ఏదో మనసు పడ్డాను కానీ....


Sun,November 12, 2017 12:41 AM

అందమైన మనసులో అంత అలజడెందుకో.. ఎందుకో.. ఆమెను తొలిసారి చూసినప్పటి నుండి ఎన్నిసార్లు పాడుకున్నానో.. చూడగానే ఆకట్టుకునే మొహం.. ఎప్పుడూ చెరగని చిరునవ్వు.. మనిషి కాస్తా పొట్టి. అప్పటికీ నా ఇంటర్ అయిపోయి రెండేళ్లయింది. ప్రైవేటు స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ డిస్టెన్స్‌లో డిగ్రీ చేస్తున్నాను. అప్పటికీ ఆమెను చూసి సంవత్సరం అవుతుంది. ఆ చూపు ఇంకా బాగా గుర్తు.నేను సోషల్ వర్కర్‌ను కూడా. నేను పదవ తరగతి చదువుతున్నప్పుడే స్నేహితులతో కలసి ఒక సామాజిక సంస్థను స్థాపించాను. దాని ద్వారా స్కూళ్లల్లో పిల్లలకు గేమ్స్, స్పోర్ట్స్, టాలెంట్ టెస్ట్ ఇలా రకరకాల పోటీలు నిర్వహించే వాళ్లం. అలా ప్రతి ఏడాదిలాగే అప్పుడు కూడా వాళ్ల స్కూల్‌లో గేమ్స్ పెట్టాము. చివరిరోజు బహుమతులు ఇచ్చేరోజు.

ఉన్నట్టుండి ఒక మెరుపు కళ్లను తగులగానే కనురెప్పలు ఒక్కసారిగా మూసుకున్నాయి. ఒకటి.. రెండు.. ఒక ఇరవైమంది పిల్లల వెనుక ఒకింత అందంతో.. చిన్నపాటి మందం (పొట్టితో పాటు అప్పుడు నాకంటే లావు)తో తెలుపు రంగు అంగి, ఆకుపచ్చ లంగ, కాషాయపు రంగు రిబ్బన్లతో రెండు జడలు. ఒకమారు కలిసిన అందం..అలలాగా ఎగిసిన కాలం కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే పాట నా చెవుల్లో రింగు మంటుంది. ఆమె కూడా ఒకసారి నన్ను చూసి చిన్నగా నవ్వి తలదించుకుంది. అ తరువాత రెండు మూడు సార్లు కనిపించినా చూసీ చూడనట్టే వెళ్లిపోయింది. ఆ తరువాత రెండు సంవత్సరాలు అలా గడచిపోయాయి. ఒకరోజు రాజేశం సార్ అని నా కొలీగ్ ఒకరింటికి వెళ్లా. ఇద్దరం ముందు రూమ్‌లో మాట్లాడుకుంటున్నాం. లోపల బెడ్‌రూం నుండి ఇద్దరమ్మాయిల మాటలు, నవ్వులు, అరుపులు ఏకధాటిగా వినవస్తున్నాయి. ఒకరు సార్ చెల్లెలు అని అర్థమవుతుంది. మరొకరు..? ఏమో లే వారి స్నేహితురాలో, బంధువో అనుకున్నా. ఒక పది నిమిషాల తరువాత వారిద్దరూ ముందు రూములోకి వచ్చారు. అనుకోకుండా నా చూపు అటువైపు తిరిగింది. అదే మెరుపు ఈసారి కుర్తా, పైజామాలో. నన్ను చూడగానే ఆశ్చర్యంతో నోరు తెరిచి వెంటనే మళ్లీ బెడ్‌రూంలోకి వెళ్లిపోయింది. ఆమె వెనుకే మిత్రుని చెల్లి కూడా. మరో పది నిమిషాల ఉత్కంఠ తర్వాత తను నవ్వుకుంటూ వెళ్లిపోయింది.
ఈలోపు మా ఫ్రెండ్ చెల్లి బయటకు వచ్చి అవును చిన్నా.. ఇపుడు వెళ్లిన అమ్మాయి నీకు తెలుసా? సూటిగా అడగగానే ఏం చెప్పాలో అర్థం కాలేదు. అసలు ఏం చెప్పిందో, ఏంటో అని ఆలోచిస్తుండగానే.. పర్లేదు చెప్పు.. తను నీకు ఒకటి చెప్పమంది అంది. ఆఁ.. తెలుసు.
LOVE

ఏదో స్కూల్లో చదివేది. అప్పుడు చూశా. అవును ఇంతకు ఎం చెప్పమంది. అని అడిగా..స్కూల్ కాదు నాయనా.. ఇప్పుడామె డిగ్రీ చదువుతుంది. సరే లే..తను వాళ్లింటికి టీ తాగడానికి రమ్మంది. ఏదో మాట్లాడుతుందట. అంది తను. వాళ్లింటికా నేనా? అయినా వాళ్లిల్లు నాకు తెలియదు. అన్నాను. ఒకింత ఆశ్చర్యం నిండిన ఆనందంతో..మీరా.. మమ్మీనా అని సంతూర్ యాడ్ చేసింది చాలు కానీ.. పద అంది. ఎక్కడికి? నా ప్రశ్న. అబ్బ పదవయ్యా బాబు పదా! సదాలా చెయ్యెత్తే సరికి లేచి నిలబడ్డా. ఆమె ముందు నడిచింది. ఆమె వెనుకాలే నేను. ఆశ్చర్యం.. మా స్నేహితుడి ఇంటి ఎదురుగానే వాళ్లిల్లు. వాళ్లింటికి చాలా సార్లు వచ్చా. కానీ ఎప్పుడూ కనిపించలేదు నాకు.వాళ్లింట్లోకి అడుగుపెట్టా.. వాళ్లింట్లో ఎవరు లేరు. ఒక్కతే ఉంది. చుడీదార్ మారింది. రండి చిన్నా.. కూర్చోండి అంది. నా పేరంటే మా ఏరియాలో చాలామందికి తెలుసు కనుక అలాగే అనుకున్నా. కానీ తన పేరు మాత్రం ఇప్పటికీ అడగలేదు. వెళ్లి తల పై కెత్తకుండా కూర్చున్న.తను ఇద్దరికీ టీ తీసుకొచ్చింది. తను తెచ్చుకుంది. ముగ్గురం తాగుతున్నాం. ఫ్యాన్ తిరుగుతున్న శబ్ధం తప్ప అంతా నిశ్చబ్దం. తనేం చేస్తుందా అని తల పైకెత్తి చూశా. నన్నే చూస్తున్నది. కంగారుగా నేను ఎటో చూస్తున్నట్లు నటించా. మరో రెండు నిమిషాలు గడిచాయి. హాం మమ్మీ...అంటూ మాకొలిగ్ చెల్లెలు తననెవరో పిలుస్తున్నట్లు లేచి నిలబడి ఒకే బై మళ్లీ వస్తా అంటూ పరిగెత్తింది. ఇప్పుడు ఇద్దరమే అక్కడ. నా గుండె వేగం పెరుగుతుంది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.

ఓ మీ పేరేంటీ? అని అడిగా?అదేంటీ ఇంతవరకు నా పేరే తెలియదా? అంది ఆశ్చర్యంగా.. నా నుండి మౌనం.నాలుగు సంవత్సరాలుగా ఎక్కడ కనపడినా అలాగే చూస్తుండిపోతారు. మాట్లాడుతారేమో అనుకుంటే మాట్లడరు. పెద్ద పెద్ద పోగ్రామ్స్‌లో స్పీచ్‌లు మాత్రం బాగా ఇస్తారు తను మాట్లాడుకుంటూ పోతుంది. ఒక్క విషయం సూటిగా అడగనా? అంది. నేను తలెత్తి ఆశ్చర్యంగా చూశా.మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ప్రశ్న సూటిగా గుండెను దాటి నా మనసును తేలిక చేస్తూ...గాలిలో తేలిపోయేలా చేసింది. నా కళ్ల నుండి ఒక మెరుపు.. అప్పుడు నాకు తెలియకుండానే... ఐ లవ్ యు శైలు అన్నాను.ఒరేయ్ మొద్దు..నాలుగు సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నా..నీవెప్పుడు చెప్తావో అని. ఇన్నాళ్లకైనా చెప్పావు. ఐ లవ్ టూ.. అంటూ నా ముందుకు వచ్చి నా తల ఎత్తి నుదుటిమీద కిస్ చేసింది.హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది పాట లయబద్ధంగా సాగుతుండగా మా ప్రేమ ప్రయాణం మరో మూడేళ్లు సాగింది. ఈ మూడేళ్లలో ఎన్నో అందమైన జ్ఞాపకాలు, మధురమైన ముచ్చట్లు, మరిచిపోలేని అనుభూతులు.నీవు ఆ అమ్మాయిని చేసుకుంటే మేము ఉరివేసుకుని చచ్చిపోతాం నా ప్రేమ విషయం మా ఇంట్లో చెప్పగానే మా అమ్మ నాన్నల నోటి నుంచి వచ్చిన తొలిమాట. చాలా చెప్పి చూశా. మా ఫ్రెండ్స్‌తో కూడా చెప్పించా. నేనూ చస్తానని బెదిరించా. ఒకసారి ఆ ప్రయత్నమూ చేశా. కానీ అమ్మాయి వాళ్ల అమ్మానాన్నలది ఇంటర్‌కాస్ట్ మ్యారేజ్ అన్న ఒక కారణమే మా పెళ్లికి అడ్డయింది. విషయమంతా శైలుకు చెప్పా. ఇద్దరం ఎటన్నా వెళ్లి పెళ్లి చేసుకుందాం అన్న. మా అమ్మనాన్నలకు నీవంటే ఇష్టమే. కానీ ఏదో ఒక ఉద్యోగం లేకుండా అంటే వాళ్లు కూడా ఒప్పుకోవడం లేదు అంది. ప్రస్తుతం స్కూల్లో పని చేస్తున్నా కదా? అన్నాను.నీవు చేసే టీచర్ ఉద్యోగానికి ఇద్దరం బతుకగలమా? ముక్కుసూటిగా అడిగింది. ఎక్కడో నా ఇగో దెబ్బ తింది. అక్కడి నుండి లేచివచ్చా. కష్టపడి హైదరాబాద్‌లో ఒక చిన్న ఉద్యోగం సంపాదించా. ఆరునెలల పాటు ఇంటికి కూడా వెళ్లలేదు. తర్వాత మా ఊరేళ్లా. నేనూ ఉద్యోగం చేస్తున్నా.. అని చెప్పాలని వాళ్లింటికి వెళ్లా. ఇంటికి తాళం వేసి ఉంది. పక్కవారిని అడిగా. వాళ్ల నాన్నకు ట్రాన్స్‌ఫర్ అయి వేరే ఊరెళ్లారని చెప్పారు. ఎంత ప్రయత్నించినా తన మొబైల్ నంబర్ కూడా తెలుసుకోలేకపోయా.

బాధతో వెనుదిరిగి హైదరాబాద్ వచ్చేశా.ఒకరోజు ఆఫీసులో పనిలో ఉండగానే నా మొబైల్ రింగైంది. ఎత్తి హాలో అన్నా..హ్యాఫీ బర్త్ డే చిన్నా... అదే వాయిస్ ఎస్. శైలుదే.. ఆశ్చర్యం, ఆనందం, బాధ...అన్నీ కలగలసిన గొంతుతో శైలు అన్న. హు తొందరగానే గుర్తు పట్టావే. అంది. ఎక్కడున్నావు? అని అడిగా. హైదరాబాద్ కృష్ణనగర్ అంది. అవునా? నేను ఇక్కడే ఉన్నా ఎక్కడ రూమ్ అని అడిగా.. అడ్రస్ చెప్పింది. వెంటనే వెతుక్కుంటూ వెళ్లా.. వారి రూముకు దగ్గరగా ఉన్న ఒక జ్యూస్ సెంటర్‌లో కూర్చుని ఉంది. మనిషి చాలా బక్కగా అయ్యింది. కానీ అదే అందం, నవ్వు....
ఏంటీ శైలు అలా చేశావు. కనీసం నాకేం చెప్పకుండా అలా వెళ్లిపోయారు. నేనంటే ఇష్టం లేదేమోనని ఎంత బాధపడ్డానో తెలుసా? అని ప్రశ్నలు కురిపించా.తన కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా..నువు ఆ రోజు ఇంట్లో నుండి వెళ్లిపోయిన తర్వాత మా ఇంట్లో చాలా గొడవైంది. ఎలాంటి ఉద్యోగం లేని వాడికి ఇవ్వమని చెప్పేశారు. మన ప్రేమ విషయం అందరికీ తెలుసు కనుక ఇంకా అక్కడే ఉంటే బాగుండదని డాడీ ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. నేను ఎంత చెప్పినా వినలేదు. అంది.పోనీలే. ఇప్పటికైనా మంచిదే. ఇప్పుడు మా అమ్మనాన్నలతో పనిలేదు. నా కాళ్లమీద నేను బతుకుతున్నా. నీవు కూడా ఏదైనా జాబ్ చేసుకుంటే ఇద్దరం హాయిగా బతుకొచ్చు. అన్నాను. మీ నాన్నతో నేను మాట్లాడుతా అన్నాను.సరే ముందు నేను మాట్లాడుతా. ఆ తర్వాత వీలును బట్టి నువు మాట్లాడుదువు అంది. సరే అన్నాను. అలా ఒక నెల గడిచింది. రెండు మూడు సార్లు బయటే కలుసుకున్నాం. కానీ తను ఇంతకు ముందున్నంత ఫ్రీగా ఉండడం లేదు. సరే మనసు బాలేదనుకున్నా. తరువాత రెండు మూడు రోజులు కలువలేదు. ఒకరోజు నేను ఆమెకు కాల్ చేశా.చిన్నా...దయచేసి ఇక ముందు కాల్ చేయకు నాకు మ్యారేజ్ సెటిలైంది.

అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తాడు. రేపే పెళ్లి అని పెట్టేసింది.షాక్..అదేంటీ, నెలరోజులుగా కలిసి తిరుగుతున్నా.. ఎప్పుడూ చెప్పలేదు.. నా కాళ్లకింది భూమి కదిలిపోతున్నట్లు అనిపించింది. ఆఫీసులో కూర్చున్న వాణ్ని కూర్చున్నట్లే టేబుల్‌మీదా ఒరిగి పోయా. అర్థగంట తర్వాత మెలకువ వచ్చింది. నా కొలిగ్స్ అందరూ నా చుట్టూ చేరి నాకు సపర్యలు చేస్తున్నారు.నాకేమయింది? అని అడిగా.. ఏమో ఉన్నట్లు ఉండి కళ్లు తిరిగి పడిపోయావు అన్నారు. శైలు లేదన్న బాధను ఎన్నిరోజులు అనుభవించానో.. ఎన్నిసార్లు ఏడ్చానో..ఎన్ని ఒంటరితనాలు అనుభవించానో నాకు తెలుసు.. రెండు సంవత్సరాలు గడిచాయి. అన్నీ మరిచిపోయి నేనూ పెళ్లి చేసుకున్నా. ఇప్పటికీ ఐదు సంవత్సరాలైంది. ఇద్దరు పిల్లలు, భార్యతో ఆనందంగా ఉన్నా. కానీ నాకో విషయం తెలిసీ బాధనిపించింది. శైలు భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీరు అని చెప్పింది అబద్దమని, తను కేవలం మెడికల్ రిఫ్ అని, తను కూడా ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా చేస్తుందని, వారికి పెళ్లయి ఇన్నేండ్లయినా ఇంకా పిల్లలు లేరని. కానీ ఆమె నన్ను కాదనుకున్నా.. నా తొలిప్రేమ శైలునే. నా జీవితంలో తొలి మజిలి శైలునే. మరిచిపోలేని నా ప్రేమకావ్యానికి ఆది అంతం అన్నీ తానే.. ఐ మిస్ యు. శైలు.నీవెప్పుడు అదే అందం.. అదే చిరునవ్వుతో ఉండాలని కోరుకుంటూ..నీ చిన్నా

తొలిప్రేమకు ఆహ్వానం!
ప్రేమ శాశ్వతం. ప్రేమ యథార్థం. ఈ ప్రపంచమంతా ప్రేమమయమైతే ఎంతో బాగుండనిపిస్తుంటుంది. అలాంటి ప్రేమలో తొలిప్రేమది మధురఘట్టం. ఒక రకంగా నిజమైన ప్రేమకు జ్ఞాపిక తొలిప్రేమ. కాలేజీ లైఫ్‌లో ప్రేమాభిమానాలను చూరగొన్న.. మీ లైఫ్‌లోకి తొంగిచూసిన.. తెరవని పేజీయై మీ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన, తడియారని తొలిప్రేమ గురించి రాసుకోవాలనుందా? మరొక్కసారి ఆ జ్ఞాపికను చూసుకోవాలనుందా? అక్షర రూపంలో అద్భుత కావ్యంగా మలుచుకునే అవకాశం మీకు మేము కల్పిస్తున్నాం. ఇదే మా ఆహ్వానం!
ప్రేమ కథలు రాయాల్సిన చిరునామా: బతుకమ్మ, నమస్తే తెలంగాణ, 8-2-603/1/7,8,9, కృష్ణాపురం, రోడ్‌నంబర్.10,
బంజారాహిల్స్, హైదరాబాద్-500034. ఈ-మెయిల్ : sunmag@ntdaily.news

1594
Tags

More News

VIRAL NEWS