ఎవుసంకు ఎలుగు


Sun,January 7, 2018 02:05 AM

పెద్ద ఎవుసం.. గట్లయింది. నాలుగర్కల నల్లటి ర్యాగడి భూమి అనాథ తీరు కానవస్తున్నది. ఒగసారి ఎవుసం బంద్ చేస్తే ఇగ దానిమీద పట్టువోతది కాస్తకారికి. ఎద్దు ఎరుకట్ట్య మూలకు వడితె గుండెల బాధవుతది. ఒలగండ్ల సదువులకని మస్తుమంది పెద్దా, చిన్న రైతులు పట్నం బాట పట్టిండ్రు. గన మనుసంత పల్లెకాయ.ప్రశాంత్, భార్య అరుణతోటి గీ మూడేండ్ల సంది ఎడ్లాపురంల జాగ వట్టిండు. విద్యానగర్‌ల రూము కిరాయి దీసుకుని పిలగండ్లను కాన్వెంటుస్కూల్ల సదివిపిస్తున్నరు. ఇగ మన్నూరుల.. తండ్రి ఆశన్న, తల్లి గంగవ్వ కైకిలోల్లని వట్టుకుని ఐకకాడికి ఒగ ఐదెక్కర్ల సెలకసాగు చేస్తున్నరు. నాలుగర్కల భూమి అంటే 48 ఎక్కర్లు. ఆల్లకు వైసుమీద వడి చాతగాక, చేసేటోడు లేక.. మిగిలిందంత మునాప (కైలు)కు ఇస్తున్నరు. గవ్వొక్క రెండు లక్షలస్తయి సాలుకు.మూడేండ్ల జిక్కిని ఎల్ కేజీకి, ఐదేండ్ల లడ్డును కాన్వెంటుకు గాయాల్ల బండిమీద దించేసి విద్యానగర్ వోయేటి దారిల ఆగి చిన్న వోటల్ల చాయ్ తాగుకుంట ఆలోచిస్తున్నడు. గా పక్క నేషనల్ హైవే నంబరు ఏడు మీద అటిటూ స్పీడుగ వోయేటి కార్లు, జీబులు, ఆటోలు, మోటార్ సైకిల్లు దారియ్యుండ్లి... అనుకుంట ఎనకాల ఎటువోతరో? ఏం జేస్తరో? హైవేమీద యూత్ పోరగాండ్ల బండ్లు సినిమ్మాల తీరు పోవట్టె. పానాలమీద వోనికి గంత పానం ఉన్నట్టు లేదు. ప్రశాంత్ ఎడ్లాపురంల, పట్నంల ఉన్నట్టెగనీ మనుసు గటే.. మన్నూరుకాయే. గీ పొద్దుగల్ల యాల్లల చాయ్‌దాగి గట్ల చేండ్లన్ని తిరిగి అస్తుండె. మర్రతానం, బోనం అయినంక పొచ్చవ్వ చెట్టుకింద రచ్చబండమీద తోటి రైతుల్తోని కూసుండి ముచ్చటవెడితె..చేనూ-చెలక పాఠాలు ఇన్నట్లుంటుండ్య. చేండ్లల్లకు పొయేటోల్లు, అచ్చెటోల్లు, బస్సు ఎక్కెటోల్లు, దిగేటోల్లు కానస్తుండె. రాంరాం కాకా, రాంరాం మామా మంచిగున్నలా.. ఎటే గిసుంటి ఆత్మీయ పిలుపులు గీడ పట్నంల కానచ్చుల్లేవు. అంటె మన్నూరు మంది, ఇంక సుట్టుపక్కల గ్రామాల నుంచి అచ్చి ఎడ్లాపురంల జాగవట్టినోల్లు లేరా? అంటె ఉన్నరు గనీ,, ఆల్లు ఏ వాడలకో? పల్లె చిన్నది.. అందరు కానస్తలు. తీరెం జేస్కొని మాట్లాడ్తలు. పట్నం పెద్దది.. లావు బిజీ. హలో అంటే చలో.. గట్ల అన్ని మనుసుల తింపుకుంట బండి చాల్ జేసి గటు రైతుబజారుకాయి పోతున్నడు ప్రశాంత్.
Story

మన్నూరుల.. భూమి రికార్డుల ప్రక్షాళన సర్వేల సందడి కానస్తున్నది. పట్నాలల్ల, ఉద్యోగాలల్ల ఉన్నోళ్లు, చిన్నాపెద్ద వ్యాపారలల్ల స్థిరపడ్డోల్లు అచ్చి రాపిచ్చుకుంటున్నలు. జటంగిలలొద్ది, పెన్‌గంగి చేను, యాప చెట్టు చేన్ల వివరాలు సూసుకుని అన్నీ కరెక్టుగున్నయని తహసీల్దార్‌కు చెప్తున్నడు ప్రశాంత్. సార్లు తాజా భూ వివరాల వన్ బి ప్రతి ప్రశాంత్ చేతుల వెట్టిండ్లు. ఎపుడో నైజాం జమాన్ల ఇసుంటి సర్వే అయిందట. మల్లా గిప్పుడే. సర్కారుది మంచి ప్రయత్నం. ప్రశాంత్ ఇంట్ల తండ్రితోని మాట్లాడుతున్నడు. అవ్వ ఎటువోయిందే బాపా. మంచం మీద వొరిగిన ఆశన్న లేచి.. కొడుకుకు చెప్తున్నడు సెల్కల పత్తి బొండ ఏరతందుకు ఇద్దరాడోళ్లను వట్టుకుని పోయిందిరా? బిందెలకెల్లి ముంతతోని నీళ్లు తీస్కొని తాగి కొంచెం కోపంతోని అంటున్నడు ప్రశాంత్.. గీ పైసల ఏంటికి చేండ్లకు పోవడ్తదే? మొత్తం మునాపకు ఇచ్చేద్దమంటె ఇనకపోతిరి చెప్తున్నడు తండ్రి. పని లేకుంటె మాకు ఉండబుద్ది కాదురా.. గందుకే గింత ఐదెక్కర్లు అల్లా ఇట్లా సేస్తున్నం. పిలగండ్లు లక్ష్మి, నారాయణ, కోడలు మంచిగున్నరా...? మల్లా అడిగిండు ఆశన్న. అంతా మంచిగున్నరు... ఈడ మీదే పరేషాననిపిస్తున్నది.. ఎడ్లాపురంకు రండ్లి అంటే ఇనరు గొంచెం బాధగ అన్నడు ప్రశాంత్. అంతట్ల పక్కింటి లస్మవ్వ అచ్చి చాయజేసి పోసింది. లక్ష్మికి అంటే మనుమరాలు జిక్కి. లడ్డు అంటెనేమో మనుమడు లడ్డు. మరి నేను వోత. ఆడికి వోయెటోల్లకే నాలుగయితది. పిలగాండ్లను బడిలకెల్లి ఇంటికి తీస్కరావడ్తది. తబేదు జాగ్రత్త. చెప్పుకుంట బండి కిక్ కొడ్తున్నడు ప్రశాంత్. ఇగో గీ సారి ఉన్నంత రండ్లి. పిలగండ్ల మీద మన్యాథ (మనో+వ్యథ) వడ్డది చెప్పి కండ్లు తుడ్సుకుంట మంచాల ఒరిగిండు ఆశన్న.

65 ఏండ్లు దాటిన ఆశన్న ఆల్ల ఎవుసం వైభవం గురించి తింపుకుంటున్నడు. ముత్తాత, తాత, తండ్రి జమానల ఎట్లుండె మా ఎవుసం. గంతేంటికి.. ఈడు ఒక్క కొడుకు ప్రశాంత్ ఎడ్లాపురంల జాగవట్టకముందు సుకా తన సేత మంచిగనే ఉండె. ఇద్దరు జీతగాల్లు. పదిమంది నిత్తె నడిసేటి కైకిలి ఆడోల్లు. మూడు జోళ్ల ఎడ్లు, రెండు పాడి బర్లు, పుట్టెడు ఆవులు, సగం పుట్టెడు మ్యాకల మంద. బేందల కోళ్లు. బంబులల్ల యాడాది గాసం. జోండ్లు, అడ్లు, బోగళ్లు, పెసళ్లు, మినుములు. గిప్పుడే కానస్తున్నయి?.. ఇంట్ల గా బొదుకు అమ్ముకునేటిదాక గింత పత్తిబొండ కానస్తది. గంతే. కొత్తలు కానచ్చి కాన్రానట్టుంటయి. మాటలల్ల లక్షలేగనీ బర్కత్ కాన్రాదు. అరె.. గింత మనుమండ్లతోని గీ వైసుల తీరెం జేస్కొచ్చు అంటె.. ఇంగ్లీషు సదూలు సల్లగుండ.. అవ్వి పొలగండ్లని పట్నాలకు గుంజుకపోతున్నయి. ఈడ పల్లెల సర్కారు బడులు లేవా.. గనీ, గీ జమానల ఆన్ని జూసి ఈడు ఈన్ని జూసి ఆడు.. ఇల్లిడిసి సాము చేస్తున్నరు. పట్నంల ఇంగ్లీషు సదిపిస్తెనే పెద్దిర్కం అనుకుంటున్నరు. పిలగండ్లకు నోరుదిర్గని పేర్తు వెడ్తున్నరు. ఏం జేస్తున్నవే ఆశన్న కాకా. గయినుకాడ నిలవడి తల లోపట పెట్టి శంకర్ పిలుస్తున్నడు. గా పిలుపుతోటి ఆశన్న ఆలోచన ఆపి.. దాదా.. కుసుండవ్‌రా శంకర్ అని బీడి ఇచ్చిండు. శంకర్ గీ మూడేండ్ల కాలం నుంచి ఆశన్నతాత చేండ్లు కౌలుకు చేస్తున్నడు. గంగ షిన్ని రాలేదా చేండ్లకెల్లి అడిగిండు శంకర్. అగ్గ రానే అచ్చ. నూరేండ్లే షిన్ని నీకు.. మల్లా శంకరే అంటున్నడు సగం కుంటలు పత్తిముల్లెని ఆమె నెత్తిమీదికెల్లి దించుకుంట కైకిలోల్లు సుకా ముల్లెలని ఇంట్ల వెట్టి పోతున్నరు గా పొజ్జామటి యాల్లల.
కాల్జేతులు కడుక్కొని డికాషను చాయజేసి తెచ్చింది గంగవ్వ. శంకర్‌తోని అంటున్నది గంగవ్వ ఎట్టున్నదిరా కొడ్కా పంటల తర్వాయి.. చెప్తున్నడతడు పత్తిల గా గులాబి పురుగుతోటి ఆపతయిందే షిన్నీ. గనీ తొగరి మంచిగున్నది ఆశన్న తాత అన్నడు. అరే శంకరా.,. భూమితల్లి ఉంచుకోదురా కష్టంను. తాత ముత్తాతలు గంత సంతానం పెంచి పెద్దజేసి లగ్గాలు, ముర్తాలూ, పుట్టింటి బిడ్డలకు రీతులు రివాజులు గీ భూమవ్వతోని గాకుంటె.. ఏమిటితోని. కాస్తకారి అనెటోడు అన్నిటిని ధైర్యంకొద్ది భరించుకుంట ముందాటికి పోవడ్తది సరే అనిపిచ్చింది శంకర్‌కు. శంకర్ చెప్తున్నడు అతని కష్టం సుఖం ఆశన్న కాకా.. ఇగో ఎంతన్న.. సంతం భూమి ఉన్నోడు ఒగ యాడాది పంటనష్టం అచ్చినా తట్టుకుంటడు. మునాప చేసెటోడు ఆనికి పండినా ఎండినా.. భూమి కౌలు పైసలైతే ఇయ్యక తప్పది. ఇగ భూమి ఉంటె యాడన్న ఇంత అప్పు పుడ్తది. వేరోల్ల భూమి మునాప పట్టెటోనికి వోళ్లిస్తలె అప్పులు సప్పులు.

....గాసంకు యాల్లవుతున్నదని గంగవ్వ అటువోయింది. ఆశన్న, శంకర్‌లు ముచ్చటలవడ్డరు. ఆల్ల మాటలల్ల రైతు-కౌలు రైతులు ఎలుగు చీకట్లు దొర్లిపోతున్నయి.
ప్రశాంత్.. పల్లె పట్నం బతుకుదెరుల తీరుల నడుమ కొట్టుమిట్టాడుతున్నడు. ఎడ్లాపురంల సదిపిస్తేనే ఉషారైతరు. గీ పోటీ ప్రపంచంల తట్టుకొని నిలవడ్తరు. జీతాలు తెచ్చుకుంటరు. ఎవుసంల ఏమి మిగుల్తది? గిట్ల అందరనుకున్నట్టె అనుకున్నడు. పల్లె నుంచి పట్నంకు వలస అచ్చిండు. పిలగండ్లు బడులల్లకు వొయిండ్లు. బోళ్లు తోముడు, బట్టలుతుకుడు చేస్తున్నది అరుణ. ఆడ.. మన్నూరుల నయితె పనులకు కులవృత్తులుంటయి. అత్తగారు ఉంటది. పట్నంల అన్నీ పిరెమే. సంతమే చేస్కోవాలె మరి. ఏమీ తోచక టీవీల ఏదో సూస్తున్నడు ప్రశాంత్. అరుణా చాయ చేస్తవ కొంచెం అడిగిండు. బట్టలు దులుపుకుంట అంటున్నది అరుణ.. గిప్పుడు టైమ్ లేదు. గొంచెమైతె పిలగండ్లకు లంచు టిఫిను తీస్కపోవాల గద. అవ్ సరే! అనుకుంట బండి అవుతల రడీ చేస్తున్నడు ప్రశాంత్. పిలగండ్ల సదులకే బతుకులు అంకితం జేసినట్టు కన్పిస్తరు ప్రశాంత్, అరుణ. ప్రశాంత్.. ఇగ వేరే ఏమీ పనిలేక అటీటూ గొంచెం తిరిగి అచ్చెటాల్లకె పొద్దువోనే వోతది. రాత్రి అయితది. మల్లా తెల్లార్తది. గదే జీవనం. నెలకు ఐదువెయిలు కిరాయి. కరెంటు బిల్లు, పిలగాండ్ల ఫీజులు, పాలూ, పెరుగూ, కూరగాయలు, సిలెండరు నింపిచ్చుడు, బండికి పెట్రోలూ, గప్పుడప్పుడూ గింత మందూ, మటనూ, చికెను. వెరసి నెలకు 15-20 వెయిలవుతున్నది.

మన్నూరిల చేండ్ల మునాప పైసల్ మొత్తం ఇటే వోతున్నయి. మర్ర మర్క సైడ్ బిజినెసా? మన్నా? ఐదెక్కర్లల్ల పండేటి పంటల మిగుల్తదెంతనో? తగుల్తదెంతనో? ఐనా ఆడ ముసలోల్లు నిబాయిచ్చుకుంటున్నరు.....ఆడ వోటల్ల కలిసిండు మన్నూరు దోస్తు. మాట్లాడుకుంటున్నరు ప్రశాంత్, దోస్తు రాజు. రాజూ.. ఎట్లున్నదిరా ఎవుసం? చెప్తున్నడు రాజు. ప్రశాంత్.. ఇగ నేను సుత భూమి మునాప (కౌలు)కు ఇచ్చి గిట్ల నీ తీరు ఎడ్లాపురం అచ్చి సోవ పిలగండ్లను సదివించాల అనుకుంటున్నరోయ్. చాయ్ గిలాస టక్‌మని బెంచి మీద పెట్టి గొంచెం కోపంతోటి అన్నడు ప్రశాంత్. చల్. రైతులందరు గిట్ల కౌలుకిచ్చేస్తమంటె.. ఎవుసంగతి ఎట్లర?.. నీకైతే పంట మంచిగనే పండుతది గద...ఏదీ కచ్చితంగ చెప్పేటట్లు లేని అయోమయంల కన్పిస్తున్న రాజుని సూసి బాధనిపించింది ప్రశాంత్‌కు. ఆడు సుత తన తీరు పట్నం దారి పడ్తడ్డా.. ఏమో అని ఆలోచిస్తున్నడు.జనవరి నెల... సంక్రాంతి సందడి షురూ అయింది. బస్సులు, రైళ్లు తొణగదొబ్బరాని మందిని పట్నాల నుంచి పల్లెలకాయి మోస్కపోతున్నయి. మన్నూరుకు అచ్చిండ్లు ప్రశాంత్, అరుణ, పిలగండ్లు. గా పాతకాలం మట్టిమిద్దె ఇంట్ల చెప్పరాని సంతోషం కానస్తున్నది. మనమండ్లతోని సోనీ ఆడుకుంటున్నడు ఆశన్న తాత. ఇగ పండుగు అయాంటె మల్లా ఎడ్లాపురంల పోతరు గదా... అనేటి విచారం కానవస్తున్నది గంగవ్వ మొకంల.

... సంక్రాంతి ముగ్గులేస్తున్నది సొంతింటి ఆకిట్ల గా పొద్దుగల్ల అరుణ.ధర్వాజులకు మామిడాకు తోర్నాలు కడ్తున్నడు ఆశన్న తాత. ఇంట్ల పండుగు కమ్మటి వంటలు సురుజేస్తున్నరు. గంగిరెద్దుతోని వచ్చిన హరిదాసుకు భిక్షపెడ్తున్నది గంగవ్వ. పిలగాండ్లు ఆడకట్టు పిల్లల్తోటి కలిసి పతంగుల ఆటల వడ్డరు. అరుణ.... గీ పల్లె పండుగు వాతావరణంను నిశితంగ గమనిస్తున్నది. ప్రశాంత్... అటు చేన్లు చూస్తున్నడు. పెన్‌గంగ చేను దూరంలున్న జిట్టిరేని, గంగిరేని చెట్లు పండ్లతోటి అంగిపోయినట్టున్నయి. యాపచెట్టు చేన్ల ఎక్కరు భూమి పడితే ఉన్నది. మునాప పట్టిన శంకర్ బొప్పడు గది దున్ని పిచ్చిలేపలేడు. ఎంతన్నగాని భూమి సొంతదారుకు ఆని భూమిమీద ఉన్న మమకారం వేరోల్లకు ఉండది. నన్ను ఇడ్సివెట్టి ఎటువోతివి కొడ్కా అని భూమితల్లి నిలదీసినట్లు అన్పిస్తున్నది ప్రశాంత్‌కు. ఆలోచించుకుంట ఇంటిదారి పట్టిండు...ఇగ పండుగు భోజనాలు అయినయి. శంకర్ అచ్చిండు. తమ్మీ ప్రశాంతూ... మరి ఇయ్యేడు సుత మీ చేన్లు ఇస్తరా? మునాపకు... ఆశన్న తాత సప్పుడు చెయ్యలేదు. ప్రశాంత్ కొంచెం ఆలోచన జేసి చెప్పిండు. శంకరు బొప్పా... ఇగ ఇయ్యేడు మేమే చేస్తం ఎవుసం.. కౌలుకు ఇయ్యం... అరుణ ఆశ్చర్యంగ సూస్తున్నది. ఆశన్న, గంగవ్వలకు ఏంటికో మస్తు గమ్మతయింది.

రాత్రి చెప్తున్నడు ప్రశాంత్ అరుణా.. గిప్పుడు మన మన్నూరుల సుత అంగన్‌వాడి, సర్కారు బడి మంచిగయ్యినయి. సార్లు మంచిగ చెప్తున్నరట. ఇంగ్లీషు మీడియంల సుత బోధిస్తున్నరట. ఇగ సన్న బియ్యంతోటి పిలగాండ్లకు పగటికి భోజనాలు. ఆరోగ్య పరీక్షలు చేపిస్తున్నరట. పిలగాండ్లు అవ్వా, బాపు కండ్లముంగటనె ఉంటే ఆళ్లకదే పదివేలు. ఇగ.. ఎవుసం అంటవా? సర్కారు రైతులకు ఎక్కరుకు రెండు పంటలకు 8 వేలు సొప్పున ఇస్తదట. అట్ల మనకు అందాజా మూడు లక్షల సగం దాక అస్తయి. బ్యాంకుల క్రాప్‌లోన్లు అస్తయి. అవ్విటితోని పెట్టుబడికి దోఖ లేదు. ఇగ పక్కకే పన్‌గంగ ఉన్నది. యాసంగిల శనగ, జొన్న ఏస్కోచ్చు. పత్తి, సోయా, శనగ, జొన్న గివ్వన్నిటికి పంటలభీమా చేస్కుందాం. మార్చిల పరీక్షలయినంక... ఎడ్లాపురంల రూం ఖాళీ చేసేద్దాం.. ఈ నిర్ణయం కుటుంబంకు నచ్చినట్లున్నది. అరుణ చిరునవ్వుతోటి పాపను దెగ్గరికి తీసుకున్నది. ఆశన్నతాత, గంగవ్వలు.. లడ్డును ముచ్చటగ సూసుకుంటున్నరు. నాలుగర్కల ఎవుసంకు మల్లా కళ అస్తున్నది.

కథలకు ఆహ్వానం

మనమంతా నగర యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోతున్నాం. కొందరు అర్బన్.. సెమీ అర్బన్ కల్చర్‌కు అటూ ఇటూ తిరుగుతుంటే.. ఇంకొందరు అర్బన్ రూరల్ మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ జీవనయానంలో ఎన్నో కథలు, వ్యథలు.. అర్బన్ కల్చర్‌తో ముడిపడి ఉన్న మానవ సంబంధాలు.. జీవన విధానాలు, వైవిధ్యాల చుట్టూ అల్లుకున్న కథలకు బతుకమ్మ స్వాగతం పలుకుతోంది. కథనంలో వైవిధ్యం, పాఠకులను ఏకబిగిన చదివించగలిగే బిగువూ ఉండాలి. ఆధునిక కథన శిల్పం ఉన్న కథలకు ప్రాధాన్యం.
మీ కథలు పంపాల్సిన చిరునామా..
కథలు రాయాల్సిన చిరునామా: బతుకమ్మ, నమస్తే తెలంగాణ, 8-2-603/1/7,8,9, కృష్ణాపురం, రోడ్‌నంబర్.10,
బంజారాహిల్స్, హైదరాబాద్-500034. ఈ-మెయిల్ : sunmag@ntdaily.news

1059
Tags

More News

VIRAL NEWS