కథలకు తెలంగాణ జీవనది


Sun,September 9, 2018 02:11 AM

Sridhar
లాభాల కోసం కాకుండా నలుగురికీ ఉపయోగపడేలా, సమాజానికి మేలు చేసేలా సినిమాలు తీసే అతికొద్ది మంది దర్శకుల్లో అల్లాణి శ్రీధర్ ఒకరు. ఆదివాసీల ఆరాధ్యదైవం గోండు వీరుడు కొమురంభీం
జీవితాన్ని తెరకెక్కించిన అరుదైన గౌరవాన్ని ఆయన సొంతం చేసుకున్నాడు. కల్పిత, దిగుమతి కథలతో తీసే చిత్రాల్లో జీవముండదని, మనం తీసే సినిమా సమాజానికి ఉపయోగపడేదై ఉండాలంటున్నారాయన. వాస్తవిక కథలకు తెలంగాణ జీవనది లాంటిదని, ఇక్కడి చరిత్ర నేపథ్యంలో ఎన్నో జీవనచిత్రాలను తెరకెక్కించవచ్చంటున్నారు సీనియర్ దర్శకులు అల్లాణి శ్రీధర్. భవిష్యత్తులో పిల్లలు, తెలంగాణ, ఆధ్యాత్మిక నేపథ్య కథలతో సినిమాలు చేయనున్నట్లు వెల్లడించారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...
Sridhar1

మనది కర్మభూమి

తెలుగు సినిమాల్లో గ్రాఫిక్స్‌తో కూడిన కల్పిత కథలు తప్ప వాస్తవిక జీవితాలేవీ తెరకెక్కడం లేదు. తెలంగాణ కర్మభూమి ఇక్కడి మట్టికి ఎంతో చరిత్ర ఉంది. ఆ మట్టిని తవ్వితే ఎన్నో బతుకుచిత్రాలు బయల్పడుతాయి. తెలంగాణ మంచికథలకు జీవ నదిలాంటిదైతే, పాటలకు తరుగని గని. ఇక్కడి చరిత్ర నేపథ్యంలో ఎన్నో సినిమాలను తెరకెక్కించే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు సాగాలి. తెలంగాణలో తెలుగు సినిమా ఎంత అవసరమో, తెలుగు సినిమాల్లో తెలంగాణ కూడా అంతే ముఖ్యం. కేవలం ఉద్యమ నేపథ్యంగా వచ్చే సినిమాలు, ఉద్యమానికి ఊతమిచ్చే సినిమాల్లోనే కాకుండా కమర్షియల్ సినిమాల్లోనూ తెలంగాణ కనపడాలి, వినపడాలి. ఇక్కడి సంస్కృతీ, సంప్రదాయాలు సినిమాల్లోనూ ప్రతిఫలించినప్పుడే తెలంగాణ గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. మాభూమి, జై బోలో తెలంగాణ, కొమురం భీం వంటి చిత్రాలు ఇక్కడి మట్టి మనుషుల చిత్రాలు. తెలంగాణ సినిమాలను ప్రోత్సహించాలి. సినిమాల విషయంలో మనం కొంత వీక్‌గా ఉన్నమాట వాస్తవమే. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సినిమా ఇండస్ట్రీ మీద పూర్తి అవగాహన ఉంది. కొంత ఆలస్యమైనా మంచే జరుగుతుందని ఆశీస్తున్నాం.

క్లాస్‌రూమ్ సినిమాలు రావాలి

సినిమా అనేది ఒక శక్తివంతమైన మాధ్య మం. ఇది పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందుకే మనం పిల్లల సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంది. అంటే క్లాస్‌రూమ్ సినిమాలను ప్రమోట్ చేయా లి. పిల్లలకు ఒక బుక్ కొనాలన్నా, ఆటవస్తువు కొనాలన్నా దాని మీద వయస్సు లిమిట్స్ రాసి ఉంటుంది. అటువంటప్పుడు పిల్లలకు ప్రత్యేక సినిమాలు ఉంటే తప్పేంటీ? వారికంటూ ప్రత్యేక చిత్రాలు లేకపోవడం మూలంగా 18ప్లస్ వాళ్లు చూడాల్సిన సినిమాలను, 10ప్లస్‌లోనే చూసేస్తున్నారు. దీంతో పిల్లల్లో హింసా ప్రవృత్తి పెరుగడం, ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి అసాంఘీక చర్యలకు పాల్పడుతున్నారు. అంతేకాక పిల్లల మానసిక ఎదుగుదలను కూడా సినిమాలు ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రతీ ఏజ్‌గ్రూప్‌కు తగ్గట్లు సినిమాలు రావాలి. మంచి సినిమాలను తరగతి గదిలోనే అలవాటు చేయాలి. ప్రతి స్కూల్లో ఒక పీరియడ్ సినిమా ప్రదర్శన ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలన్నీ డిజిటల్ స్కూల్స్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నది. కనుక వాటిద్వారానే సినిమా ప్రదర్శన చేయొచ్చు. లేదా వీడియో ఆన్ వీల్స్ విధానం ఆలోచించాలి.

సమాజమే ఒక సినిమా

మనం ఎంతసేపు కథలోకి వెళ్తున్నాం కానీ సమాజంలోకి వెళ్లడం లేదు. సమాజం నుంచి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే హిందీ సినిమాల్లో భారతీయ జీవన విధానం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. అట్లే తెలంగాణ మీద ఎందుకు తీయకూడదు? సమాజంలోని కష్టాలు, సుఖాలు, మార్పులు, సామాజిక సమస్యలు ఇట్ల ఎన్ని లేవు. అంతెందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినన్ని సంక్షేమ పథకాలు మరే ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. ఉదాహరణకు మిషన్ కాకతీయ తీసుకోండి. గతంలో చెరువు ఎలా ఉండేది. మిషన్ కాకతీయలో చెరువు బాగు చేసుకున్నాక ఆ గ్రామ స్థితిగతులు ఎలా మారాయి. పండే పంటల శాతం ఎంత వరకు పెరిగింది. అక్కడ అభివృద్ధి ఎలా సాగుతుంది వంటి అంశాలతో మంచి సినిమా చేయొచ్చు.

చిన్నసినిమాలు, థియేటర్స్ బతకాలి

తెలంగాణలో సినిమా బతుకాలంటే మినీ థియేటర్స్, ప్రొడ్యూసర్స్‌ని ప్రోత్సహించాలి. ప్రాంతీయ భాష చిత్రాల అభివృద్ధికి మరింత కృషి జరుగాల్సి ఉంది. ఈ దిశలో దర్శకుల సంఘంగా నరసింగరావు, ఎన్. శంకర్, దశరథ్, సానయాదిరెడ్డి, నేను ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను కలిశాం. వారంతా సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ సలహాదారులు కె.వి రమణాచారి ఈ విషయంలో మాకెంతో సహకరిస్తున్నారు. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పడింది. ఇక్కడి యువతకు సినిమా రంగంలో ఉపాధి రావాలంటే ఫిలిం ఇనిస్టిట్యూట్ రావాలి.

నా గురించిమాది మెదక్ జిల్లాలోని కొడకంబ అనే చిన్న ఊరు. నాకు కళారంగం పట్ల ఆసక్తి కలుగడానికి కారణం మా అమ్మ. చిన్నతనంలో ఆమె చెప్పే కథలే నన్ను ఈ రంగం వైపు మళ్లించాయి. చిన్నతనంలో నాన్నగారొస్తున్నారు బాబోయ్, మరో ప్రపంచం పిలిచింది నాటికలు రాశాను. ఇండియన్‌నేషనల్ థియేటర్ సంస్థ జాతీయ స్థాయి నాటక ప్రదర్శనల్లో నా నాటికకు ఉత్తమ, ప్రదర్శన, రచన బహుమతులు వచ్చాయి. దాంతో కొండంత ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే సినిమా రంగం వైపు మళ్లాను. నరసింగరావు గారు మా భూమి చేస్తున్న సమయంలో ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడ వాలిపోయేవాణ్ణి. ఆయన దగ్గర కొంతకాలం తర్వాత దాసరి గారి దగ్గర చేరాను. ప్రజాప్రతినిధి, బ్రహ్మపుత్రుడు, మజ్ను, రొటేషన్ చక్రవర్తి సిని మాలకు ఆయన దగ్గర పనిచేశాను. ఆ సమయంలోనే నాచేత క్యాంపస్ క్యాంపస్ అనే నవల రాయించారు. అది ఒక దినపత్రికలో డైలీ సీరియల్‌గా వచ్చింది.

కొమురం భీంతో శ్రీకారం

ఆదిలాబాద్ సంస్కృతి మీద, గిరిజన వీరుల మీద ఒక డాక్యుమెంటరీ తీయాలన్న ఐటీడీఏ వారి ప్రోద్భలం ఆ తరువాత సినిమాకు దారి తీసింది. భూపాల్‌రెడ్డి, ప్రాణ్‌రావు, గౌతంఘోష్ సహకారంతో 1990లో కొమరం భీం పూర్తయింది. దానికి 1991లో ఉత్తమచిత్రం (జాతీయ సమగ్రత), తొలి ఉత్తమ చిత్ర దర్శకుడిగా నంది అవార్డులు లభించాయి. ఇరవైయేండ్ల తర్వాత ఈ సినిమా విడుదలై విజయం సాధించడం, హైదరాబాద్‌లో 100 రోజులు ఆడడం మరిచిపోలేని అనుభూతి. అదే క్రమంలో రగులుతున్న భారతం, ప్రేమే నా ప్రాణం, ఉత్సాహం, జై శ్రీ బాలాజీ, గౌతమబుద్ధ, హనుమాన్ చాలిసా, హాలీడేస్, చిలుకూరు బాలాజీ చేశాను. వీటితోపాటు టీవీలకు శ్రీవారి తీర్ధాలు, సాయిశరణం, ఆదిపరాశక్తి, మనకథ గులాబీ అత్తరు ఇలా 13 వరకు సూపర్‌హిట్ సీరియల్స్, సమ్మక్క, సారక్క జాతరతో పాటు పలు డాక్యుమెంటరీలు, ఎడ్యుకేషనల్ సినిమాలు చేశాను. హిందీలోనూ తూహీ మేరీ గంగా, తథాగత బుద్ధ, గోస్వారి తులసీదాస్ సినిమాలు, ఐదు సీరియల్స్ చేశాను. ఇటీవలే చిలుకూరి బాలాజీ చిత్రం విడుదలయ్యింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినన్ని సంక్షేమ పథకాలు మరే ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. ఉదాహరణకు మిషన్ కాకతీయ తీసుకోండి. గతంలో చెరువు ఎలా ఉండేది. మిషన్ కాకతీయలో చెరువు బాగు చేసుకున్నాక ఆ గ్రామ స్థితిగతులు ఎలా మారాయి. పండే పంటల శాతం ఎంత వరకు పెరిగింది. అక్కడ అభివృద్ధి ఎలా సాగుతుంది వంటి అంశాలతో మంచి సినిమా చేయొచ్చు.

అవార్డులు, పదవులు

Sridhar2
-కొమరం భీం చిత్రానికి బెస్ట్ ఫిలిం డైరెక్టర్‌గా నంది అవార్డు, కాటమరాయుడు కథలు టీవీ సీరియల్‌కు నంది బెస్ట్ స్క్రిన్‌ప్లే అవార్డు, హిందీ సినిమా తూహీ మేరీ గంగా చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ డైరెక్టర్‌గా, కొమురం భీం మెమొరియల్ నేషనల్ అవార్డు అందుకున్నాను.
-2004లో టీవీ నంది, 2006, 11లో సినిమా నంది అవార్డుల కమిటీకి జ్యూరీ సభ్యునిగా పనిచేశాను. 2015లో ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జ్యూరీ సభ్యునిగా పనిచేశాను.
-ప్రస్తుతం ఫిల్మిడియా ప్రొడక్షన్స్‌కు ఎండీగా, హైదరాబాద్ ఫిలిం క్లబ్‌కు అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను.

395
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles