ఎవర్‌గ్రీన్ స్టోరీ


Sun,April 16, 2017 01:43 AM

ఉదయం ఫలహారం సరిగ్గా చేయనేలేదు. మధ్యాహ్నం భోజనం మధ్యలోనే వదిలి వెళ్ళింది. ఇప్పుడు సూర్యుడు అస్తమించే వేళ కూడా స్నేహితురాళ్ళతో తోటలో ఆ ఆటలేమిటో! తండ్రి గారాబమే ఇందుకు కారణం అనుకున్నది తల్లి.తోటలో మల్లెపువ్వుల బంతితో ఆటలాడుతున్నది ఆమె కూతురు, స్నేహితురాళ్ళతో ఆ పడుచు పిల్లల నవ్వుల్ని చెవులు రిక్కించి వింటున్నాయి పూపొదలు. ఒకరు మరొకరికి ఆ మరొకరు ఇంకొకరికి విసిరేస్తే ఆకుపచ్చని చెట్ల మధ్య ఆ తెల్లటి బంతి కనబడ్డట్టే కనబడి మాయమవుతున్నది.ఎవరో బలంగా విసిరేశారు బంతిని. అది ఎవరికీ అందకుండా గాలిలో ఎగురుతూ ఉద్యాన వనానికి ఓ పక్కన ఉన్న భవంతి కిటికీలోంచి లోపల పడిపోయింది. ఆట ఆగిపోయింది. ఎవరు తెస్తారు బంతిని అడిగింది ఒక అమ్మాయి. నేను పోను ఆ మూల భవంతిలో ఏమున్నదో! ఎప్పుడూ ఎవరూ అటువైపు పోరు అన్నది బంతిని ఆ వైపుకు విసిరిన అమ్మాయి. మేం పోం అంటే మేము పోలేం అన్నారందరూ.అయితే ఆట సాగేదెలా? ఒక పని చేద్దాం. ఎవరో ఒకరు పోయి తేవడానికి భయం కదా అందరం కలిసిపోయి తెచ్చుకుందాం అనుకున్నారు. బిలబిలమంటూ వాళ్ళంతా భవంతి ముఖద్వారాన్ని తోసుకొని లోపలికి వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద భోషాణం పెట్టె దానిమీద ఓ పెద్ద ధనుస్సూ ఉన్నాయి.
అదిగోనే మన బంతి దాని కింద నుంచి కనపడుతున్నది అన్నది ఒక పడుచు.
ఇంక లాభం లేదు. దాన్ని ఎట్లా కదిలిస్తాం. బంతినెట్లా తీసుకుంటాం పెదవి విరిచింది మరో పడుచు.
అందరం కలిసి కదిలిద్దాం అన్నది ఓ యువతి. అంతా కలిసి తోసినా అంగుళం కూడా కదలలేదది.
చూస్తూ నిలబడకపోతే నువ్వూ సహాయం చెయ్యరాదూ అన్నది ఓ అమ్మాయి వెనక్కి తిరిగి. అందరికంటే వెనక నిలబడ్డ మెరుపుతీగ పెదవుల మీద చిరునవ్వును అదిమి పెట్టి మీరంతా పక్కకు జరగండి. నేను కదిలిస్తాను అన్నది.
story

ముక్కుమీద వేలు వేసుకున్న పడుచు వెనకకు వచ్చింది. తతిమ్మా వాళ్ళు నోళ్ళు తెరిచి ఇవతలికి వచ్చారు. కలహంసలా నడిచివచ్చిన మెరుపుతీగ ఆ భోషాణం పెట్టెమీద చేయి వేసింది.
తలమీద చంద్రవంకా, మెడలో జారిపోతున్న నాగుడూ, నుదుటిమీద మరో కన్నూ ఉన్న జడధారికి ధ్యాన భంగమయింది. ఒక్క ఉదుటన కళ్ళు తెరిచాడు.ఆ పక్కనే వున్న ఆమె అడిగింది. ఏమయింది స్వామీ అన్నది.కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డవి! మేరే జెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు కదా. మనం పూనుకోవాల్సిన సమయం వచ్చింది. అటు చూడు దేవీ అన్నాడు. తలలో అలంకరించుకున్న చందమామలా నవ్వుతూ ఆయన వేలు పెట్టి చూపిన వైపుకి ఆమె తొంగి చూసింది.
భూమ్మీద ఓ ఉద్యానవనం చివరలో ఉన్న భవంతి. ఆ భవంతిలో బంతికోసం ప్రయత్నిస్తున్న అమ్మాయిలు కనిపించారు. అంతమంది అమ్మాయిలు కదిలించలేని దాన్ని ఆ ఒక్క అమ్మాయి ఎలా కదిలిస్తుంది? బంతిని ఎలా బయటకు తీస్తుంది స్వామీ అన్నది ఆమె.ఆ బంతి నా ధనుస్సు కింద ఉన్నది. ఇప్పుడు ఆ అమ్మాయి కనక ఆ ధనుస్సుని కదిలించి బంతి బయటకి తీసిందంటే అదో సెన్సేషన్ అవుతుంది. ఆ తర్వాత ఆమె కళ్యాణానికి మార్గమేమిటో ఆ తండ్రికి తెలిసివస్తుంది. చూడు తమాషా అన్నాడు భర్త.
ఆయన తన రెండు కళ్ళనీ భవంతిలోని ఆ వస్తువు మీద కేంద్రీకరించాడు.

అందరితోనూ తాను ఆ భోషాణం పెట్టెని కదిలిస్తానని బంతిని బయటకు తీస్తానని అన్నది కాని నిజంగా అంత పెద్ద వస్తువు కదులుతుందా అని సందేహిస్తూనే ఆమె తన సుకుమారమైన చేయిని దానిపైన వేసింది.
ఆశ్చర్యం! అది అతి తేలికగా కదిలింది. ధైర్యం వచ్చిన అమ్మాయి దాన్ని చేత్తో అలవోకగా పక్కకు జరిపి బంతిని బయటకు తీసింది.బ్రేకింగ్ న్యూస్ అంతఃపురపు మందిరాలకు చేరనే చేరింది.
ఎప్పుడూ స్నేహితురాళ్ళూ, ఆటలూనా? అమ్మాయికి తన పెళ్ళి సంగతి పట్టించుకోరా అని నిష్టూరమాడింది అమ్మాయి తల్లి.తండ్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు మందిరంలో. ఇన్నాళ్ళ నుంచీ వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం లభించింది.వందలమంది బలిష్టులైన మగవాళ్ళు కదిలిస్తే తప్ప కదలని ధనుస్సుని కుసుమకోమలమైన చిన్నారి వామ హస్తంతో అవలీలగా కదిలించి తన వర పరీక్షను తానే నిర్ణయించేసింది. ఎవరైతే ఆ ధనుస్సుని ఎత్తి పట్టుకుని బాణం సంధించగలరో ఆ వీరుడే ఆమె వరుడు అనుకున్నారు.
స్వయంవరం ప్రకటించబడింది.ఈ విషయం దుర్గమారణ్య మధ్యన ఉన్న ఆశ్రమంలోని రాజర్షి చెవులకి వినబడ్డది. ఎండ కన్నెరుగని పసివాడు నా పుత్రుడు, నీ వెంట పంపలేను అన్న తండ్రిని ఒప్పించి వెంట తీసుకు వచ్చాడా వీర కుమారుడిని. అన్న వెంట తమ్ముడూ బయల్దేరి వచ్చాడు. ఆశ్రమాల్లో మునులను హింసపెడ్తున్న రాక్షసిని వధించాడు ఆ అన్న. అంతేకాదు యజ్ఞయాగాదుల్ని భగ్నం చేస్తున్న రాక్షసులకు తన శర పరంపరల రుచి చూపాడు. తండ్రిచాటు బిడ్డడి కళ్యాణం జరిపించి గానీ అప్పగించను అని నవ్వుకున్నాడు ముని. తూరుపు దిక్కున ఎర్రటి కలువరేకుల్లా పూస్తున్నవి అరుణ కిరణాలు. నేడే మిథిలకు ప్రయాణం. రాకుమారుల్ని నిద్ర లేపాలి అనుకున్నాడు.

నీలమేఘశ్యాముడు, ఆజానుబాహుడు, అరవింద దళాయ తాక్షుడు నగరవీధుల వెంటవస్తుంటే చూసిన వారు చూసినట్టే నిలబడిపోతున్నారు. నల్లని వాడయిన అన్నయ్య వదనం ప్రసన్నంగా, అధరం నిరంతర దరహాసానికి ఆనకట్టగా నిలిస్తే, తమ్ముడి వదనం మాత్రం చుట్టు పక్కలకు నిశితంగా పరీక్షించే నయన ద్వయంతో గంభీరంగా ఉంది.తమ బల పరాక్రమాలను ప్రదర్శించి కన్యను పరిణయం ఆడదామని వచ్చారు దేశ దేశాల రాజులు. తానే పూలఘోరం అయిన అందాల భరిణ. చేత పూలహోరం ధరించి నిలబడ్డది తండ్రి సింహాసనం పక్కన. ఆమెను అనుసరించి ఉన్నారు స్నేహితురాళ్ళు.భవనం మధ్య తాము బంతికోసం పోయినప్పుడు చూసిన పెద్ద ధనుస్సు ఉన్నది. ఒకరి తర్వాత ఒకరు జబ్బలు చరుచుకుంటూ వచ్చి ఎన్నో విధాల ప్రయత్నించీ బాణాన్ని అర అంగుళం కూడా కదల్చలేక అవమానంతో తలలు దించుకొని వెళ్ళిపోతున్నారు రాజకుమారులు.సమయం మించి పోతున్నది. ఎక్కుపెట్టకపోయినా కనీసం ధనుస్సును ఎత్తి పట్టుకునే వారైనా లేరా? ఇక నా కూతురుకి కల్యాణం జరిగేనా? తన కూతురు దానిని అలవోకగా కదిలించిందని ఈ పరీక్ష పెట్టడం తన తప్పిదమా అని ఆలోచిస్తున్నాడు తండ్రి.
స్వయంవరం అన్నాక వచ్చిన వాళ్ళలో అందగాడినీ, తన మనస్సుకు నచ్చిన వాడినీ అమ్మాయి పరిణయం ఆడాలి కానీ ఈ కఠిన పరీక్ష ఏమిటి? అని చింతించసాగింది తల్లి.మహా వీరుడూ, కైలాస పర్వతాన్ని తన పది తలలతో కదిలించిన వాడు కూడా ఇది తన వల్లకాని పని అని ఎస్కేపయ్యాక ఇక ఇంతే సంగతులు అనుకున్నారందరూ.

ఆకాశంలో రెండు మేఘాలు ఢీకొన్నప్పుడు మెరిస్తే మెరుపులా గురువు కనుసైగతో ముందుకు కదిలాడతడు. కొదమసింహంలా అడుగులో అడుగువేస్తూ వచ్చి చుట్టూ చూస్తూ సభకు నమస్కరించాడు. ముకుళిత పద్మాల్లాంటి హస్తాలతో. ఆ తర్వాత కలువరేకుల వంటి కన్నులు పూర్తిగా తెరిచి ధనుస్సును ఆసాంతం పరికించాడు. చూపుకి సుకుమారంగా కనిపిస్తున్నా దృఢమైన దక్షిణ హస్తంతో అందరూ చూస్తుండగా అలా అలా... పైకి లేపాడు ధనుస్సును వామహస్తాన్ని ముందుకు చాచి ధనుస్సును. వంచి నారిని పైకిలాగి సారించబోతున్నంతలో ఫెళఫెళార్భాటంతో ధనుస్సు విరిగిపోవడంతో సభాసదులు సభా భవనం ఒక ఊయలలా అటూ ఇటూ ఊగిందనుకున్నారు. ఎవరీ వీర కుమారుడు అని సభలో గుసగుసలు. దశరథ తనయుడు, కోసలరాముడు, కోదండరాముడు, అయోధ్యరాముడు...ఏ రాముడయితేనేం ఇప్పుడు ఈ రాముడు కల్యాణరాముడు అన్నాలెవరో.నీలమేఘశ్యాముని మెడను వరమాలతో అలంకరించి కనులు దించి ఆ సుందర విగ్రహాన్ని ఓర కంటితో చూస్తూ నిలబడ్డది వధువు. జనకరాజు పుత్రి జానకి.శివుడు పార్వతి వైపు చూశాడు మిషన్ కంప్లీటెడ్ అన్నట్టు. దేవతలు పూల తోటల్లోకి పరుగెత్తారు కల్యాణ సమయంలో వధూవరులను పూల వర్షంలో ముంచెయ్యడానికి పూలకోసం.జానకిరాముల కల్యాణం... జగత్కల్యాణం!!

2028
Tags

More News

VIRAL NEWS