ఎవరు కాకతిదేవత?


Sun,October 8, 2017 04:37 AM

ఇటీవల ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన ఓ అధికారి అమరావతి ప్రాంతంలోని ఒక అమ్మదేవతను కాకతిదేవతగా అభిప్రాయపడ్డారని పత్రికల్లో వచ్చింది. స్థానికంగా ఆ దేవతను బలుసులమ్మ అని అంటారని, ఆమె కిరీటం కాకతీయశైలిలో ఉందని డా. శివనాగిరెడ్డి చెప్పారు. రాష్ట్రకూటులైన వారు ఎప్పటి నుంచి కాకతీయులు అయ్యారో, ఎందుకయ్యారో తెలియకుండా ఇది ఎట్లా చెప్పగలం? వ్యక్తమైన అభిప్రాయాలమేరకే కాకతిదేవత గురించి పలుసార్లు వ్యాఖ్యలు వస్తున్నాయి. అస్పష్టమైన వార్తలవల్ల, వ్యాఖ్యానాల వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి కదా.

కాకతి ప్రతిమ హైద్రాబాదులో శంకర్ మఠ్ దగ్గర చరిత్రకారుని (వేటూరి ప్రభాకరశాస్త్రి) ఇంట్లో ఉందని వింటాం. వరంగల్ జిల్లా సర్వస్వంలో కాకతిశిల్పం ఫొటో ఒకటి కనపడుతుంది. కాకతి దేవత చాముండిలాగే ఉంటుంది. వాహనం నక్క లేదా ముంగిస ఉండాలి అని చరిత్రకారులు కాకతి ప్రతి లక్షణాలను నిర్వచించారు. వేటూరి ప్రభాకరశాస్త్రి సేకరించిన విగ్రహం, దోర్నాలలో బయటపడ్డ శిల్పం అవే ప్రతిమా లక్షణాలు కలిగివున్నాయి. రెండింటిలో వాహనం నక్క. మా క్షేత్రపర్యటనల్లో మూటకోడూరు (యాదాద్రి జిల్లా)లో, రామునిపట్ల (సిద్ధిపేట)లో, కొడవటూరు (జనగామ)లో, పానగల్ మ్యూజియం, స్టేట్ మ్యూజి యం (హైద్రాబాద్)లలో, కారేపల్లి కోట- రొట్టమాకురేవు (ఖమ్మం జిల్లా)లో, షారాజిపేట (యాదాద్రి జిల్లా), కడవెరుగు (జనగాం జిల్లా)లలో నక్క, ముంగిసలు వాహనాలుగా ఉన్న చాముండేశ్వరి విగ్రహాలను చూసాం. ఇవన్నీ చరిత్రకారులు నిర్వచించిన ప్రతిమా లక్షణాలు కలిగినవే. కాకతి దేవత కాకతీయుల కులదేవత. ఇది నిర్వివాదాంశం. ఇందరు కాకతిదేవతలుండగలరా? అమ్మదేవతలు విరివిగా ఉన్న తెలంగాణలో నక్క లేదా ముంగిస వాహనంగా ఉన్న చాముండేశ్వరి దేవతలు కొల్లలుగా ఉన్నారు. వీరిలో కాకతీయుల కులదేవతగా ఎవరిని చెప్పగలం?
God

విద్యానాథుని ప్రతాపరుద్రీయంలో, కుమారస్వామి సోమపీథి రత్నాపణవ్యాఖ్యలో కాకతిదేవతను హిందూదేవతగా చెప్పిన వ్యాఖ్యానాలు ఉన్నాయి. దొండపాడులోని కాకతమ్మబీడులో తవ్వించగా, దొరికిన అమ్మదేవతల నుంచి వేటూరి ప్రభాకరశాస్త్రి చాముండ (సప్తమాతృకలలో సౌమ్యంగా ఉండే దేవత)నే కాకతిగా నిర్ధారించాడు. కానీ, ఏ దేవీపురాణాల్లో కానీ, దేవీనామాల్లో కానీ కాకతిపదం కనిపించదు.
కాకర్త్య పదోత్పత్తికి సంబంధించి అనేక చర్చలు జరిగాయి. కాకర్త్య పదమే కాకతిగా పరిణమించిందని ఎక్కువమంది చరిత్రకారులు అంగీకరించారు. కాకతి, కాకత్య, కకెత అనేవి కాకతిదేవతనామ రూపాంతరాలు. కాకతీయులు మొదట జైనులు. అందులోను వారు దిగంబరజైన పంథాను అనుసరించేవారు. కాకర్త్య గుండన వరకు వారికి కాకతీయులనే వంశనామం లేదని తెలుస్తున్నది. గుండన ఇంటిపేరు కాకర్త్య నుండి వచ్చిన రూపాంతర నామాలే కాకత, కాకతి, కాకెతి, కాకితలనేవి.
కాకతి అనే మాటకు గుమ్మడితీగ అని అర్థముందని, గుమ్మడి పదానికి కూష్మాండం సంస్కృతీకరణమని చరిత్రకారులు చెప్పారు. జైనయక్షిణులలో కూష్మాండిని అంబికాదేవికి పర్యాయనామం. అంబిక జైనయక్షిణులలో 22వ తీర్థంకరుడు నేమినాథుని శాసనదేవత. ఈ దేవతారూపం దిగంబర, శ్వేతాంబర జైనభేదాలతో ఉంటుంది. దిగంబరులు కూష్మాండిని అని, శ్వేతాంబరులు అంబిక అని పిలుచుకుంటారు. ఎక్కువమట్టుకు ప్రతిమాలక్షణం ప్రకారం దేవత కుడిచేతిలో మామిడిపండ్లు, ఎడమచేతిలో నిమ్మ (జాతి) పండు, లేదా ఒడిలో ఎడమచేతితో పట్టుకున్న శిశువు ఒకరు లేదా ఇద్దరుంటారు. లలితాసనంలో మామిడిచెట్టు నీడలో కూర్చుని ఉంటుంది. ఇట్లాంటి రూపలక్షణాలతో ఉన్న అంబిక లేదా కూష్మాండిని శిల్పం జనగామ జిల్లా సిద్దెంకి గ్రామంలో ఉన్న గుట్టకు దక్షిణంవైపు చెక్కిన జైనశిల్పాలు పార్శ్వనాథుడు, మహావీరులతో పాటు చెక్కి ఉన్నది.
God1

ఎడమవైపున మామిడిచెట్టు కింద సుఖాసనంలో కూర్చున్న ఈ దేవతతో పాటు ఆమెకిరుపక్కల ఉన్న ఇద్దరు పుత్రులలో ఒకడు ఎదురుగా సింహంపై కూర్చుని ఉన్నాడు. దేవత కుడిచేతిలో కాడవున్న ఫలం (ఆమ్రం), ఎడమచేతిలో నిమ్మజాతి పెద్దఫలం ఉన్నాయి.మనదేశంలో 5వ శతాబ్దం నుంచి కనిపించే అంబికాదేవి గురించి జైనపురాణాల్లో ఉంది. ఆమెకు జైనంలోనే ఎక్కువ ఆరాదన ఉంది. జినప్రభసూరి సంకలనం అంబికాదేవి కల్పలో అంబికాదేవి Kohandi (కూష్మాండి, కూష్మాండినీ) కోహండవిమానమనే స్వర్గంలో ఉండే దేవత. ఇది శ్వేతాంబర జైనం కథ. సాధారణంగా జైన Iconography ప్రకారం ఇద్దరు శిశువులు (సిద్ధ, బుద్ధ), మామిడి పండ్ల గుత్తి, పాశంతో అంబిక శిల్పం ఉంటుంది. లభిస్తున్న అంబికరూపాలను బట్టి రెండు చేతులతో, నాలుగు చేతులతో, నాలుగు కంటే ఎక్కువ చేతులతో దిగంబర, శ్వేతాంబర భేదాలతో అంబిక రూపాలుంటాయి. జైనదేవత అంబిక పుట్టుక గురించి పరిశోధకుడు ఉమాకాంత్ పి షా రాసారు.

జినప్రభసూరి ఊర్జయంతస్తవలో అంబిక సింహవాహిని, ఇద్దరుపుత్రులు సిద్ధ, బుద్ధులతో చేతిలో మామిడిపండ్లగుత్తితో జైనసంఘాన్ని కాపాడుగాక అని ఉంది. అంబిక ప్రస్తావన జినభద్రగాని క్షమాశ్రమణ విశేషావశ్యక మహాభాష్యలో అంబా కూష్మాండవిద్య అని, హరిభద్రసూరి ఆవశ్యకనిర్యుక్తిలో, లలితవిస్తార వ్యాఖ్యలో అంబా-కూష్మాండివిద్య అని, భైరవ పద్మావతికల్పలో ఆమ్ర కూష్మాండిని అని, దిగంబర తాంత్రికగ్రంథం విద్యాశాసనలో 8చేతుల ఆమ్రకూష్మాండిని అని ఉంది. వస్తుపాల జైనమంత్రి అంబిక ప్రార్థనలో కూష్మాండిని పద్మాలయ అని ఉంది. అందువల్లనే కావచ్చు పద్మాక్షిగుట్టమీద నిర్మితమైన జైనబసది కడలాలయ బసదిగా పిలువబడ్డది. కాయోత్సర్గ భంగిమలో ఉన్న తీర్థంకరునికి, ఇరుపక్కల యక్షి అంబిక, యక్షుడు సర్వంహా జినభద్రవచనాచార్య చేత అంకితం చేయబడ్డారు.
అనుయోగద్వారసూత్ర అనే గ్రంథంలో.. తేయసా జలంతే ఇందస్సా ఖాండస్సావా రుద్దస్సావా సివస్సావా వేసమనస్సావా దేవస్సావా నాగస్సావా జక్కస్సావా భూయస్సావా ముగుందస్సావా అజ్జేవా దుగ్గేవా కొత్తాకిరియేవా ఉవాలేవసమ్మజ్జనా సణవరి సణధువ పుప్పగంధమాల్లైయం దువ్వావస్సాయైం కరేంతి అని ఉంది.

దీనిని వ్యాఖ్యానించిన హరిభద్రసూరి జినదాస మహత్తరలో దుర్గాయా పూర్వరూపం ఆమ్రకూష్మాండివత్ తధా థితా అజ్జా భన్నతి శైవ మహిష వ్యాపాదానకళాప్రభృతి తద్రూపస్థిత కొత్తవ్యా (కొత్తాకిరియ) భన్నతి అని వివరించాడు. హరిభద్రసూరి కొత్తాకిరియను కొత్తాకురియ, కొత్తవి అన్నాడు. కొత్తాకిరియనే కాకరితియ, కాకర్త్యగా పరిణమించి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో కూష్మాండిని కొత్తావి, కొఱ్ఱివై (అంటే వనదుర్గ, విజయప్రదాత)గా పూజింపబడుతున్నది.పై ఆధారాలను బట్టి కొత్తాకిరియకు కాకరితయ(కాకర్త్య)కు పదసంబంధముందని తెలుస్తున్నది. కొత్తాకిరియ కొత్తకురియ, కొత్తవి, కొఱ్ఱివైగా పరిణమించడాన్ని అర్థం చేసుకోవచ్చు. అంబిక లేదా కూష్మాండినియే కాకతి అని, దిగంబర జైనపంథాను అనుసరించినందువల్లే గుండన కాకర్త్య(కాకతి) ఆరాధకుడుగా కాకర్త్యగుండన అని పిలువబడ్డాడు. అట్లే నేటి కొఱవే కాకతిపట్టణం అయే అవకాశముంది. కాకతీయుల పాలన ప్రారంభమయింది కొఱవి నుండే కదా. పద్మాక్షి గుట్టలోని దేవాలయంలోకి ప్రవేశించగానే కనబడే సర్వంహా (కుబేరుడు?) అనబడే యక్షుడు, కాయోత్సర్గభంగిమలో తలపై ఛత్రంతో 22వ జైనతీర్థంకరుడు నేమినాథుడు, అవతల కూష్మాండిని లేదా అంబిక, ద్విభుజిగా, రెండు చేతుల్లోను ఫలాలతో కాకతీయుల కులదేవత కాకతి వుంది. వీటికి కొంచెం పక్కగా వినాయకుడు, లలితాసనంలో చాముండేశ్వరి, ఆమె పాదాలకింద అంబిక శిల్పం, వాటి వెనక పూర్తిగా చెక్కకుండ నిలిచిపోయిన 24వ జైన తీర్థంకరుడు మహావీరుని 7 అడుగుల ఎత్తైన శిల్పం. దానిపక్కన జైనపాదాలు, జైన చౌవిసస్తంభం, చౌవిస విగ్రహఫలకం వున్నాయి. ఇవన్నీ దిగంబర జైనప్రతిమలే.
ప్రతిమా లక్షణాలను బట్టి, జైనబసది ప్రాచీనతను బట్టి పద్మాక్షి గుట్టమీది పద్మాక్షిదేవతే కాకతిదేవత. ప్రత్యామ్నాయ దేవత లేదు.

గెస్ట్ కాలమ్
శ్రీరామోజు హరగోపాల్, సెల్ ః 9949498698
కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం

1755
Tags

More News

VIRAL NEWS