కవి హరగోపాల్ - రెండు దోసిళ్ళ ప్రేమ


Sun,April 17, 2016 02:14 AM

జీవితంలో ప్రేమ, విషాదం గురించి ఎంతోమంది రచనలు చేశారు. ఎన్నో కథలు, కవితలు వచ్చాయి. అయితే కవి, ఉపాధ్యాయుడు అయిన హరగోపాల్ రెండు దోసిళ్ళ కాలం పేరుతో ఈ రెండు అంశాలను ఎంతో ఆర్తితో తడుముతూనే వైవిధ్యభరితమైన కవిత్వాన్ని కాన్కగా అందించారు.

haragopalఇంతకు ముందు మట్టి పొత్తిళ్ళు, మూలకం కవితా సంపుటాలు వెలువరించిన ఈ కవి మూడవ సంకలనంగా తెచ్చిన ఈ పుస్తకంలో మొత్తం 168 కవితలున్నాయి. దోపిడీ పాలనలో అణగారిన తెలంగాణ మట్టి బతుకు నుంచి, సామ్రాజ్యవాద బాంబుదాడులతో ధ్వంసమైన గాజా జనజీవితం దాకా...అలాగే, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఆకాంక్ష, మానవ సంబంధాలు, ప్రకృతి పట్ల ప్రేమ ఇలా ఎంతో సహజంగా కవిత్వీకరించారు. మనదైన భాషా యాసలతో జన జీవితాన్ని పదచిత్రాలతో ఆవిష్కరించారు.
కవిగా, ఉపాధ్యాయ ఉద్యమ కార్యకర్తగా హరగోపాల్ తెలంగాణ ఉద్యమ పరిస్థితుల్ని దగ్గరగా చూసిన వ్యక్తి. అందువల్లే ఆయన రచనల్లో మనుషుల పట్ల అపారమైన ప్రేమ, మొక్కవోని ఆత్మవిశ్వాసం గోచరిస్తాయి.

హృదయ యమునాతీరంలో కవితలో చెప్పినట్లు ప్రేమ రాహిత్యంతో ఎండిపోయిన ఎడారి బతుకుల్లో/ నీ ఆత్మీయ కరచాలనాల తడినందివ్వు/నేను నీ చేతుల్లో వెచ్చని అనురాగ స్పర్శనవుతా/రా, నిట్టూర్పులను విశ్వసించు/ కొత్త మానవ ప్రపంచాన్ని ఆవిష్కరిద్దాం/ వేదనలు లేని స్వర్గాన్ని శ్వాసిద్దాం అంటారు. ఇట్లా ఒకటని కాదు ద్రవించే హృదయంతో విశ్వమానవాళి పట్ల ఉన్న ఆర్థ్రతతో రాసిన కవితలన్నీ మనల్ని చదివింపజేస్తై. ప్రతి చరణమూ సామూహిక దుఃఖాలకు కారణాలను ఆలోచింపజేస్తుంది. మొత్తంగా హరగోపాల్ కవిత్వం జీవన విధ్వంసం తాలుకు జ్ఞాపకాల్ని ఎంతో ఆర్తితో స్పృశింపజేస్తుంది.
కవి తన జీవితానుభవాలతో పెనవేసుకున్న అనుభూతులు, సంఘర్షణలు గ్రామీణ జీవితాన్ని దగ్గరగా చూసిన అనుభవాలతో కూడి ఒక ధారగా కవితల్లోకి ప్రవహించడం వల్లనే కావచ్చు, అతని కవిత్వంలో గాఢత కనిపిస్తోంది. ముందుమాటలో ఎన్.వేణుగోపాల్ చెప్పినట్లు నిద్రలేని ఊళ్ల మనాదిని చిత్రించిన కవిత్వం తనది.

రెండు దోసిళ్ళ కాలం, రచన: శ్రీరామోజు హరగోపాల్, పేజీలు: 168, వెల: రూ. 100/- ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు. కవి మొబైల్ 9949498698
అశోక్

1500
Tags

More News

VIRAL NEWS