ఈ కోణంలో చూసి ఉండరు!


Sun,March 17, 2019 01:49 AM

logo
కారుపై కనిపించే లోగోను బట్టి అది ఏ కంపెనీదో పట్టేస్తాం. అంగీ మీదున్న ఐకాన్‌ను బట్టి అది ఏ బ్రాండో గుర్తుపట్టేస్తాం.అలాంటి వాటిలో మనం రోజూ చూసే కొన్ని ప్రముఖ కంపెనీల లోగోలను, వాటి వెనక ఉన్న అర్థాలను, రహస్యాలను తెలుసుకుందాం

ఇలా రకరకాల లోగోలను మనం రోజూ చూస్తూ వెళ్తుంటాం. లోగోలో ఎలాంటి పేరు లేకున్నా అది పలాన బ్రాండ్ అని సులభంగా అర్థమవుతుంది. ఈ లోగోలే కంపెనీ బ్రాండింగ్‌లో, ప్రమోషన్స్‌లో కీలక పాత్ర పోషిస్తాయి, కంపెనీకి పేరు తెచ్చి పెడతాయి. అయితే సదరు కంపెనీలు లోగోలను తయారు చేయడంలో విభిన్నంగా ఆలోచిస్తాయి. కేవలం అందంగా కనిపించే విధంగానే కాకుండా ప్రత్యేకమైన అర్థం వచ్చేలా తయారు చేస్తాయి. సంస్థకు, వినియోగదారులకు అనుసంధానం ఉండే ఆలోచనతోనే లోగోలను సృష్టిస్తాయి.
logo1
హ్యూండాయి : ఈ మోటార్ కంపెనీ లోగో చూసే ఉంటారు కదా! చూడగానే మనకు ఏం కనిపిస్తుంది.. H అక్షరం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అందులో ఏం అర్థం ఉంది? హెచ్ అంటే హ్యూండాయి అర్థమే కదా అంటారా? నిజానికి హ్యూండాయి లోగోలో ఒక స్టయిలిష్ పిక్చర్ ఉంటుంది. ఇద్దరు మనుషులు కరచాలనం చేస్తున్నట్టు అర్థం వచ్చే లోగో అది. ఇద్దరిలో ఒకరు కంపెనీకి చెందిన వ్యక్తి, మరొకరు సంతృప్తి పొందిన కస్టమర్. ఇద్దరూ హ్యాండ్‌షేక్ చేస్తారు. ఇది నమ్మకానికి, సంతృప్తికి చిహ్నం అని అర్థం వచ్చేట్టు దాన్ని డిజైన్ చేశారు. ఈ లోగో వెహికిల్ గ్రిల్ మీద సిల్వర్ రంగులోనే కనిపిస్తుంది. ఈ రంగు ఆడంబరతకు చిహ్నంగా ఉంటుందని ఆ కంపెనీ భావిస్తుంది. అయితే చాలామంది H అంటే హ్యుండాయి అని, స్పీడ్ అని అనుకుంటారు కానీ దాని అర్థం అది కాదు.

రేబాన్: కండ్లజోడు ఫ్యాషన్‌లో రే-బాన్ కండ్లజోడ్ స్టేటస్ సింబల్. దీని లోగో ఎన్నో సార్లు చూసి ఉంటాం. అచ్చం కండ్లజోడు లానే Ray-Ban అని అందమైన అక్షరాలతో డిజైన్ చేసి ఉంటుంది. కానీ మీరెప్పుడైనా ఆ అక్షరాల్లో ఓ కండ్లజోడును గుర్తించారా? కచ్చితంగా గుర్తించి ఉండరు. అయితే ఈ సారి చూడండి. Ray-Ban లోని B లోకి లోతుగా చూడండి. ఓ కండ్ల జోడు కచ్చితంగా కనిపిస్తుంది. రే-బాన్ అనేది అమెరికా కంపెనీ మొదట్లో కాంటాక్ట్ లెన్స్‌లను తయారు చేసేది. తర్వాత ఎండ నుంచి కండ్లను కాపాడుకోవడానికి కండ్లజోడు కావాలని ఓ పైలెట్ నుంచి వచ్చిన ఆర్డర్‌తో అందంగా, సూర్యకిరణాల నుంచి రక్షణగా ఈ రే-బాన్ కండ్లద్దాలను తయారు చేయడం ప్రారంభించింది ఆ కంపెనీ.
logo2
అమెజాన్ : ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్‌గా మారింది అమెజాన్. దీని లోగో కింద ఎడమ నుంచి కుడికి ఒక బాణం గుర్తు స్పష్టంగా కనిపిస్తుంది.

