ఒకప్పటి వెండికొండ యెల్లకొండ


Sun,April 16, 2017 02:01 AM

ఆదిదంపతులకు నిలయమై అందమైన ప్రకృతి నడుమ ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతూ.. అద్భుతమైన కట్టడాలతో అలనాటి కాకతీయ కళావైభవానికి ప్రతిరూపంగా నిలుస్తూ.. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా, ఎన్నో జ్ఞాపకాలను, మధుర ఘట్టాలను తనలో దాచుకున్న.. యెల్లకొండ ఎదలోని ముచ్చట్లివి..ఎక్కడ ఉంది? ఎలా వెళ్లాలి?


వికారాబాద్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఊరు. హైదరాబాద్ నుంచి రైలు మార్గం లేదా రోడ్డు మార్గం ద్వారా వికారాబాద్ చేరుకుని.. అక్కడ నుంచి ఆటోల్లోనూ, లోకల్ బస్సుల్లోనూ వెళ్లవచ్చు. మండల కేంద్రం నవాబ్‌పేట నుంచి కూడా రవాణా సౌకర్యం ఉంటుంది. శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌లో దిగి, పది కిలోమీటర్లు ఆటో లేదా బస్సు ద్వారా యెల్లకొండకు చేరుకోవచ్చు.
ఒకప్పటి రంగారెడ్డి జిల్లా, నేటి వికారాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామం యెల్లకొండ. మారుమూల గ్రామమంటే .. చిన్న పల్లెటూరేం కాదు. చుట్టుపక్కల నాలుగైదు గూడాలను, తండాలను తన హద్దులోనే కలిపేసుకున్న మేజర్ గ్రామపంచాయితీ ఇది. ఎన్నో రాజవంశాల ఏలుబడిలో సిరిసంపదలతో తులతూగింది.

కొండే హద్దు..


యెల్ల అంటే హద్దు. కొండ అంటే గుట్ట. గుట్టనే హద్దుగా కలిగిన ఊరు కాబట్టి.. దీనికి యెల్లకొండ అనే పేరు వచ్చినట్టు స్థానికులు చెప్పారు. పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉండే కైలాసాన్ని వెండికొండగా అభివర్ణిస్తున్నాయి మన పురాణాలు. ఇక్కడి గుట్టపై ఆదిదంపతులు వెలిసినందునే, ఈ ఊరిని వెండికొండగా కూడా పిలిచినట్టు తెలుస్తున్నది.
Village

వెయ్యేళ్ల చరిత్ర..


ఈ ప్రాంతంలో జైనులు, బౌద్ధులు ఎక్కువ నివసించే వారని తెలుస్తున్నది. గుట్టపై కనిపించే జైన విగ్రహాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 12వ శతాబ్దంలో పోట్లచెరువు (ప్రస్తుతం పటాన్‌చెరువు)ను పరిపాలించిన రాజు జైన మతాన్ని ఆచరించేవాడు. ఆయన భార్య సుగ్గలదేవి వీరశైవురాలు. వీరిద్దరి మధ్య చెలరేగిన కలహాలు విపరీతాలకు దారితీశాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఇరు వర్గాలకు చెందిన పండితుల మధ్య పాండిత్య పోటీలు నిర్వహించి.. ఓడిన వర్గం రాజ్యాన్ని వదిలి వెళ్లాలనే షరతు పెట్టుకున్నారట ఈ దంపతులు. ఈ పోటీల్లో వీరశైవులు విజయం సాధించడంతో.. ఒప్పందం ప్రకారం జైనులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. జైనుల స్థావరాలన్నింటినీ వీరశైవులు చేజిక్కించుకున్నారు. అంతే కాదు.. వారికి సంబంధించిన విగ్రహాలు, నిర్మాణాలను ధ్వంసం చేశారనే ప్రచారం కూడా ఉంది. గుట్టపై ధ్వంసమై కనిపించే జైన విగ్రహాలు, ఊరి మధ్య శిథిలావస్థకు చేరిన శంభులింగేశ్వరాలయం దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెబుతారు గ్రామస్థులు. ఆ సమయంలో ఇక్కడికి వచ్చిన సుగ్గలదేవి శైవమత అభివృద్ధికి నాంది పలికినట్టు వారు చెప్పారు.

దేవాలయ ప్రత్యేకత


ఏ శివాలయంలో అయినా, పరమేశ్వరుడు ఏక లింగావతారంలో దర్శనమిస్తాడు. కానీ ఇక్కడి గుర్భగుడిలో మూడు లింగాలు ఒకేచోట దర్శనమిస్తాయి. బ్రహ్మ, విష్ణువులు సహితం మహేశ్వరుడితో కలిసి ఇక్కడ లింగ రూపంలో వెలిశారని, అందుకే మూడు లింగాలు ఉన్నాయని ఊరి పండితులు చెబుతున్నారు. ఇక్కడ అమ్మవారి విగ్రహానికి ఒకే చేయి ఉండడం మరో వింత. ఆ విపరీతానికి కూడా రజాకార్ల విధ్వంసమే కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు గ్రామస్థులు. ఏటా శివరాత్రి తర్వాత పదో రోజు నుంచి.. వైభవోపేతంగా జాతర మహోత్సవాలు జరుగుతాయిక్కడ. గుట్టపై కొద్ది దూరంలో ఒక బండపై కనిపించే కొన్ని లోతైన అచ్చులను నంది పాదాలు, రథచక్రాలవిగా ప్రజలు నమ్ముతారు. కొండపై పైభాగంలో విశాలమైన ఖాళీ ప్రదేశంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి.
Village1

Village2

కాకతీయుల కళావైభవం


కాకతీయులు మొదట జైనులు. అనంతరం వారు శైవులుగా మారారు. ఊరి మధ్యలో ఉన్న పురాతన శంభు లింగేశ్వర ఆలయం.. కాకతీయుల కళావైభవానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నది. ఆలయం నిర్మాణ శైలి అచ్చం ఓరుగల్లులోని రామప్ప దేవాలయాన్ని తలపించడం.. చూడముచ్చట గొలుపుతుంది. అయితే సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఈ అద్భుత మందిరం పందుల నివాసంగా మారిపోవడం బాధాకరం. ఆలయం బయటే అద్భుతంగా చెక్కబడిన నాగదేవత శిల్పాలు పడి ఉన్నాయి. స్తంభాలు చెక్కిన తీరు, వాటిపై అందమైన బొమ్మల్ని నెలకొల్పిన శైలి కాకతీయులు.. ఈ దేవాలయ నిర్మాణంపై తీసుకున్న శ్రద్ధను ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నది.

శ్రీశైలం దాకా సొరంగం..


గుట్టపై అమ్మవారి ఆలయం పక్కనే ఒక సొరంగం ఉంది. రెండు ద్వారాలు కలిగిన ఈ సొరంగం గురించి.. చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇది సంగారెడ్డి జిల్లా మాందాపురం పార్వతీ పరమేశ్వరుల గుట్ట వరకు ఉన్నదని, శ్రీశైలం వరకు మరో దారి ఉన్నదని.. పెద్దలు చెప్పేవారట. అయితే మనిషి పాకుతూ వెళ్ల గలిగేంత సందు మాత్రమే ఉన్న సొరంగంలోకి నాలుగు అడుగుల దూరానికి మించి ఎవ్వరూ ముందుకెళ్లే సాహసం చేయలేదట. అక్కడ పెద్ద సర్పం తిరుగుతూ ఉంటుందనే ప్రచారం కూడా ఉంది. అయితే ఆత్మరక్షణ కోసం అప్పటి పాలకులే ఆ సొరంగాన్ని తవ్వించి ఉంటారని చరిత్రకారులు చెబుతున్నారు.
Village3

జైనులు, బౌద్ధుల కాలం నాటి ఎన్నో ఆధారాలు మా ఊరిలో కనిపిస్తున్నాయి. ఎక్కడ తవ్వకాలు జరిపినా శివలింగాలు, శిల్పకళలు బయట పడుతున్నాయి. మరింత లోతైన పరిశోధన జరిపేందుకు పురావస్తు శాఖ అధికారులు చొరవ చూపాలి.


మా ఊరికి హద్దుగా ఉన్న గుట్టపై వెలసిన శివాలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడ బయల్పడిన గుహలు, విగ్రహాల గురించి అధ్యయనం చేస్తే, మా ఊరి చరిత్ర మరింత తెలిసే అవకాశం ఉంది.


గ్రామ స్వరూపం
మొత్తం జనాభా: 4,266
పురుషులు : 2,184
మహిళలు : 2,082
విస్తీర్ణం : 2,102 హెక్టార్లు
మండలం: నవాబ్‌పేట
జిల్లా: వికారాబాద్
పిన్ కోడ్: 501203
ఊరికి తూర్పున: ముభారక్‌పూర్
పడమట: లింగంపల్లి
ఉత్తరాన: మైతాప్‌ఖాన్ గూడ
దక్షిణాన: గొల్లగూడ
దగ్గరలో ఉండే పట్టణాలు:
శంకర్‌పల్లి, వికారాబాద్, మోమిన్‌పేట్

2336
Tags

More News

VIRAL NEWS