కంటే కూతుర్నే కనాలి!


Sun,December 3, 2017 03:17 AM

ఆడపిల్ల పుట్టిందా? అయ్యో.. ఎలా మరి? అమ్మాయి పుడితే మీకు సమాజంలో అవమానంగా ఉందా? వంశం అంతరించి పోతుందని దిగులు చెందుతున్నారా? చస్తే తలకొరివి పెట్టేదెవరని బెంగ పడుతున్నారా? ఎందుకండీ ఈ దిక్కుమాలిన ఆలోచనలు? ఎవరు చెప్పారు.. ఆడపిల్ల పుడితే అరిష్టమని? ఎవరు చెప్పారు ఆడపిల్లను కడుపులో ఉండగానే స్కాన్‌చేసి చంపేయమని? పుట్టిన వెంటనే చెత్తకుప్పల్లో.. ముళ్ల పొదల్లో పడేయమని ఏ సంప్రదాయం చెప్తున్నది? ఎందుకింత కాఠిన్యం? ఎందుకీ వివక్ష? ఎందుకింత దారుణం? లోకం తెలియని ఆ పసికందు చేసిన పాపం ఏంటి? దీనికి సమాధానం మీ దగ్గరుందా? ఉంటే మార్పు ఎలా తీసుకురాగలరు? ఆడపిల్లను ఎలా బతికించగలరు?ఆడపిల్లనమ్మా.. నేను ఆడపిల్లనానీ.. బాధ పడకమ్మా.. నువ్వు దిగులు చెందకమ్మా అని కంట కన్నీరు పెట్టుకుని సోయి తెప్పించే ప్రయత్నం చేసినా.. ఆడపిల్ల.. ఆడీపిల్లా.. ఆడు పిల్లనంట.. నేను పాడుపిల్లనంట అని గొంతెత్తి మొత్తుకున్నా ఆమె గోస ఎవరూ వినడం లేదు. మగవాని బతుకులో సగపాలు తనదిగా.. జీవితం.. అంకితం చేసినా కూడా ఆమె త్యాగాన్నెవరూ గుర్తించడం లేదు. ఆధునిక కాల ప్రభావంతో అంతోఇంతో సమాజంలో గుర్తింపు లభిస్తున్నది కానీ ఇంట్లోనే అస్పృశ్యత ఎదురవుతోంది. అన్నీ తెలిసినవాళ్లు.. చదువుకున్నవాళ్లే ఇలా వారసత్వం పేరు చెప్పి.. మూఢనమ్మకాల మాటున.. వంశాంకుర మోజులోపడి ఆడజన్మను ఆదిలోనే అంతమొందించే ప్రయత్నాలు చేస్తున్నారు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలుగా.. బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలుగా.. చిట్టిపొట్టి పలుకుల ముద్దు మాటలే ధనధాన్యాలుగా ఆడపిల్లను ఇంతకు ఇంత ఎదగనివ్వాలి. జగమంతా ఏలేటట్లు ప్రోత్సహించాలి. ఆడపిల్ల పుట్టాలని కలగనాలి. ఆమెను మహారాణిలా నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించాలి అనే విషయాలతో ముఖచిత్ర కథనం.
baby3

డే1

కోఠీ మెటర్నిటీ హాస్పిటల్ థియేటర్ అబ్జర్వేషన్.

అప్పుడే ఒక డెలివరీ జరిగింది. లేబర్‌రూమ్ నుంచి నర్స్ బయటకు వచ్చింది. అమ్మాయి పుట్టింది అని నర్స్ చెప్పగానే ముక్కొక దిక్కు.. ముఖమొక దిక్కు పెట్టుకున్నారు అక్కడున్నవాళ్లు. మల్లా పిల్లనే పుట్టిందంట అని గుసగుసలాడుతున్నారు. పచ్చి నొప్పులతో ఉన్న బాలింత వొలవొలా ఏడుస్తున్నది. తాశిల్ది.. మల్లా బిడ్డనే కన్నది అని అత్తింటివాళ్లు ఆడిపోసుకుంటారని ఎక్కిఎక్కి ఏడుస్తున్నది. ఎంతమంది ఊకోబెట్టినా దుఃఖమాపడం లేదామె. బయట భర్తేమో ఫోన్ మాట్లాడుతూ అటూ ఇటూ ఏదో కోల్పోయినట్టు తిరుగుతున్నాడు. మల్లా బిడ్డెనే పుట్టింది అంటూ అయిష్టంగా.. నీరసంగా ఎవరితోనో చెప్తున్నాడు. ఆడపిల్ల పుడితే నేరమన్నట్టు కుటుంబ సభ్యులు రెండ్రోజుల దాకా తిండి కూడా తినలేదు. అప్పటికే ఇద్దరు అమ్మాయిలు. కొడుకులైతేంది.. కూతుైర్లెతేంది. ఇద్దరు చాలు అని భార్య అంటే.. లేదు. కొడుకు పుట్టిందాక ఏ ఆపరేషనూ వద్దు. ఆడపిల్లలు పెండ్లి చేసి ఓ అయ్యింటికి ఇస్తే వెళ్లిపోతారు. కానీ మనతో ఉండేందుకు ఒక్క కొడుకైనా కావాలిగా అని భావించి ఈసారైనా కొడుకు పుడుతుండేమో అని ఆశగా ఎదురుచూసిండు. ఇష్టం లేని బిడ్డ పుట్టిందని పురుడు పోయలేదు. తొట్టెలలో వేయలేదు. ఆర్నెళ్లలో ఏనాడూ చిన్నారి పాపను చూడలేదు. బిడ్డ పుట్టిన విషయం ఎవరితోనూ పెద్దగా షేర్ చేసుకోలేదు.
baby

డే2

కోఠీ మెటర్నిటీ హాస్పిటల్ కాంపౌండ్ అబ్జర్వేషన్.

ఒకతను తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. ఏమైంది అని ఎవరైనా అడిగితే.. ఏం లేదు. పని ఒత్తిడి వల్ల టెన్షన్స్ ఎక్కువయ్యాయి అని చెప్తున్నాడు. అతడికి పెండ్లయింది. ఒక పాప కూడా పుట్టింది. భార్య మరోసారి ప్రెగ్నెంట్. ఎలాగైనా ఈసారి కొడుకే పుడతడనే నమ్మకంతో ఉన్నాడు. ఇంకొన్ని గంటల్లో డెలివరీ. ఫ్యామిలీ అంతా టెన్షన్‌తో ఎదురుచూస్తున్నారు. ఈసారైనా గండం గట్టెక్కితే బాగుండు. లేకపోతే నలుగురిలో తిరగలేని పరిస్థితి. పెద్దన్నకు ఇద్దరు అమ్మాయిలే. చిన్నన్నకు ఇద్దరు అమ్మాయిలే. ఆశలన్నీ మాపైనే ఉన్నాయి. ఈసారి కూడా అమ్మాయే పుడితే ఇక మా వంశం ఇక్కడితో ఖతమైనట్లు. మొండి మొదలారినోళ్లు అని వాళ్లూ వీళ్లూ దెప్పి పొడుస్తుంటారు అనే ఆందోళన. ప్రసవం సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. గుండెవేగం పెరుగుతున్నది. ఇంతలో డెలివరీ అయ్యింది. లేబర్ రూమ్ నుంచి నర్స్ నవ్వుతూ ఆనందంతో బయటకు వచ్చింది. అబ్బాయి పుట్టాడు అని చెప్పగానే అక్కడున్న అందరి కళ్లలో వెయ్యి రెట్ల కాంతులు కనిపించాయి. ఏదో ప్రపంచాన్ని జయించినంత ఆనందంతో ఫోన్లు తీసి కొడుకు పుట్టిండు అని అందరికీ చెప్పేసిండు. ఫేస్‌బుక్.. వాట్సప్ ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు.
baby1

డే3

న్యూస్ అబ్జర్వేషన్.

చందానగర్‌కు చెందిన సంగీతకు నాలుగేండ్ల క్రితం పెండ్లి అయింది. పాప పుట్టింది. ఆడపిల్ల ఇష్టం లేని భర్త వేరొక యువతిని పెండ్లి చేసుకున్నాడు. సంగీత భర్తను నిలదీసింది. ప్రశ్నించినందుకు దారుణంగా కొట్టి ఇంట్లోంచి గెంటేశాడు.
పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్‌లోని కొత్బానా గ్రామం. రుబీనా బీబీ.. రజాన్‌లకు రెండేండ్ల కింద పెండ్లయింది. పుట్టబోయే బిడ్డ ఆడనా.. మగనా తెలుసుకునేందుకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాడు భర్త. ఆడపిల్ల అని తెలిసి రుబీనా గొంతులో యాసిడ్ పోశాడు.
-
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం రామకొండ గ్రామానికి చెందిన లావణ్యకు మొదటి.. రెండో కాన్పుల్లో ఆడపిల్లలే పుట్టారు. నిన్ను చేసుకున్నందుకు నీ దరిద్రం నా వెంట వస్తున్నది అని భర్త గొడవకు దిగడంతో లావణ్య ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నది.
-
ఖమ్మం పట్టణంలోని రంగనాయకుల గుట్టకు చెందిన సమ్మక్కకు ఆరుగురు ఆడపిల్లలే పుట్టడంతో వాళ్లను పోషించలేనని కల్లూరుకు చెందిన మణెమ్మ అమ్మాయిని కొనేందుకు సిద్ధమైంది. అడ్వాన్స్‌గా రూ. 5 వేలు చెల్లించింది కూడా.
baby2

అవనిలో సగమెక్కడ? :

కొడుకు పుడితే కోలాహలం చేసి.. కూతురు పుడితే కుంగుబాటుకు లోనయ్యే సంస్కృతి ఇప్పటికీ ఉనికిలో ఉండటం బాధాకరం. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా సుమారు కోటి 20 లక్షల మంది ఆడపిల్లల్లో పది లక్షల మంది తొలి పుట్టినరోజు వరకు కూడా బతకడం లేదని ఓ సర్వే చెప్తున్నది. దాదాపు 30 లక్షల మంది 15 ఏళ్లలోపే మరణిస్తున్నారట. పుట్టబోయేది ఆడబిడ్డే అని తెలుసుకుని కడుపులోనే చంపేసేవాళ్లు కొందరైతే.. పుట్టాక అస్పృశ్యతా భావంతో చంపేసేవాళ్లు ఇంకొందరు. సాంకేతికత.. విజ్ఞానం ఎంత అభివృద్ధి సాధించినా ఆడపిల్లల్ని బతికించడంలో మానవ ప్రయత్నం నానాటికీ ఎందుకు తగ్గుతున్నదో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.

-అస్పృశ్యత వల్ల ఆత్మన్యూనత :

ఆడపిల్లలపై వివక్ష క్రమంగా వాళ్లను ఆత్మన్యూనతా భావానికి గురిచేస్తుంది. పుట్టినప్పట్నుంచీ ఇంటా బయటా ఈ వివక్షను అనుభవించిన వాళ్లు తాము బలహీనులమనే భావనకు గురవుతున్నారట. అబ్బాయిలకంటే బలహీనులమనే ఆలోచనా ధోరణి అమ్మాయిల్లో ఎక్కువవుతుందని చెప్తున్నాయి సర్వేలు. అమెరికా, చైనా, ఈజిప్టు, భారత్‌తో సహా 15 దేశాలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే చేసింది. ఆయా దేశాల్లోని 14-15 ఏండ్ల వయసున్న పిల్లలు.. వారి తల్లిదండ్రులపై ఈ సర్వే నిర్వహించారు. ఆడపిల్ల అనే చులకన భావంతో చూడటంవల్ల తను అమ్మాయిని.. ఏమీ చేయలేను అనే భావన వారిలో ఏర్పడుతుందని ఈ సర్వే వెల్లడించింది.

మార్పు ఇంటి నుంచే రావాలి:

లింగ వివక్ష రోజురోజుకూ పెరిగిపోతున్నది. కారణం ఆలోచనా విధాన లోపమే. ఆడపిల్ల పుడితే ఏదో నేరం చేసినట్లు ఊహించుకుంటున్నారు. పిల్లలు పుట్టడమనేది ఓ సైన్స్ ప్రక్రియ. దానికి మరో మహిళను నిందించడం ఎంత వరకు సమంజసం? మార్పు అనేది ఇంటి నుంచి ప్రారంభం కావాలి. అమ్మాయి ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. ఎప్పుడున్నా ఆమెను నిందించడానికి.. ఒంటిపై చేయి వేయడానికి ఎవరికీ హక్కు లేదు. నిస్సహాయులుగా మార్చే అర్హత లేదు. ఆ నిస్సహాయతను ఆసరగా చేసుకుని వివక్ష చూపించే హక్కు కూడా లేదు.
సంధ్య, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు

ఆడపిల్ల అదృష్టం :

ఆడపిల్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. కేసీఆర్ కిట్స్ ఇస్తూ గర్భిణీ స్త్రీలకు.. పుట్టబోయే పిల్లలకు అండగా నిలుస్తున్నది. పెద్దయ్యాక పెండ్లి సమయంలో కల్యాణలక్ష్మీ.. షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి ఆడపిల్ల పుడితే అదృష్టంగా భావించేట్లు చేస్తున్నది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా రావాల్సిన అవసరం ఉన్నది. స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అందునా మనది స్త్రీని పూజించే దేశం. భవిష్యత్ తరాలు బాగుండాలంటే స్త్రీ-పురుష నిష్పత్తిని సమాంతరం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధిలో దూసుకెళ్తున్న మనం ఆడపిల్లలను కాపాడటంలో మాత్రం ఎందుకు వెనుకబడిపోతున్నామో ఆలోచించాలి. ఆడపిల్ల అంటే దురదృష్టం.. ఆర్థిక నష్టం కాదు. ఆడపిల్ల అదృష్ట దేవత.
Girl7

ఇతనిలా ఆలోచించండి :

పుణేలోని హదాప్సర్ ఏరియాలో ఓ మెటర్నిటీ హాస్పిటల్ ఉన్నది. నార్మల్ డెలివరీకి రూ. 10వేలు, సిజేరియన్‌కు రూ. 25వేలు తీసుకుంటున్నారు. కానీ ఆడపిల్ల పుడితే మాత్రం ఈ ఫీజులేవీ ఉండవు. అంతా ఉచితసేవలే. ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును. మనలా అతనూ ఆశ్చర్యపోయాడు ఆడపిల్లల నిష్పత్తిని చూసి. పరిస్థితిలో మార్పు తీసుకురాకపోతే ఆడజన్మకు ప్రమాదం తప్పదని భావించి ఈ ఉచిత సేవల నిర్ణయం తీసుకున్నాడు ఆ డాక్టర్. ఆ మనసున్న డాక్టరే గణేశ్ రాఖ్. లింగ వివక్షను రూపుమాపాలనే ఉద్దేశంతో ఆయన 2007 నుంచి ఈ సేవల్ని కొనసాగిస్తున్నారు. అబ్బాయి పుడితే ఆనందం.. అమ్మాయి పుడితే బాధ ఎందుకు? అంటారాయన. అలా ఆయన ఇప్పటి వరకు 432 మంది మహిళలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు.
Girl6

ఆడపిల్లను రక్షించుకుందాం రా:

చదువుకున్న వాళ్లు సైతం ఆడపిల్లలపై అస్పృశ్యతను ప్రదర్శిస్తుంటే ఏమీ చదువుకోని పల్లె ప్రజలు ఆడపిల్లల పట్ల సదుద్దేశంతో ఉన్నారు. అమ్మాయి పుడితే ఏకంగా పండుగనే చేసుకునేంత పరిణతి చెంది ఉన్నారు వాళ్లు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను చదివిస్తారు. ప్రశ్నార్ధకంగా మారుతున్న ఆడపిల్ల ఉనికిని కాపాడేందుకు కృషి చేస్తున్నారు. ఆడపిల్లను రక్షించుకుందాం రా అంటూ సాగుతున్న ఈ ఉద్యమం రాజస్థాన్‌లోని సికార్‌జిల్లా మెట్లపాస్‌లో పురుడు పోసుకున్నది. ఈ ఉద్యమం ఇప్పుడు ఆరు జిల్లాల్లో విజయవంతంగా సాగుతున్నది. ఉవ్వెత్తున సాగుతున్న ఈ ఉద్యమానికి ప్రేరణ మంజుదేవి. ఆమె ఓ అంగన్వాడీ కార్యకర్త. సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచింది. ఆడపిల్లల ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తూ ఆడపిల్లల్ని కన్నవారికి అభినందనలు తెలియజేయడం.. ఉత్తరాలు పంపడం ప్రారంభించింది.
Girl5

కనక మహాలక్ష్మి :

పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఇప్పటికీ కొంతమంది ఆ పసిప్రాణాలను కడుపులోనే చిదిమేస్తున్నారు. ఇటువంటి వాటిని నియంత్రించేందుకు కేరళలోని ఓ కౌన్సిలర్ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. ఆడపిల్ల పుడితే.. బహుమతిగా బంగారు నాణేన్ని ఇస్తున్నారు. కేరళలోని మలప్పురం జిల్లా కొట్టాక్కళ్ మున్సిపాలిటీలో మహిళలు ఆడపిల్లలకు జన్మనిస్తే.. వారికి బంగారు నాణాన్ని బహుమతిగా ఇస్తున్నారు అక్కడి మున్సిపల్ కౌన్సిల్ అబ్దుల్ రహీమ్. బాలికల నిష్పత్తిని కాపాడేందుకు ఈ వినూత్నమైన ఆలోచన చేశారు. రెండేళ్లుగా ఆయన వార్డులో ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు ఒక గ్రాము విలువ చేసే బంగారు నాణాన్ని బహుకరిస్తున్నారు.
Girl4

అమ్మాయి సరస్వతి :

ఆడపిల్లలకు అడ్డుగోడగా నిలిచిన అనేక ఆచారాలకు రాజస్థాన్‌లోని దౌలత్‌పూర్ అనే గ్రామంలో వనితా రాజ్వాత్ అనే అంగన్వాడీ కార్యకర్త స్వస్తి పలికించారు. ఆడపిల్లలకు ఖచ్చితంగా చదువు చెప్పించాలనే ఉద్యమానికి ఆమె శ్రీకారం చుట్టింది. ఆమె కృషి ఫలితంగా సొంతూర్లోని పాఠశాలలో 250 మంది విద్యార్థులుండగా వారిలో 200 మంది అమ్మాయిలే కావడం విశేషం. అదే విధంగా ప్రత్యేకంగా ఓ నర్స్‌ను నియమించి బాలికల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. బాలికలను కనీసం 12వ తరగతి వరకు చదివించాలనే ఆమె ప్రయత్నం ఫలించడంతో అక్కడ బాలికల విద్యాశాతం గణనీయంగా పెరిగిందట.
Girl3

ఆడపిల్లకూ హక్కులుంటాయి:

మనది పితృస్వామ్య దేశం. ఆధునిక కాలంలోనూ వారసులు.. వంశోద్ధారకులు అనే మూఢ విశ్వాసాల్లోనే ఇంకా బతుకుతున్నారు. కొడుకయితే మన దగ్గరే ఉండి.. మనం చనిపోయాక తలకొరివి పెడతాడు అని ఆలోచిస్తున్నారు. కానీ వెనుకటి పరిస్థితులే లేవు ఇప్పుడు. అబ్బాయిల్లెక్కన అమ్మాయిలూ పెండ్లయినా కూడా తల్లిదండ్రుల బాధ్యతలు చూసుకునే అవకాశం కల్పించొచ్చు. వారసత్వ బాధ్యతలు తీసుకోవచ్చు. ఇంకో విషయమేంటంటే అమ్మాయిలు పెండ్లి చేస్తే అత్తారింటికి వెళ్లి ఉండొచ్చుగానీ.. తల్లిదండ్రులపై కొడుకుల కంటే వాళ్లకే ఎక్కువ ప్రేమ.. బాధ్యత ఉంటాయి. కాబట్టి ఆడపిల్ల అనే విషయంలో అవగాహన ఏర్పడాలి. ఆడపిల్లలకూ అన్ని హక్కులుంటాయి.


బాలికోత్సవం :

రాజస్థాన్‌లోని రాజ్సమంద్ జిల్లాలో పిప్లాంత్రి అనే గ్రామం ఉన్నది. ఆడపిల్ల పుట్టిందంటే గ్రామంలోని ప్రజలంతా సంతోషంగా అడవికి వెళ్లి ఆ అమ్మాయి పేరుమీద 111 మొక్కలు నాటుతారు. కేవలం మొక్కలు నాటి వదిలేయడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకుంటారు. అంతేకాదు.. పుట్టిన ప్రతీ అమ్మాయికి ఆర్థిక భద్రతను కలిగించేందుకు తమ వాటాగా రూ. 21000లు ఇస్తారు. అమ్మాయి తండ్రి వాటాగా రూ. 10000 మొత్తం ఇస్తారు. ఈ నగదునంతా కలిపి అమ్మాయి పేరు మీద 20 సంవత్సరాలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చేవరకు పెండ్లి చేయమనీ.. ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తామని తల్లిదండ్రులతో ప్రమాణం చేయిస్తారు. ఇలా ఇప్పటి వరకు పిప్లాంత్రి గ్రామస్తులు 2 లక్షల 50 వేల మొక్కలు నాటారు.
Girl1

చైతన్యం దిశగా :

అతని పేరు అశోక్ పవార్. మహారాష్ట్రలోని బీద్ జిల్లా కుంభెఫల్ గ్రామం. బీద్ జిల్లాలో లింగ నిర్దారణ పరీక్షలు, భ్రూణ హత్యలు ఎక్కువయ్యాయి. ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే చాలు ఆ శిశువును భూమిపై పడకముందే అంతమొందిస్తున్నారు. ప్రజల్లో అలాంటి దురాచారాన్ని పోగొట్టి వారిని చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో అశోక్ పవార్ అనే బార్బర్ తన సెలూన్లో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. గ్రామంలో ఎవరికైనా ఆడపిల్ల పుడితే ఆ ఇంట్లో ఉండే మగవారికి 6 నెలల పాటు ఉచితంగా కటింగ్.. షేవింగ్ చేస్తానని ప్రకటించాడు. అంతేకాదు ఆడపిల్ల పుడితే వారికి ఉచితంగా పుట్టు వెంట్రుకలు తీస్తానని కూడా చెప్పాడు. తన షాపు ఎదుట ఓ బోర్డు కూడా రాయించడంతో ఊరి ప్రజల్లో మార్పు తీసుకురాగలిగాడు. ఈయనలా ఆలోచిస్తే ప్రతీ ఊరు.. ప్రతీ వాడ ఆడపిల్లల ముసిముసి నవ్వులతోమురిసిపోతుంది.
Girl


స్త్రీ-పురుష వ్యత్యాసం


LIST

దీన్నిబట్టి పాశ్చాత్య దేశాలకంటే కూడా ఇండియాలోనే ఆడపిల్లలపై చిన్నచూపు.. నిర్లక్ష్యం చేస్తున్నాయని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే గత మూడు దశాబ్దాల్లో దాదాపు కోటి 20 లక్షల మంది ఆడపిల్లల్ని అబార్షన్ల ద్వారా చంపేశారన్నది మరో లెక్క. ఆడపిల్లలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో భారత్ 4వ స్థానం.. లింగ వివక్షలో 127వ ర్యాంక్.

1793
Tags

More News

VIRAL NEWS