ఆ బాణం గుర్తే ఈ కంపెనీ లోగోలో అసలైన అర్థాన్ని ఇస్తుంది. బాణం గుర్తును సరిగ్గా గమనిస్తే amazon లోని a కింది నుంచి z వరకూ ఉంటుంది. అంటే అమెజాన్ స్టోర్‌లో A టు Z అన్నీ లభిస్తాయని దాని అర్థం.

అడిడాస్ : ఫ్యాషన్ ప్రపంచంలో అడిడాస్ ఓ తిరుగులేని బ్రాండ్. దీని లోగోను గమనించినట్టయితే అడిడాస్ అనే చిన్న అక్షరాల మీద మూడు ఎత్తయిన వికర్ణ చారలు కనిపిస్తాయి. అడిడాస్ కంపెనీ అర్థం అంతా ఆ చారల్లోనే దాగి ఉంది. నిజానికి అవి చారలు కాదు. కంపెనీ ఉద్దేశించిన దాని ప్రకారం అవి ఎత్తయిన పర్వతాలు. క్రీడాకారులు అడిడాస్ కంపోనీ షూ వేసుకొని పర్వతాలు ఎక్కుతున్నప్పుడు వాళ్లకు స్ఫూర్తి నింపేందుకు లోగోలో వాటిని డిజైన్ చేశారు. ఎలాంటి అసమానతలనైనా క్రీడాకారులు అధిగమించాలని మూడు రకాల చారలను సృష్టించారు. అయితే ఇది అడిడాస్ కంపెనీ మొదటి లోగో కాదు. దీని కంటే ముందు రెండు లోగోలు ఉండేవి.

ఫెడెక్స్: ప్రపంచంలో ఫేమస్ షిప్పింగ్ కంపెనీ. సాధారణంగా చూస్తే FedEx మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ కంపెనీ లోగోకు విశిష్టత ఉంది. హిడెన్ ఇమేజెస్ లోగోల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ డిజైన్ 40 అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో పాటు ప్రపంచంలోని టాప్ ఎనిమిది లోగోల్లో ఇదీ ఒక్కటి. రోలింగ్ స్టోన్ అనే మ్యాగజైన్ గత 35 సంవత్సరాలుగా ఇస్తున్న ఈ ర్యాంకులో FedEx ఇప్పటి వరకూ తన ర్యాంకును కోల్పోలేదు. అయితే చాలా క్యాజువల్‌గానే కనిపిస్తున్నగా ఈ లోగోలో ఇంతటి విశేషం ఏంటి అంటారా? ఒకసారి E, X అక్షరాల మధ్య క్షుణ్ణంగా గమనించండి. మీకో బాణం గుర్తు కన్పిస్తుంది. ఈ బాణం గుర్తు ముందుకు వెళ్లే మార్గాన్ని, వేగాన్ని, కచ్చితత్వాన్ని సూచిస్తుందని కంపెనీ అలా డిజైన్ చేసింది.

ఎల్‌జీ: ప్రముఖ ఎలాక్ట్రానిక్ దిగ్గజ సంస్థ LG (life Good) లోగో మనకు ముఖ్యంగా ఒక వృత్తంలో L, G అక్షరాలు కనిపిస్తాయి. దాని అర్థం నవ్వుతున్న మనిషి అని. L అక్షరం ముక్కును, G అక్షరం ముఖాన్ని, మధ్యలో చుక్క కన్నును సూచించే విధంగా ఉంటుంది. మొత్తాన్ని గమనిస్తే నవ్వుతూ ఉన్న మనిషి మొహం ఆ కంపెనీకి అనుకూలిస్తుందని, ఒక యూత్ వాతావరణాన్ని సృష్టిస్తుందని తెలుసుకోవచ్చు.

ఆడి: ఆడి మోటార్ కంపెనీ లోగో ఆసక్తికరంగా ఉంటుంది. అక్షరాలు లేకుండా నాలుగు వృత్తాలతో ఉంటుంది. ఆ కంపెనీ ఫౌండర్ ఆగస్ట్‌హోర్చ్ పేరును లాటిన్ భాషలోకి మార్చడం ద్వారా ఆ పేరు వచ్చింది. ఆడి కంపెనీ ప్రారంభించాక మరో మూడు పెద్ద కంపెనీలు కలిసి ఆటో యూనియన్‌గా ఏర్పడ్డాయి. DKW, Horch, Wandered, Audi కంపెనీలు కలిశాయి. వీటి మధ్య ఐక్యతా చిహ్నంగానే లోగోనూ డిజైన్ చేశారు.

- వినోద్ మామిడాల
సెల్: 07660066469

497
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles