కర్తవ్యం


Sun,May 14, 2017 02:33 AM

జీవితాన్ని క్షణికంగా భావించి, చిన్నపాటి లాభాలను దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన భవిష్యత్తును చేజేతులా కుంచించుకుంటున్నాం. కర్తవ్యాన్ని కృషితో నిర్వరిస్తూ.. వందేళ్లూ నీదైన జీవితాన్ని జీవించు అంటూ భారతీయత ప్రపంచానికి చాటి చెప్పింది. సౌశీల్యం, సహృదయత, స్వేచ్ఛ, ఉన్నతి వంటివన్నీ కర్తవ్యం సాక్షిగా జీవితంలో మనకు చేరువవుతాయి. కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ తృప్తిగా జీవిస్తే మనిషి జన్మకు సార్థకత సిద్ధిస్తుంది. కర్తవ్యం విస్మరిస్తే మనం, మనతోపాటు సమాజమూ కుంటుపడుతుంది. అసలు మానవత్వానికీ అర్థం ఉండదు. లోకం చీకటై మనల్ని అజ్ఞానంలోకి నెట్టేస్తుంది. కర్తవ్య రాహిత్యంతో జరిగే వైఫల్యాలకు ఉదాహరణగా నిలిచే ఈ కథ మనకు కనువిప్పు కలిగిస్తుంది. కర్తవ్య బోధ చేస్తుంది.

ఒక ఊర్లో గొప్ప ధనవంతుడుండేవాడు. అతనికి మేలు జాతి గుర్రాలు పూర్చిన గుర్రపు బండి ఉంది. ఒకరోజు ఆ ధనికుడు విలాసం కోసం తన గుర్రపు బండిలో షికారుకు బయలుదేరాడు. బండి పట్టణాన్ని దాటి చిన్న గ్రామం చేరింది. బండిని తోలేవాడు మంచి వేగంతో గుర్రాలను అదిలించి నడుపుతూ యజమాని ప్రశంసకై ప్రాకులాడుతున్నాడు. అంతలో అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది. వేగంగా పోతున్న బండి అదుపు తప్పి పక్కకు పోయి నడుచుకుంటూ వెళుతున్న చిన్న పిల్లాడిని తోసేయడంతో అతను కింద పడిపోతాడు. బండి చక్రాలు అతనిపై నుండి పోయి ఆ పిల్లాడు చనిపోవడం హఠాత్తుగా జరుగుతుంది.
చిన్న పిల్లాడు మరణించినా ఏ మాత్రం చలించని ధనికుడు బండి వాడిని ముందుకెళ్లమన్నాడు. ఆ ఘోరాన్ని చూసిన పిల్ల్లాడి బంధువులు, గ్రామ ప్రజలు ఆగ్రహంతో కేకలు పెడుతూ బండిని వెంబడించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ధనికుడు వారికి తాను గనుక చిక్కితే బతకడం అసాధ్యమని గ్రహించి, తన దగ్గర ఉన్న సంచిలోంచి వెండి కాసులను నేలపై పడేయసాగాడు. వెండి కాసులను చూసిన గ్రామ ప్రజలందరూ తమ ఆవేశాన్నీ, జరిగిన విషయాన్నీ మరచి అపరాదియైన ధనికుడిని తరమడం ఆపేసి వాటిని పోగు చేసుకోసాగారు. పైగా వెండి కాసులను తీసుకున్న వారంతా బండివాడి వైపు చూస్తూ ఓ ధనవంతుడా! నిన్ను భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నారు. కనుచూపు మేర గుర్రపు బండి దాటి ఎప్పుడో వెళ్లిపోయింది. గ్రామంలోని వారంతా చనిపోయిన పిల్లాడి ధ్యాస లేక దొరికిన వెండి కాసులను గురించి చర్చించుకోసాగారు.
Neethi-katha

గ్రామాన్ని దాటి పట్టణం వైపు పరుగులు తీస్తున్న గుర్రపు బండిలో కూర్చున్న ధనికుడు బండి నడిపే వాడితో తన తెలివి తేటలను గొప్పగా చెప్పుకుంటూ ఎలా తప్పించుకున్నామో మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ మురిసిపోయాడు. ఇల్లు చేరగానే జరిగిన విషయాన్నే మరచిపోయాడు.
సమాజంలో అత్యధికుల స్వభావానికి అద్దం పడుతుందీ సంఘటన. చిన్న లాభం స్వార్థంగా పరిణమించి తమ కనీస కర్తవ్యాన్ని విస్మరించేలా చేస్తుంది. సమాజం పట్ల మనకున్న కర్తవ్యాన్ని ఎంతటి దౌర్భాగ్యం. ఈ కథలోని పిల్లాడి విషయంలో గ్రామ ప్రజలూ, చివరికి బండి నడిపేవాడు వారి వారి కర్తవ్యాలను మరచి క్షణ కాలంలోనే తమ తమ స్వార్థ చింతనల్లో మునిగిపోయారు.
సమాజం అంటే మనమే కదా! తాత్కాలికంగా దొరికే చిన్నపాటి లాభాలనూ, సుఖాలనూ త్యాగం చేస్తే కర్తవ్యాభిముఖంగా ఆలోచిస్తే మనసుకు తృప్తి కలుగుతుందనేది నిర్వివాదాంశం. మనిషి ఎంత గొప్పవాడైనా, సామాన్యుడైనా మానవత్వం అనే కవచం ధరించి లోకంలో అడుగుపెట్టాడు. మనిషిగానే లోకం నుండి వెళ్లిపోతాడు.

నిన్న, నేడు, రేపు మూడింటికీ వ్యత్యాసం ఉన్నా, కాలం అనే మాటలో ఒకటై ఒదిగిపోతాయి. మనుషుల్లో బతికే విధానంలో తేడాలున్నా మానవత్వంతో ఒక్కటై కలిసి పోవాల్సిందే. అది కేవలం కర్తవ్యంతోనే సాధ్యం. మన కర్తవ్యాలను విస్మరిస్తే మనల్ని మనం మరచిపోయినట్లే. కర్తవ్య రాహిత్యం నిర్లక్ష్యానికి దారి చూపి అన్యాయానికి తావిస్తుంది. దాని ప్రభావం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా మనపై పడుతుంది. ఇవాళ వేరొకరికి జరిగిన అన్యాయం రేపు మనకూ జరగొచ్చు. కర్తవ్యం అంటే మనల్ని మనం ఉద్ధరించుకునేందుకు నెరవేర్చే దీక్ష మాత్రమే కాదు, సాటివారి పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల చూపించగల కనీస బాధ్యత అని మరిచిపోకూడదు.

1173
Tags

More News

VIRAL NEWS