెంగాలీ భాషలు. తెలుగు ఆవిర్భావానికి మూలాలను మాత్రం మన చరిత్రకారులు అంగీకరించలేదు. మూలాలను అంగీకరిస్తే తెలంగాణను, త్రిలింగదేశ భావనను అంగీకరించాల్సి ఉంటుందని వారు భావించారు. అందుకే త్రిలింగ, తెలింగ, తెలంగాణ భావనల ప్రాధాన్యాన్ని చరిత్రలో వీలైనంత తగ్గించి చూపడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఆ భావనల ఆవిర్భావ క్రమాన్ని, ఆ భావనల వెంట అల్లుకుపోయిన చారిత్రక ఆధారాలను తవ్వితీయడానికి ఇప్పుడు ఒక కొత్తచూపు కావాలి. తెలంగాణ చరిత్రకారులు కొందరు ఈ దిశగా పరిశోధనలు ప్రారంభించారు. కానీ అది చాలదు. తవ్వినా కొద్దీ కొత్త ఆధారాలు లభిస్తున్నాయి. వెతికినా కొద్దీ మూలాలు దొరుకుతున్నాయి.

చరిత్ర పరిశోధకులంతా ఆంధ్రజాతి దృక్పథం నుంచి తమ పరిశోధనను సాగించి, ఆంధ్రజాతి అన్నది ఒకే ప్రాంతంగా మనలేదన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక, భేదాల గురించి చర్చించి, కొన్ని ప్రాంతాలను పూర్తిగా విస్మరించి, ఆంధ్ర చరిత్రను మొత్తం తెలుగుజాతి చరిత్రగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్ర కళింగలో భాగంగా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు పల్లవ, చోళ, పాండ్య రాజ్యాలకు ఉపరాజ్యాలుగా మనుగడ సాగించాయి. గుంటూరు ప్రత్యేక రాజ్యంగా వర్ధిల్లింది. కర్నూలు, అనంతపురం వేర్వేరు రాజ్యాలుగా ఉన్నాయి. తెలంగాణ అత్యధికకాలం ఈ ప్రాంతాలతో విడివడి ప్రత్యేక రాజ్యంగా గానీ, వేర్వేరు రాజ్యాలలో అంతర్భాగంగా గానీ ఉంది. తెలంగాణ ప్రస్తావనను విస్మరింపజేసేందుకు అనేక చారిత్రక సందర్భాలకు ఆంధ్రను లేక ఆంధ్ర రాజ్య భావనను ఆపాదించారు. తెలంగాణ అస్తిత్వాన్ని సూచించే గుర్తులను, ప్రస్తావనలను వారు ఎంతమాత్రం నమోదు చేయలేదు. ఐత్తరేయ బ్రాహ్మణంలో అంధక లేక ఆంధ్రక ప్రస్తావన ఉంది. అది అతి ప్రాచీనమైనది కాబట్టి, తెలుగు జాతికంతటికీ అదే వర్తిస్తూ చరిత్ర రచన సాగింది. అస్మక మహాజనపదం ప్రస్తావన కూడా చాలా ప్రాచీనమైనది. రామాయణ, మహాభారత కాలాల్లో, రచనల్లో ఈ మహాజనపదం ప్రస్తావన ఉంది. గోదావరి తీరంలో వర్ధిల్లిన అస్మకుల చరిత్రను ఆధునిక చరిత్ర రచయితలు ఎందుకో విస్మరించారు. ఆంధ్ర ప్రస్తావన ముందు నుంచి ఉన్నమాట వాస్తవమే. మహాభారతంలో కూడా ఆంధ్రులు కౌరవుల పక్షాన యుద్ధం చేసినట్టుగా వ్యాసభారతంలో ఉంది. విచిత్రం ఏమంటే నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ తెలుగులో రాసిన మహాభారతంలో ఆంధ్ర ప్రస్తావన తొలిగించి రాశారు. ఆంధ్రులకు కౌరవుల పక్షాన పోరాడారన్న అపప్రథ రాకూడదని అలా చేసి ఉంటారు. కానీ, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు వేరు. పాండ్యులు పాండవుల పక్షాన యుద్ధం చేశారు. ఆంధ్రులకు పాండ్యులకు ఆది నుంచి వైరుధ్యం ఉంది. ఘర్షణ ఉంది.

ఆ ఘర్షణ కురుక్షేత్ర యుద్ధంలో ప్రతిఫలించవచ్చు. ఆశ్చర్యం ఏమంటే మహాభారతంలో తెలంగాణ ప్రాంత ప్రస్తావన గురించి పరిశోధకులు పరిశీలించకపోవడం. అసలు ఈ ప్రాంతం అప్పట్లో ఏ పేరుతో ఉంది? ఎవరి పక్షాన ఉంది? కచ్చితంగా మహాభారత కాలం నాటికి ఆంధ్ర అంతా ఒక్కటిగా లేదు. మహారాజ్యాలు ఏర్పడలేదు. మౌర్యుల తర్వాతనే రాజ్యాల అవతరణ మొదలైందని చరిత్రకారులు అందరూ చెప్పే వాదన. ఇతిహాసకాలంలో పదహారు మహాజనపదాలు ఉన్నాయని, అందులో అస్సక లేక అస్మక లేక అశ్విక మహాజనపదం ఒకటని మహాభారతంలో ప్రస్తావన ఉంది. వింధ్యా పర్వతాలకు ఈ వల ఉన్న మహాజనపదం ఇదొక్కటే అని కూడా జనపదాల వివరణలో ఉంది. గోదావరి, మంజీరా నదుల మధ్య విస్తరించి ఉన్న ప్రాంతమే ఈ అస్మక మహాజనపదమని, దీనికి పోతలి లేక పౌధన లేక బహుధాన్య లేక బోధన లేక బోధన్ రాజధానిగా ఉందని చారిత్రక చర్చల్లో ప్రస్తావించారు. బౌద్ధ, జైన వాజ్ఞయాల్లోనూ పౌధన లేక పోతలి ప్రస్తావన ఉంది. సుత్తనిపాత(పరమాత్తజోతిక-581) అస్మక, మూలక రాజ్యాలనే ఆంధ్ర ప్రాంతంగా అభివర్ణించింది. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంనాటి అంగుత్తర నికాయ అనే బౌద్ధ విచారగ్రంథంలో ప్రస్తావించిన షోడశ మహాజనపదాల్లో అస్మక కూడా ఒకటి.

చరిత్రకు ముందు మహాభారతంలో కొన్ని ప్రస్తావనలను అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. మహాభారతంలో ధర్మరాజు నిర్వహించిన రాజసూయ జైత్రయాత్రలో భాగంగా సహదేవుడు దక్షిణ భారతంలోని రాజ్యాలను జయించిన ప్రస్తావన ఉంది (మ.భా. ప.2- అ.30). అందులో సహదేవుడు ద్రవిడులు, ఉడ్రకేరళులు, కేరళులు, ఆంధ్రులు, తలవానులు(తెలింగులా?), కలింగులను జయించినట్టు ప్రస్తావించారు. తలవానులు తెలంగాణులేనని, గోదావరి నదికి తెలివాహ నదిగా పేరుందని, గోదావరి తీరాన వెలసిన రాజ్యమే తలవానుల రాజ్యమని చరిత్రకారులు సంగనభట్ల నర్సయ్య ఒక సూత్రీకరణ చెప్పారు. భీష్మపర్వం తొమ్మిదో అధ్యాయంలో ధృతరాష్ర్టునికి కురుక్షేత్ర యుద్ధ వర్ణనకు ముందు భారత దేశ భౌగోళిక వర్ణన చేస్తారు సంజయుడు. అందులో దక్షిణాపథాన ఏయే రాజ్యాలు ఉన్నాయో వివరిస్తూ, ద్రవిడులు, కైరళులు, ప్రాచ్యులు, మూషికులు, వనవాసికులు, కరనాటులు, మహిషకులు... తలవానులు, విదర్భులు, కకులు, తంగనులు, పరతంగనులు ఉన్నట్టుగా వర్ణిస్తారు. అదే వరుసలో మరో చోట షండులు, విదర్భులు, రూపవాసికులు, అశ్వకులు, పాంశురాష్ర్టులు, గోపరాష్ర్టుల.. గురించి ప్రస్తావించారు. దాక్షిణాత్యులైన పులిందులు, ఖసులు, బాహ్లికులు, నిషాదులు, అంధకులు, తంగనులు భోజులతో కలిసి పాండవుల పక్షాన పోరాడుతున్న పాండ్యులతో తలపడుతున్నారు (మహాభారతం, ప.8-అ.20) అని వర్ణించారు. తుషారులు, యవనులు, ఖసులు, దర్వభీషరులు, దరదులు, శకులు, కామటులు, రామటులు, తంగనులు, అంధకులు, పులిందులు, భీకర పోరుకు పేరుగాంచిన కిరాతులు, మ్లేచ్ఛులు, పర్వతారోహకులు దుర్యోధనుని పక్షాన పోరాడుతున్నారు (మహాభారతం, ప.8-అ.73) అని కూడా వివరించారు. తలవానులు, మూషికులు, అశ్వకులు, తంగనులు ఎవరు? ఎక్కడివారు? అన్న చర్చ చరిత్ర పరిశోధనలో జరుగులేదు. మహాభారతానికి ముందు నుంచి ఉన్న జనపదాలన్నీ యుద్ధంలో పాల్గొన్నట్టు సంజయుని వర్ణనలో ఉంది. అశ్వక లేక అస్మక లేక అస్సక జనపదం చరిత్ర తెలంగాణ చరిత్రలో భాగం కాదా? సంజయుడు ప్రస్తావించిన అశ్వకులు మన అశ్వకులు కాదా? ఈ ప్రశ్నలపై ఇంకా విస్తృతంగా శోధన, చర్చ జరుగాల్సి ఉంది. మత్స్యపురాణంలో అస్మక రాజ్య వివరణ ఉంది. బ్రహ్మదత్తునితో సహా 22 మంది రాజులు అస్మక రాజ్యాన్ని పాలించినట్టు మత్స్యపురాణం పేర్కొంది.

లింగ శబ్దం మూలాలు పురాణేతిహాసాల కాలం నుంచి ఉన్నాయి. దాక్షిణాత్యులు దస్యులు, రాక్షసులు, మ్లేచ్ఛులు, కిరాతులు, ఆర్య సంస్కృతి నుంచి బహిష్కరించబడినవారు. వీరిలో శైవారాధన ఎక్కువ. శివాలయాలు అధికం. త్రిలింగ భావన చాలా కాలంగా ఉండి ఉండాలి. అనేక లింగాలు ఉండగా త్రిలింగాలే ఎందుకు అని కొందరు ప్రశ్నించవచ్చు. కానీ ప్రతి ప్రాంతానికి ఒక విస్తృతి, ఒక పరిమితి ఉన్నాయి. అలా త్రిలింగ భావన ఏర్పడి ఉండవచ్చు. కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామంల మధ్య భాగాన్ని త్రిలింగ దేశమని స్కందపురాణం పేర్కొంది.

శ్రీశైల భీమ కాళేశ మహేంద్రగిరి సంయుతం
ప్రాకారాతు మహత్ కృత్యా త్రీణిద్వారా మపాకరోత్... త్రిలింగ
అని స్కందపురాణం వర్ణించింది. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దకాలానికి సంబంధించిన స్కందపురాణం మహాపురాణంగా ప్రసిద్ధిగాంచింది. ఆ తర్వాత కాలంలో
అథపార్శే త్రిలింగాస్య మగధాస్య వృకైస్సహ!
మధ్యదేశా జనపదాః ప్రాయోశోమి ప్రకీర్తితాః!!(వాయుపురాణం-శ్లో 111) అని వాయుపురాణం వర్ణించింది. వాయుపురాణం క్రీస్తుశకం ఐదో శతాబ్దకాలంలో రాసినట్టు చరిత్రకారుల అంచనా.

గోదావరి, కృష్ణా నదుల మధ్య ఆవరించి ఉన్న ప్రాంతం త్రిలింగభూమిగా చాలాకాలం పరిగణనలో ఉంది. ఈ ప్రాంతమంతా ఒకే రాజ్యఛాయలో ఉన్నట్టు మనకు ఆధారాలున్నాయి. శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు అందరూ ప్రధానంగా ఈ ప్రాంతాన్నే ఏలారు. అయితే ఆంధ్ర చరిత్ర పరిశోధకులు ఈ వర్ణణను అంగీకరించలేదు. తెలుగు నేలకు ఇవి సరిహద్దులు కాజాలవని వాదించారు. ఆంధ్ర శబ్దంపై మమకారం, త్రిలింగ శబ్దాన్ని అంగీకరించలేకపోవడం ఇందుకు కారణం తప్ప మరో కారణమేదీ కనిపించదు. తెలుగు నేలంతా ఎక్కువకాలం ఒక్కటిగా లేదని చెప్పిన చరిత్రకారులే ఆంధ్ర, త్రిలింగ భావనలను అంగీకరించడానికి నిరాకరిస్తూ వచ్చారు. విన్నకోట పెద్దన
ధర శ్రీపర్వత కాళేశ్వర ద్రాక్షారామ సంజ్ఞవరలు త్రిలింగా
కరమగుట నంధ్రదేశం బరుదార త్రిలింగదేశమనజనుకృతులన్ రాశారు.
కాశ్మీరు రాజుల చరిత్ర రాజతరంగిణిలో కల్హణుడు దక్షిణభారతంలో బ్రాహ్మణుల వర్గీకరణ గురించి వివరిస్తూ..
కర్ణాటకాశ్చ తైలంగా మహరాష్ట్రకాః
గుర్జరాశ్చతీ పంచౌ ద్రవిడ వింధ్యా దక్షిణే!!
సారస్వతాః కాన్యాకుబ్జ గౌడ ఉత్కళ మైథిలాః
పాంచగౌడ ఇతి ఖ్యాతా వింధ్యాస్తోత్తరవాసీ!! (రాజతరంగిణి, సంపుటి 4, పే-468) అని రాసినట్టు చెబుతున్నారు. కర్ణాటులు, తైలంగులు, ద్రవిడులు, మహారాష్ట్రకులు, గుర్జరులు-ఈ ఐదు వింధ్యాచలానికి దక్షిణదిక్కున ఉన్న బ్రాహ్మణులుగా, వీరిని పాంచ ద్రవిడులుగా కల్హణుడు అభివర్ణించారు. పన్నెండో శతాబ్దకాలంలో ఆయన ఈ రచన చేసినట్టు చరిత్రకారులు అంచనా వేశారు.

- మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ నెంబర్‌లో తెలియజేయండి.
సెల్ : 80966 77177

572
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles