ఐఎంఎఫ్ తొలి మహిళచీఫ్ ఎకనామిస్టుగా గీతా గోపీనాథ్


Sun,January 20, 2019 02:54 AM

Gita-Gopinath
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనామిస్టుగా ప్రముఖ ప్రవాస భారతీయ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ బాధ్యతలు చేపట్టారు. ఆమె ఈ పదవిలో నియమితులైన తొలి మహిళ కావడం విశేషం. అమెరికా పౌరసత్వం ఉన్న గీతా గోపీనాథ్.. హార్వర్డ్ వర్సిటీలో ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. డిసెంబర్ 31న పదవీ విరమణ చేసిన ఐఎంఎఫ్ రీసెర్చ్ విభాగం ఎకనామిక్స్ కౌన్సిలర్, డైరెక్టర్ మౌరీ ఓబ్ స్టెఫెల్ స్థానంలో ఆమె నియమితులయ్యారు. గతేడాది అక్టోబర్ 1న గీతా గోపీనాథ్ నియామకాన్ని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టీన్ లగార్డ్ ప్రకటించారు.

- మధుకర్ వైద్యుల

47 ఏండ్ల గీతా గోపీనాథ్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించగా, ఈమె ఐఎంఎఫ్ 11వ ప్రధాన ఆర్థికవేత్తగా సేవలు అందించనున్నారు. ఐఎంఎఫ్‌లో ఈ పదవికి ఎంపికైన రెండో భారతీయురాలు, తొలి మహిళ గీతనే. ఆమెకు ముందు భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేశారు. గీతా గోపీనాథ్ నియామకం గురించి వెల్లడిస్తూ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టీన్ లగార్డే.. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్తలలో గీతా ఒకరు. ఆమె పాండిత్యం, మేధస్సు సాటిలేనివి. ఆర్థికశాస్త్రంలో ఆమెకు విస్తృతమైన అంతర్జాతీయ అనుభవం ఉంది అని తెలిపారు.

కోల్‌కతాలో పుట్టి..గీత గోపీనాథ్ పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో డిసెంబర్ 8, 1971న జన్మించారు. మైసూర్‌లోని నిర్మల్ కాన్వెంట్ స్కూల్‌లో తన ప్రాథమిక విద్యను పూర్తిచేశారు. ఆమె తల్లిదండ్రులు టీవీ గోపినాథ్, వీసీ విజయలక్ష్మీలు. వీరు కేరళలోని కన్నూరుకు చెందిన వారు. వారి ఇద్దరు అమ్మాయిల్లో గీత పెద్దది.

ఆర్థిక సలహాదారుగా...

గీతా గోపీనాథ్ 2016లో కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ఈ నియామకం వివాదాస్పదమైంది. మార్కెట్, ఉదారవాద విధానాలకు ప్రాధాన్యం ఇచ్చే గీతా గోపీనాథ్‌ను ఆర్థిక సలహాదారుగా నియమించడాన్ని కొందరు కమ్యూనిస్టు నాయకులు తప్పుపట్టారు. కాగా గీతా గోపీనాథ్.. ఎక్స్చేంజ్ రేట్లు, వాణిజ్యం, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, ద్రవ్య పరపతి విధానం, రుణాలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్.. సంక్షోభాలు వంటి వివిధ ఆర్థికాంశాలపై 40 వరకూ పరిశోధన పత్రాలను సమర్పించారు.

ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేషన్

గీత గ్రాడ్యుయేషన్ వరకు భారతదేశంలోనే చదువుకున్నారు. ఆమె 1992లో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లేడీ శ్రీరామ్ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో హానర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, 1994లో వాషింగ్టన్ వెళ్లారు. 1996 నుంచి 2001 వరకు ప్రిన్స్‌స్టన్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. ఆ తర్వాత 2001 నుంచి 2005 వరకు చికాగో యూనివర్సిటీలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా పని చేశారు. 2005లో ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. 2010లో ఆమె అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 2015 నుంచి ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనమిక్స్‌లో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గీతా గోపీనాథ్ అమెరికన్ ఎకనామిక్ రివ్యూ పత్రికకు సహసంపాదకురాలిగా ఉన్నారు. ఆమె నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్‌లో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ మాక్రోఎకనామిక్స్ ప్రోగ్రామ్ కోడైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అరుదైన గౌరవం

ఈ పదవి దక్కడం చాలా అరుదైన గౌరవంగా భావిస్తున్నానని గీతా గోపీనాథ్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచీకరణ నుంచి వెనక్కి తగ్గడం, సుంకాలు పెంపు పెద్ద సవాళ్లుగా మారాయని, బహుళజాతి సంస్థల (ఎంఎన్సీ)కు ఇబ్బందులు పెరిగాయని గీత తెలిపారు. ది హార్వర్డ్ గెజిట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్రిస్టిన్ లగార్డేపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచంలోని మహిళలందరికీ ఆమె ఆదర్శమని కీర్తించారు. కాగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)పై స్పందిస్తూ టెక్నాలజీ రంగంలోని సంస్థల్లోకే ఎఫ్‌డీఐ అధికంగా వెళ్తున్నదని, ఈ క్రమంలో జాతీయ భద్రత, అంతర్జాతీయ సంపద చోరీ వంటి వాటిపై ఆందోళనలు పెరుగుతున్నాయన్నారు. వడ్డీరేట్లను అమెరికా సాధారణ స్థాయికి తీసుకొస్తున్న నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పరిపుష్ఠిపైనా ఆందోళనలు నెలకొన్నాయని చెప్పారు. విదేశీ మారకపు రేట్లు, డాలర్ నిల్వలు, విదేశీ రుణాలు వంటివి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నట్లు తెలిపారు.
Gita-Gopinath1
ప్రపంచ దేశాలు గ్లోబలైజేషన్ నుంచి వెనక్కి తగ్గుతుండటాన్ని నివారించడం ఐఎంఎఫ్ ముందున్న పలు ప్రధాన సవాళ్లలో ఒకటని గీత తెలిపారు. గ్లోబలైజేషన్‌లో భాగంగా గడిచిన 50, 60 ఏళ్లలో ప్రపంచ దేశాలు టారిఫ్‌లు తగ్గించుకోవడం, వాణిజ్యం పెంచుకోవడం వంటివి చేశాయి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా గ్లోబలైజేషన్ నుంచి ప్రస్తుతం వెనక్కి తగ్గుతున్నాయి. చైనా తదితర దేశాలపై అమెరికా టారిఫ్‌లు విధించడం, ఆయా దేశాలు కూడా అదే రీతిలో స్పందించడం కొన్ని నెలలుగా చూస్తున్నాం. దీంతో వాణిజ్య విధానాలపై అనిశ్చితి పెరుగుతున్నది. ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యం పెరగడం వల్ల అంతర్జాతీయంగా పేదరికం తగ్గినా.. దాని ప్రభావంతో అసమానతలు పెరిగిపోయాయన్న ఆందోళన ఉంది. ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు తగు చర్యలు అవసరం అని ఆమె పేర్కొన్నారు.

845
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles